విశాఖ స్పోర్ట్స్: విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన వైజాగ్ నేవీ మారథాన్ 8వ ఎడిషన్ ఓపెన్‌లో శిఖంధర్, మహిళల్లో ఆశా విజేతలుగా నిలిచారు. వైజాగ్ నేవీ మారథాన్ పరుగు సాగరతీరంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి అథ్లెట్లు విజయమే లక్ష్యంగా ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్ల పరుగుపెట్టారు. ఔత్సాహికులు సరదాగా ఐదు కిలోమీటర్ల మేర ఫన్ రన్ చేపట్టారు. ఫుల్ మారథాన్ 42.2 కిలోమీటర్లు, హాఫ్ మారథాన్ 21.1 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల రేస్‌ను నిర్వహించి విజేతలకు బహుమతులందించారు.
మారథాన్ రేస్, ఫన్ పరుగు ఆర్‌కే బీచ్ మీదుగా నేవల్ కోస్టల్ బ్యాటరీ వైపు వద్ద యూటర్న్ తీసుకుని.. కాళీమాత ఆలయం మీదుగా వీఎంఆర్‌డీఏ ఎంజీఎం పార్క్ వద్దకు చేరుకోగానే ముగిసింది. పది కిలోమీటర్ల పరుగు తెన్నేటి వద్ద యూ టర్న్ తీసుకోగా, హాఫ్ మారథాన్ పరుగు వీరులు రుషికొండ గాయత్రి కళాశాల దగ్గర యూ టర్న్ తీసుకున్నారు. పూర్తి మారథాన్‌లో అథ్లెట్లు ఐఎన్‌ఎస్ కళింగ సమీపంలోని చేపాలుప్పాడ దగ్గర యూ టర్న్ తీసుకుని ప్రారంభస్థానానికి చేరుకున్నారు.
వీఎంఆర్డీఏ పార్క్‌లో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పురుషుల ఓపెన్ హాఫ్ మారథాన్‌లో దీపక్ కుంబార్, 10 కిలోమీటర్ల పరుగులో సోనుకుష్వా విజేతలుగా నిలిచారు. మహిళా విభాగం హాఫ్ మారథాన్‌లో లిలియన్ రుట్టో, 10 కిలోమీటర్ల పరుగులో మేరీగ్రేస్ విజేతలుగా నిలిచి బహుమతులు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment