India Tourism
-
ప్రపంచ వింతల్లో మహాబలిపురం
సాక్షి, చెన్నై: ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న మహాబలిపురం ప్రపంచ వింతల్లో చేరటమే కాకుండా పర్యాటకుల సందర్శనలో తాజ్ మహల్‌నే అధిగమించి తమిళనాడుకే గర్వకారణంగా నిలిచింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ విడుదల చేసిన ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్ 2022 పేరుతో భారత పురావస్తు శాఖ నివేదిక ప్రకారం మన దేశంలో విదేశీయులు ఎక్కువగా సందర్శించే స్మారక చిహ్నాల జాబితాలో తమిళనాడులోని మహాబలిపురం అగ్రస్థానంలో ఉందని ప్రకటించారు. పల్లవ రాజులు నిర్మించిన 7వ, 8వ శతాబ్దపు సముద్రతీర దేవాలయాలు, శిల్పా సౌందర్యంతో కూడిన దేవాలయాలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. వందల ఏళ్ల క్రితం మహేంద్రవర్మ నిర్మించిన రాతి రథాలు, ఆలయాలు కాలంతో పాటు సగర్వంగా నిలుస్తున్నాయి. యునెస్కో జాబితాలో సైతం చోటు సంపాదించింది. ఈ అద్భుతాన్ని చూసేందుకు ఏటా లక్షల మంది ప్రజలు, పర్యాటకులు, విదేశీయులు ఇక్కడికి వస్తుండటం విశేషం. ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్ 2022 పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్ 2022 ప్రకారం, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా వర్గీకరించిన మహాబలిపురానికి విదేశీ సందర్శకుల సంఖ్యలో తాజ్ మహల్‌ను అధిగమించింది. సెప్టెంబరు 27న న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్లో ప్రపంచ పర్యాటక దినోత్స వం సందర్భంగా ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్ దీనిని విడుదల చేశారు. పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామల్లపురం (మహాబలిపురం)ను 2021–22లో 1,44,984 మంది విదేశీ పర్యాటకులు సందర్శించారు. 45.50 శాతం మంది విదేశీయులు పర్యటించి మొదటి స్థానంలో నిలువుగా, ఆగ్రాలోని తాజ్ మహల్‌ను 38,922 మంది విదేశీ సందర్శకులతో రెండో స్థానంలో నిలిచి 12.21 శాతంగా నిలిచింది. మహాబలిపురం విశేషాలు ఈ ప్రదేశంలో 7వ , 8వ శతాబ్దపు హిందూ మతపరమైన స్మారక చిహ్నాల సేకరణ ఉంది. 40 పురాతన దేవాలయాలు, స్మారక కట్టడాల్లో గంగా అవరోహణ, పంచ రథాలు, ఏకశిలా పిరమిడ్ నిర్మాణాలు, 7వ శతాబ్దానికి చెందిన 10 రాక్–కట్ గుహ దేవాలయాలు, ఒక బీచ్ టెంపుల్‌తో సహా కళాత్మక రాతి నిర్మాణాలు పర్యటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. భారత పర్యాటక శాఖ ప్రచురించిన జాబితాలోని మొదటి 10 స్మారక చిహ్నాలలో ఆరు తమిళనాడులో ఉండటం విశేషం. మహాబలిపురంలో అనేక అద్భుత క్షేత్రాలతో పాటు సీషెల్, మారిటైమ్ హెరిటేజ్ మ్యూజియం, 40,000 పైగా అరుదైన సీషెల్ నమూనాలు, ముత్యాలు, అక్వేరియంలు, డైనోసార్ శిలాజాలు పర్యటకులను సంమ్మోహన పరుస్తాయి. మామల్లపురం సముద్రపు గవ్వలతో చేసిన కళాఖండాలు మనకంటే విదేశీయులు ఎక్కువగా కొనుగోలు చేసి ఆనందిస్తారు. మొత్తానికి మహాబలిపురం ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా నిస్సందేహంగా రుజువు చేస్తుంది. -
'60 రోజుల్లో 4000 కిలోమీటర్ల పరుగు..'
► కన్యాకుమారీలో మొదలై కశ్మీర్లో ముగింపు న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మారథాన్ కింగ్ పట్ ఫామర్ భారత దేశ దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువం వరకు పరుగెత్తనున్నారు. దాదాపు 4000 కిలోమీటర్లకు పైగా ఉన్న వీటి మధ్య దూరాన్ని ఆయన అలవోకగా తన పరుగు ద్వారా 60 రోజుల్లో ముగించనున్నారు. కన్యా కుమారిలో ఆయన పరుగు ప్రారంభించి కశ్మీర్ వరకు వెళ్లనున్నారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఈ మారథాన్ ప్రారంభిస్తారు. అదే రోజు ఆస్ట్రేలియా ఆవిర్భావ దినోత్సవం కూడా. భారత్, ఆస్ట్రేలియాల మధ్య పర్యాటకాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో 'స్పిరిట్ ఆఫ్ ఇండియా' పేరిట భారత్ టూరిజం, విదేశాంగ వ్యవహారాల శాఖ ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో ఈ మారథాన్ నిర్వహించనుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, చండీగఢ్ రాష్ట్రాల గుండా ఈ మారథాన్ కొనసాగనుంది. పట్ ఫామర్ ఇప్పటికే పలు మారథాన్లలో పాల్గొని రికార్డులు నెలకొల్పారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వియత్నాం, మధ్యాసియా, ఉత్తర అమెరికావంటి దేశాల ఉత్తర, దక్షిణ ధ్రువాల వరకు ఆయన పరుగుతో చేరుకున్నారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా పార్లమెంటు సభ్యుడిగా ఎనిమిదేళ్లపాటు సేవలందించడమేకాకుండా ఇతర బాధ్యతలు కూడా నిర్వహించారు. ఆయన 20 ఏళ్ల పరుగు ప్రయాణంలో తన మారథాన్ల ద్వారా ఎన్నో చారిటీలకు డాలర్ల మూటలు కట్టబెట్టారు. భారత్‌లో నిర్వహించనున్న మారథాన్ ప్రధాన ఉద్దేశం పర్యాటకాన్ని వృద్ధి చేయడమే కాకుండా బాలికల విద్య కోసం నిధుల సేకరణ కూడా ఉంది. పట్ ఫామర్ పరుగు మొత్తాన్ని ఓ ప్రత్యేక మీడియా బృందం ఆయన వెంట 60 రోజులపాటు ఉండి డాక్యుమెంటరీగా ఎప్పటికప్పుడూ ఆస్ట్రేలియాలో ప్రసారం చేయనుంది. జనవరి 26న కన్యాకుమారిలోని గాంధీ మండపం వద్ద ఉదయం 6.15గంటలకు ఆయన పరుగు ప్రారంభించి మార్చి 30నాటికి శ్రీనగర్ లో ముగిస్తారు. రోజుకు ఆయన 70 నుంచి 80 కిలోమీటర్లు పరుగెత్తనున్నారు. -
వేడుకలకు వేదిక.. మారిషస్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెళ్లి, వార్షికోత్సవం, పుట్టిన రోజు.. సందర్భం ఏదైనా జీవితంలో గుర్తుండిపోయే అనుభూతి కోసం సాధారణంగా ఏం చేస్తాం? ఒక బహుమతి ఇవ్వడమో లేదా వేడుకను అంగరంగ వైభవంగా జరపడమో చేస్తాం. ఇప్పుడు ట్రెండ్ మారింది. అతిథులకూ తీపి జ్ఞాపకం మిగిల్చేందుకు చలో మారిషస్ అంటున్నారు. భారతీయులకు సైతం మారిషస్ మేనియా పట్టుకుంది. విమానాన్ని మాత్రమే కాదు హోటల్‌ను సైతం పూర్తిగా బుక్ చేసుకుంటున్నారు. వంటవారు మొదలు వినోదం వరకు అంతా అతిథులకు నచ్చినట్టుగానే. అంతేకాదు అక్కడి ప్రకృతి అందాలూ ఆహ్వానితులను కనువిందు చేస్తున్నాయి. పెళ్లంటే పెద్ద వేడుకే.. యూరప్ నుంచి అత్యధికులు తమ పెళ్లి వేడుకలకు మారిషస్‌ను వేదికగా చేసుకుంటున్నారు. ఎంత కాదన్నా ఏటా 10 వేల వివాహాలు జరుగుతున్నాయి. భారత్ నుంచి ఏడాదికి కనీసం 10 జంటలైనా తమ దేశంలో ఒక్కటవుతున్నారని మారిషస్ టూరిజం ప్రమోషన్ అథారిటీ (ఎంటీపీఏ) అంటోంది. ‘భారతీయుల పెళ్లి అంటే అదో వేడుక. భారతీయత ఉట్టిపడుతుంది. కనీసం 50 మంది మొదలు 700 మంది వరకు హాజరవుతారు. అదే యూరప్ జంటల విషయంలో అతిథుల సంఖ్య 30కి మించదు’ అని ఎంటీపీఏ డిప్యూటీ డెరైక్టర్ విజయ్ హాల్దర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. అన్ని గదులనూ పూర్తిగా బుక్ చేసుకునే సౌకర్యాన్ని హోటళ్లు కల్పిస్తాయి. వంటవారినీ తెచ్చుకోవచ్చని చెప్పారు. బీచ్ ఒడ్డున వేడుక అంటే ఆ అనుభూతిని ఆస్వాదించాల్సిందేనని అన్నారు. 30 శాతం దాకా డిస్కౌంట్.. వివిధ దేశాల నుంచి ఏటా 10 లక్షల మంది పర్యాటకులు మారిషస్‌కు వస్తున్నారు. ఈ సంఖ్యను 13.5 లక్షలకు చేర్చాలన్నది ఎంటీపీఏ లక్ష్యం. అలాగే భారత్ నుంచి 2013లో 59 వేల మంది వచ్చారని, ఈ ఏడాది 60 వేలు అంచనా వేస్తున్నట్టు ఎంటీపీఏ ఇండియా మేనేజర్ వివేక్ ఆనంద్ తెలిపారు. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 10 శాతం మంది ఉంటారని చెప్పారు. హనీమూన్ కోసం వచ్చే జంటలకు 30 శాతం దాకా డిస్కౌంట్లను కొన్ని హోటళ్లు అందిస్తున్నాయని వివరించారు. ఏటా భారత్ నుంచి 15 వేల జంటలు హనీమూన్ కోసం మారిషస్ వెళ్తున్నట్టు సమాచారం. కాగా, సింహం, పులి, చిరుతతో కలసి నడవాలంటే కసేలా నేచుర్ పార్క్ వెళ్లాల్సిందే. పోర్ట్ లూయిస్ మార్కెట్, ఎస్ఎస్ఆర్ బొటానికల్ గార్డెన్స్, గ్రాండ్ బేసిన్, చమారెల్ తదితర పర్యాటక ప్రదేశాలు చూడదగ్గవి. మారిషస్ విశేషాలను వెల్లడించేందుకు హైదరాబాద్‌తోసహా నాలుగు నగరాల్లో ఎంటీపీఏ రోడ్‌షో నిర్వహిస్తోంది.