Marathon
-
మనతో రోబో రన్!
ఎన్నో రంగాల్లో మనిషికి సవాల్ విసురుతున్న మరమనుషులను చైనా.. ప్రపంచంలోనే తొలిసారిగా చరిత్రాత్మక పోటీకి రంగంలోకి దింపుతోంది. అథ్లెట్లు, హ్యూమనాయిడ్ రోబోలకు కలిపి మొట్టమొదటిసారిగా హాఫ్ మారథాన్ (21 కి.మీ.) పరుగు పందెం నిర్వహించనుంది. ఏప్రిల్‌లో జరగనున్న ఈ పోటీకి చైనా రాజధాని బీజింగ్‌లోని డాక్సింగ్ జిల్లా వేదిక కానుంది. ఇందులో డజన్లకొద్దీ హ్యూమనాయిడ్ రోబోలు సుమారు 12 వేల మంది అథ్లెట్లతో పోటీపడనున్నాయి. ఈ రేసులో టాప్–3లో నిలిచే రేసర్లకు (అథ్లెట్లు అయినా లేక హ్యూమనాయిడ్ రోబోలైనా) బహుమతులిస్తారని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’తెలిపింది. బీజింగ్ ఆర్థిక–సాంకేతికత అభివృద్ధి ప్రాంతం లేదా ఈ–టౌన్ పరిపాలనా సంఘం ఈ వినూత్న పోటీని నిర్వహించనుంది. 20కన్నా ఎక్కువ రోబో తయారీ సంస్థలు హాఫ్ మారథాన్‌లో పాల్గొననున్నాయి.స్పెషల్ ఎట్రాక్షన్‌గా ‘టియాంగోంగ్’ మారథాన్‌లో పాల్గొనే రోబోలలో చైనాకు చెందిన ఎంబాడీడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ అభివృద్ధి చేసిన టియాంగోంగ్ హ్యూమనాయిడ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ రోబోకు గంటకు సగటున 10 కి.మీ. వేగంతో పరిగెత్తే సామర్థ్యం ఉందని ‘ద డైలీ సీపీఈసీ’పేర్కొంది. గతేడాది బీజింగ్‌లో జరిగిన హాఫ్ మారథాన్‌లో రేసు మొదలైనప్పటి నుంచి చివరిదాకా ఈ రోబో మనుషులతో కలిసి పరుగెత్తింది.చైనాలో రోబోల అభివృద్ధి ఎందుకంటే.. చైనాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోవడంతో శ్రామికశక్తి తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం జనాభాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఇతర దేశాలతో పోటీపడాలన్నా.. ఆర్ధికవృద్ధిని పెంచాలన్నా శ్రామికశక్తి అవసరం.దీనిని భర్తీ చేయడానికి చైనా హ్యూమనాయిడ్ రోబోలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. చైనా ఆగస్టులో హ్యూమనాయిడ్ రోబోలతో ఫుట్‌బాల్, ట్రాక్ అండ్ ఫీల్డ్ లాంటి పోటీలు నిర్వహించనుంది. – సాక్షి, సెంట్రల్డెస్క్కండిషన్స్ అప్లై..హాఫ్ మారథాన్‌లో పాల్గొనే రోబోలవిషయంలో చైనా కొన్ని షరతులు విధించింది. అవేమిటంటే.. » రోబోలన్నీ మనిషి ఆకృతిలో కనిపించాలి. » వాకింగ్ లేదా రన్నింగ్ లాంటి కదలికల లక్షణాలు కలిగి ఉండాలి. అంటే వాటికి చక్రాలు ఉండరాదన్నమాట. » రోబోల కనీస ఎత్తు 1.6 అడుగుల నుంచి గరిష్టంగా 6 అడుగుల మధ్య ఉండాలి. » హిప్–టు–ఫుట్ పొడవు అంటే నడుము నుంచి పాదం వరకు 1.47 అడుగుల ఎత్తు ఉండాలి. » రిమోట్ ద్వారా నియంత్రించే రోబోలు లేదా పూర్తిస్థాయిలో ఆటోమేటిక్ హ్యూమనాయిడ్లను పోటీలోకి దింపాలి. అయితే అవసరమైతే పోటీ మధ్య బ్యాటరీలను మార్చుకోవచ్చు.2,76,288ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం 2023లో చైనా సంస్థలు ఇన్స్టాల్ చేసిన రోబోల సంఖ్య. ఇది ఆ ఏడాది ప్రపంచంలోని మొత్తం రోబోల్లో 51 శాతం -
‘మారతాను’ అనుకుంటే మారథాన్ గెలిచినట్టే!
పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలతోనే స్త్రీ జీవనం గడిచిపోతుంది. రొటీన్లో తన మనుగడ ప్రశ్నార్థకం అవుతుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంటుంది. జీవనశైలిని మార్పుకోవాలన్న ఒకే ఒక ఆలోచనతో ఇండియా ఫాస్టెస్ట్ ఔతాహ్సిక మారథానర్గా తనకై తాను ఓ గుర్తింపును సాధించారు కవితారెడ్డి.50 ఏళ్ల వయసులో ఆరు ప్రపంచ మారథాన్లను పూర్తిచేసి స్టార్ మెడల్స్‌ను సొంతం చేసుకున్నారు. ప్రపంచ మారథాన్ ల చరిత్రలో అత్యంత వేగవంతమైన భారతీయ మహిళా రన్నర్‌గా నిలిచారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో మారథాన్ రన్స్‌లో పాల్గొంటున్న కవితారెడ్డి ‘మన మైండ్, బాడీ చురుగ్గా ఉండాలంటే ముందు ఏదైనా క్రీడలలో పాల్గొనాలి’ అంటూ ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నారు.‘‘మన దేశంలో మహిళలు బయటకు వచ్చి, రన్స్‌లో పాల్గొడం తక్కువే. వారిని ఎంకరేజ్ చేయడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. పుట్టి పెరిగింది అనంతపూర్. డిగ్రీ పూర్తవుతూనే పెళ్లి, కుటుంబ బాధ్యతలు. ఎప్పుడూ క్రీడల్లో పాల్గొనలేదు. నలభైఏళ్ల వరకు గృహిణిగా, ఇద్దరు అబ్బాయిల పెంపకం, కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుంటూ వచ్చాను. వయసు పెరుగుతున్నప్పుడు జీవనశైలి సరిగా లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే, కొన్ని మార్పులు చేసుకోవాలనుకుని, పదేళ్ళక్రితం జిమ్‌లో చేరాను. కొన్నిరోజులు ఇబ్బందే అనిపించింది. కానీ, అదే సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. స్నేహితుల ద్వారా మారథాన్ల గురించి తెలిసింది. అలా జిమ్‌తో పాటు పదేళ్ల క్రితమే మారథాన్ జర్నీ స్టార్ట్ అయ్యింది. మా వారు దీపక్‌రెడ్డి ఉద్యోగరీత్యా హైదరాబాద్, బెంగళూరు, ముంబయ్, పుణెలలో నివసిస్తూ వచ్చాం. అలాగే, ఎక్కడ మారథాన్ జరిగినా పాల్గొంటూ వచ్చాను. మారథాన్లు నా జీవన విధానాన్నే మార్చాయి. వాటిల్లో ఎంజాయ్ చేయడమే పెరిగింది. దీంతో అదే ΄్యాషన్గా మారింది.సొంత గుర్తింపుకూతురు, భార్య, తల్లి.. సమాజం మనకో గుర్తింపునిస్తుంది. కానీ, మనకంటూ ఓ సొంత గుర్తింపును సాధించుకోవాలి. అందుకు ఏదో ఒక యాక్టివిటీని ఏర్పరుచుకోవాలి. గృహిణిగా, అమ్మగా గుర్తింపు ఉన్న నాకు ఇప్పుడు ‘మారథాన్ రన్నర్ కవితారెడ్డి’ అంటూ మరో గుర్తింపు వచ్చింది. ఈ ప్రయాణంలో ఎంతోమంది పరిచయం అయ్యారు. కాన్ఫిడెన్స్తోపాటు జీవనశైలిలోనూ మంచి మార్పులు వచ్చాయి. మద్దతు అవసరంమహిళలు మారథాన్‌లో పాల్గొనడానికి మన దగ్గర ఇంకా అంత ప్రోత్సాహం లేదనే చెప్పవచ్చు. తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ, ఇరుకు రోడ్లు, సౌకర్యాలు కూడా తక్కువే. విదేశాలలో మారథాన్ అంటే సిటీ మొత్తం ఒక పండగలా జరుగుతుంది. స్త్రీ–పురుష తేడా లేకుండా ఎంతోమంది వచ్చి హుషారుగా పాల్గొంటారు. సామాజికంగానూ ఇది ఐక్యతను సూచిస్తుంది. ఒక తెలియని ఎనర్జీ మనలోకి వచ్చేస్తుంది. దీనివల్ల చేయాలనుకున్న పనుల్లో వేగం కూడా ఉంటుంది. శిక్షణ తప్పనిసరిముందు మనకోసం సొంతంగా ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు కుటుంబం నుంచి అంతగా సపోర్ట్ రాకపోవచ్చు. కానీ, పరిస్థితులలో మంచి మార్పులు వచ్చాయి. నేడు మన జీవన విధానంలో ఆహారం, చేస్తున్న పనులకు ఏ మాత్రం ΄÷ంతన లేదు. అందుకే, మహిళలు తప్పనిసరిగా వ్యాయామాలు ఒక అలవాటుగా చేసుకోవాలి. ఏడాదికి రెండు మూడు హాఫ్ మారథాన్లలో పాల్గొంటుంటాను. ఆ తర్వాత ఫుల్ మారథాన్ ఉంటుంది. సాధారణంగా ఫుల్ మారథాన్లనే కౌంట్ చేస్తుంటారు. అందరూ ఆ డిస్టెన్స్‌లో పాల్గొనలేరు. అందుకని హాఫ్ మారథాన్లు, 5కె, 10కె రన్లు జరుగుతుంటాయి. రాబోయే ఫిబ్రవరిలో చండీగఢ్లోహాఫ్ మారథాన్ ఉంది. దానికి శిక్షణ తీసుకుంటున్నాను’ అని వివరించారు ఈ మారథాన్ రన్నర్. అడ్డంకులను అధిగమిస్తూ..ఎవరెస్ట్ బేస్ క్యాంప్, అంతకుముందు అంటార్కిటికా ఐస్ మారథాన్లు రెండు అత్యంత కష్టమైనవే. బోస్టన్‌లో పాల్గొన్న మారథాన్‌లో అయితే బలమైన ఈదురుగాలులు, వర్షం.. అత్యంత దారుణమైన వాతావరణ పరిస్థితులు. అయినా, 42.21 కి.మీ మారథాన్‌ని పూర్తి చేయాలి. లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆలోచన అడ్డంకులను అధిగమించేలా చేసింది. 3.05 గంటలలో లక్ష్యాన్ని చేరుకున్నా. ప్రకృతి విసిరే సవాళ్లను తట్టుకోవడానికి మహిళలే ముందుంటారు. పదేళ్లపాటు చేస్తున్న ఈ జర్నీలో ఇండియాతో పాటు న్యూయార్క్, లండన్, చికాగో, బెర్లిన్, బోస్టన్ – టోక్యోలలో జరిగిన ఆరు ఫుల్ మారథాన్లలో పాల్గొన్నాను. మెడల్స్ ΄÷ందాను. నన్ను చూసి మారథాన్లలో పాల్గొన్న మహిళలు చాలామంది ఉన్నారు.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్
-
హైదరాబాద్‌లో రెండో అతిపెద్ద మారథాన్ (ఫోటోలు)
-
24 ఏళ్ల తర్వాత... ఇథోయోపియా అథ్లెట్‌కు పసడి పతకం
పారిస్: ఒలింపిక్స్ క్రీడలు ముగియడానికి ఒక రోజు ముందు ఇథియోపియా జట్టు పసిడి పతకం బోణీ కొట్టింది. పురుషుల మారథాన్ ఈవెంట్లో తమిరాత్ తోలా విజేతగా నిలిచి ఇథియోపియాకు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. శనివారం జరిగిన మారథాన్ రేసులో నిర్ణీత 42.195 కిలోమీటర్ల దూరాన్ని 32 ఏళ్ల తోలా అందరికంటే వేగంగా 2 గంటల 6 నిమిషాల 26 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బషీర్ ఆబ్ది (బెల్జియం; 2గం:06ని:47 సెకన్లు) రజతం... బెన్సన్ కిప్రోతో (కెన్యా; 2గం:7ని:00 సెకన్లు) కాంస్యం సాధించారు. 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ పురుషుల మారథాన్‌లో ఇథియోపియా అథ్లెట్ స్వర్ణ పతకం సాధించడం విశేషం. చివరిసారి 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో ఇథియోపియా అథ్లెట్ గెజాహెగ్నె అబెరా మారథాన్ విజేతగా నిలిచాడు. మరోవైపు మారథాన్‌లో ‘హ్యాట్రిక్’ ఒలింపిక్ స్వర్ణం లక్ష్యంగా బరిలోకి దిగిన కెన్యా దిగ్గజం ఎలూడ్ కిప్చోగే అనూహ్యంగా విఫలమయ్యాడు. 40 ఏళ్ల కిప్చోగే 30 కిలోమీటర్లు పరుగెత్తాక రేసు నుంచి వైదొలిగాడు. 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కిప్చోగే స్వర్ణ పతకాలు సాధించాడు. కిప్చోగే ‘పారిస్’లోనూ విజేతగా నిలిచిఉంటే ఒలింపిక్స్ మారథాన్ చరిత్రలో మూడు బంగారు పతకాలు నెగ్గిన తొలి అథ్లెట్‌గా కొత్త చరిత్ర సృష్టించేవాడు. -
Hyderabad: రన్.. సిటీ రన్! త్వరలో నగరంలో మారథాన్..
సాక్షి, సిటీబ్యూరో: అది ముంబై మహానగరం.. ఉరుకులు పరుగుల జీవితం.. ఎవరి పనుల్లో వారు ఫుల్ బిజీ.. కానీ ఆ ఒక్క రోజు మాత్రం ముంబై నగరం మొత్తం పండుగ. కులం, మతం తేడా ఉండదు. చిన్నా పెద్ద బేధాలు ఉండవు. నగర వీధుల్లోకి వచ్చి పూలు చల్లుతూ కొందరు.. ఎనర్జీ డ్రింక్స్ ఇస్తూ ఇంకొందరు.. తినుబండారాలు ఇస్తూ మరికొందరు అలా ఉండిపోతారు. ఇంతకీ ఇలా ముంబైకర్లు ఎందుకు చేస్తారనే కదా మీ సందేహం..ముంబై మారథాన్ రోజున ఇలా అందరూ ఏకమై ఓ పెద్ద పండుగలా సంబరాలు చేసుకుంటారు. ముంబై మారథాన్‌ను తమదిగా ముంబైవాసులు అంతలా ఓన్ చేసుకుంటారన్న మాట. ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే అదే రీతిలో మన హైదరాబాద్ నగరంలో కూడా కొద్దిరోజుల్లోనే ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే ఈ మారథాన్‌ను కూడా నగరం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈసారి ఈ మారథాన్‌కు ఓ అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ అథ్లెటిక్ గుర్తింపు పొందింది. ముంబై మారథాన్‌కు మాత్రమే ఇప్పటి వరకు ఈ గుర్తింపు ఉండేది. దేశంలో ఆ గుర్తింపు పొందిన మారథాన్ హైదరాబాద్ మారథాన్ కావడం విశేషం.రూ.44 లక్షల ప్రైజ్‌మనీ.. ఈ మారథాన్‌లో మొత్తం రూ.44 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. తొలిస్థానంలో నిలిచిన వారికి రూ.5 లక్షలు, రెండోస్థానంలో పూర్తిచేసిన వారికి రూ.2.5 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.2 లక్షల పురస్కారం అందించనున్నారు. ఇక, కోర్సు రికార్డు సాధించిన రన్నర్‌కు రూ.10 లక్షల నగదు పురస్కారం, జాతీయ రికార్డు బద్దలు కొట్టిన వారికి రూ.5 లక్షల పారితోషికం అందజేస్తారు.దేశంలోనే రెండో అతిపెద్దది.. మరో 15 రోజుల్లో ప్రారంభమయ్యే హైదరాబాద్ మారథాన్‌లో వేల సంఖ్యలో రన్నర్లు పాల్గొంటారు. ఈ ఏడాది 27 వేలకు పైగా మంది మారథాన్‌లో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ మారథాన్‌లో పాల్గొనే రన్నర్ల సంఖ్య పరంగా చూసుకుంటే.. భారత్‌లోనే అతిపెద్ద రెండో పరుగు ఇది. ఈ మారథాన్‌లో 42 కిలోమీటర్ల దూరం రన్నర్లు పరుగెత్తనున్నారు. ఫుల్ మారథాన్‌తో పాటు హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల పరుగు కూడా ఉంటుంది. ఇటీవలే ఈ మారథాన్ డ్రైరన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఫన్ రన్‌తో ప్రారంభమై..మారథాన్ మొదటి రోజైన 24వ తేదీన ఫన్ రన్ పేరుతో 5కే రన్ ఉంటుంది. ఇది అసలు మారథాన్‌కు కర్టెన్ రైజర్ లాంటిది. ప్రతిఒక్కరూ రన్నింగ్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ ఫన్ రన్ ఏర్పాటు చేశారు. ఇది హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ క్యాంపస్‌లో ఉంటుంది. ఇక మరుసటి రోజు అసలు మారథాన్ (42 కి.మీ.) ప్రారంభం అవుతుంది. పీపుల్స్ ప్లాజా వద్ద ఉదయం మారథాన్ ప్రారంభం అవుతుంది. రాజ్‌భవన్ రోడ్డు, పంజాగుట్ట ఫ్లైఓవర్, కేబీఆర్ పార్కు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, మైండ్ స్పేస్ జంక్షన్, బయోడైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, హెచ్‌సీయూ మీదుగా గచ్చిబౌలి అథ్లెటిక్ స్టేడియం వద్ద ముగుస్తుంది. హాఫ్ మారథాన్ పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమై.. 21 కి.మీ. దూరం ఉండేలా నిర్దేశించిన మార్గంలో రన్ ఉంటుంది. ఇది కూడా గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగుస్తుంది. -
Jasmin Paris: ఒకే ఒక్కరు!
100 మైళ్ల దూరం.. 60 గంటల వ్యవధి. మధ్యలో ఎవ్వరూ మనకు సాయపడరు. పరుగెత్తుతూనే ఉండాలి. ట్రెజర్ హంట్ తరహాలో అక్కడక్కడా ఉన్న పుస్తకాలను వెతికి పట్టుకుంటూ పరుగు ఆపకుండా గమ్యం దిశగా దూసుకెళ్లాల్సిందే. మారథాన్‌లో భాగంగా పార్క్ చుట్టూతా మొత్తంగా దాదాపు 60,000 అడుగుల ఎత్తును ఎక్కి దిగాలి. అలసటతో ఆగితే ఔటే ఇక. ధృఢ శరీరం మాత్రమే కాదు అంతకుమించిన మనో సంకల్పం తోడుంటేనే మారథాన్‌లో జయకేతనం ఎగరేయగలం. ప్రపంచంలోనే అత్యంత కఠోరమైన మారథాన్లలో ఒకటిగా పేరొందిన ప్రతిష్టాత్మక బాక్లీ మారథాన్స్‌లో పురుషులకు దీటుగా మొట్టమొదటిసారిగా ఒక అతివ ఈ రేసులో గెలిచి అబ్బురపరిచింది. అమెరికాలోని టెన్నిస్సీ రాష్ట్రంలోని ఫ్రెజెన్ హెడ్ స్టేట్ పార్క్ ఈ మారథాన్‌కు వేదికైంది. బ్రిటన్‌కు చెందిన జాస్మిన్ ప్యారిస్ అనే 40 ఏళ్ల వెటర్నరీ వైద్యురాలు ఈ ఫీట్ సాధించి చరిత్రలో నిలిచిపోయారు. 55 మైళ్లుగా ఉన్న మారథాన్‌ను 1989 సంవత్సరంలో 100 మైళ్లకు పెంచాక ఇన్నేళ్లలో నిరీ్ణత గడువులోగా మారథాన్‌ను కేవలం 20 మంది మాత్రమే పూర్తిచేయగలిగారు. వీరిలో జాస్మిన్ ప్యారిస్ ఒక్కరే మహిళ కావడం విశేషం. మారథాన్‌ను 60 గంటల్లోపు పూర్తిచేయాల్సి ఉండగా ఇంకా 99 సెకన్లు ఉండగానే ఆమె విజయతీరాన్ని తాకారు. 59 గంటల 58 నిమిషాల 21 సెకన్లలో జాస్మిన్ ఈ రేసును శుక్రవారం పూర్తిచేశారు. రాత్రంతా సరైన దారీతెన్నూ లేకున్నా ముళ్లు, పొదల గుండా పరుగెడుతూ ఫినిషింగ్ లైన్‌ను చేరుకున్న జాస్మిన్ను వేలాది మంది ఔత్సాహికులు తమ హర్షధ్వానాలతో ఉత్సాహపరిచారు. ఈ సంవత్సరం 20 మంది బరిలో దిగగా జాస్మిన్‌తో కలిపి మొత్తంగా కేవలం ఐదుగురే మారథాన్‌ను పూర్తిచేయగలిగారు. ‘ ఈ రేసు ఉత్సాహం, ఆందోళనల కలబోత. దాదాపు అసాధ్యమైన రేసు అని తెలుసు. ఆ అసాధ్యమనే భావనే నన్ను ఈ రేసులో పరుగెత్తేలా చేసింది’ అని జాస్మిన్ అన్నారు. అథ్లెట్ గాయాలపాలైనా మధ్యలో ఎవరూ ఎలాంటి సాయం చేయరు. ఫోన్లు ఉండవు, జీపీఎస్ ట్రాకింగ్ ఉండదు. ఎలాంటి నావిగేషన్ వ్యవస్థలు ఉండవు. రెండు చోట్ల మాత్రం తాగు నీరు సదుపాయం ఉంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన జాస్మిన్ వృత్తిరీత్యా పశువైద్యురాలు. బ్రిటన్‌లోని మిడ్లోటియన్లో ఉండే జాస్మిన్ వైద్యవృత్తిని కొనసాగిస్తూనే ఎడిన్బర్గ్లో పరిశోధనా శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆఫ్రికన్–అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మారి్టన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యకేసులో దోషి అయిన జేమ్స్ ఎర్ల్ రే అనే ఖైదీ 1977 ఏడాదిలో అమెరికా జై లు నుంచి పారిపోతూ ఆగకుండా 12 మైళ్లు పరుగెత్తిన ఘటన నుంచి స్ఫూర్తి పొ ంది ఈ మారథాన్‌ను గ్యారీ క్యాంట్రెల్, కార్ల్ హెన్లు 1986లో ప్రారంభించారు. -
భగత్‌సింగ్‌ను గుర్తుచేసుకుంటూ మారథాన్.. విజేతకు రూ. 4 లక్షల బహుమానం!
