‘క్వీన్స్‌ క్లబ్‌’ కింగ్ అల్‌కరాజ్‌.. ప్రైజ్‌ మనీ ఎంతంటే? | Queens Club Championships Final: Alcaraz Beat Lehecka Check Prize Money | Sakshi
Sakshi News home page

‘క్వీన్స్‌ క్లబ్‌’ కింగ్ అల్‌కరాజ్‌.. ప్రైజ్‌ మనీ ఎంతంటే?

Jun 23 2025 12:24 PM | Updated on Jun 23 2025 1:12 PM

Queens Club Championships Final: Alcaraz Beat Lehecka Check Prize Money

లండన్‌: ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ ఐదో సింగిల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన క్వీన్స్‌ క్లబ్‌ ఏటీపీ–500 టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్‌ అల్‌కరాజ్‌ చాంపియన్‌గా నిలిచాడు. 2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ అల్‌కరాజ్‌ 7–5, 6–7 (5/7), 6–2తో జిరీ లెహెస్కా (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలుపొందాడు.

ప్రైజ్‌మనీ ఎంతంటే? 
విజేత అల్‌కరాజ్‌కు 4,71,755 యూరోల (రూ. 4 కోట్ల 70 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్‌ పాయింట్లు... రన్నరప్‌ లెహెస్కాకు 2,53,790 యూరోల (రూ. 2 కోట్ల 53 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 330 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఫైనల్లో అల్‌కరాజ్‌ 18 ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. 

ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసిన అల్‌కరాజ్‌ తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోలేదు. ఓవరాల్‌గా అల్‌కరాజ్‌ కెరీర్‌లో ఇది 21వ సింగిల్స్‌ టైటిల్‌. ఈ ఏడాది అల్‌కరాజ్‌ రొటర్‌డామ్‌ ఓపెన్, మోంటెకార్లో మాస్టర్స్, రోమ్‌ మాస్టర్స్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో విజేతగా నిలిచాడు.

ఇదీ చదవండి: రెండేళ్ల తర్వాత... మరో సింగిల్స్‌ టైటిల్‌
బెర్లిన్‌: హోరాహోరీ పోరులో పైచేయి సాధించిన చెక్‌ రిపబ్లిక్‌ టెన్నిస్‌ స్టార్‌ మర్కెటా వొండ్రుసోవా... రెండేళ్ల తర్వాత తన కెరీర్‌లో మరో సింగిల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన బెర్లిన్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో 25 ఏళ్ల వొండ్రుసోవా విజేతగా అవతరించింది. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో ప్రపంచ 164వ ర్యాంకర్‌ వొండ్రుసోవా 7–6 (12/10), 4–6, 6–2తో ప్రపంచ 49వ ర్యాంకర్‌ జిన్‌యు వాంగ్‌ (చైనా)పై విజయం సాధించింది.

2023లో వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గి సంచలనం సృష్టించిన వొండ్రుసోవా ఆ తర్వాత మరో టైటిల్‌ను అందుకోలేకపోయింది. జిన్‌యు వాంగ్‌తో జరిగిన ఫైనల్లో వొండ్రుసోవా ఆరు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది. 

టైటిల్‌ గెలిచే క్రమంలో వొండ్రుసోవా సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ సబెలెంకా (బెలారస్‌)పై, తొలి రౌండ్‌లో ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌    ఓపెన్‌ చాంపియన్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా)పై, క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ మాజీ రెండో ర్యాంకర్‌ ఆన్స్‌ జబర్‌ (ట్యూనిషియా)పై నెగ్గడం విశేషం. విజేతగా నిలిచిన వొండ్రుసోవాకు 1,42,610 యూరోల (రూ. 1 కోటీ 42 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement