'60 రోజుల్లో 4000 కిలోమీటర్ల పరుగు..'
► కన్యాకుమారీలో మొదలై కశ్మీర్లో ముగింపు
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మారథాన్ కింగ్ పట్ ఫామర్ భారత దేశ దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువం వరకు పరుగెత్తనున్నారు. దాదాపు 4000 కిలోమీటర్లకు పైగా ఉన్న వీటి మధ్య దూరాన్ని ఆయన అలవోకగా తన పరుగు ద్వారా 60 రోజుల్లో ముగించనున్నారు. కన్యా కుమారిలో ఆయన పరుగు ప్రారంభించి కశ్మీర్ వరకు వెళ్లనున్నారు.
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఈ మారథాన్ ప్రారంభిస్తారు. అదే రోజు ఆస్ట్రేలియా ఆవిర్భావ దినోత్సవం కూడా. భారత్, ఆస్ట్రేలియాల మధ్య పర్యాటకాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో 'స్పిరిట్ ఆఫ్ ఇండియా' పేరిట భారత్ టూరిజం, విదేశాంగ వ్యవహారాల శాఖ ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో ఈ మారథాన్ నిర్వహించనుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, చండీగఢ్ రాష్ట్రాల గుండా ఈ మారథాన్ కొనసాగనుంది.
పట్ ఫామర్ ఇప్పటికే పలు మారథాన్లలో పాల్గొని రికార్డులు నెలకొల్పారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వియత్నాం, మధ్యాసియా, ఉత్తర అమెరికావంటి దేశాల ఉత్తర, దక్షిణ ధ్రువాల వరకు ఆయన పరుగుతో చేరుకున్నారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా పార్లమెంటు సభ్యుడిగా ఎనిమిదేళ్లపాటు సేవలందించడమేకాకుండా ఇతర బాధ్యతలు కూడా నిర్వహించారు. ఆయన 20 ఏళ్ల పరుగు ప్రయాణంలో తన మారథాన్ల ద్వారా ఎన్నో చారిటీలకు డాలర్ల మూటలు కట్టబెట్టారు.
భారత్లో నిర్వహించనున్న మారథాన్ ప్రధాన ఉద్దేశం పర్యాటకాన్ని వృద్ధి చేయడమే కాకుండా బాలికల విద్య కోసం నిధుల సేకరణ కూడా ఉంది. పట్ ఫామర్ పరుగు మొత్తాన్ని ఓ ప్రత్యేక మీడియా బృందం ఆయన వెంట 60 రోజులపాటు ఉండి డాక్యుమెంటరీగా ఎప్పటికప్పుడూ ఆస్ట్రేలియాలో ప్రసారం చేయనుంది. జనవరి 26న కన్యాకుమారిలోని గాంధీ మండపం వద్ద ఉదయం 6.15గంటలకు ఆయన పరుగు ప్రారంభించి మార్చి 30నాటికి శ్రీనగర్ లో ముగిస్తారు. రోజుకు ఆయన 70 నుంచి 80 కిలోమీటర్లు పరుగెత్తనున్నారు.