అమర వీరుడు భగత్ సింగ్‌ను గుర్తు చేసుకుంటూ మార్చి 24న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మారథాన్ నిర్వహించనున్నారు. తాత్యా తోపే నగర్ స్టేడియంలో ‘షహీద్-ఏ-అజం’ పేరిట మారథాన్ నిర్వహిస్తున్నారు. ఈ మారథాన్‌లో పాల్గొనేవారి కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. అన్ని వయసుల వారు ఈ మారథాన్‌లో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ మారథాన్‌లో పాల్గొనేవారికి టీ-షర్ట్, అల్పాహారం, సర్టిఫికేట్ అందించనున్నారు. మారధాన్ విజేతకు రూ.4 లక్షల నగదు బహుమానం అందించనున్నారు. 24న ఉదయం 6 గంటలకు మారథాన్ ప్రారంభం కానుంది. ఈ ఈ మారథాన్‌ను సిక్స్త్ సెన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఈ మారథాన్ నిర్వహిస్తున్నారు. ఆరోజు భగత్ సింగ్‌కు నివాళులు అర్పించనున్నారు. -
24 ఏళ్ల వయసులోనే ప్రపంచ రికార్డు విజేత దుర్మరణం.. కోచ్ కూడా!
Kelvin Kiptum: కెన్యా అథ్లెట్, మారథాన్ ప్రపంచ రికార్డు విజేత కెల్విన్ కిప్టం దుర్మరణం పాలయ్యాడు. ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో 24 ఏళ్ల ఈ యువ అథ్లెట్ మరణించాడు. ఆ సమయంలో కెల్విన్‌తో పాటే కారులో ఉన్న అతడి కోచ్ గెర్వాస్ హాకిజిమనా కూడా కన్నుమూశాడు. ఈ ఘటన క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం నింపింది. కెల్విన్, గెర్వాస్ హఠాన్మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని.. వారి ఆత్మలకు శాంతి కలగాలంటూ వరల్డ్ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కోయే విచారం వ్యక్తం చేశాడు. కాగా పురుషుల మారథాన్ ఈవెంట్లో కెల్విన్ కిప్టం ప్రపంచ రికార్డు సాధించాడు. అక్టోబరు 8, 2023లో చికాగో మారథాన్‌లో పాల్గొన్న అతడు రెండు గంటల 35 సెకండ్లలోనే పరుగు పూర్తి చేశాడు. తద్వారా రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన ఎల్యూడ్ కిచోగ్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఎల్యూడ్ కంటే 34 సెకండ్ల ముందే లక్ష్యాన్ని చేరుకుని ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో... రెండు గంటల ఒక నిమిషానికి ముందే మారథాన్ పూర్తి చేసిన పురుష అథ్లెట్‌గా కెల్విన్ చరిత్రకెక్కాడు. పారిస్ ఒలింపిక్స్-2024 లక్ష్యంగా ముందుకు సాగుతున్న అతడు ఇలా హఠాన్మరణం చెందాడు. కోచ్‌తో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో కెల్విన్ కిప్టం కారు అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కెల్విన్, కోచ్ గెర్వాస్ అక్కడిక్కడే మృతి చెందగా.. కారులో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.కాగా కెల్విన్ కిప్టంకు భార్య అసెనాథ్ రోటిచ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: Devon Conway - Kim Watson: ‘గర్భస్రావం.. మా బిడ్డను కోల్పోయాం’ -
వైజాగ్ నేవీ మారథాన్ విజేతలు శిఖంధర్, ఆశా
విశాఖ స్పోర్ట్స్: విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన వైజాగ్ నేవీ మారథాన్ 8వ ఎడిషన్ ఓపెన్‌లో శిఖంధర్, మహిళల్లో ఆశా విజేతలుగా నిలిచారు. వైజాగ్ నేవీ మారథాన్ పరుగు సాగరతీరంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి అథ్లెట్లు విజయమే లక్ష్యంగా ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్ల పరుగుపెట్టారు. ఔత్సాహికులు సరదాగా ఐదు కిలోమీటర్ల మేర ఫన్ రన్ చేపట్టారు. ఫుల్ మారథాన్ 42.2 కిలోమీటర్లు, హాఫ్ మారథాన్ 21.1 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల రేస్‌ను నిర్వహించి విజేతలకు బహుమతులందించారు. మారథాన్ రేస్, ఫన్ పరుగు ఆర్కే బీచ్ మీదుగా నేవల్ కోస్టల్ బ్యాటరీ వైపు వద్ద యూటర్న్ తీసుకుని.. కాళీమాత ఆలయం మీదుగా వీఎంఆర్డీఏ ఎంజీఎం పార్క్ వద్దకు చేరుకోగానే ముగిసింది. పది కిలోమీటర్ల పరుగు తెన్నేటి వద్ద యూ టర్న్ తీసుకోగా, హాఫ్ మారథాన్ పరుగు వీరులు రుషికొండ గాయత్రి కళాశాల దగ్గర యూ టర్న్ తీసుకున్నారు. పూర్తి మారథాన్‌లో అథ్లెట్లు ఐఎన్ఎస్ కళింగ సమీపంలోని చేపాలుప్పాడ దగ్గర యూ టర్న్ తీసుకుని ప్రారంభస్థానానికి చేరుకున్నారు. వీఎంఆర్డీఏ పార్క్‌లో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పురుషుల ఓపెన్ హాఫ్ మారథాన్‌లో దీపక్ కుంబార్, 10 కిలోమీటర్ల పరుగులో సోనుకుష్వా విజేతలుగా నిలిచారు. మహిళా విభాగం హాఫ్ మారథాన్‌లో లిలియన్ రుట్టో, 10 కిలోమీటర్ల పరుగులో మేరీగ్రేస్ విజేతలుగా నిలిచి బహుమతులు అందుకున్నారు. -
విశాఖ బీచ్ లో వైజాగ్ మారథాన్ వేడుకలు
-
ఈనెల 30న విజయవాడలో రాష్ట్ర స్థాయి యూత్ ఫెస్ట్ మారథాన్
సాక్షి, అమరావతి: హెచ్ఐవి/ఎయిడ్స్ మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు ఈనెల 30న విజయవాడలో రాష్ట్ర స్థాయి యూత్ ఫెస్ట్ 5కె మారథాన్ (రెడ్ రన్)ను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఎపిశాక్స్) అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కోటేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ఎపిశాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఎస్బీ రాజేంద్రకుమార్ (ఐఆర్‌యస్) నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆమె తెలిపారు. సెప్టెంబర్ 30న ఐక్యత మరియు దృఢ సంకల్పం యొక్క ఉల్లాసకరమైన ప్రదర్శనలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆలోచనగా యూత్ ఫెస్ట్ గ్రాండ్ ఫినాలేను నిర్వహించేందుకు విజయవాడ నగరం సిద్ధమవుతోందని ఆమె అన్నారు. ఈ ఈవెంట్ యువత ఆరోగ్యం మరియు అవగాహన దిశగా అద్భుతమైన వేడుకగా నిర్వహించనున్నట్లు డాక్టర్ కోటేశ్వరి తెలిపారు. నేకో(NACO) దూరదృష్టితో కూడిన నాయకత్వంలో కీలకమైన సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు ఒక వినూత్నమైన కార్యక్రమంగా దీన్ని రూపొందించామని అన్నారు. హెచ్ఐవి నివారణ, మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని నియంత్రించడం, యువతలో సురక్షితమైన మరియు బాధ్యతాయుతమైన లైంగిక ప్రవర్తనను ప్రోత్సహించడం, హెచ్ఐవి మరియు ఎస్టిఐ సంబంధిత సేవల్ని ప్రోత్సహించడం , ప్రాథమిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం వంటి నిర్ధేశించిన లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు డాక్టర్ కోటేశ్వరి తెలిపారు. 26 జిల్లాల నుండి వచ్చిన 17-25 సంవత్సరాల వయస్సు గల 260 ఔత్సాహిక కళాశాల విద్యార్థులు 5K మారథాన్‌లో పాల్గొంటారన్నారు. ఇది ఆరోగ్యకరమైన, మరింత అవగాహన గల భవిష్యత్తు కోసం వారి నిబద్ధతను సూచిస్తుందన్నారు. కళాశాల విద్యార్థులు మరియు రెడ్ రిబ్బన్ క్లబ్ సభ్యులతో సహా ప్రతి జిల్లా నుంచి పది మంది దీనిలో పాల్గొంటారన్నారు. హెచ్ఐవికి సంబంధించిన మరింత సమాచారం కోసం www.apsacs.ap.gov.in సంప్రదించాలని ఆమె కోరారు. -
Hyderabad Marathon: లింగం.. మారథాన్ సింగం! హార్ట్ పేషెంట్ అయినా..
సాక్షి, హైదరాబాద్: లింగం వయసు 50 ఏళ్లు. ఫుల్ మారథాన్ (42 కిలోమీటర్లు) పూర్తి చేశాడు. ఇది అంత పెద్ద విశేషమేమీ కాదు...కానీ అతను వెల్డింగ్ పనిచేసే సామాన్యమైన కార్మికుడు. అంతేకాదు హార్ట్ పేషెంట్ కూడా. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివసించే లింగం ఆదివారం నెక్లెస్‌రోడ్‌లో ప్రారంభమైన హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొని ఫుల్ మారథాన్ పూర్తి చేశారు. అయితే ఈ ఘనత సాధించిన హార్ట్ పేషెంట్‌గా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా లింగం, ఆయనకు వైద్యం చేసిన డా.మురళీధర్ బాబీ ‘సాక్షి’తో ఆ వివరాలు పంచుకున్నారు. కరోనా అనుకుంటే... వెల్డర్‌గా పనిచేస్తున్న లింగం రెండేళ్ల క్రితం తీవ్రమైన దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడుతూ ఇఎస్ఐ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే ఈ సమస్యకు కారణం కరోనా అని కుటుంబసభ్యులు అనుమానించారు. అయితే పరీక్షల అనంతరం వైద్యులు ఇది కరోనా కాదని, పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ అని..అప్పటికే లింగంకు తెలియకుండా రెండుసార్లు స్ట్రోక్స్ వచ్చి ఉండొచ్చని అంచనా వేశారు. ఆయనకు కొన్ని మందులు రాసిచ్చి వాడమన్నారు. కొద్దిరోజుల తర్వాత నిమ్స్‌కు రిఫర్ చేశారు. నిమ్స్‌లో యాంజియోగ్రామ్ తదితర పరీక్షలు చేసి బ్లాక్స్ లేవని, అయితే ఆయన గుండెకు పంపింగ్ సామర్థ్యం బాగా తక్కువగా..అంటే 18కి దిగిపోయిందని డాక్టర్లు తేల్చారు. రిహాబ్‌తో రీచార్జ్ డాక్టర్ మురళీధర్ నిర్వహించే కార్డియాక్ రిహాబ్ సెంటర్ ప్రోగ్రామ్‌లో లింగం చేరారు. అక్కడ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని రకాల మందులు, చికిత్సలతో పాటుగా రెగ్యులర్‌గా ట్రెడ్మిల్ వ్యాయామం, ఆహారంలో రైస్ బాగా తగ్గించి కాయగూరలు, మొలకలు వంటివి బాగా పెంచారు. తద్వారా పంపింగ్ సామర్థ్యాన్ని 53 శాతానికి మెరుగుపరిచారు. ఫలితంగా గత ఏడాదిలో జరిగిన హాఫ్ మారథాన్ పూర్తి చేసిన లింగం...మంచి అలవాట్లు కొనసాగిస్తూ గుండెను మరింత బలోపేతం చేసుకున్నారు. ప్రస్తుతం ఫుల్ మారథాన్‌ను కూడా పూర్తి చేయగలిగారు. చదవండి: మంచిర్యాల: పీఎస్‌లో కుప్పకూలిన నిందితుడు -
Srushti Sudhir Jagtap: రికార్డు సృష్టించింది!
సాధించాలంటే కఠోర సాధన ఉండాలి. అంతకు మించిన అంకితభావం ఉండాలి. ఈ రెండూ ఉంటే రికార్డు సాధనకు వయసు అనేది ప్రధానం కాదని నిరూపించింది సృష్టి సుధీర్ జగ్తాప్. పదహారేళ్ల సృష్టి విరామం లేకుండా 127 గంటల సేపు నాట్యం చేసి లాంగెస్ట్ డాన్స్ మారథాన్ (ఇండివిడ్యుయల్ కేటగిరీ)లో గిన్నిస్ రికార్డు సాధించింది. మహారాష్ట్రలోని లాతూర్‌కి చెందిన సృష్టి... లాతూర్‌లోని పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోంది. ఆమె అమ్మానాన్న సుధీర్, సంజీవని ఇద్దరూ టీచర్లు. వాళ్ల తాతగారు ‘బాబన్ మనే’ స్వయానా నాట్యగురువు. సృష్టికి చిన్నప్పటి నుంచి నాట్యసాధన అలవాటయింది. కానీ ఆమెకు రికార్డు కోసం నాట్యం చేయాలనే ఆకాంక్షకు కారణం బందనా నేపాల్. ఆమె 2018లో 126 గంటల సేపు నాట్యం చేసి లాంగెస్ట్ డాన్స్ మారథాన్‌లో గిన్నిస్ రికార్డు సాధించింది. అప్పుడు ‘భారతీయ నాట్యరీతులు లెక్కలేనన్ని ఉన్నాయి. మన నాట్యరీతికి ఓ రికార్డు ఉంటే బావుణ్ను. ఆ రికార్డు ద్వారా ప్రపంచదేశాలకు మన శాస్త్రీయ నాట్యం గురించి తెలుస్తుంది’... అనే ఆలోచన సృష్టిలో రేకెత్తింది. ఆమె ఆలోచనకు తల్లిదండ్రులు, తాత అండగా నిలిచారు. గిన్నిస్ రికార్డు కోసం కథక్ నాట్య సాధన చేయాలనుకుంది. తాత పర్యవేక్షణలో 15 నెలల పాటు కఠోరసాధన చేసింది. ధ్యానంలో యోగనిద్ర కూడా సాధన చేయించారు బాబన్ మనే. రోజుకు నాలుగు గంటల సేపు ధ్యానం, మూడు గంటల సేపు వ్యాయామం, ఆరు గంటల సేపు నాట్యసాధన... ఇదీ రికార్డు కోసం ఆమె చేసిన దీక్ష. గంటకు ఐదు నిమిషాల విరామం సృష్టి 127 గంటల నాట్య ప్రద్శన మే నెల 29వ తేదీన పోదార్ స్కూల్ వేదిక మీద మొదలైంది. నాట్యప్రదర్శన ఐదు రోజుల పాటు నిర్విరామంగా సాగింది. ఆహారం అందక దేహం నీరసించి, డీహైడ్రేషన్‌కు లోను కాకుండా ఉండడానికి గంటకోసారి ఐదు నిమిషాల సేపు విరామం తీసుకునేది. ఆ విరామంలో ఎనర్జీ డ్రింక్ తీసుకుంటూ తన నాట్యదీక్షను కొనసాగించింది. సృష్టి నాట్యం చేసినంత సేపూ ఆమె తల్లిదండ్రులు వేదిక పక్కనే ఉండి ఆమెకు కావలసినవి అందిస్తూ వచ్చారు. నాట్య ప్రదర్శనను వీక్షించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి స్వప్నిల్ దంగారికర్ సర్టిఫికేట్ ప్రదానం చేస్తూ సృష్టిని ప్రశంసల్లో ముంచెత్తారు. ‘‘రికార్డు సాధనలో నా లక్ష్యం నెరవేరింది. ఐదు రోజుల ఐదు గంటల పాటు (విరామంతో కలిపి దాదాపు ఆరు రోజులు) సాగిన నాట్య ప్రదర్శన మధ్యలో అప్పుడప్పుడూ తల, శరీరం తూలిపోతున్న భావన కలిగాయి. నా లక్ష్యం 127 గంటలను పూర్తి చేయడం. లాంగెస్ట్ డాన్స్ మారథాన్‌లో ఇండియాకు రికార్డు సాధించడం. దేహం నిస్సత్తువతో ఇకచాలనే సంకేతాలు జారీ చేసినప్పుడు నా లక్ష్యాన్ని గుర్తు చేసుకుని క్షణాల్లో నన్ను నేను సంబాళించుకున్నాను. మానసికంగా స్థిరంగా ఉంటే దేహం కూడా సహకరిస్తుంది’ అన్నది పదహారేళ్ల సృష్టి. -
73 ఏళ్ల వయసులో బాడీబిల్డింగ్.. ఈయన గురించి తెలుసుకోవాల్సిందే
‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అని అందరికి తెలిసిందే. కానీ, గోల్డ్ ఓల్డ్‌గా ఎన్నటికీ మారదన్నట్లు మనిషికి వయసు పైబడినంత మాత్రాన సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ఇదే విషయాన్ని నిజం చేస్తూ ఎంతోమంది వృద్ధులు లేటు వయసులోనూ వివిధ రంగాల్లో ఘన విజయాలు సాధిస్తున్నారు. అలాంటి వారిలో కేరళకు చెందిన వేంకటేష్ ప్రభు కూడా ఒకరు. ప్రస్తుతం సింగపూర్‌లో స్థిరపడ్డ ప్రభు.. పదవీ విరమణ పొందిన తర్వాత అందరిలా ఇంట్లో ఖాళీగా కూర్చోవాలనుకోలేదు. అది గ్రహించిన అతడి కూతురు ఇచ్చిన సలహా మేరకు 58 ఏళ్ల వయసులో పరుగు ప్రారంభించాడు. ఇక అప్పటి నుంచి ప్రభు పరుగు ఆగలేదు. కేవలం 15 సంవత్సరాల్లోనే 50 మారథాన్లను పూర్తి చేశాడు. 73 ఏళ్ల వయసులోనూ ఆగకుండా 21 కిలోమీటర్లు పరుగెత్తి అందరినీ ఆశ్చర్యపరచాడు. అంతేకాదు, ఈ వయసులోనూ బాడీబిల్డర్‌లా బరువులెత్తగలడు. ప్రస్తుతం సొంతంగా ఓ ఫిట్నెస్ సెంటర్‌ని ప్రారంభించి, తనలాంటి ఎంతోమంది వయో వృద్ధుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు. ఇంతకీ, తన ఆరోగ్య రహస్యం ఏమిటని అడిగితే ‘ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూండటం, మంచి ఆహారం తీసుకోవడమే’ అంటాడు ఈ తాత. -
Mahasweta Ghosh: ఎడారి చిరుత
