వివాదాల మధ్య పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచిన అల్జీరియా బాక్సర్
పారిస్: అల్జీరియాకు చెందిన వివాదాస్పద మహిళా బాక్సర్ ఇమాన్ ఖలీఫ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 66 కేజీల కేటగిరీలో జరిగిన ఫైనల్లో యాంగ్ ల్యూ (చైనా)ను ఓడించి ఖలీఫ్ తన కెరీర్‌లో తొలి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుంది. పోటీలు ఆరంభమైనప్పటి నుంచి ఖలీఫ్‌పై వివాదం చెలరేగింది. పేరుకు ఆమె మహిళే అయినా శరీరంలో పురుష లక్షణాలు ఉన్నాయని... గతంలో ఇదే విషయంలో ఆమె నిషేధానికి గురైందని అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి.
మగాడి తరహాలో ఉన్న బాక్సర్‌ను మహిళల విభాగంలో అనుమతించారంటూ నిర్వాహకులను అంతా తిట్టిపోశారు. అయితే ఐఓసీ మాత్రం ఈ విమర్శలను లెక్క చేయకపోగా... ఖలీఫ్ కూడా ఆ ప్రభావం తనపై పడకుండా వరుసగా గెలుస్తూ పోయింది. ఇప్పుడు స్వర్ణంతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. ‘ఎనిమిదేళ్లుగా ఈ పతకం కోసం కలగన్నా. నేనిప్పుడు ఒలింపిక్ చాంపియన్‌ను. ఎన్నో సూటిపోటి మాటలు ఎదుర్కొన్నాను. అందుకే ఈ గెలుపు నాకు రెట్టింపు ఆనందాన్నిస్తోంది.
నాలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావద్దు. నేను పుట్టుకతో మహిళను. ఇతర మహిళల్లాగే నేను కూడా. అలాగే జీవిస్తాను కూడా. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అన్ని రకాలుగా అర్హత ఉన్నదానిని కాబట్టే క్వాలిఫై అయ్యాను’ అని కన్నీళ్లపర్యంతమవుతూ ఖలీఫ్ వ్యాఖ్యానించింది. అల్జీరియా దేశ చరిత్రలో ఇది ఏడో స్వర్ణపతకం.
Comments
Please login to add a commentAdd a comment