ఒలింపిక్స్ పురుషుల మారథాన్‌లో ఇథియోపియా అథ్లెట్‌కు స్వర్ణం
రేసు పూర్తి చేయలేకపోయిన డిఫెండింగ్ చాంపియన్ కిప్‌చోగే
పారిస్: ఒలింపిక్స్ క్రీడలు ముగియడానికి ఒక రోజు ముందు ఇథియోపియా జట్టు పసిడి పతకం బోణీ కొట్టింది. పురుషుల మారథాన్ ఈవెంట్‌లో తమిరాత్ తోలా విజేతగా నిలిచి ఇథియోపియాకు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. శనివారం జరిగిన మారథాన్ రేసులో నిర్ణీత 42.195 కిలోమీటర్ల దూరాన్ని 32 ఏళ్ల తోలా అందరికంటే వేగంగా 2 గంటల 6 నిమిషాల 26 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
బషీర్ ఆబ్ది (బెల్జియం; 2గం:06ని:47 సెకన్లు) రజతం... బెన్సన్ కిప్రోతో (కెన్యా; 2గం:7ని:00 సెకన్లు) కాంస్యం సాధించారు. 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ పురుషుల మారథాన్‌లో ఇథియోపియా అథ్లెట్ స్వర్ణ పతకం సాధించడం విశేషం. చివరిసారి 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో ఇథియోపియా అథ్లెట్ గెజాహెగ్నె అబెరా మారథాన్ విజేతగా నిలిచాడు.
మరోవైపు మారథాన్‌లో ‘హ్యాట్రిక్’ ఒలింపిక్ స్వర్ణం లక్ష్యంగా బరిలోకి దిగిన కెన్యా దిగ్గజం ఎలూడ్ కిప్‌చోగే అనూహ్యంగా విఫలమయ్యాడు. 40 ఏళ్ల కిప్‌చోగే 30 కిలోమీటర్లు పరుగెత్తాక రేసు నుంచి వైదొలిగాడు. 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కిప్‌చోగే స్వర్ణ పతకాలు సాధించాడు. కిప్‌చోగే ‘పారిస్’లోనూ విజేతగా నిలిచిఉంటే ఒలింపిక్స్ మారథాన్ చరిత్రలో మూడు బంగారు పతకాలు నెగ్గిన తొలి అథ్లెట్‌గా కొత్త చరిత్ర సృష్టించేవాడు.
Comments
Please login to add a commentAdd a comment