ప్రపంచంలో అత్యంత కష్టమైన మారథాన్ ‘సహారా మారథాన్’. ఆరు రోజుల పాటు సహారా ఎడారిలో 250 కిలోమీటర్లు నడవాలి. ఒక్క ఒయాసిస్సు కూడా తగలని ఈ దారిలో ప్రాణం కూడా పోవచ్చు. ఇంతటి ప్రమాదకరమైన పోటీలో భారతీయ మహిళ మహాశ్వేతా ఘోష్ మొదటిసారి పాల్గొని మారథాన్ పూర్తి చేసింది. ఆమె పరిచయం. ‘మారథాన్ దెస్ సేబుల్స్’ లేదా ‘మారథాన్ ఆఫ్ ది శాండ్స్’ లేదా ‘సహారా మారథాన్’లో పాల్గొనేవారి ధైర్యం ఏమిటో? మామూలుగా ఎండలో నడవడమే కష్టం. అలాంటిది ఎడారి ఎండలో నడవడం సామాన్యమా? మామూలు నేల మీద ఎక్కువసేపు నడవడం కష్టం. ఇక ఎడారి ఇసుకలో ఎక్కువ సేపు నడవడం సాధ్యమా? 44 ఏళ్ల మహాశ్వేతా ఈ అసాధ్యమైన మారథాన్‌ను పూర్తి చేయగలిగింది. అలా చేసిన తొలి భారతీయ మహిళగా రికార్డు స్థాపించింది. ఏప్రిల్ చివరి వారంలో మొదలయ్యి మే 1న ఈ మారథాన్ పూర్తయ్యింది. ఎడారిలో సాహసవంతులు ‘మారథాన్ ఆఫ్ ది శాండ్స్’ 1986 నుంచి మొదలయ్యింది. 1984లో పాట్రిక్ బ్యూయెర్ అనే ఫ్రెంచ్ వ్యక్తి మొరాకోలోని సహారా ఎడారిలో 12 రోజుల పాటు ఒక్కడే 250 కిలోమీటర్లు ప్రయాణించాడు. అతడు ప్రయాణించిన దారిలో ఒక్క ఒయాసిస్సు కూడా లేదు. ఎడారి తండాలు కూడా కనిపించలేదు. అంటే ఈ దారి అల్ట్రా మారథాన్‌కు అనువైనదని భావించి రెండేళ్ల తర్వాత ఈ మారథాన్‌ను మొదలెట్టాడు. అయితే 2009 నాటికిగాని ఇది ఊపందుకోలేదు. ఆ సంవత్సరం వెయ్యి మంది సహారా మారథాన్‌లో పాల్గొన్నారు. అడుగడుగునా సవాళ్లు 2023లో మారథాన్ ఆఫ్ ది శాండ్స్ ఏప్రిల్ చివరి వారంలో మొదలయ్యింది. భారతదేశం నుంచి మహాశ్వేతా ఘోష్ మాత్రమే హాజరయ్యింది. అనేక దేశాల నుంచి మొత్తం 1200 మంది పోటీదారులు వచ్చారు. ‘మా అందరికీ 11 కిలోల బరువున్న బ్యాక్ ప్యాక్ మాత్రమే అనుమతించారు. రోజుకు 12 లీటర్ల నీళ్లు నిర్వాహకులు సప్లై చేశారు. అంతకుమించిన నీరు దొరకవు. ఎవరి ఆహారం వారు తినాలి. మారథాన్‌లో పెద్దగా స్నేహాలు ఏర్పడవు. పోటీ కాబట్టి ఎవరి లక్ష్యంలో వారు నడుస్తుంటారు. ఎడారి దారిలో 40 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకూ ఉండే ఎండలో నడవడం అంటే మాటలు కాదు. మాకు ప్రతిరోజూ లక్ష్యం ఇస్తారు. అంటే రోజుకు 70 నుంచి 90 కిలోమీటర్ల లక్ష్యానికి చేరుకోవాలి. ఇచ్చిన సమయంలో నిర్దేశిత దూరానికి చేరుకోలేకపోతే అక్కడితో వారు పోటీ నుంచి డిస్క్వాలిఫై అయిపోతారు. నేను ఎలాగైనా ఈ మారథాన్ పూర్తి చేయదలిచాను. అందుకే ఏ రోజు కూడా నిర్దేశిత గమ్యాన్ని తప్పలేదు. చాలామంది మధ్యలోనే ఆగిపోయారు’ అని తెలిపింది మహాశ్వేతా. పోహా, ఓట్స్ ‘నేను మారథాన్ సాగిన ఆరు రోజులు హల్దీరామ్ డిహైడ్రేటెడ్ దాల్ చావల్, రెడీ టు ఈట్ పోహా, న్యూట్రిబార్స్, చాక్లెట్లు, డ్రై ఓట్స్ తిన్నాను. తల మీద సోలార్ హ్యాట్, కూలింగ్ గ్లాసెస్, స్ట్రోలింగ్ స్టిక్స్, భుజాన బ్యాగ్‌తో మన నడక కొనసాగాలి. చివరిరోజు చివరి దశలో పరుగు తీయాలి. ఎండ మన సహనాన్ని పరీక్షిస్తుంది. డీ–హైడ్రేట్ కాకుండా చూసుకో వాలి. చాలామంది తల మీద నీళ్లు పోసుకుంటారు. అలా పోసుకోవడం వల్ల వేడి ఇంకా పెరుగుతుంది. కేవలం మెడ, ముఖం తడుపుకుంటూ ముందుకు సాగాలి. గుడారంలో రాత్రిపూట విశ్రాంతిలో భాగ్ మిల్కా భాగ్‌లోని స్ఫూర్తిగీతం వినేదాన్ని’ అని చెప్పిందామె. భ్రాంతుల నుంచి ‘ఎడారిలో భ్రాంతులు ఎక్కువ. వాటి మాయలో పడ్డామంటే చిక్కుల్లో పడతాం. ఈ ఎడారిలో నీకు ఎప్పటికీ నీళ్లు కనిపించవు. కనిపించే నీళ్లను నమ్మకు అని నా మనసుకు చెప్పుకున్నాను. ఏమంటే చాలాసార్లు ఎండమావులు కనిపిస్తాయి. షూస్‌లో ఇసుక దూరకుండా నడవడం పెద్ద విద్య. ఇన్ని కష్టాలు పడ్డా అంతిమంగా యాత్ర ముగిస్తే కలిగే ఆనందం నిజంగా జీవితంలో ఒయాసిస్సులా ఉంటుంది’ అందామె నవ్వుతూ. లూజర్స్ స్ఫూర్తి ‘మాది పశ్చిమ బెంగాల్. నేను కాలేజీలో చదివేప్పుడు సన్నబడటానికి నడకను, జాగింగ్‌ను సాధనంగా చేసుకున్నాను. అదే కొనసాగిస్తున్నాను. 2019లో నెట్‌ఫ్లిక్స్‌లోని లూజర్స్ సిరీస్ నాకు మారథాన్ ఆఫ్ శాండ్స్ గురించి తెలియజేసింది. అందులోని ఒక ఎపిసోడ్లో ఒలింపిక్ విజేత మౌరో ప్రాస్పెరీ మారథాన్ ఆఫ్ శాండ్స్ను ఎలా ముగించాడో వివరంగా చూపించారు. నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. అయితే ఎడారిలో మారథాన్ చాలా కష్టం. అందుకే రాజస్థాన్‌లోని పోఖ్రాన్లో నాకై నేను 75 కిలోమీటర్ల మారథాన్ సాధన చేసి ఈ అతికష్టమైన ఎడారి మారథాన్‌కు సిద్ధమయ్యాను’ అని చెప్పింది మహాశ్వేతా ఘోష్. -
మాంచెస్టర్‌లో హైస్కూల్ టీచర్.. సంబల్‌పురీ చీరకట్టి సంబురంగా పరుగెట్టీ
మొన్నటికి మొన్న గ్వాలియర్‌లో... చీరె ధరించి ఫుట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు మహిళామణులు. తాజాగా... మాంచెస్టర్ మారథాన్‌లో చీరె ధరించి పాల్గొని ‘శభాష్’ అని ప్రశంసలు అందుకుంటోంది మధుస్మిత జెన... చిన్నప్పటి నుంచి మధుస్మితకు పరుగెత్తడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే తనకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చింది. మాంచెస్టర్‌లో హైస్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న మధుస్మిత జెన నార్త్ వెస్ట్ ఇంగ్లాండ్ ఒడియా కమ్యూనిటీలో క్రియాశీల కార్యకర్త. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మారథాన్లు, ఆల్ట్రా మారథాన్లలో పాల్గొంది. తాజాగా మాంచెస్టర్‌లో 42.5 కి.మీల మారథాన్‌లో పాల్గొంది. ఈసారి మాత్రం అందరూ ఆశ్చర్యపడేలా చేసింది. అభినందనలు అందుకుంది. ఈసారి ప్రత్యేకత...సంబల్‌పురీ చీర కట్టి మారథాన్‌లో పాల్గొంది మధుస్మిత. ‘అంతదూరం చీరతో పరుగెత్తడం సులువేమీ కాదు’ అంటున్న మధుస్మిత సంతోషం ప్లస్ సంకల్పబలంతో నాలుగు గంటల యాభైనిమిషాలలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ‘చీరతో మారథాన్‌లో పాల్గొనడం అసాధ్యం అనేది చాలామంది నమ్మకం. ఇది తప్పని రుజువు చేయాలనుకున్నాను’ అంటుంది 41 సంవత్సరాల మధుస్మిత. ‘తనలోని ప్రతిభతో ఎప్పుడూ ఎంతోమందికి స్మిత స్ఫూర్తి ఇస్తుంటుంది. ఆమె విజయానికి గర్విస్తున్నాం’ అంటున్నాడు ఒడియా కమ్యూనిటీ మాజీ కార్యదర్శి సుకాంత్ కుమార్ సాహు. ఒడిశాలోని కుస్పూర్ గ్రామానికి చెందిన మధుస్మితకు తల్లి, అమ్మల ద్వారా చీరెపై ఇష్టం ఏర్పడింది. ఇంగ్లాండ్‌లో ప్రత్యేకమైన సందర్భాలు, వేసవిలో చీర ధరిస్తుంది మధుస్మిత. -
Vizag : విశాఖ ఆర్కే బీచ్‌లో జి 20 సదస్సు సన్నాహక మారథాన్ (ఫొటోలు)
-
విశాఖపట్నం ఆర్కే బీచ్ లో విజయవంతంగా మారథాన్
-
చీరకట్టులో మారథాన్.. 80 ఏళ్లయినా తగ్గేదే లే.. బామ్మ వీడియో వైరల్
ముంబై: పట్టుదల ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఏమైనా సాధించవచ్చని మరోమారు నిరూపించారు మహారాష్ట్ర ముంబైకి చెందిన ఓ బామ్మ. 80 ఏళ్ల వయసులో మారథాన్‌లో పాల్గొన్నారు. స్నీకర్స్ ధరించి చీరకట్టులో పరుగులు తీశారు. చేతిలో జాతీయ జెండా కూడా పట్టుకున్నారు. 51 నిమిషాల్లో 4.2కిలోమీటర్లు పరుగెత్తి శభాష్ అనిపించుకున్నారు. టాటా ముంబై మారథాన్ 18వ ఎడిషన్ ఆదివారం ఘనంగా జరిగింది. దాదాపు 55,000 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. 80 ఎళ్ల బామ్మ కూడా ఇందులో భాగమయ్యారు. ఆమె మనవరాలు ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. दुनिया में कोई काम असंभव नहीं, बस हौसला और मेहनत की जरूरत है।#thursdayvibes #ThursdayMotivation #marathon #mumbai #grandmother pic.twitter.com/dDzvGxmFG9 — Dr. Vivek Bindra (@DrVivekBindra) January 19, 2023 ఈ బామ్మ చాలా మందికి స్ఫూర్తి. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమేనని ఈమె నిరూపించారు. అని కొందరు నెటిజన్లు ప్రశంసించారు. కాగా.. ఈ మారథాన్‌లో పాల్గొనడం తనకు ఇది ఐదోసారి అని బామ్మ తెలిపారు. తాను భారతీయురాలినని సగర్వంగా చెప్పేందుకే చేతిలో జాతీయ జెండా పట్టుకున్నట్లు వివరించారు. చదవండి: పేదలకు ప్రతి నెలా రూ.2,000.. కర్ణాటక మంత్రి కీలక ప్రకటన -
విశాఖ బీచ్‌రోడ్‌లో మారథాన్ (ఫొటోలు)
-
వింత స్టంట్: 50 ఏళ్ల వ్యక్తి స్మోకింగ్ చేస్తూ మారథాన్
మారథాన్ చేయడం అంత ఈజీ కాదు. అందుకు ప్రత్యేక శిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి, నిబద్ధత అవసరం. ఆరోగ్య స్పృహతో ఉన్న క్రీడాకారులు మాత్రమే ఇలాంటివి చేస్తారని అందరికీ తెలుసు. కానీ ఇక్కడొక మనిషి అందుకు విరుద్ధం. పొగ తాగుతూ... మారథాన్ చేసి అందర్నీ ఆకర్షించాడు. వివరాల్లోకెళ్తూ.....చైనాకు చెందిన అంకుల్ చెన్ అనే వ్యక్తి మారథాన్ పోటీల్లో స్మోక్ చేస్తూ మారథాన్ చేశాడు. అలా చేయడంతో అతని ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాడు. వాస్తవానికి ధూమపానం చేస్తే గుండె, ఊపితిత్తులు, కండరాలకు ఆక్సిజన్ తక్కువగా అందడంతో పరుగు పెట్టడం కష్టమవుతుంది. కానీ ఈ 50 ఏళ్ల చెన్ మాత్రం చైనాలోని జియాండేలో జరిగిన 42 కి.మీ మారథాన్‌ని ధూమపానం చేస్తూ పూర్తి చేశాడు. పైగా ఈ మారథాన్ మూడు గంటల 28 నిమిషాల్లో పూర్తి చేశాడు. అంతేగాదు పోటీలో ఉన్న 1500 మందిలో 574వ రన్నర్‌గా నిలిచాడు. చెన్ ఇలాంటి వింత స్టంట్లు చేయడం ఇది తొలిసారి కాదు. 2018 గ్వాంగ్జౌ మారథాన్, 2019 జియామెన్ మారథాన్‌లో ధూమపానం చేస్తూ పాల్గొన్నాడు. దీంతో అతని ఫోటోలు చైనా సోషల్ మాధ్యమం విబోలో తెగ వైరల్ అయ్యాయి. ఈ మేరకు నెటిజన్లు పొగ తాగకపోతే ఇంకా మెరుగైనా ప్రతిభ కనబర్చేవాడని ఒకరు, అక్షరాల అతని ఊపిరిత్తితులు బాగా పనిస్తున్నాయి అని మరోకరు కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. ఐతే ప్రస్తుతం మారథాన్ పోటీల్లో ధూమపానం చేయకూడదనే నిబంధనలు లేవు. (చదవండి: ఐదేళ్ల తర్వాత.. ఈ చిట్టిబాబుకు చెవులొచ్చాయ్! ఎలాగో తెలుసా?..) -
మిర్చీ భార్గవి.. పరుగుల రాణీ..!
హాయ్.. హలో అంటూ సాక్షి టీవీలో బ్యాండ్ బాజా ప్రోగ్రాంను పరుగులెత్తించిన మిర్చీ భార్గవి నిజ జీవితంలో పరుగుల రాణీగా మారింది. హైదరాబాద్‌లో రేడియో జాకీగా బిజీగా ఉంటూనే వివిధ ప్రాంతాల్లో మారథాన్లలో పాల్గొంటోంది భార్గవి. ఫిట్నెస్ అంటే తనకు ప్రాణమని చెప్పుకునే భార్గవి.. మన జీవితం ఒకే సారి ఉంటుందని, ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవన విధనాంతో మరింత సంతోషంగా ఉండవచ్చని చెబుతోంది. మెరుగైన ఫిట్ నెస్ కోసం పరుగెత్తడం మొదలెట్టిన భార్గవి కొన్నాళ్లలోనే ప్రొఫెషనల్ రన్నర్‌గా మారిపోయింది. భార్గవి ఖాతాలో మూడు ప్రపంచంలోనే మూడు అతి పెద్ద మారథాన్లుగా పేరుపడ్డ బెర్లిన్ (జర్మనీ), న్యూయార్క్ (అమెరికా)లలో పాల్గొన్న భార్గవి.. ఈ నెలలో షికాగో (అమెరికా) మారథాన్లోనూ పాల్గొన్నారు. "ఒక్కసారి మారథాన్‌లో పాల్గొనడమనేది జీవితానికి సరిపడా అనుభవాలను, పాఠాలను నేర్పిస్తుంది. నువ్వు మారథాన్‌ను పూర్తి చేయగలిగితే జీవితంలో ఏదైనా సాధిస్తావన్న ఆత్మవిశ్వాసం కలిగిస్తుందంటారు" భార్గవి. వణికించే ఛాలెంజ్ షికాగో ఇటీవల షికాగోలో జరిగింది 44వ ఎడిషన్ మారథాన్. ఇందులో 40 వేల మంది వేర్వేరు దేశాల రన్నర్లు పాల్గొన్నారు. షికాగోను విండ్ సిటీ అని కూడా అంటారు. వణికించే చల్లటి ఈదురుగాలుల మధ్య మారథాన్‌లో పాల్గొనడమంటే మాటలు కాదు. గ్రాంట్ పార్క్ వద్ద ఎండ్ పాయింట్‌ను చేరుకున్న విజేతలు తమ స్వప్నాన్ని పూర్తి చేసుకున్నందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్లానింగ్ వర్సెస్ సక్సెస్ "ఇంత బిజీగా ఉంటావు, పరుగులెలా తీస్తున్నావని నన్ను అందరూ అడుగుతారు, ఒక రోజును మనం ఏ రకంగా ప్లాన్ చేసుకుంటున్నామన్న దాంట్లోనే ఉంది. ఫిట్నెస్ కోసం ప్రతీ రోజు కొంత సమయం కేటాయించుకోగలిగితే.. మనలో తేడా మనకే తెలుస్తుంది" అంటారు భార్గవి. ఆల్ ది బెస్ట్ పరుగుల రాణీ. -
Pureathon 2022: ప్రతి ఒక్కరికి రుతుక్రమంపై అవగాహన అవసరం.. అందుకే ఈ పరుగు
Menstruation Awareness 2K 5K Run: మహిళల్లో రుతుక్రమం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని డాక్టర్ మంజుల అనగాని, టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ అన్నారు. ప్యూరథాన్ పేరుతో ఈ నెల 9న పీపుల్స్‌ప్లాజాలో నిర్వహించబోయే అవగాహన 2కే, 5కే రన్ సన్నాహక సమావేశాన్ని బంజారాహిల్స్‌లోని బ్లూ ఫాక్స్ హోటల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగాని, హీరో సందీప్ కిషన్, దర్శకుడు మెహర్ రమేష్, నటి ఝన్సీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మంజుల అనగాని మాట్లాడుతూ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బహిష్టు సమయంలో బాలికలను, మహిళలను అంటరాని వారుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదన్న ఆమె.. మహిళల్లో రుతుక్రమం అనేది సర్వసాధారణమైన విషయమని ప్రతి తల్లి తమ ఇంట్లో ఉన్న భర్త, అన్న, తమ్ముడు, కుమారుడు ఇలా అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయం గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మహిళలు బహిష్టు సమయంలో సరైన రక్షణ చర్యలు లేక అనారోగ్యాల బారిన పడి మరణిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని అనగాని మంజుల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో మహిళలు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు శైలా తాళ్లూరి ముందుకు రావడం అభినందనీయం అన్నారు. రుతుక్రమం వచ్చినప్పడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన ఉదయం 6 గంటలకు నిర్వహించబోయే 2కే, 5కే రన్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ రన్లో ఆర్టీసీ ఎండి సజ్జనార్‌తో, రాకొండ సీపీ మహేష్‌భగవత్, హీరోయిన్ కీర్తి సురేష్, సినీ నటుడు సత్యదేవ్, సింగర్ సిద్ శ్రీరామ్, సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపోలో వైద్యురాలు షర్మిలా పెండ్యాల, సామాజిక వేత్త పార్వతి సుదర్శన్, ప్రేమా సుదర్శన్, ట్రాన్స్‌జెండర్ రచన పాల్గొన్నారు. చదవండి: Health Tips: అధిక రక్తపోటు ప్రాణాలకు కూడా ముప్పే! వీటిని తరచుగా తిన్నారంటే.. -
ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ రన్ (ఫొటోలు)
-
106 రోజుల్లో 106 మారథాన్లతో గిన్నిస్ రికార్డు
Guinness World Record for the most consecutive days to complete a marathon: కేట్ జేడెన్ అనే బ్రిటిష మహిళ వరుసగా అత్యధిక రోజులు మారథాన్ పూర్తి చేసి గిన్నిస్ రికార్డు సొంతం చేసింది. ఈ మేరకు ఆమె 106 రోజుల్లో 106 మారథాన్లను చేసింది. అత్యథిక రోజులు మారథాన్ చేసిన వ్యక్తిగా రికార్డులకెక్కింది. ఆమె గతేడాది డిసెంబర్ 31, 2021 నుంచి ఏప్రిల్ 15, 2021 వరకు చాలామైళ్లు మారథాన్ పూర్తి చేసింది. అలిస్సా క్లార్క్ పేరిట ఉన్న 35 రోజుల మునపటి రికార్డును బ్రేక్ చేసింది. ఆమె ఈ మారథాన్‌ని నిధులు సేకరణ కోసం చేస్తోంది. మానసిక ఆరోగ్య సేవలకు, శరణార్థుల మానవతా సాయానికి విరాళాలు ఇచ్చేందుకు ఆమె ఈ నిధులు సేకురిస్తోంది. ఈ క్రమంలో జేడెన్ తన ఇన్‌స్టాగ్రాంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సంబంధించిన పోస్ట్‌లను నెటిజన్లుతో పంచుకున్నారు. దీంతో నెటిజనలతో మీరు అద్భుతమైన విజయం సాధించారంటూ అభినందిస్తూ పోస్టులు పెట్టారు. ఆమె మొదట్లో వంద రోజుల్లో 100 మారథాన్లు పూర్తి చేయాలని భావించింది. ఆమె మారథాన్ చేసిన ప్రదేశాలు అలెప్పో, సిరియా, యునైటెడ్ కింగ్డమ్ మధ్య దాదాపు 2620 మైళ్ల దూరం ఉంటుంది. వాస్తవానికి ఈ మార్గం ఆశ్రయం శరణార్థులు తరచూ ప్రయాణించే మార్గం కావడం విశేషం. (చదవండి: భారత్‌తో పాటు ఇతర దేశాలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు) -
– 53 డిగ్రీల సెల్సియస్, గడ్డకట్టే చలిలో పరుగు, ఎందుకిదంతా అని ఆశ్చర్యపోతున్నారా?
Worlds Coldest Marathon At Yakutia: చూశారుగా... కనురెప్పలు సహా మొహాన్ని మంచు కప్పేసినా, గడ్డకట్టే చలి తీవ్రతకు నోట్లోని లాలాజలం సూదిలా పెదవులను గుచ్చుతున్నా లెక్కచేయకుండా ఓ యువకుడు లక్ష్యం వైపు సాగిపోతున్న దృశ్యమిది. మంచులో ఈ పరుగేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది అలాంటి, ఇలాంటి పరుగు పందెం కాదండి. రష్యాలోని సైబీరియాలో ఉన్న ఓమ్యకోన్లో ఇటీవల జరిగిన మంచు మారథాన్ అన్నమాట. అదేనండి 42.19 కి.మీ. ఆగకుండా పరుగెత్తి గమ్యం చేరుకోవడం. ఆ ఏముందిలే.. ఒళ్లంతా వెచ్చని దుస్తులు కప్పుకొని పరిగెత్తడమూ ఓ విశేషమేనా అని అనుకుంటున్నారా? విశేషమే మరి.ఈ పోటీ జరిగిన సమయంలో ఉష్ణోగ్రత ఎంతో తెలుసా? ఏకంగా మైనస్ 53 డిగ్రీల సెల్సియస్. ఇంత చల్లటి ఉష్ణోగ్రతల్లో జరిగిన పోటీ కాబట్టే ‘వరల్డ్స్ కోల్డెస్ట్ మారథాన్’గా గిన్నిస్ రికార్డులకెక్కింది. ఈ పోటీలో అమెరికా, రష్యా, యూఈఏ, బెలారస్‌కు చెందిన 65 మంది పరుగువీరులు అత్యంత ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా పాల్గొన్నారు. సుమారు 100 మంది స్థానికులు ఈ పోటీని చూసేందుకు, పోటీదారులను ఉత్సాహపరిచేందుకు వచ్చారు! పురుషుల విభాగంలో రష్యాకు చెందిన వ్యాసిలీ ల్యూకిన్ 3 గంటల 22 నిమిషాల్లో ఈ మారథాన్‌ను పూర్తి చేయగా మహిళల విభాగంలో సైబీరియా ప్రాంతానికి చెందిన మెరీనా సెడలిస్చెవా 4 గంటల 9 నిమిష్యాల్లో గమ్యం చేరుకుంది. చదవండి: ఆ వ్యక్తి ఏడు నిమిషాలకే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు!.. ఎలాగో తెలుసా? ఏటా దాదాపు 10 నెలలు మంచు దుప్పటిలో ఉండే ఓమ్యకాన్ ప్రాంతంలో చలి తీవ్రత ఎంతలా ఉంటుందంటే అక్కడ ఎవరైనా మరణిస్తే వారికి అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశం గడ్డకట్టకుండా ఉండేందుకు రోజుల తరబడి పెద్దపెద్ద మంటలు వేయాల్సి ఉంటుందట! అంతటి ప్రతికూల వాతావరణంలో ఎందుకు పరుగులు పెట్టడం? అని పోటీదారులను అడిగితే ‘గల్లీలో సిక్సర్ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో కొట్టే వాడికే ఓ రేంజ్ ఉంటుంది’ అనే తరహాలో బదులిచ్చారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
మారథాన్.. ధనాధన్
-
వయసు 105.. 102 సెకన్లలో 100 మీటర్లు
వాషింగ్టన్: 105 ఏళ్లు... జీవితమే ఊహకందదు. కానీ ఆ వయసులో ప్రపంచ రికార్డు సృష్టించింది లూసియానాకు జూలియా హరికేన్స్ హాకిన్స్. 102 సెకన్లలో 100 మీటర్ల దూరం పరుగెత్తింది. ఆమె పేరులోకి ‘హరికేన్’అట్లా రికార్డుతో వచ్చిందే. మీ వయసుకంటే తక్కువ సెకన్లలోపే పూర్తిచేశారు కదా ... ‘‘నో’నిమిషంలో పూర్తి చేయాలనుకున్నా. కుదరలేదు. ఇంకా ఎక్కువ పరుగెత్తాలి’ అని చెబుతోంది. రన్నింగ్‌ను 101వ ఏట మొదలుపెట్టిన హాకిన్స్‌కు అథ్లెటిక్స్ కొత్తేం కాదు. 80 ఏళ్ల వయసులో ‘నేషనల్ సీనియర్ గేమ్స్’సైక్లింగ్‌లో పోటీ పడింది. 2017లో సైక్లింగ్ వదిలేశాక... రన్నింగ్ ట్రాక్‌ను ఎంచుకుంది. సో... సంకల్పం ఉండాలేగానీ.. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్! -
హఠాత్తుగా మారిన వాతావరణం: పెనువిషాదం
బీజింగ్: మారథాన్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. అప్పటిదాకా ఎండగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవడంతో 21 మంది మరణించారు. ఈశాన్య చైనా హువాంగే షిలిన్ పర్వతాల దగ్గర శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం ఉదయం హవాంగే పర్వత ప్రాంతంలో 100 కిలోమీటర్ల అల్ట్రామారథాన్ మొదలైంది. ఆ టైంలో వాతావరణం పొడిగా ఉంది. అయితే మధ్యాహ్నం ఒంటిగంట టైంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులు, చలి తీవ్రత పెరిగిపోవడం, ఉన్నట్లుండి వడగళ్ల వానతో మారథాన్‌లో పాల్గొన్నవాళ్లు తట్టుకోలేకపోయారు. యెల్లో రివర్ స్టోన్‌ఫారెస్ట్ వెంట పరుగులు తీస్తున్న వాళ్లలో చాలామంది హైపోథెర్మియాకు గురయ్యారు. చాలామంది కనిపించకుండా పోయారు. దీంతో పోటీని ఆపేసిన నిర్వాహకులు.. సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. గడ్డకట్టుకుపోయి.. మొత్తం 172 మంది ఈ అల్ట్రామారథాన్‌లో పాల్గొన్నారు. వీళ్ల ఆచూకీ కోసం 1200 రెస్క్యూ టీంలుగా ఏర్పడ్డాయి. ఆదివారం ఉదయం కల్లా 151 మందిని సురక్షితంగా కాపాడగా, వీళ్లలో ఎనిమిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 21 మంది చనిపోయారని రెస్క్యూ టీం వర్గాలు వెల్లడించాయి. వీళ్లంతా చలిని తట్టుకోలేక గడ్డకట్టుకుని చనిపోయారని అధికారులు వెల్లడించారు. మారథాన్‌లో పాల్గొన్నవాళ్లు షార్ట్స్ ,టీషర్ట్స్ ధరించడం కూడా వాళ్ల మృతికి ఒక కారణమైందని అధికారులు అంటున్నారు. పరిగెడుతున్న టైంలో హఠాత్తుగా చీకటి అలుముకుందని తన నాలుకతో పాటు వేలు గడ్డకట్టాయని, వెంటనే ఓ చెట్టు తొర్రలోకి వెళ్లి దాక్కున్నానని ట్రీట్మెంట్ పొందుతున్న ఓ బాధితుడు వెల్లడించాడు. తనతో పాటు మరో పదిమంది దాక్కోగా.. రెస్క్యూ టీం కాపాడిందని తెలిపాడు. -
నాచారంలో సేవ్ వాటార్ మారథాన్
-
ఉత్సాహంగా 'నేవీ మారథాన్'
విశాఖ స్పోర్ట్స్: తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో వైజాగ్ నేవీ మారథాన్ విశాఖ సాగర తీరంలో ఆదివారం ఉదయం ఉత్సాహంగా సాగింది. మారథాన్‌ను తూర్పు నావికాదళ కమాండింగ్ చీఫ్ వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్, స్టాఫ్ చీఫ్ వైస్ అడ్మిరల్ గొర్మాడేతో కలసి రాష్ట్ర పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. కరేజ్ రన్ పేరిట 42.2 కిలోమీటర్ల మేరకు సాగిన మారథాన్‌లో 458 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. డెస్టినీ రన్ కింద 21.1 కిలోమీటర్ల మేరకు కొనసాగిన హాఫ్ మారథాన్‌లో 2,739 మంది అథ్లెట్లు ఉత్సాహంగా పరుగు తీశారు. అలాగే ఫ్రెండ్షిప్ రన్‌గా పది కిలోమీటర్ల మేరకు సాగిన పరుగులో 5,850 మంది పాల్గొనగా.. ఐదు కిలోమీటర్ల పరుగులో 10,061 మంది పాల్గొన్నారు. విజేతలు వీరే.. మారథాన్ మెన్ కేటగిరీలో ఫెలిక్స్ చిరిమోత్ రాబ్ విజేత కాగా మోహిత్ రాథోర్ రన్నరప్‌గా నిలిచాడు. హాఫ్ మారథాన్‌లో నికోడిమస్ కిప్రుగట్ గెలుపొందగా.. మోసెస్ కిప్టానియా రన్నరప్‌గా వచ్చాడు. మారథాన్ మహిళా విభాగంలో ఎట్రేగెనట్ బెలెటే విజేత అవగా, సెల్లీ జెబివుట్ రన్నరప్‌గా నిలిచింది. హాఫ్ మారథాన్ మహిళా విభాగంలో కరెన్ జబెట్ విజేత అవగా ఫూలన్ పాల్ రన్నరప్‌గా నిలిచింది. -
మారథాన్ వేదిక మార్పు ఖాయం
టోక్యో: వచ్చే ఏడాది సమ్మర్ టోక్యో ఒలింపిక్స్‌లో జరిగే మారథాన్, నడక రేసు వేదికలను మారుస్తూ గతంలో తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పూలేదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) చైర్మన్ జాన్ కొయేట్స్ స్పష్టం చేశారు. ఒలింపిక్స్ జరిగే జూలై, ఆగస్టులో టోక్యోలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని, అలాంటి వేడి వాతావరణంలో మారథాన్, నడక రేసులను నిర్వహించి అథ్లెట్ల ప్రాణాలతో చెలగాటం ఆడలేమని ఆయన పేర్కొన్నారు. అందుకే వాటిని టోక్యో నుంచి ఉత్తర జపాన్‌లోని సప్పోరొ సిటీకి మారుస్తున్నట్లు తెలిపారు. వాటిల్లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లకు పతకాల ప్రధానం మాత్రం టోక్యోలోనే నిర్వహిస్తామన్నారు. ఇటీవల దోహాలో ముగిసిన ప్రపంచ అథ్లెట్ల చాంపియన్‌షిప్ మారథాన్‌లో పాల్గొన్న పలువురు అథ్లెట్లు ఎండ వేడిమి తట్టుకోలేక రేసు నుంచి మధ్యలోనే వైదొలిగారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకూడదనే ఐఓసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. టోక్యో ఒలింపిక్ అభిమానులను తమ నిర్ణయంతో బాధ పెడుతున్నా అథ్లెట్ల శ్రేయస్సే మాకు ముఖ్యం అని జాన్ తెలిపారు. అయితే ఈ నిర్ణయం పట్ల టోక్యో గవర్నర్ యురికో కోయ్‌కె అసంతృప్తి వ్యక్తం చేసింది. -
ఢిల్లీ మారథాన్‌లో సచిన్ ‘పుష్–అప్స్’
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ‘న్యూఢిల్లీ మారథాన్’లో పుల్వామా అమర జవాన్ల కోసం కదంతొక్కాడు. ఈవెంట్ ప్రారంభానికి ముందు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సచిన్ 10 ‘పుష్–అప్స్’ ఎక్సర్సైజ్ చేశాడు. మారథాన్‌లో పరుగు పెట్టాడు. బ్యాటింగ్ గ్రేట్ కదంతొక్కడంతో రూ. 15 లక్షలు పోగయ్యాయి. ఈ మొత్తాన్ని ఇటీవల ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ‘ఓ మంచి పనికోసం నిధులను సేకరిస్తున్నారు. ప్రజలంతా ఇందులో భాగం కావాలని, ఎక్కువ మొత్తం నిధులు పోగవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పెద్దలతో పాటు ఉత్సాహంగా పరిగెత్తడానికి వచ్చిన బాలబాలికల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. రాబోయే తరం మీదే. జాతిని నడిపించేది మీరే. ఇలాంటి ఆరోగ్యకర వాతావరణంతో భారత్‌ను క్రీడలు ఆడే దేశంగా మార్చాలి. వెల్ డన్... ఢిల్లీ. ఈ మారథాన్‌కు మీ ఉరిమే ఉత్సాహమే ఊపిరి’ అని సచిన్ అన్నాడు. -
ఉత్సాహంగా మారథాన్
-
అలుపెరగని ‘పరుగు’
హైదరాబాద్: వృత్తి ఏదైనా ప్రవృత్తిలో రాణించవచ్చు. ఆటల్లో సత్తా చాటేందుకు వయసు అడ్డుకాబోదు. తల్లిదండ్రుల నుంచే కాదు కన్నబిడ్డల నుంచి కూడా స్ఫూర్తి పొందవచ్చు. ఈ అంశాలన్నీ నగరానికి చెందిన సీనియర్ ఉపాధ్యాయురాలు అన్నా అలెగ్జాండర్‌కు సరిగ్గా నప్పుతాయి. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు అయినప్పటికీ... పరుగును ప్రవృత్తిగా మార్చుకుంది. ఆరుపదుల వయసులోనూ అలుపెరగని పరుగుతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన కన్నబిడ్డలు పరుగు పోటీల్లో పాల్గొనడం చూసి స్ఫూర్తి పొందిన ఈ అమ్మ ఏకంగా మలివయçసులో పతకాలను సాధిస్తోంది. తాజాగా ముంబైలో జరిగిన టాటా–ముంబై మారథాన్ రేసులో అన్నా అలెగ్జాండర్ రజత పతకాన్ని గెలుచుకుంది. 60–64 వయోవిభాగం 10,000మీ. పరుగు ఈవెంట్‌ను ఆమె ఒక గంటా 19.45 నిమిషాల్లో పూర్తిచేసి రెండోస్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాకు చెందిన గిలియన్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. గతేడాది ఇదే ఈవెంట్లో అన్నా స్వర్ణంతో సత్తా చాటింది. టీచర్ టు అథ్లెట్... అమీర్‌పేట ధరమ్ కరమ్ రోడ్‌లోని సర్కారు బడిలో ‘పెగా టీచ్ ఫర్ ఛేంజ్’ అనే స్వచ్ఛంద సంస్థలో వాలంటరీగా పనిచేస్తున్న అన్నా అలెగ్జాండర్ ఉచితంగా పాఠాలు బోధిస్తూ అమీర్‌పేటలోనే నివసిస్తున్నారు. తన కుమారులు అశ్విన్, నితిన్ అలెగ్జాండర్ ఇంగ్లండ్‌లో జరిగే మారథాన్లలో క్రమం తప్పకుండా పాల్గొనడం తనకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్న అన్నా... 2016 నుంచే రన్నింగ్‌పై ఇష్టాన్ని పెంచుకున్నానని తెలిపింది. మూడేళ్లుగా వాకింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ వివిధ ప్రాంతాల్లో జరిగే మారథాన్లలో పాల్గొంటున్నానని చెప్పింది. 2017లో ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్‌లో 10,000 మీటర్ల పరుగులో బంగారు పతకం, 2018 నవంబర్‌లో ఫ్రీడం హైదరాబాద్ 10,000 మీటర్ల పరుగులో కాంస్యాన్ని గెలుచుకుంది. రన్నింగ్, సైక్లింగ్ ఈవెంట్లలో పాల్గొనే అన్నా అలెగ్జాండర్... హైదరాబాద్, హంపిలలో జరిగే ‘గో హెరిటేజ్’ ఈవెంట్లలోనూ భాగస్వాములవుతున్నారు. 20 ఏళ్ల క్రితం ముంబైలోని భారత్ పెట్రోలియంలో ఉద్యోగాన్ని వదులుకొని హైదరాబాద్ వచ్చిన ఆమె... బంజారాహిల్స్‌లో మంజరి ప్రీ ప్రైమరీ స్కూల్లో టీచర్‌గా పనిచేశారు. 2011లో ఈ పాఠశాల మూతపడటంతో టీచర్ వృత్తిపట్ల తనకున్న ఇష్టంతో టీచ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. అమీర్‌పేట సర్కారు బడిలో ఇంగ్లిషు టీచర్‌గా స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారు. భర్త అజిత్ అలెగ్జాండర్ జార్జ్, కొడుకులు, కోడళ్ల ప్రోత్సాహంతో పరుగులో కొనసాగుతున్నానని ఆమె తెలిపింది. -
జియో అమరావతి మారథాన్‌కు విశేష స్పందన
సాక్షి, అమరావతి: జియో అమరావతి మారథాన్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మూడు విభాగాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అమరావతిలోని మంతెన సత్యనారాయణ ఆశ్రమం వద్ద మొదలైన ఈ మారథాన్‌లో సుమారు 5000 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. ఏపీ రాజధానిలో జియో అమరావతి మారథాన్ నిర్వహించడం ఇది నాలుగోసారి. 5కే, 10కే, 21కే కేటగిరిల్లో పోటీలు నిర్వహించారు. 21కే రన్‌ను తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఐఏఎస్ అధికారి క్రాంతిలాల్ దండే, ఐపీఎస్ అధికారి చంద్రశేఖర్‌లు జెండా ఊపి మారథాన్‌ను ప్రారంభించారు.10కే రన్‌ను మంత్రి నక్కా ఆనంద్ బాబు, స్పోర్ట్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం జెండా ఊపి ప్రారంభించారు. 5కే రన్‌ను జియో ఏపీ సీఈవో మహేష్ కుమార్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మహేష్ కుమార్ మాట్లాడుతూ.. జియో అమరావతి మారథాన్ రన్లో తాము భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. అమరావతి నగరం అభివృద్ధి కోసం నిర్వహించే రన్లో నగరవాసులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో మరింతగా డిజిటల్ సేవలను విస్తరించాలనే ఉద్దేశ్యంతో మారథాన్‌లో భాగస్వాములమైనట్లు ఆయన తెలిపారు. -
ముంబై మారథాన్‌లో మెరిసిన సుధా సింగ్
ముంబై: భారత అథ్లెట్లు సుధా సింగ్, నితేంద్ర సింగ్ రావత్ ముంబై మారథాన్‌లో మెరిశారు. మహిళల, పురుషుల విభాగాల్లో భారత్ తరఫున మెరుగైన స్థానంలో నిలిచారు. సుధ 2 గంటల 34 నిమిషాల 56 సెకన్లలో పరుగును పూర్తిచేసి దోహాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం నిర్దేశించిన 2:37:00 క్వాలిఫయింగ్ మార్క్‌ను అధిగమించింది. రావత్ 2:15:52 సెకన్ల టైమింగ్‌తో మెరిశాడు. పురుషుల కేటగిరీలో 2:16:00 క్వాలిఫయింగ్ మార్క్‌ను నితేంద్రసింగ్ అధిగమించాడు. ఈ మారథాన్‌లో కాస్మస్ లగత్ (కెన్యా; 2:09:15) పురుషుల విభాగంలో విజేతగా నిలువగా... మహిళల కేటగిరీలో వర్క్నెష్ అలెము (ఇథియోపియా; 2:25:45) గెలిచింది. -
నాదల్ నిలిచాడు
రాఫెల్ నాదల్ ్ఠ డొమినిక్ థీమ్మ్యాచ్ చూసిన వాళ్లకిది ఆటగాఅనిపించలేదంటే నమ్మాల్సిందే!ఆటగాళ్లు రాకెట్లతోనే పోరాడారంటేఅనుమానించాల్సిందే! ఇందులో విజేత ఒకరే అంటే తప్పనాల్సిందే! ఈ పోరాటంలో ఓడింది... చెమటే అంటే ఔనాల్సిందే!అవును. ఇది నిజం. ఆట కాదది యుద్ధం. అవి రాకెట్లు కాదు ఆయుధాలే.ఒకరు కాదు ఐదు గంటలాడిన ఇద్దరూ విజేతలే. థీమ్ పరాజిత కానేకాదు. పోరాడి ఓడినా కచ్చితంగా విజయుడే...థీమ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ చావే తప్పించుకున్నాడు... అంతే! కానీ కన్నులొట్టబోయింది. ఈ శ్రమైక సమరంలో చివరకు కొన ఊపిరితో బయటబట్టాడు నాదల్. ప్రత్యర్థి థీమ్ ఒక్క ఫలితంలోనే వెనుకబడ్డాడు. అరివీర పరాజయుడుగా నిలిచాడు. ఔరా... యూఎస్ ఓపెన్ క్వార్టర్స్. న్యూయార్క్: డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో సెమీఫైనల్ చేరాడు. డొమినిక్ థీమ్ చివరకు ఫలితంలో ఓడినా మనసుల్ని గెలిచాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నాదల్‌తో పాటు డెల్‌పొట్రో కూడా విజయం సాధించగా... మహిళల సింగిల్స్‌లో సెరెనా ట్రాక్‌లోకి వచ్చింది. సెమీస్‌లోకి అడుగు పెట్టిన ఆమె... అమ్మతనంలో తొలి గ్రాండ్‌స్లామ్‌ను ముద్దాడేందుకు మరింత చేరువగా వచ్చింది. సరైనోడికి ‘సారీ’... స్పెయిన్ స్టార్, టాప్ సీడ్ నాదల్కు ఫ్రెంచ్ ఓపెన్‌లో అసాధారణ రికార్డు ఉంది. అందుకే సరిలేరు నీకెవ్వరని కీర్తిస్తాం. కానీ అలాంటి యోధుడికి ఈ యూఎస్ ఓపెన్‌లో సరైనోడు ఎదురుపడ్డాడు. ఎంతకీ తగ్గలేదు. ఎందాకైనా పోరాడాడు. ఓ దశలో ప్రేక్షకులకు ఈ మ్యాచ్ ముగించేది ఎవరనే అనుమానం వచ్చేసింది. చివరకు 4 గంటల 49 నిమిషాలపాటు జరిగిన సుదీర్ఘ క్వార్టర్ ఫైనల్ పోరులో ప్రపంచ నంబర్‌వన్ నాదల్ 0–6, 6–4, 7–5, 6–7 (4/7), 7–6 (7/5)తో తొమ్మిదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై గెలిచాననిపించాడు. ఇక్కడ ఫలితం ప్రకారమైతే విజేత ఒక్కరే కానీ పోరాటాన్ని పరిశీలిస్తే కచ్చితంగా ఇద్దరనే అనిపిస్తుంది. మండే ఎండ సెగలకు హేమాహేమీలైన ఆటగాళ్లే బిత్తరపోతుంటే... వీళ్లిద్దరి హోరాహోరీకి ఆ సెగలే సలామ్ అన్నాయి. ఇద్దరు నాలుగేసి డబుల్ ఫాల్ట్‌లు చేశారు. కానీ ఆస్ట్రియన్ ఏస్‌లతో చెలరేగిపోయాడు. ఏకంగా 18 ఏస్‌లను సంధించగా, నాదల్ మూడు ఏస్‌లకే పరిమితమయ్యాడు. స్పెయిన్ స్టార్ 55 విన్నర్లు కొడితే, థీమ్ 74 కొట్టాడు. ఇలా ఎందులోనూ తగ్గకుండా కడదాకా పోరాడాడు. దీంతో మొదటి సెట్లో నాదల్ ఒక్క గేమ్ కూడా గెలవలేకపోయాడు. కాస్త తేరుకొని రెండో సెట్‌ను, తర్వాత మూడో సెట్‌ను కష్టంగా గెలుచుకున్నాడు. ఇక మ్యాచ్ చేతుల్లోకి వచ్చిందని అనుకుంటున్న తరుణంలో ఆట కాస్తా ‘హాట్’అయింది. ప్రతీ పాయింట్ ఓ వేటయ్యింది. ఇద్దరి పోరాటం ఎంతకీ తగ్గకపోవడంతో ఆ తర్వాతి రెండు సెట్లు టైబ్రేక్‌కు దారి తీశాయి. ఈ టైబ్రేక్‌లు కూడా సమవుజ్జీలకు సమ న్యాయం చేశాయి. ఇద్దరూ చెరొకటి గెలిచారు. నాలుగో సెట్‌ను 7/6 (7/4)తో థీమ్ కైవసం చేసుకుంటే... నిర్ణాయక సెట్‌ను 7–6 (7/5)తో నాదల్ చేజిక్కించుకున్నాడు. అప్పటికే ఇద్దరు డ్రెస్‌పైనే చెమటస్నానం చేశారు. సరైనోడికి ‘సారీ’ చెబుతూ నాదల్ అతని వెన్నుతడితే... ప్రేక్షకుల చప్పట్ల మధ్య థీమ్ నిష్క్రమించాడు. -
నేడు హైదరాబాద్ మారథాన్
- పీపుల్స్ ప్లాజా నుంచి బాలయోగి స్టేడియం వరకు - 20 వేల మందికి పైగా రన్నర్స్ పాల్గొనే అవకాశం - మారథాన్‌ను ప్రారంభించనున్న కేటీఆర్ - పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక హైదరాబాద్ మారథాన్‌కు సర్వం సిద్ధమైంది. ప్రజల్లో సమైక్యతా భావాన్ని, సామాజిక దృక్పథాన్ని, ఆరోగ్య స్పృహను పెంపొందించే లక్ష్యంతో తలపెట్టిన ఈ మారథాన్‌ను ఆదివారం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ రన్నర్స్తోపాటు వేలాది మంది హైదరాబాదీలు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు పాల్గొనే ఈ వేడుకకు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై పరుగును ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ వేడుకల్లో నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పాల్గొంటారు. జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహించే మారథాన్ ముగింపు కార్యక్రమంలో సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ మారథాన్ రేస్ డైరెక్టర్ అభిజీత్ మధ్నూకర్ పాల్గొంటారు. కార్పొరేట్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులతో పాటు సుమారు 20 వేల మంది యువతీ, యువకులు మారథాన్‌లో పాలుపంచుకోనున్నారు. జీవితాన్ని ఉత్తేజితం చేసే, ఉత్సాహభరితంగా మార్చే ఈ పోటీల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని ప్రజల్లో స్ఫూర్తి నింపనున్నారు. అలాగే తాము ఎంచుకున్న రంగాల్లో విజయం సాధించిన విజేతలు, నిజజీవిత హీరోలు మారథాన్‌కు సరికొత్త సొబగులు అద్దనున్నారు. మరోవైపు 40కి పైగా స్వచ్ఛంద సంస్థలు తమ లక్ష్యాలను మారథాన్ ద్వారా ప్రజలకు తెలియజేయనున్నాయి. అలాగే పలు రంగాల్లో సేవలందజేస్తున్న స్వచ్ఛంద సంస్థల సందేశాన్ని తెలుపుతూ పలువురు రన్నర్స్ మారథాన్‌లో ప్లకార్డులను ప్రదర్శిస్తారు. మారథాన్‌లో గెలుపొందే స్త్రీ, పురుషులకు మూడు విభాగాల నుంచి రూ.7.2 లక్షల ప్రైజ్‌మనీని అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరోవైపు మారథాన్ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మూడు విభాగాల్లో మారథాన్.. మారథాన్‌లో రకరకాల ఈవెంట్స్ ఉంటాయి. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కే రన్‌గా మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. మొదట 42.2 కి.మీ. ఫుల్ మారథాన్ ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది. పీపుల్స్ ప్లాజా వద్ద మంత్రి కేటీఆర్ దీనిని ప్రారంభిస్తారు. ఫుల్ మారథాన్ సాగేదిలా.. పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమయ్యే ఫుల్ మారథాన్.. ఎన్టీఆర్ రోడ్, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, రాజ్‌భవన్ రోడ్, పంజాగుట్ట ఫ్లైఓవర్, బంజారాహిల్స్ రోడ్–2, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, జూబ్లీహిల్స్ రోడ్–36, మాదాపూర్ పోలీస్‌స్టేషన్, సైబర్టవర్స్, మైండ్‌స్పేస్ సర్కిల్, బయోడైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, త్రిపుల్‌ఐటీ జంక్షన్, విప్రో సర్కిల్, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి జంక్షన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీదుగా జీఎంసీ బాలయోగి స్టేడియానికి చేరుకుని అక్కడ ముగుస్తుంది. హాఫ్ మారథాన్ దారి ఇదీ.. ఇక 21.1 కి.మీ. మేర సాగే హాఫ్ మారథాన్ ఉదయం 6 గంటలకు పీపుల్స్‌ప్లాజా వద్ద ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, రాజ్‌భవన్ రోడ్, పంజాగుట్ట ఫ్లైఓవర్, బంజారాహిల్స్ రోడ్–2, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, జూబ్లీహిల్స్ రోడ్–36, మాదాపూర్ పోలీస్‌స్టేషన్, సైబర్టవర్స్, మైండ్‌స్పేస్ సర్కిల్, బయోడైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, త్రిపుల్‌ఐటీ జంక్షన్ నుంచి బాలయోగి స్టేడియానికి చేరుకుని ముగుస్తుంది. హైటెక్స్ నుంచి 10 కె రన్.. హైటెక్స్ ఎక్స్పో గ్రౌండ్ వద్ద ఉదయం 7 గంటలకు 10కె రన్ ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి సైబర్టవర్స్, మైండ్‌స్పేస్ సర్కిల్, బయోడైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఐఐఐటీ జంక్షన్ మీదుగా బాలయోగి స్టేడియానికి చేరుకుంటుంది. -
టార్గెట్ ఎవరెస్ట్
మారధాన్‌తో 31 జిల్లాల్లో పర్యటన అభినందించిన పలు రాజకీయ నాయకులు పటాన్చెరు : ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడమే తన లక్ష్యమని సికింద్రాబాద్ మోండా మార్కెట్ ప్రాంతానికి చెందిన కోర నిఖితాయాదవ్ తెలిపింది. అసాధ్యమైన లక్ష్యాలు సుసాధ్యం చేసి బాలికల్లో రోల్ మోడల్‌గా నిలవాలని ఈ సాహసం చేపట్టినట్టు చెప్పింది . తెలంగాణలోని 31 జిల్లాల్లో పర్యటించి బాలికల్లో ఆత్మస్తెర్యం నిపేందుకు ప్రయత్నిస్తున్న ఆమె.. ఇప్పటికి 29 జిల్లాల్లో పర్యటన ముగించుకుని మంగళవారం 30 వ జిల్లా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చేరుకుంది. దీంతో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి దండు విక్రమ్ యాదవ్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చక్రీ, నిరంజన్లు నిఖితా యాదవ్‌ను కలసి సన్మానం చేసి తన లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిఖితా యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను హైదరాబాద్‌లోని కస్తూర్భాగాంధీ బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రధమ సంవత్సరం పూర్తి చేశానని, కుటుంబ పెద్దలు యాదవ సంఘాల సహకారంతో ఆడపిల్లల్లో ఆత్మస్ధెర్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నానని చెప్పింది. ఆడపిల్ల అబలకాదు సబల అని నిరూపిస్తానని తెలిపింది. ప్రభుత్వం నుంచి సహకారం అందితే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని చెప్పింది. ప్రస్తుతం మారధాన్‌తో 31 జిల్లాల్లో పర్యటించాలని లక్ష్యంగా పెట్టూకున్నానని, ఏప్రిల్ 27న ప్రారంభమైన మారధాన్‌తో ఇప్పటి వరకు 30 జిల్లాలో పర్యటనలో 1990 కిలోమీటర్ల పూర్తి చేసుకున్నాని వివరించింది. జూన్ 2 నాటికి హైదరాబాద్‌కు చేరుకొని అక్కడ నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొంటానని నికిత తెలిపింది. కాగ చిన్న వయస్సులోనే ఉన్నత లక్షాఅ్యలు నిర్దేశించుకని ఆ దిశగా పయనిస్తున్న నిఖితను వైఎస్సార్సీపీ నాయకులు అభినందించారు. నిఖిత యాదవ్‌కు స్వాగతం పలికిన యాదవ సంఘం నాయకులు ఆర్. కుమార్ యాదవ్, ఆర్.సంతోష్ యాదవ్, దండు విక్రమ్ యాదవ్‌లను కృతజ్ఞతలు తెలిపింది. -
స్లిప్పర్స్‌తో ప్రపంచ కప్పు!
మారథాన్ క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొనాలంటే ఏం కావాలి?ఒక మంచి క్రికెట్ బ్యాట్... నీ ప్యాడ్స్, గార్డ్, మంచి బాల్.. ఎట్సట్రా ఎట్సట్రా...మరి ఒక మారథాన్‌లో పాల్గొనాలంటే..?బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. బాడీ ఫిట్‌గా ఉండాలి. ఎప్పటికప్పుడు లోపాలు సరిదిద్దుతూ, వెన్నుతట్టి ప్రోత్సహించే పర్సనల్ కోచ్ ఉండాలి. బోలెడంత ప్రాక్టీసుండాలి... మాంచి రన్నింగ్ షూస్... స్పోర్ట్స్ డ్రెస్ ఉండాలి. అయితే ఇవేమీ లేకుండానే మారథాన్‌లో గెలిచింది మారియా లోరెనా రామిరెజ్ అనే ఓ 22 ఏళ్ల మెక్సికన్ అమ్మాయి. 12 దేశాలనుంచి కనీసం 500 మంది మహిళలు పాల్గొన్న ఈ మారథాన్‌లో ఈ అమ్మాయి 50 కిలోమీటర్ల దూరాన్ని ఏడుగంటల మూడు నిమిషాల వ్యవధిలో అధిగమించింది. అదీ ఒంటికి ఒక స్కర్ట్, తలకు ఒక కర్చీఫ్, కాళ్లకు సాధారణమైన స్లిప్పర్స్, చేతిలో ఒక వాటర్ బాటిల్‌తో మారియా తన లక్ష్యాన్ని ఛేదించింది, బంగారు పతకాన్ని గెలుపొందింది. ఒక మారథాన్ రన్నర్‌గా ఏ విధమైన స్పెషల్ యాక్సెసరీస్ లేకుండా వచ్చింది మారియా. మిగిలిన అందరిలా జెల్ కానీ, ఎనర్జీ స్వీట్లు కానీ, వాకింగ్ స్టిక్ కానీ, కళ్లకు గాగుల్స్ కానీ, కనీసం రన్నింగ్ షూస్ కానీ వాడలేదు. ‘‘మారియాను చూస్తే మారథాన్ గెలుచుకుంటుందని ఎవరూ ఊహించలేరు’’ అన్నారు ఈ రేస్ ఆర్గనైజర్ ఆర్లాండో జిమినెజ్. అవేమీ లేకపోతేనేం, లోరినా పరిగెత్తేటప్పుడు ఒళ్లంతా చెమటలు కారిపోవడం, ఆయాసపడటం, రొప్పడం, పట్టి పట్టి అడుగులు వేయడం వంటివేమీ లేవు. ఎంతో అలవోకగా పరిగెత్తి ఈ విజయాన్ని సాధించింది. అసలు ఇంతకీ మారియా వృత్తి ఏమిటనుకున్నారు.. గొర్రెలు కాయడం, పశువులను మేపడం... ఇదే ఆమె నిత్యకృత్యం. తన పనిలో భాగంగా మారియా రోజుకు కనీసం పది పదిహేను కిలోమీటర్ల దూరం నడుస్తుంది. ఇలానే గత సంవత్సరమే చిన్హువాలో జరిగిన వంద కిలోమీటర్ల విభాగంలో కాబల్లో బ్లాన్కో అల్ట్రా మారథాన్‌లో సెకండ్ ప్రైజ్ గెల్చుకుంది. ప్రస్తుత మారథాన్‌లో ఆమె గెల్చుకున్న మొత్తం 6,000 పెసోలు. అంటే సుమారు రూ. 21000 అన్నట్టు మారియా ఒక్కతే కాదు... ఆమె కుటుంబంలో తండ్రి, తాత, సోదరులు, అక్కచెల్లెళ్లు కూడా మారథాన్లలో పాల్గొన్నవారే. -
క్యారమ్స్‌లో సరికొత్త గిన్నిస్ రికార్డు
-
విశాఖ తీరంలో నేవీ మారథాన్
విశాఖపట్నం: తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖ సముద్రతీరంలో ఆదివారం ఉదయం నేవీ మారథాన్ పోటీలు ప్రారంభమయ్యాయి. బీచ్‌రోడ్డులో ప్రారంభమైన ఈ పోటీల్లో మారథాన్(42 కి.మీ), హాఫ్ మారథాన్(21 కి.మీ) విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో నౌకాదళ సిబ్బందితో పాటు పలు దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. -
హామీ ఇస్తేనే... తిరిగి స్వదేశానికి వెళతా
ఇథియోపియా రజత విజేత లిలెసా అడిస్ అబబా: రియో ఒలింపిక్స్ వేదికగా తమ దేశ రాజకీయాంశాలపై నిరసన వ్యక్తం చేసిన మారథాన్ రజత పతక విజేత ఫెయిసా లిలెసా ఇథియోపియా వెళ్లేందుకు ససేమిరా అంటున్నాడు. తనకెలాంటి శిక్ష విధించబోమని ప్రభుత్వం నుంచి హామీ లభిస్తేనే తిరిగి వెళతానన్నాడు. రియోలో మారథాన్ రజతం నెగ్గిన అతను పోడియం వద్ద ఇథియోపియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం వివాదాస్పదమైంది. ఇదిలావుండగా... 8 పతకాలు గెలిచిన ఇథియోపియా అథ్లెట్లకు స్వదేశంలో ప్రభుత్వ, క్రీడాధికారులు ఘనస్వాగతం పలికారు. అయితే లిలెసాకు హామీపై వ్యాఖ్యానించేందుకు అధికారులు నిరాకరించారు. -
ఒలింపిక్స్-ఫ్లాష్‌బ్యాక్..
కారు.. పతకం బేకారు.. 1904 ఒలింపిక్స్‌లో మారథాన్‌లో పాల్గొన్న క్రీడాకారులు వీరు. ఇందులో 31వ నంబరు బనియన్ వేసుకున్న ఫ్రెడ్రిక్ లార్జ్ ఈ పోటీలో గెలిచాడు. అయితే.. అతడిని తర్వాత అనర్హుడిగా ప్రకటించారు. ఎందుకో తెలుసా? సగం దూరం పరిగెత్తకుండా.. కారులో లిఫ్ట్ అడిగి వచ్చేశాడట. తర్వాత బాగా పరిగెత్తినట్లు పోజిచ్చి.. ప్రైజు కొట్టేశాడట. దీంతో 20వ నంబరు బనియన్ వేసుకున్న థామస్ హిక్స్ను విజేతగా ప్రకటించారు. ఈయన ఏం చేశాడో తెలుసా? పరిగెత్తినంత సేపూ అలా బ్రాందీ తాగుతూనే ఉన్నాడట. హెల్ప్ కావాలా.. నాయనా.. 1908 ఒలింపిక్స్‌లోని సీన్ ఇది. ఇటలీకి చెందిన రన్నర్ డొర్నాడో మారథాన్‌లో ఒకటికి పదిసార్లు కింద పడిపోయాడు. ఓసారైతే రివర్స్‌లో పరిగెత్తాడు. దీంతో కొందరు ఒలింపిక్స్ అధికారులు ‘దయ’తో సాయం కావాలా నాయనా.. అంటూ దగ్గరుండి మరీ.. ఇలా విజయం సాధించేలా చేశారు. తర్వాత డొర్నాడోను అనర్హుడిగా ప్రకటించినా.. రేసును పూర్తి చేసినందుకు కన్సొలేషన్ ప్రైజును ఇచ్చారు. సర్ఫ్ ఎక్సెల్ ఉందిగా.. ఒలింపిక్స్ అంటే.. ఎన్నో సదుపాయాలు ఉంటాయి. ఈ ఫొటో చూడండి.. క్రీడాకారులు తమ బట్టలను తామే ఉతుక్కుని ఆరేసుకుంటున్నారు. 1948 లండన్ ఒలింపిక్స్ పరిస్థితి ఇదీ.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో ఇలాంటి ఆదా చర్యలు చేపట్టారు. అంతేకాదు.. ఎవరి టవల్స్ వారే తెచ్చుకోవాలని చెప్పారట. కొందరైతే.. తమ ఆహారం తామే తెచ్చుకున్నారట. ఇప్పటి లెక్కల ప్రకారం చూసినా.. ఆ ఒలింపిక్స్ కోసం బ్రిటన్ పెట్టిన ఖర్చు రూ.6.39 కోట్లు మాత్రమే. జనం.. జంప్.. ఇది 1908 లండన్ ఒలింపిక్స్‌లోని సీన్. స్వీడన్‌కు చెందిన క్రీడాకారిణి హైజంప్ చేస్తోంది.. జంప్ చేయాల్సినంత హైటు అక్కడ లేదన్న సంగతిని పక్కనపెడితే.. వెనుక చూశారా గ్యాలరీలో.. జనం కనిపిస్తే ఒట్టు. జనం లేకున్నా.. మన పని మనం చేసుకుందాం అన్నట్లు క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. దూకుడు.. లాగుడు.. 1904లో అమెరికాలో జరిగిన ఒలింపిక్స్‌లోని సన్నివేశాలివీ.. అప్పటి ఒలింపిక్స్‌లో ఇలా బ్యారెల్ జంపింగ్, టగ్ ఆఫ్ వార్ వంటి పోటీలు ఉండేవి. అంటే దూకుడు.. లాగుడు అన్నమాట. 1900 ప్యారిస్ ఒలింపిక్స్‌లో అయితే షూటింగ్ కోసం నిజమైన పావురాలను వాడారు. గోల్డెన్ లెగ్గు ఇతడు అమెరికాకు చెందిన జిమ్నాస్ట్ జార్జ్ ఈజర్ 1904 ఒలింపిక్స్ లో పోల్గోన్నాడు.అయితే..ఇక్కడో ట్విస్టుంది...ఇతడు వికలాంగుడు .చెక్క కాలు పెట్టుకుని పోటీల్లో పోల్గోన్న జార్జ్ ఏకంగా ఆరు పతకాలు గెలుచుకోవడం విశేషం. -
ఉత్సాహంగా మారథాన్
ఎయిర్టెల్ హైదరాబాద్ ఉత్సాహంగా మారథాన్ మేడ్చల్ రూరల్: ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ శిక్షణ పరుగును ఆదివారం నిర్వహించారు. మేడ్చల్ మండల పరిధిలోని కండ్లకోయ ధృవ కళాశాల వద్ద ఉదయం ఉదయం 5గంటలకు చేపట్టారు. కళాశాల నుంచి రింగురోడ్డు సర్వీస్‌రోడ్డులో నిర్వాహకులు రన్నింగ్ ప్రారంభించారు. 250 మంది ఔత్సాహకులు 10, 21, 32 కే రన్‌ల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ ఆరో ఎడిషన్ శిక్షణలో భాగంగా ఈ రన్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజలంతా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు రన్నింగ్ చేయాలని సూచించారు. పరుగుతో ఎన్నో లాభాలు ఉంటాయని, మనిషి ఆరోగ్యకరంగా ఉంటారని తెలిపారు. శిక్షణలో భాగంగా ఈ నెల 27, 28వ తేదీల్లో హైదరాబాద్‌లో రన్నింగ్ చేపడుతున్నట్లు వివరించారు. -
బైస్కిల్ క్లబ్ ఆధ్వర్యంలో మారథాన్
పర్యావారణాన్ని రిక్షించుకోవడం పై అవగాహన పెంపోందించేదుకు చేపట్టిన 15 కిలోమీటర్ల సైకిల్ ర్యాలి విజయవాడలో ప్రారంభమైంది. ఆంధ్రా బైస్కిల్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో మారథాన్ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీని మున్సిపల్ క మిషనర్ వీరపాండ్యన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ మారథాన్ స్టేడియం నుంచి ప్రారంభమై బెంజ్ సర్కిల్, ఏలూరు రోడ్డు, పోలీస్కంట్రోల్రూంల మీదుగా సాగనుంది. ర్యాలీలో బైస్కిల్ క్లబ్ సభ్యులతో పాటు పలువురు ఔత్సాహికులు పాల్గొంటున్నారు. -
140 కిలోమీటర్ల మారథాన్!
కల్యాణదుర్గం: స్పెయిన్ దేశస్తుడు జువాన్ మాన్యుయెల్ అనంతపురం జిల్లాలో 140 కిలోమీటర్ల మారథాన్ చేపట్టాడు. కల్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లి ఎస్సీ కాలనీ నుంచి సోమవారం సాయంత్రం ఐదు గంటలకు పరుగు ప్రారంభించాడు. స్థానిక ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, ఆర్డీఓ రామారావు, ఆర్డీటీ ప్రోగ్రాం డెరైక్టర్ మాంఛోఫై, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అన్నేఫై తదితరులు మారథాన్‌ను ప్రారంభించారు. ప్రతి కిలోమీటరుకు ఒక విద్యార్థి చొప్పున దత్తత తీసుకుంటానని మాన్యుయేల్ తెలిపాడు. ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ స్ఫూర్తితో ఈ మారథాన్ ప్రారంభించినట్లు పేర్కొన్నాడు. -
'60 రోజుల్లో 4000 కిలోమీటర్ల పరుగు..'
► కన్యాకుమారీలో మొదలై కశ్మీర్లో ముగింపు న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మారథాన్ కింగ్ పట్ ఫామర్ భారత దేశ దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువం వరకు పరుగెత్తనున్నారు. దాదాపు 4000 కిలోమీటర్లకు పైగా ఉన్న వీటి మధ్య దూరాన్ని ఆయన అలవోకగా తన పరుగు ద్వారా 60 రోజుల్లో ముగించనున్నారు. కన్యా కుమారిలో ఆయన పరుగు ప్రారంభించి కశ్మీర్ వరకు వెళ్లనున్నారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఈ మారథాన్ ప్రారంభిస్తారు. అదే రోజు ఆస్ట్రేలియా ఆవిర్భావ దినోత్సవం కూడా. భారత్, ఆస్ట్రేలియాల మధ్య పర్యాటకాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో 'స్పిరిట్ ఆఫ్ ఇండియా' పేరిట భారత్ టూరిజం, విదేశాంగ వ్యవహారాల శాఖ ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో ఈ మారథాన్ నిర్వహించనుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, చండీగఢ్ రాష్ట్రాల గుండా ఈ మారథాన్ కొనసాగనుంది. పట్ ఫామర్ ఇప్పటికే పలు మారథాన్లలో పాల్గొని రికార్డులు నెలకొల్పారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వియత్నాం, మధ్యాసియా, ఉత్తర అమెరికావంటి దేశాల ఉత్తర, దక్షిణ ధ్రువాల వరకు ఆయన పరుగుతో చేరుకున్నారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా పార్లమెంటు సభ్యుడిగా ఎనిమిదేళ్లపాటు సేవలందించడమేకాకుండా ఇతర బాధ్యతలు కూడా నిర్వహించారు. ఆయన 20 ఏళ్ల పరుగు ప్రయాణంలో తన మారథాన్ల ద్వారా ఎన్నో చారిటీలకు డాలర్ల మూటలు కట్టబెట్టారు. భారత్‌లో నిర్వహించనున్న మారథాన్ ప్రధాన ఉద్దేశం పర్యాటకాన్ని వృద్ధి చేయడమే కాకుండా బాలికల విద్య కోసం నిధుల సేకరణ కూడా ఉంది. పట్ ఫామర్ పరుగు మొత్తాన్ని ఓ ప్రత్యేక మీడియా బృందం ఆయన వెంట 60 రోజులపాటు ఉండి డాక్యుమెంటరీగా ఎప్పటికప్పుడూ ఆస్ట్రేలియాలో ప్రసారం చేయనుంది. జనవరి 26న కన్యాకుమారిలోని గాంధీ మండపం వద్ద ఉదయం 6.15గంటలకు ఆయన పరుగు ప్రారంభించి మార్చి 30నాటికి శ్రీనగర్ లో ముగిస్తారు. రోజుకు ఆయన 70 నుంచి 80 కిలోమీటర్లు పరుగెత్తనున్నారు. -
ఇది స్ప్రింట్ కాదు.. మారథాన్...
ఆర్థిక సంస్కరణల అమలుపై ప్రధాని మోదీ * సంస్కరణలు సమ్మిళితంగా ఉండాలని వ్యాఖ్య * జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యం కావాలి న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణలనేవి ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ, విస్తృత స్థాయిలో ప్రయోజనాలు కల్పించేలా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సంస్కరణల లక్ష్యం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే తప్ప.. మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కడం కాకూడదని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం 6వ ఢిల్లీ ఎకనామిక్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. సంస్కరణలను పరుగుపందెంతో పోలుస్తూ.. వీటి అమలనేది స్వల్పదూరం వేగంగా పరుగెత్తి పూర్తి చేసే స్ప్రింట్ కాదని నిలకడగా సుదీర్ఘ దూరాన్ని అధిగమించాల్సిన మారథాన్ లాంటిదని మోదీ చెప్పారు. ప్రభుత్వం సమ్మిళిత సంస్కరణలను అమలు చేసే లక్ష్యంతో ముందుకెడుతోందన్నారు. తాము అధికారంలోకి రాకముందుతో పోలిస్తే.. అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో భారత్ ఎంతో మెరుగుపడిందని ప్రధాని చెప్పారు. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి, విదేశీ పెట్టుబడులు, ఆదాయాలు పెరగ్గా.. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం తగ్గిందని ఆయన వివరించారు. అవినీతికి చెక్..: వృద్ధికి ప్రతిబంధకాలైన అవినీతి, పన్ను ఎగవేతలు, మనీ లాండరింగ్ మొదలైన వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంద ని ప్రధాని చెప్పారు. ఈ దిశగా చేపట్టిన చర్యలవల్లే విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న సుమారు రూ.10,500 కోట్లు నల్లధనాన్ని గుర్తించడం జరిగిందన్నారు. గోల్డ్ స్కీములపై 3వేల కాల్స్..: ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసిడి పథకాలకు మంచి స్పందన కనిపించిందని, వీటి వివరాల కోసం టోల్ ఫ్రీ నంబరుకు 3,000 పైచిలుకు కాల్స్ వచ్చాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. గోల్డ్ డిపాజిట్ పథకాన్ని దశలవారీగా దేశమంతటా అమల్లోకి తేనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
కాశ్మీర్లో వేర్పాటువాదుల తెగింపు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని వేర్పాటువాదులు భారత్‌కు వ్యతిరేకంగా మరో అంకానికి తెరతీశారు. ఇప్పటి వరకు నిరసనల, ఆందోళనలు,హార్తాళ్లు, పాక్ జెండా ప్రదర్శనల ద్వారా పాకిస్థాన్ అనుకూల చర్యలకు దిగి.. తాజాగా భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు అనుకూల ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఏకంగా 21 కిలోమీటర్లపాటు మారథాన్ ప్రారంభించారు. హజ్రత్బల్ ప్రాంతంలోని కాశ్మీర్ యూనివర్సిటీ నుంచి ఈ ర్యాలీ ప్రారంభంకాగా మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ ర్యాలీ సమాచారం ముందుగానే తెలుసుకున్న పోలీసులు భారీగా ఆ ప్రాంతంలో మోహరించగా వేర్పాటువాదులువారిపై రాళ్లు రువ్వారు. భారత్ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో పోలీసులు భాష్పవాయుగోళాలు ప్రయోగించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా బయలుదేరడం గమనార్హం. అయితే, పోలీసులు జోక్యం చేసుకున్నారని ఘర్షణ వాతావరణం నెలకొందని తెలిసి ఆయన ఆగిపోయారు. ఇక రాష్ట్రానికి చెందిన 15 మంది అథ్లెట్స్ కూడా పాల్గొనేందుకు తమ పేరును నమోదు చేసుకోవడం గమనార్హం. మొత్తం పదిహేను వేలమంది ఈ ర్యాలీలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. -
మారథాన్‌లో కెన్యా వాసుల సందడి
-
వెల్ రన్
ఎముకలు కొరికే చలి. బలమైన గాలులు. కుండపోత వర్షం. క్రూర మృగాలు సంచరించే అడవులు. ఇలాంటి భిన్న వాతావరణమున్న ఏడు దేశాల్లో చిరుతల్లా పరుగులు తీశారా ఇద్దరు. 148 కిలోమీటర్ల ఏడు మారథాన్లను 21 గంటల్లో పూర్తిచేసి ‘వరల్డ్ మారథాన్ ఛాలెంజ్’లో భారత్ జెండాను రెపరెపలాడించారు నగరానికి చెందిన చిగురపాటి ఉమ, కృష్ణప్రసాద్ దంపతులు. యాభైఏళ్లు పైబడిన వీరు ఏడు ఖండాల్లో, ఏడు రోజుల్లో, ఏడు మారథాన్లను విజయవంతంగా పూర్తి చేసిన ఫస్ట్ ఇండియన్ కపుల్‌గా రికార్డుల్లోకెక్కారు. ఈ సందర్భంగా నగరానికి వచ్చిన ఉమ, కృష్ణ ప్రసాద్‌లను శనివారం ‘సిటీప్లస్’ పలకరించింది... ‘మాది గుంటూరు. చిన్నప్పటి నుంచే ఏదైనా డిఫరెంట్‌గా చేయాలనే ఆలోచన ఉండేది. 15 ఏళ్లప్పుడే కెమెరా పట్టుకున్నా. నాన్నకు తెలియకుండా పెళ్లి ఫొటోలు తీసి పాకెట్ మనీ సంపాదించుకున్నా. 20వ ఏటవైన్ తయారుచేశా. తర్వాత హైదరాబాద్ వచ్చి బిజినెస్‌మేన్‌గా మారా. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని భార్య ఉమ సహకారంతో సక్సెస్ సాధించాన’నంటున్నారు గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్ సీఈవో కృష్ణప్రసాద్. ఫిట్నెస్ కోసం... ‘నాకు 30. మా వారికి 40 ఏళ్లున్నప్పుడు రన్నింగ్ ప్రారంభించాం. కొన్నాళ్ల పాటు ఫిట్నెస్ కోసమే రన్నింగ్ చేసేవాళ్లం. తొలినాళ్లలో కృష్ణ హాఫ్ కిలోమీటర్ కూడా ఉరకలేకపోయేవారు. రెగ్యులర్ ప్రాక్టీస్‌తో మార్పొచ్చింది. ఐదు, పది కిలోమీటర్ల నుంచి హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్‌లో పాల్గొనే స్థాయికి చేరుకున్నా’మన్నారు క్రిష్మ వైనారిస్ అధినేత ఉమ. యోగా ఈజ్ మై సీక్రెట్... ‘ప్రపంచంలోని వివిధ నగరాల్లో జరిగిన హాఫ్, ఫుల్ మారథాన్‌ల్లోనూ పాల్గొన్నాం. ఏడు ఖండాల్లో ఏడు నెలల్లో ఏడు మారథాన్లను 2010 డిసెంబర్లో దిగ్విజయంగా పూర్తి చేశాం. అదే స్ఫూర్తితో గతేడాది అక్టోబర్‌లో అనుకుంటా వరల్డ్ మారథాన్ చాలెంజ్‌లో పాల్గొందామని ఉమకు చెప్పా. ‘అబ్బో ఏడు రోజుల్లో ఏడు దేశాల్లో ఏడు మారథాన్లు.. ఈ వయస్సులో సాధ్యమా?’ అని అనుమానం వెలిబుచ్చింది. అయితే, మర్నాడే ఓకే అంది. అప్పటి నుంచి రోజూ ఉదయం 3.30 గంటలకే లేచి 21 కిలోమీటర్లు రన్నింగ్, గంట పాటు యోగా ప్రాక్టీసు చేసేవాళ్లం. యోగానే మారథాన్‌లో ముందుకు నడిపించింది’ అని తమ సీక్రెట్ ఆఫ్ సక్సెస్‌ను వెల్లడించారు కృష్ణప్రసాద్. ఏడు ఖండాల్లో ఏడు రోజుల్లో మారథాన్ చేయడానికి దాదాపు 38 వేల కిలోమీటర్లు, 59 గంటల పాటు విమానంలో ప్రయాణించాల్సి వచ్చింది. ఆ ప్రయాణ బడలికను సైతం లెక్క చేయకుండా... పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగారు కృష్ణ ప్రసాద్ దంపతులు. దారితప్పినా.. సమయానికి లక్ష్యం ‘జనవరి 17న అంటార్కిటికాలోని యూనియన్ గ్లాసియర్ చేరుకున్నాం. అక్కడ మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఎముకలు కొరికే చలిలో పరుగులు తీశాం. మర్నాడు దక్షిణ అమెరికాలోని పుంటా అరెనస్ ప్రాంతానికి చేరుకొని మారథాన్‌లో పాల్గొన్నాం. ఆరు డిగ్రీల ఉష్ణగ్రతతో పాటు బలమైన గాలులు మమ్మల్ని ముందుకు సాగనివ్వలేదు. చాలా కష్టపడాల్సి వచ్చింది. జనవరి 20న నార్త్ అమెరికాలోని మియామిలో వాతావరణం కాస్త అనుకూలించింది. మరుసటి రోజు మొరాకో.. ఆఫ్రికాలోని మర్రాకెచ్‌లో పరుగులు తీస్తుండగా కుండపోత వాన.. తడుస్తూ, వణుకుతూనే లక్ష్యాన్ని చేరుకున్నాం. 22న దుబాయ్ చేరుకున్నాం. అక్కడ వాతావరణం అనుకూలంగానే ఉండటంతో మారథాన్ పూర్తి చేసుకొని, ఆఖరున 24న సిడ్నీలో పరుగు తీశాం. రాత్రి పది గంటలకు మొదలైన ఈ మారథాన్‌లో సహాయకుడు అవసరమయ్యాడు. వారి డెరైక్షన్లోనే ముందుకెళుతుండగా నేను దారితప్పాను. మాకు ఇచ్చిన మ్యాప్ కాకుండా వేరే ప్రాంతాల మీదుగా వెళుతుండగా ఓ పెట్రోల్ బంక్ వచ్చింది. అక్కడ ఓ కారు డ్రైవర్ని అడిగితే.... నన్ను మళ్లీ స్టార్టింగ్ పాయింట్ వాటర్ ఫౌంట్కు తీసుకెళ్లారు. నా పరుగు మళ్లీ మొదలు. ఎలాగైతేనేం గమ్యాన్ని చేరుకోగలిగా. భారతీయుడిలా కనిపించిన ఆ డ్రైవర్ హెల్ప్వల్లే... అనుకున్న సమయానికి లక్ష్యాన్ని చేరుకోగలిగాన’ని ఉమ తన అనుభవాలను పంచుకున్నారు. ఈ మారథాన్‌లో ఎనిమిది దేశాలకు చెందిన 10 మంది పాల్గొన్నారు. హైదరాబాద్ వాసుల్లోనూ ఫిట్నెస్ పెంచాలనే ఉద్దేశంతో 2003లో 10కే రన్ ఫౌండేషన్ ప్రారంభించారు ఉమ. భవిష్యత్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ప్రధాన నగరాల్లోనూ నిర్వహించేందుకు ప్రయత్నిస్తామంటున్నారామె. - వాంకె శ్రీనివాస్ -
విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీగా తీర్చిదిద్దుతాం: గంటా
విశాఖ : విశాఖను 'సిటీ ఆఫ్ డెస్టినీ'గా తీర్చిదిద్దుతామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన సోమవారం ఉదయం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశాఖ పునరుద్ధరణ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఉడా పార్క్ వద్ద మారథాన్ రన్‌ను మంత్రి గంటా ప్రారంభించారు. టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయిస్తోందని ఆయన తెలిపారు. విశాఖను ప్రపంచ స్థాయి పర్యాటక నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. -
ఉత్సాహంగా పరుగులుతీసిన యువత!
విశాఖపట్నం: విశాఖ బీచ్‌రోడ్‌లోని సబ్ మెరైన్ వద్ద తూర్పు నావికాదళం నిర్వహించిన మారథాన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఓవైపు లేలేత కిరణాలు .. మరోవైపు అలల హోరు .. యువత ఉత్సాహంగా పరుగులు తీసింది. తూర్పునావికాదళం వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ ఈ రన్ ప్రారంభించారు. మారథాన్, 5 కిలోమీటర్లు, 10కిలోమీటర్లు, సంకల్ప్ రన్ పేరుతో నాలుగు కేటగిరీల్లో రన్ నిర్వహించారు. హుదూద్ తుపానును ధైర్యంగా ఎదుర్కొన్న విశాఖవాసుల స్ఫూర్తికి సెల్యూట్ చేస్తూ నేవీ ఈ రన్‌ను నిర్వహించింది. ఈ మారథాన్‌లో దేశవ్యాప్తంగా రెండు వేల మందికి పైగా రన్నర్స్ పాల్గొన్నారు. ** -
రికార్డ్ ఈతగాడు
‘లైఫ్ సేవింగ్ ఆర్ట్’ అని నాన్న చెప్పిన మాటలు అతడిని కదలించాయి. ఈత నేర్చుకుంటే మనల్నే కాదు ఇతరులను కూడా ఆపద సమయాల్లో రక్షించవచ్చన్న అమ్మ మాటలు.. అతని మనసును ఈతవైపు మళ్లించాయి. ఇంటర్లో నేర్చుకున్న స్విమ్మింగ్ ఈ రోజు అతగాడిని గజఈతగాడిగా నిలబెట్టాయి. హైదరాబాద్ సిటీ సలామ్ చేసేలా యాప్రాల్‌లోని పయనీర్ స్విమ్మింగ్ పూల్‌లో ఏకంగా 24 గంటల పాటు 75 కిలోమీటర్ల లాంగెస్ట్ స్విమ్మింగ్ మారథాన్ చేసి ఇండియన్, ఆసియా బుక్స్ రికార్డుల్లో చోటు దక్కించుకున్న ‘దిలీప్’తో సిటీప్లస్ ముచ్చటించింది. మాది కరీంనగర్ జిల్లా గోదావరిఖని. నాన్న రాజలింగం సింగరేణిలో ఏరియాస్ స్టోర్స్ క్లర్క్. మంచి స్పోర్ట్స్‌మన్ కూడా. అమ్మ కళావతి గృహిణి. చిన్నప్పటి నుంచే ఎక్కువగా పాఠశాలలో జరిగే కబడ్డీ, ఖోఖో, క్రికెట్ పోటీల్లో పాల్గొనేవాణ్ని. ఇంటర్ వచ్చాక నాన్న ఈత నేర్చుకోవడం మంచిదని ఓ రోజు స్విమ్మింగ్ పూల్‌కు తీసుకెళ్లారు.‘స్విమ్మింగ్ మంచి వ్యాయామమే కాదు.. ఆపదలో ఉన్నవారిని రక్షించే విద్య’ అని అమ్మ చెప్పింది. అలా నా స్విమ్మింగ్ ప్రస్థానం మొదలైంది. కోచ్ ప్రోత్సాహం.. మొదట్లో ఈతంటే భయపడ్డాను. స్విమ్మింగ్ కోచ్ కృష్ణమూర్తి చిట్కాలతో స్విమ్మింగ్‌ను ఎంతో ఎంజాయ్ చేశా. రోజుకు నాలుగు గంటలకు పైగా ప్రాక్టీసు చేశా. నాలో ఉన్న ప్రతిభను గుర్తించిన కృష్ణమూర్తి 2006లో కర్నూలులో జరిగిన 1,500 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మెరుగైన ప్రదర్శన ఇచ్చా. అప్పటికే మా కుటుంబం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. అలా హైదరాబాద్‌లో జరిగిన బ్రెస్ట్ స్ట్రోక్, బ్యాక్ స్ట్రోక్, బటర్‌ఫ్లయ్ విభాగాల్లోనూ పాల్గొన్నా. 2007లో గుజరాత్, 2008లో కేరళ, 2009లో ముంబైలో 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లలో పాల్గొన్న. కేరళలో జరిగిన ఈవెంట్లో ఆరో స్థానం సాధించాను. టీచింగ్ చానల్.. జీవితం మధ్యలో నాకు వచ్చిన ఈతను.. మరెందరికో నేర్పించాలనే ఉద్దేశంతో మూడేళ్ల కిందట యాప్రాల్‌లో పయనీర్ స్విమ్మింగ్ అకాడమీ నెలకొల్పాను. ఇక్కడ ఈత నేర్చుకున్న వారు అనేక ఈవెంట్లలో రాణిస్తున్నారు. సక్సెస్ఫుల్ స్విమ్మర్ కావాలన్న పట్టుదల ఉండి, ఆర్థికంగా లేని వారికి ఉచిత శిక్షణ ఇస్తున్నాను. లక్ష్యం... ఇంగ్లిష్ చానల్‌ను ఈదాలన్నది నా లక్ష్యం. భారత్ నుంచి శ్రీలంక మధ్యలో ఉండే పాక్ స్ట్రెయిట్ ఈదాలనుకుంటున్నాను. నా అకాడమీ నుంచి బెస్ట్ స్విమ్మర్లను తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాను. - వాంకె శ్రీనివాస్ -
సలామ్ ఫౌజా సింగ్
102 సంవత్సరాలు... ఓ మనిషి ఇన్నేళ్లు బతకడమంటేనే అత్యంత అరుదైన విషయం.. ఓ వేళ బతికినా చక్రాల కుర్చీకో.. ఓ గదికో పరిమితమవడం సహజం.. కానీ ఫౌజా సింగ్ కథ వేరు.. ఈయన దృష్టిలో వయస్సు అనేది కేవలం సంఖ్య మాత్రమే... ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువ వయస్సు కలిగిన మారథాన్ రన్నర్ ఆయనే... ఇంకా విచిత్రమేమిటంటే 89 ఏళ్ల ముదిమి వయస్సులో ఈ క్రీడను ఆయన సీరియస్‌గా తీసుకోవడం. ఏదో మామూలుగా కాకుండా 9 ఫుల్ మారథాన్‌లో పాల్గొని ఎందరో యువ రన్నర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.. ఇప్పటికీ రోజూ నాలుగు గంటలపాటు వాకింగ్, రన్నింగ్, జాగింగ్ చేయనిదే ఆయన దినచర్య ప్రారంభం కాదు.. అందుకే ఈ ఫౌ(జియో)జాకు ఎవరైనా సలామ్ కొట్టాల్సిందే.. 1911, ఏప్రిల్ 1...పంజాబ్‌లోని జలంధర్‌లో ఫౌజా సింగ్ జన్మించాడు. నలుగురు పిల్లల్లో చివరివాడు. చిన్నప్పుడు అతడి కాళ్లు చాలా సన్నగా, బలహీనంగా వుండడంతో ఐదేళ్లు వచ్చే వరకు అసలు నడవలేకపోయాడు. తోటి పిల్లల హేళనను సవాల్‌గా తీసుకున్న తను యుక్త వయస్సులో రన్నర్‌గా మారాడు. అయితే భారత్, పాక్ విభజన సమయంలో దీనికి తెర దించాడు. ఆ తర్వాత 90వ దశకంలో తన జీవితంలో కొన్ని విషాద సంఘటనలు జరిగాయి. తన భార్య, కుమారుడు, కుమార్తె వివిధ కారణాల రీత్యా మరణించడంతో ఒంటరి వాడైన ఫౌజా తిరిగి రన్నింగ్‌పై దృష్టి పెట్టాడు. ఇదే సమయంలో ఇంగ్లండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. 89 ఏళ్ల వయస్సులో ఇక మారథాన్‌పై సీరియస్‌గా తీసుకున్నాడు. ఆ వయస్సులో తను సులువుగా 20 కి.మీ పరిగెత్తే వాడు. అందుకే మారథాన్‌లో పాల్గొనాలని భావించాడు. అయితే ఇక్కడ తను 26 మైళ్ల (42 కి.మీ.)కు బదులు మారథాన్ 26 కి.మీ దూరం ఉంటుందని భావించాడు. కోచ్ అసలు విషయం వివరించడంతో ఆ దూరాన్ని సవాల్‌గా తీసుకుని తదేక దీక్షతో ప్రాక్టీస్ చేశాడు. ప్రపంచ రికార్డు... 2000, లండన్ మారథాన్. అందరి దృష్టీ 89 ఏళ్ల ఫౌజా సింగ్ పైనే. ఏదో సరదాకి వచ్చాడనే అనుకున్నారంతా. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రేసును పూర్తి చేశాడు. 2003లో ఇదే రేసును 6 గంటల 2 నిమిషాల్లో పూర్తి చేసి తన అత్యుత్తమ సమయాన్ని నమోదు చేశాడు. ఇక 2004లో ఈ పంజాబీ పుత్తర్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 93 ఏళ్ల వయస్సులో 26.2 మైళ్ల దూరాన్ని 6 గంటల 54 ని.ల్లో అధిగమించి ఔరా! అనిపించుకున్నాడు. ఎందుకంటే అప్పటిదాకా 90+ వ్యక్తుల కన్నా 58 నిమిషాల తక్కువ వ్యవధిలోనే ఆ రేసును పూర్తి చేయగలిగాడు. అలాగే తన వయస్సు కేటగిరీల్లో 200మీ. 400మీ. 800మీ. 3000మీ. రేసులో యూకే రికార్డులన్నీ తన పేరిటే ఉన్నాయి. వందేళ్ల వయస్సులో ఒకే రోజు 8 రేసులను పరిగెత్తిన ఫౌజా ప్రపంచ రికార్డు సృష్టించాడు. -
మృత్యువుతో ముఖాముఖి
విధివశాత్తూ దగ్గరి వారిని పోగొట్టుకున్న బాధితుల మనసులో కల్లోలాలు చెలరేగుతాయి. ఇదే అంశంతో తన స్వీయానుభవాలను జోడించి ‘వేర్ ఎర్త్ మీట్స్ వాటర్’ నవలను రాశారు పియా పడుకొనే... విలయాలలో, విపత్తులలో, దుర్ఘటనల్లో అశువులు బాసే వారితో పాటే, విధివశాన మృత్యుంజయులైన వారూ ఉంటారు. అయితే ఆ ప్రమాదాలనుంచి తప్పించుకున్న వారు కూడా చాలాకాలం పాటు ఆ విషాద జ్ఞాపకాలలో జీవనం సాగిస్తుంటారు. అలాంటి విషాద జీవితాన్ని ‘వేర్ ఎర్త్ మీట్స్ వాటర్’ సున్నితంగా, భావయుక్తంగా స్పృశిస్తుంది. మృత్యుముఖంలోకి వెళ్లొచ్చిన రచయిత్రి పియా పడుకొనె! నిజానికి మృత్యుముఖంలోకి వెళ్లొచ్చాకే ఆమె రచయిత్రి అయ్యారని చెప్పాలి. 2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు ఆ జంట ఆకాశ హర్మ్యాలలోని ఒక దానిలో పియా కూడా ఉండవలసిందే కానీ ‘అదృష్టవశాత్తూ’ నాలుగు రోజుల ముందే ఆమె అక్కడ పని మానేసి వెళ్లిపోయారు. తిరిగి 2004లో పియా మృత్యువు సమీపానికి వెళ్లి వచ్చారు. ఆ ఏడాది డిసెంబరులో భారతదేశపు తూర్పు తీర ప్రాంతాన్ని సునామీ ముంచెత్తుతోంది. ఆ సమయానికి పియా తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి కొన్ని మైళ్ల సమీపంలో సముద్రపు ఒడ్డున ఉన్నప్పటికీ ‘అదృష్టవశాత్తూ’ బతికి బయటపడగలిగారు. 2013లో కూడా విధి పియాతో చెలగాటం ఆడబోయి ఆఖరి నిమిషంలో మనసు మార్చుకున్నట్లు ఆమెను వదిలిపెట్టింది. బోస్టన్ మారథాన్‌లో అకస్మాత్తుగా బాంబు పేలుళ్లు సంభవించిన సంవత్సరం అది. ఆ మారథాన్‌లో పాల్గొన్న పియా భర్త, అక్కడికి సమీపంలో ఉన్న పియా ఇద్దరూ ‘అదృష్టవశాత్తూ’ తృటిలో తప్పించుకున్నారు. నిజానికి అదొక అద్భుతం లా జరిగింది. పియ భర్త ఫినిషింగ్ లైన్‌ని దాటిన సంబరాన్ని ఆస్వాదించేందుకు దంపతులిద్దరూ కలిసి అక్కడికి సమీపంలోని బార్లోకి వెళ్లి కూర్చున్నారు. రెండు గుటకలు వేశారో లేదో... ఆ ప్రదేశం బాంబుల చప్పుళ్లతో దద్దరిల్లింది. అయితే పియా ఈ మూడు సంఘటనల్లోనూ తను బయట పడడాన్ని ‘అదృష్టం’అనుకోలేకపోతున్నారు. మృత్యువు నుంచి తప్పించుకోవడం తనది అదృష్టం అయితే, మృత్యువుకు బలైన వారి మాట ఏమిటి? ఈ సంఘటన లు ఆమెలో ఆలోచనలను రేకెత్తించాయి. వీటి ఆధారంగా విధిపై ఒక పుస్తకం రాయడానికి ఆమెను ప్రేరేపించాయి. ఆ పుస్తకం పేరే ‘వేర్ ఎర్త్ మీట్స్ వాటర్’. హార్లెక్విన్ ఇండియా వారు ప్రచురించారు. ‘‘విధివశాత్తూ దగ్గరి వారిని పోగొట్టుకున్న బాధితుల భావోద్వేగాలలో ఎలాంటి కల్లోలాలు చెలరేగుతాయనే అంశంతో ఈ పుస్తకం రాశాను’’ అంటారు పియా. కన్నీళ్లను, ఉద్వేగాలను, మానసిక స్థితి గతులను మాత్రమే సారాశంగా తీసుకుని నవలను నడిపించారు. అందుకే పుస్తకంలో మనకు ఎక్కువగా పియా వ్యక్తిగత అభిప్రాయాలు, జ్ఞాపకాలు కనిపిస్తాయి. పాఠకులను కదిలిస్తాయి. ‘‘సెప్టెంబర్ 11 దాడుల ఘటనలో కొందరు ట్రేడ్ సెంటర్ ఉద్యోగులు రైలును సమయానికి అందుకోలేక తప్పించుకున్నారు. కొందరు ఆఫీస్ టైమ్‌కి నిద్రలేవలేక, కొందరైతే మీటింగ్ రద్దయిన కారణంగా ఆఫీసుకు రావలసిన అవసరం లేక తప్పించుకున్నారు. అలాంటి వారిలో తాము బైటపడ్డామన్న సంతోషం కన్నా కూడా, ‘అయ్యో వారు చనిపోయారే’ అనే బాధ, అవేదన ఉంటుందని నేను గ్రహించగలను. ఆ గ్రహింపునుంచే నాకీ నవల రాయాలన్న ఆలోచన వచ్చింది’’ అని చెబుతున్న పియా పడుకొనె ఇప్పటికే రెండో నవల రాసే ప్రయత్నంలో ఉన్నారు! ప్రస్తుతం ఆమె తన భర్త రోహిత్‌తో కలిసి ‘టు అడ్మైరబుల్ ప్లెజర్స్’ అనే బ్లాగు నడుపుతున్నారు. అందులో వారు పుస్తక సమీక్షల గురించీ, కొత్త కొత్త వంటల తయారీ గురించి రాస్తుంటారు. ఇద్దరం కలిసి ఇలా కొత్త కొత్త రుచులను పంచుకోవడం నాకెంతో బాగుంటుంది’’ అని చెప్పే పియా పడుకొనేకి ఇక ఇప్పట్లో మృత్యువుతో ముఖాముఖి ఉండకూడదని ఆశిద్దాం. -
గ్రాండ్ మారథాన్..
ఉత్సాహంగా సాగిన రన్ యువతదే పైచేయి విజేతగా నిలిచిన హర్యానా రైతు బిడ్డ హాఫ్ మారథాన్‌లో నెగ్గిన బాబూరామ్ 5కే రన్ విన్నర్‌గా కార్మికుడి కొడుకు సాక్షి, సిటిబ్యూరో: నగరంలో ఆదివారం నిర్వహించిన ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ సక్సెస్ అయింది. అన్ని వర్గాల వారు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. పరుగులో పాల్గొనేందుకు భారీగా తరలిరావడంతో నిర్వాహకులు సైతం ఆనందంలో మునిగిపోయారు. ఏటా ఇలాంటి రన్ నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. ఫుల్ మారథాన్ (42.195 కిలోమీటర్లు) సాగిందిలా... నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం ఐదు గంటలకు నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, రాజ్‌భవన్ రోడ్డు, శ్రీనగర్ కాలనీ బస్‌స్టాప్, కేబీఆర్ పార్కు, దస్పల్లా హోటల్, హైటెక్ సిటీ, అస్కెండస్ సర్కిల్, క్వాలిటీ ఇన్ సర్కిల్, ఐఐఐటీ జంక్షన్, విప్రో సర్కిల్, పోలారిస్ బిల్డింగ్, గోపన్నపల్లి జంక్షన్, హెచ్‌సీయూ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగిసింది. హాఫ్ మారథాన్ (21.1 కిలోమీటర్లు)... నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైంది. ఎన్టీఆర్ గార్డెన్, రాజ్‌భవన్, శ్రీనగర్ కాలనీ బస్‌స్టాప్, న్యూ దస్పల్లా హోటల్, హైటెక్ సిటీ, అస్కెండస్ సర్కిల్, క్వాలిటీ ఇన్ సర్కిల్, ఐఐఐటీ జంక్షన్, గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగిసింది. 5 కే రన్... గచ్చిబౌలి స్టేడియం నుంచి ట్రిపుల్ ఐటీ కూడలి, ఇన్ఫోసిస్, విప్రో సర్కిల్ మీదుగా క్యూసిటీ నుంచి తిరిగి గచ్చిబౌలి స్టేడియం వరకు కొనసాగింది. ఇందులో ఐటీ కంపెనీలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రన్‌ను ప్రారంభించిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సినీ నటులు రానా, సునీల్, నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ మహంతి పరుగులు తీశారు. సత్తాచాటిన యువత.. ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్‌లో యువత సత్తా చాటింది. 42.195 కిలోమీటర్లు పురుషుల ఫుల్మారథాన్ను హర్యానాలోని మహేందర్గడ్కు చెందిన 25 ఏళ్ల కరన్ సింగ్ 2 గంటల 24 నిమిషాల 57 సెకన్లలో పరుగెత్తాడు. ఈ ఏడాది జనవరిలో ముంబై మారథాన్‌లో ఇండియన్ మెన్స్ ఫుల్ మారథాన్ విజేతగా నిలిచిన కరన్ అదే స్ఫూర్తితో హైదరాబాద్ మారథాన్లోనూ సత్తా చాటాడు. ఇంటర్ వరకు చదువుకున్న హర్యానాలోని విలేజ్ దానిమనియాలికి చెందిన ఈ యువకుడు ప్రస్తుతం పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ యూనిట్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇతని తండ్రి శ్రీవికారమ్ రైతు. తల్లి సంతోషిణి గృహిణి. అథ్లెట్ కావడమే తన లక్ష్యమని కరన్‌సింగ్ తెలిపారు. ఇదే ఫుల్మారథాన్లో 2 గంటల 26 నిమిషాల 26 సెకన్లతో పుణె ఆర్మీకి చెందిన వీఐ డంగ్ ఐ, 2 గంటల 28 నిమిషాల 23 సెకన్లతో మూడో స్థానంలో రాజేశ్పాల్ సింగ్ నిలిచారు. మెన్ హాఫ్ మారథాన్‌లో.. మెన్ హాఫ్ మారథాన్‌లో హైదరాబాద్‌లోని ‘ఆర్మీ ఆర్టిలరీ సెంటర్’లో సోల్జర్‌గా పనిచేస్తున్న బాబూరామ్ గంటా 9 నిమిషాల 50 సెకన్లలో 21.1 కిలోమీటర్లను ఛేదించి విజేతగా నిలిచారు. జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఈయన హైదరాబాద్‌లోని ఆర్మీ ఆర్టిలరీ సెంటర్లో సోల్జర్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచే రన్నింగ్ అంటే ఇష్టమని చెబుతున్నారు. మూడేళ్లుగా నగరంలోని ఆర్మీ ఆర్టిలరీ సెంటర్లోనే రన్నింగ్ ప్రాక్టీసు చేస్తున్నారు. గతేడాది హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొన్నారు. మంగళూరు నిఫ్ట్ హాఫ్ మారథాన్‌లో రన్ చేసి ప్రథమ స్థానంలో నిలిచారు. ఇదే స్ఫూర్తితో ఈసారి జరిగిన హైదరాబాద్ మారథాన్‌లో విజేతగా నిలబడ్డారు. దీనికి తమ స్నేహితుల సహకారం కూడా ఉందని చెబుతున్నారు. కాగా గంటా 13 నిమిషాల 52 సెకన్లలో నంజుడప్ప, గంటా 18 నిమిషాల 19 సెకన్లలో సతీశ్ కుమార్ రన్ చేసి మూడో స్థానంలో నిలిచారు. 5కే రన్లో.. 5 కే రన్లో కేరళకు చెందిన సందీప్ విజేతగా నిలిచారు. కేరళకు చెందిన ఈయన డిగ్రీ వరకు చదువుకున్నారు. 1,500 మీటర్ల మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్‌లో పాల్గొన్నారు. మారథాన్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. తొలి ఈవెంట్లోనే విజేతగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందని సందీప్ చెబుతున్నారు. మహిళ విజేతలు వీరే... మహిళల ఫుల్మారథాన్లో షామిలీ సింగ్, రశ్మి, ఎం.సుధ వరుసగా మూడు స్థానాల్లో నిలిచారు. ఉమెన్ హాఫ్ మారథాన్‌ను జ్యోతి గెలిచింది. సీమ, కేఎం రంజన రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. కార్పొరేట్ ట్రోఫీ యూహెచ్‌జీ కైవసం... ఈ ఈవెంట్లో యూనెటైడ్ హెల్త్ గ్రూపు కంపెనీకి చెందిన 800 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. మారథాన్‌లో ఎక్కువ మంది ఉద్యోగులు పాల్గొన్నందుకు కార్పొరేట్ ట్రోఫీని యూహెచ్‌జీ కైవసం చేసుకుంది. ‘కేర్’ వైద్య సేవలు హ్యాపెనింగ్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించిన ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్‌కు కేర్ ఆస్పత్రుల ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించినట్టు ఆ ఆస్పత్రి మీడియా మేనేజర్ ఎం.శివశంకర్ తెలిపారు. వైద్య సేవల్లో భాగంగా రన్ ప్రారంభమైన నెక్లెస్ రోడ్ నుంచి రన్ ముగిసిన గచ్చిబౌలి స్టేడియం వరకు ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక పాయింట్ చొప్పున ఏర్పాటు చేసి రన్లో పాల్గొన్న వారికి పెయిన్ రిలీఫ్ స్ప్రేలతోపాటు వారికి కావాల్సిన గ్లూకోస్లను అందించినట్టు చెప్పారు. మొబైల్ సర్వీసులను కూడా అందించినట్టు తెలిపారు. -
ఎయిర్టెల్ మారథాన్
సిటీ.. రన్‌కు సిద్ధమైంది. ఆదివారం తెల్లవారు జామున 5 గంటలకు మొదలయ్యే ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల రన్నర్లు, విదేశీయులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఎక్స్‌పోకు వేలాదివుంది తరలివచ్చారు. టీ షర్ట్లు, బూట్లు, గూడీ, బ్యాగ్‌లు తీసుకున్నారు. అనుభవజ్ఞులైన రన్నర్ల దగ్గర సలహాలు, సూచనలు తీసుకున్నారు. బ్లేడ్ రన్నర్స్ కూడా పరుగో పరుగు అంటున్నారు. వూరథాన్ కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 1,500 వుంది వాలంటీర్లు సేవలందించనున్నారు. పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. వురోవైపు ‘సోల్స్ ఫర్ సూల్స్’లో భాగంగా సేకరించిన బూట్లను హైదరాబాద్ రన్నర్స్ పంపిణీ చేశారు. ఫుల్ మారథాన్ (42.195 కి.మీ): నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా దగ్గర మొదలవుతుంది. సంజీవయ్యుపార్క్, ఎన్టీఆర్ గార్డెన్, రాజ్‌భవన్ రోడ్, శ్రీనగర్ కాలనీ బస్టాప్, బీకేఆర్ పార్క్, హైటెక్ సిటీ, ఐఐఐటీ జంక్షన్, విప్రో సర్కిల్, పోలారిస్ బిల్డింగ్, హెచ్‌సీయూ మీదుగా సాగి గచ్చిబౌలి స్టేడియం దగ్గర వుుగుస్తుంది. హాఫ్ మారథాన్ (21.1 కిలోమీటర్లు): నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా దగ్గర ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్ గార్డెన్, రాజ్‌భవన్, శ్రీనగర్ కాలనీ బస్‌స్టాప్, హైటెక్ సిటీ, ఐఐఐటీ జంక్షన్ మీదుగా సాగి గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగుస్తుంది. ఇక 5కే రన్ గచ్చిబౌలి స్టేడియుంలో ఉదయుం 8 గంటలకు మొదలవుతుంది. - వాంకె శ్రీనివాస్ -
జీవితానికి రన్‌వే...
వంద మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది... ఇదే నానుడితో నడక మొదలు పెట్టారీ మహిళలు. ఆ నడకను కాస్తా పరుగుగా మార్చి, సుదీర్ఘమైన పరుగుతో జీవితంలో కొత్త లక్ష్యాలు చూస్తున్నారు. క్వాలిటీ లైఫ్ కోసం ఒకరు ... జీవితంలో నిలబడడానికి ఒకరు... రికార్డు మారథాన్ల కోసం ఒకరు... ఇలా పరుగునే జీవితంగా మార్చుకున్నారు. హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ ఇవాళ మారథాన్ నిర్వహిస్తున్న వేళ విభిన్నమైన జీవితాల నుంచి వచ్చిన ముగ్గురు మహిళల పరుగు ప్రయాణం గురించి... అస్సాంకు చెందిన కస్తూరికి పరుగు కేవలం హాబీ. పుణే నుంచి వచ్చిన అపర్ణది జీవన్మరణ పోరాటం. హైదరాబాద్‌వాసి యాభెరైండేళ్ల పద్మది అధిక బరువు తగ్గాలనే చిన్న కోరిక. అక్కడి కోచ్ సలహాతో రన్‌ను ఓ సాహసంలా మొదలు పెట్టారు. రెండేళ్లు తిరక్కుండానే ఆమె ఇండియా, ఇండోనేషియాల్లో 12 హాఫ్ మారథాన్లను పూర్తి చేశారు. ఇప్పుడామె లక్ష్యం పరుగెడుతూ ఉండడమే. సునీతకు కొత్త ప్రదేశాలను చూడడం, ఫొటోగ్రఫీ ఇష్టం. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం, సామాజికంగా చైతన్యం తీసుకురావడం ఆమె అభిలాష. స్నేహితులతో హిమాలయాల్లో చేసిన ట్రెక్కింగ్ ఆమెను మారథాన్ వైపు మళ్లించింది. హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ నిర్వహిస్తున్న సామాజిక పరుగు ఉద్యమంలో పాల్గొనే వారిలో ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. ఆరేళ్ళక్రితం ముప్ఫై తొమ్మిదేళ్ళ వయసులో పరుగు ప్రారంభించిన సునీతకు ఇప్పుడు 45 ఏళ్లు. ఈ ఆరేళ్లలో 30 ఫుల్ మారథాన్లు, పది హాఫ్ మారథాన్లు చేశారు. వీటితోపాటు బెంగళూరులో 50 కి.మీ రేస్, న్యూజిలాండ్‌లో 100 కి.మీ రేస్‌లోనూ పాల్గొన్నారు. భారత్ నుంచి పాల్గొన్న ఏకైక మహిళ ఆమె. ఈ పరుగు ఎవరెస్టుకి తొలిమెట్టు! ఈ ఏడాది హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ నిర్వహిస్తున్న మారథాన్ నాలుగోది. ఈ రన్లో పాల్గొనడం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి మొదటి మెట్టు అవుతుందంటారు పుణే నుంచి వచ్చిన అపర్ణ. ఆమెకు 44 ఏళ్ళు. ఎముకలను తినేసే వ్యాధితో బాధపడిన ఆమె ఎవరి మీదా ఆధారపడకుండా సొంత కాళ్ల మీద నిలబడాలనే తపనతోనే పరుగును ఓ యజ్ఞంలా చేస్తున్నారు. వీల్ చెయిర్‌కే పరిమితం కావాల్సిన జీవితాన్ని ఆమె పట్టుదలతో ట్రాక్‌లోకి తెచ్చుకున్నారు. గత ఏడాది మే నెల నుంచి మారథాన్లలో ఆమె పాల్గొంటున్నారు. ఆమెకిది నాలుగో మారథాన్. ‘‘ఇప్పటి వరకు అన్నీ హాఫ్ మారథాన్‌లే. వచ్చే ఏడాది జనవరిలో ముంబయిలో ఫుల్ మారథాన్‌లో పాల్గొంటాను. నా లక్ష్యం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం. హైదరాబాద్‌లో నేల ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఈ నేల మీద పరిగెట్టిన అనుభవం హిమాలయాల అధిరోహణకు దోహదం చేస్తుందనే ఇక్కడికి వచ్చాను’’ అన్నారామె. ఈ పరుగు తన ఆరోగ్యాన్ని కాపాడడమే కాక మానసిక స్థయిర్యాన్ని పెంచింది, కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలుగుతున్నారు. హాఫ్ మారథాన్‌ను రెండు గంటల పద్దెనిమిది నిమిషాల్లో పూర్తి చేసిన ఆమె... ఈ నేల మీద ఎంత సమయం పడుతుందో చూడాలంటున్నారు. నిజానికి ఆమె హాఫ్ మారథాన్ పూర్తి చేసిన సమయం సాధారణమైన వ్యక్తులు తీసుకునే సమయం కంటే తక్కువే. ఆమె ఇద్దరు కూతుళ్లు, కొడుకు తల్లిని చూసి స్ఫూర్తి పొందుతున్నారు. ఇంతకంటే కావల్సింది ఏముంది- అంటారామె. మారిన జీవన శైలి! ఇప్పటికి 12 హాఫ్ మారథాన్లు పూర్తి చేసిన పద్మ రెండు నెలల్లో 15 కిలోలు తగ్గారు. అప్పట్లో నాలుగ్గంటల నిద్రపోవడమే కష్టమయ్యేది, ఇప్పుడు ఏడు గంటల పాటు చక్కగా నిద్రపోగలుగుతున్నానంటారామె. అందరూ బృందంగా పరుగు పెట్టడం వల్ల సానుకూల ఆలోచనలు పెరుగుతాయంటారామె. ఆమె ఈ పరుగులో పాల్గొనడానికి రిలయెన్స్‌లో పని చేసే తన ఉద్యోగులను చైతన్యవంతం చేశారు. ‘‘నేను పొందిన ప్రయోజనాలు నా సహోద్యోగులు కూడా పొందాలనేదే నా తాపత్రయం. మారథాన్ రన్ ప్రారంభించిన తర్వాత దేహం దానంతట అదే ఆహారపు అలవాట్లను మార్చుకుంది. ఇప్పుడు నూనెపదార్థాలను చూసినా తినాలపించడం లేదు. పండ్లు తినాలనే కోరిక పెరుగుతోంది. నీళ్లు తాగాలనే కోరిక కూడా ఎక్కువైంది. దేహమే అలా కోరుకుంటోంది. అంతకంటే పెద్ద విషయం మానసిక సమతుల్యత బాగా ఎక్కువైంది’’ అంటారామె. అలాంటి వారిలో వైశాలి, సయూరి దల్వీ లాంటి ఎందరో ఉన్నారు. ఐఐటి ప్రొఫెసర్ల నుంచి బ్యాంకింగ్ ఉన్నతోద్యోగుల వరకు వివిధ రంగాల వాళ్లు, ముఖ్యంగా మహిళలు మారథాన్‌లో పాల్గొంటున్నారు. ఇంతటి సుదీర్ఘమైన పరుగులో పాల్గొంటున్న ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకమైన కారణం ఉన్నప్పటికీ అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట మాత్రం... ‘పరుగుతో దేహం, మెదడు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఎంతటి ఒత్తిడులనైనా తట్టుకుని వాటిని సమగ్రంగా నిర్వర్తించగలిగిన మనోనిశ్చలత్వం వచ్చింది. చీకాకులు దరి చేరడం లేదు. మనసు ఆహ్లాదంగా ఉంటోంది’ అని మాత్రమే. నిజమే! పరుగెత్తితే... పాలు తాగకపోయినా దేహం కోరినన్ని నీళ్లు తాగవచ్చు. అదే గొప్ప ఆరోగ్యం, ఆనందం. - వాకా మంజులారెడ్డి -
వీళ్లకా.. వృద్ధాప్యమా?
నూరేళ్లూ నిండటం అనే మాట దేనికి చిహ్నమో తెలిసిందే... కాటికి కాళ్లు చాపడం అంటే దాన్నుంచి దూరంగా పరుగెత్తడమే అంటూ ‘నూరేళ్లూ నిండాక’ మారథాన్ సాధించాడో మహాసాహసి. భాషతో భాసిస్తూ ధగధగలాడే మహాశ్వేతసౌధంలా నిలిచిందో నవకవన యువతి. తాతే కదా అని పంచ్ ఇస్తే తాట తీస్తా అంటూ హెచ్చరించాడో వృద్ధయువకుడు. కష్టాలు కత్తిగట్టి, నష్టాలు నడిచివచ్చి హలో అంటే చెలో, చెలో అంటూ వాటిని చెండాడుతూ తరిమాడు హనీబీ కంటే ఎక్కువగా కష్టపడి తెరపై తేనెలూరించిన బిగ్ బీ! ఏ యువతకూ తీసిపోని ఈ యువతరాన్నిచూసి. వీళ్ల నుంచి స్ఫూర్తి పొందడానికే... వీళ్ల వృత్తాంతాలు! బామ్మమాట బంగారు బాట... హాబి ఆస్ట్రేలియాకు చెందిన జాన్ బాయ్డ్ వయసు 71 సంవత్సరాలు. వేగంగా సైకిల్ తొక్కే తీరును చూస్తుంటే... ఆమె వయసును ఎక్కువ చేసి చెప్పారేమో అనే భ్రమ కలుగుతుంది.‘‘ఈ వయసులో ఈ సాహహం ఎందుకు బామ్మా’’ అని ఇంటివారు, పొరుగు వారు వారించినా వేల మైళ్ల దూరం సైకిల్ మీద ప్రయాణం చేసి, విజయవంతంగా తిరిగివచ్చింది. బామ్మకు ఏడు మంది సంతానం. ఇరవై మంది మనవళ్లు, మనవరాళ్లు. ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ‘సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్’ అందుకున్న ఈ బామ్మ ‘మనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని అందులో తలమునకలవుతుంటే, అనారోగ్యం ఎప్పుడూ దరిచేరదు’’ అంటున్నారు. గాల్లో తేలినట్లుందే...వయసు తగ్గినట్లుందే! సాహసం వస్త్రప్రపంచ రారాజుగా పేరు గాంచిన విజయపథ్ సింఘానియా (67)కు ఇంట్లో నుంచి కాలు కదపకుండా సుఖాలు అనుభవించేంత ఆస్తి ఉంది. అయితే ఆయన ఏదో ఒక రూపంలో కష్టపడడానికే ఇష్టపడతారు. ‘హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా కొన్ని గంటల పాటు గాలిలో ప్రయాణించాలనుకుంటున్నాను’ అని ఆయన అన్నప్పుడు ఈ వయసులో రిస్క్ అవసరమా? అని కొందరు గొణుకున్నారు. ముంబాయిలోని 22 అంతస్తుల బిల్డింగ్ నుంచి హాట్ బెలూన్‌కు అమర్చిన క్యాబిన్ ద్వారా ఆయన 69,000 అడుగుల ఎత్తుకు ఎగిరి 5 గంటల తరువాత తిరిగి వచ్చారు.‘సాహసంతో చెలిమి చేయడానికి వయసు ఆటంకం కాదని చెప్పడానికే ఈ పని చేశాను’ అని సగర్వంగా చెప్పారు సింఘానియా. ఆరోగ్యంగా... ఆనందంగా! మిస్టర్ యూనివర్స్ మిస్టర్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడుగా మనోహర్ 102 సంవత్సరాల వయసులోనూ ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన బగైహతి (పశ్చిమబెంగాల్)లో నివసిస్తున్నారు. బాడీబిల్డింగ్ అనేది కేవలం శరీరానికి సంబంధించిన విషయం కాదని దానిలో మనసు కూడా నిమగ్నమవుతుందని అంటారు మనోహర్. పొగతాగడం, పొగాకు నమలడం లాంటి అలవాట్లను ఎప్పుడూ దరి చేరనివ్వలేదు.‘‘ఎంత ఎక్కువ కాలం జీవించాం అనేదికాదు, జీవించినంత కాలం చురుకుగా, ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఇదే నన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది’’ అంటున్నారు మనోహర్. వయసు సగం అవుతుంది... సేవ ఆలోచనలు ఆరోగ్యంగా ఉంటే, మనసు ఆరోగ్యంగా ఉంటుంది. మనసు ఆరోగ్యంగా ఉంటే, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది... అని చెబుతుంటారు సింధుతాయి. కష్టాల కారడవిని దాటి వచ్చిన సింధుతాయి ‘అనాథల తల్లి’గా మహారాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఆమె చదివింది నాలుగో తరగతే అయినా... ఆమె పెంచిన పిల్లలు మాత్రం మెడిసిన్, ఇంజనీరింగ్‌లాంటి చదువులు చదివారు.‘ఈ వయసులో విశ్రాంతి తీసుకోవచ్చు కదా’’ అని ఆమెను అభిమానించేవాళ్లు అంటే... ‘నేను విశ్రాంతి తీసుకుంటే నా వయసు రెట్టింపు అవుతుంది, పిల్లలతో తీరిక లేకుండా గడిపితే సగం అవుతుంది’’ అంటారు 68 సంవత్సరాల సింధుతాయి. ఒక్క పంచ్‌తో ఆటకట్టించాడు... బాక్సింగ్ లండన్‌లోని తన నివాసంలో ఒకరోజు తీరిగ్గా దినపత్రిక చదువుకుంటున్న జాన్ కొకెలె (72) ఇంట్లోకి ఒక దొంగ చొరబడ్డాడు. వృద్ధుడు అనే కనికరం లేకుండా జాన్ ముఖం మీద ఒక బలమైప పంచ్ ఇచ్చాడు ఆ దొంగ. మరో పంచ్ ఇచ్చే లోపే దొంగోడికి ఒకే ఒక పంచ్ ఇచ్చాడు జాన్. ఈ దెబ్బతో దొంగోడు కుప్పకూలి పోయాడు. మరో పంచ్ కొసరుగా ఇచ్చి వాడిని పోలిసులకు అప్పజెప్పాడు జాన్. ఈ మాజీ బాక్సర్ గురించి చెప్పుకోవడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ఇప్పటికీ ఇరవై ఏళ్ల కుర్రాడిలా ఉత్సాహంగా ఉండే జాన్ దగ్గరికి బాక్సింగ్ టిప్స్ తెలుసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో ఎందరెందరో వస్తుంటారు. ఎనభై ఎనిమిదిలోనూ ఎంతో చురుగ్గా... సాహిత్యం మహాశ్వేతాదేవి... సాహిత్య అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆమె రాసిన నవలలు, కథలు, వ్యాసాలలో గిరిజన ప్రపంచాన్ని ఆవిష్కరించారు. ఆమె పుస్తకాలు తెలుగులో అనువాదమై పాఠకులను ఆకట్టుకున్నాయి. ఆమె సెకండ్ హ్యాండ్ సమాచారం మీద ఆధారపడకుండా తాను ఏ సమూహం గురించి రాస్తున్నారో, వారితో ప్రత్యక్షంగా మాట్లాడతారు. ఈ క్రమంలో దేశంలో ఎన్నో ప్రాంతాలు తిరిగారు. సామాజిక కార్యకర్తగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ‘‘రాయడమనేది ఉత్తేజపరిచే పని’’ అని చెబుతున్న మహాశ్వేతాదేవి ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులోనూ చురుగ్గా ఉండడానికి రచనా వ్యాసంగమే కారణం అంటారు. మృత్యువును జయించాడు... స్ఫూర్తి పంజాబ్‌కు చెందిన వరల్డ్ ఓల్డెస్ట్ మారథన్ రన్నర్ ఫౌజాసింగ్ వయసు 101 సంవత్సరాలు. అయిదు నెలల క్రితం జరిగిన హాంకాంగ్ మారథన్‌లో పదికిలోమీటర్ల దూరాన్ని 92 నిమిషాల వ్యవధిలో చేరుకొని తన సత్తా చాటారు. 1994లో ఫౌజా కుమారుడు చనిపోయాడు. ఈ విషాదంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు. విషాదం నుంచి ఫౌజాను బయటికి తీసుకురావడానికి హర్మేందర్‌సింగ్ అనే గురువు పరుగుపందేలలో పాల్గొనేలా చేశాడు. ఎన్నో జాతీయ,అంతర్జాతీయ పరుగు పందేలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు ఫౌజా.‘‘పరుగెత్తడం అనేది లేకపోతే... విషాదంలో మునిగిపోయేవాడిని.’ అంటారు ఫౌజా. నిలువెత్తు ఉత్తేజిత చిత్రం! చిత్రకళ అంతర్జాతీయ చిత్రకారుడు యస్.హెచ్.రజా వయసు 92. కుంచె పట్టుకున్నప్పుడు మాత్రం ఆ 92 కాస్తా 29 అవుతుంది.‘‘నాలోని అంతర్గత అనుభూతులకు చిత్రరూపం ఇవ్వడమే నా పని’’ అంటారు రజా. అయితే ఆ పని తన చిత్రకళకు మాత్రమే పరిమితమైపోలేదు. ఆయన్ను నిరంతర యవ్వనుడిగా ఉంచుతుంది.‘ధ్యానం చేసిన వ్యక్తి మునపటి కంటే కొత్త ఉత్సాహంతో శక్తిమంతంగా కనిపిస్తాడు. చిత్రకళలో నాకు ఆ శక్తి కనిపించింది. యవ్వన ఆలోచనలు, వయసు పైబడిన ఆలోచనలు అంటూ ఉండవు. ప్రతి సృజనాత్మక ఆలోచనా వయసుకు అతీతమైనదే. సరికొత్తదే’’ అంటున్న రజా గీసిన బొమ్మలు చూస్తే ఆయన చెప్పింది ఎంత నిజమో తెలుస్తుంది. -
లేడీ పేసర్స్
మామూలు పరుగు పోటీలకు ఎవరి సాయం అవసరం లేదు గానీ, మారథాన్ పరుగులో మాత్రం పేసర్ల సాయం తప్పనిసరి. మారథాన్‌లో పరుగులు తీసేవారికి మార్గదర్శకత్వం చేసేవారిని ‘పేసర్’ అంటారు. దేశంలోనే రెండో అతిపెద్ద మారథాన్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్ మారథాన్లోనూ పేసర్ల పాత్ర తక్కువేమీ కాదు. కొత్త రన్నర్లకు మార్గదర్శకత్వం వహించేందుకు పలువురు మహిళలు సైతం పేసర్లుగా సేవలందించేందుకు ముందుకొస్తున్నారు. రన్నర్ల స్థాయి నుంచి పేసర్లుగా ఎదిగిన కొందరు మహిళల అనుభవాలు వారి మాటల్లోనే... సేవలను వినియోగించుకోవాలి పీహెచ్డీ చేస్తుండగా రన్నింగ్‌పై ఆసక్తి మొదలైంది. బెంగళూరులో 2000 సంవత్సరంలో జరిగిన 22 కిలోమీటర్ల పరుగులో పాల్గొన్నా. ఇప్పటి వరకు ఏడు ఫుల్ మారథాన్లలో పాల్గొన్నా. ఈ పరుగే నన్ను పేసర్‌గా మీ ముందు నిలిపింది. మా సేవలను అందరూ వినియోగించుకోవాలి. - దేవయాని హల్దర్ కొత్త రన్నర్లకు బాసటగా.. మూడేళ్ల కిందట బెంగళూరు నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డా. 2012 హైదరాబాద్ హాఫ్ మారథాన్‌లో పరుగెత్తా. 2013లో జరిగిన 10కే రన్లో పోడియం ఫినిషర్‌గా నిలిచా. ఒలింపిక్ ట్రైథ్లాన్లో పాల్గొన్నా. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ రన్నర్స్ నిర్వహించిన హాఫ్ మారథాన్‌లో 2 గంటల 1 నిమిషంలో లక్ష్యాన్ని అధిగమించా. ఈసారి హైదరాబాద్ రన్నర్స్ నాకు పేసర్‌గా అవకాశం ఇచ్చారు. కొత్త రన్నర్లకు అన్ని విధాలా బాసటగా ఉంటా. - ఠాకూర్ కస్తూరి లైఫ్‌లాంగ్ రన్ చేస్తా లండన్, ఇస్తాంబుల్ సహా ఇప్పటి వరకు ఆరు ఫుల్ మారథాన్లలో పాల్గొన్నా. మారథాన్‌కు ఒకరోజు ముందే కొత్త రన్నర్స్‌కు రన్నింగ్ ఎలా ఉండాలి, ఎలా హైడ్రేట్ చేసుకోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పిస్తాం. రన్నర్స్ పేసర్లను ఫాలో కావాలి. ముందుగా చేసుకున్న ప్లానింగ్ ప్రకారం రన్నింగ్ సాగించాలి. - డా.శిల్పారెడ్డి రన్నర్లను గమ్యానికి చేర్పిస్తా... హైదరాబాద్ రన్నర్స్ జనవరి 4న ‘అలంకృత’లో నిర్వహించిన లాంగ్న్‌ల్రో పాల్గొన్నా. తొలుత సరదాగా ఐదు కిలోమీటర్లు పరుగెత్తాలనుకున్నా. అయితే, అందరూ లక్ష్యాన్ని అధిగమించేందుకు ముందుకు వెళుతుంటే, నేనూ పోటీ పడ్డా. మొత్తానికి 2 గంటల 35 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకున్నా. తర్వాత హెచ్‌సీయూలో జరిగిన హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ నిర్వహించిన హాఫ్ మారథాన్‌లో పాల్గొని, 2 గంటల 14 నిమిషాల్లో 21 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకున్నా. కొత్త రన్నర్స్‌కు సోషల్ మీడియా ద్వారా సలహా, సూచనలు ఇస్తుంటా. హైదరాబాద్ రన్నర్స్ ఈసారి హాఫ్ మారథాన్ 21 కిలోమీటర్ల విభాగంలో పేసర్‌గా అవకాశం ఇచ్చారు. దాదాపు ఆరువందల మంది రన్నర్లను సకాలంలో గమ్యానికి చేర్పించే బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తా. - బబితా జేవియర్ పేసర్‌ను ఎంచుకోవడం ఇలా... మారథాన్‌కు ఒక వారం ముందు పేసర్ తన గ్రూపు వారితో ఆన్లైన్లో స్ట్రాటజీపై చర్చిస్తారు. దీనికి ఒకరోజు ముందు పేసర్లు అందరూ పాల్గొనే ఎక్స్‌పోలో వారి స్ట్రాటజీని రన్నర్లు నేరుగా తెలుసుకోవచ్చు. దాని బట్టి తమకు నచ్చిన వారిని ఎంచుకోవచ్చు. బస్ అంటే ఇదీ... కొత్త రన్నర్స్‌కు మార్గదర్శనం చేసేందుకు పేసర్లు జర్నీ చేసే టైమ్‌ను ‘బస్’ అంటారు. హాఫ్, ఫుల్ మారథాన్‌లో పాల్గొనే రన్నర్లు వివిధ బస్‌లలో ఉన్న పేసర్లను సెలక్ట్ చేసుకోవచ్చు. హాఫ్ మారథాన్‌లో 2.45 గంటల బస్‌లో బబితా జేవియర్, 2.15 గంటల బస్‌లో ఠాకూర్ కస్తూరి, ఫుల్ మారథాన్‌లో 5.30 గంటల బస్‌లో డాక్టర్ శిల్పారెడ్డి పేసర్లుగా ఉన్నారు. ఫుల్ మారథాన్‌లో 4 గంటల మొదలుకొని 6 గంటల బస్ వరకు ఉంటాయి. ఆ సమయాల్లో ఆ బస్లలోని పేసర్లు రన్నర్లను గమ్య స్థానానికి చేరుస్తారు. పేసర్లలోనూ ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. కొందరు పరుగు వేగంలో నిలకడ పాటిస్తారు. ఇంకొందరు వేగంగా దూసుకెళతారు. మరికొందరు తొలుత నెమ్మదిగా పరుగు ప్రారంభించి, క్రమంగా వేగాన్ని పెంచుతారు. పేసర్లను అనుసరిస్తూ రన్నర్లు గమ్యస్థానాన్ని చేరుకుంటారు. - వాంకె శ్రీనివాస్ -
మారథాన్‌కు విశేష స్పందన
కొరుక్కుపేట, న్యూస్‌లైన్:మెదడువాపు సమస్యతో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం నాథెల్లా జ్యువెలరీస్, డౌన్ టు డస్క్ మారథాన్ - 2014 సంయుక్తంగా ఆదివారం ఉదయం చేపట్టిన డౌన్ టు డస్క్ మారథాన్‌కు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని చెన్నై గిండీలోని ఐఐటీ- మద్రాసు ఆవరణలో ప్రముఖ సినీ నటులు, డౌన్ టు డస్క్ బ్రాండ్ అంబాసిడర్లైన కార్తీ, అరవింద్ స్వామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ మారథాన్‌లో రన్ మారథాన్, సైకిల్ మారథాన్ నిర్వహించారు. ఉదయం 8.30 గంటల రన్ మారథాన్‌లో పెద్ద సంఖ్యలో చిన్నారులు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించిన సైకిల్ మారథాన్ చెన్నై ఐఐటీ - మద్రాసు నుంచి మహాబలిపురం వరకు సాగింది. దీనిని చెన్నై, పోలీసు జాయింట్ కమిషనర్ రాజేష్ దాస్, టీపీఎస్ డెరైక్టర్ శ్రీనాథ్ రాజెం జెండా ఊపి ప్రారంభించారు. రన్ మారథాన్‌లో, సైకిల్ మారథాన్‌లో 6,300 మంది పాల్గొని మారథాన్‌ను విజయవంతం చేశారు. డౌన్ టు డస్క్ మారథాన్ - 2014 నిర్వాహకులు మాట్లాడుతూ బాల సంజీవని సిరెబ్రల్ పల్సీ రెహబ్ సెంటర్లోని మెదడు సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు థెరపీ సౌకర్యార్థం మారథాన్‌లో వచ్చిన మొత్తాన్ని విరాళంగా అందించనున్నామన్నారు. పెద్ద సంఖ్యలో యువకులు, చిన్నారులు పాల్గొని మారథాన్‌ను విజయవంతం చేయడం సంతోషంగా ఉందని, వారం దరికీ అభినందనలు తెలిపారు. -
రోడ్డు భద్రత కు మారథాన్
వేలూరు, న్యూస్‌లైన్: రోడ్డు భద్రతపై అవగాహ నకల్పించేం దుకు మినీ మారథాన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నందగోపాల్ తెలిపారు. వేలూరు కరుగంబత్తూరులో ఎకే గ్రూప్స్ చారిటబుల్ ట్రాన్స్‌పోర్టు ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, గ్లోబల్ వార్మింగ్‌పై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు మినీ మారథాన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఎస్‌ఓబీ జిల్లా అధ్యక్షుడు శరవణ కుమార్ అధ్యక్షతన కలెక్టర్ నందగోపాల్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇటువంటి మినీ మారథాన్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం నిర్వహిం చిన ఈ పోటీలకు సుమారు మూడు వేల మంది విద్యార్థులు కలుసుకున్నారని చెప్పారు. వికలాంగుల కోసం ప్రత్యేక మినీ మారథాన్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులతో పాటు సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పాల్ దేవసహాయం, పారిశ్రామిక వేత్త విఎం బాలాజీ మొదలియార్, సినీ డెరైక్టర్ గోపాల్ క్రిష్ణన్, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
రాకెట్లా దూసుకెళ్లిన బామ్మ