వేడుకలకు వేదిక.. మారిషస్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెళ్లి, వార్షికోత్సవం, పుట్టిన రోజు.. సందర్భం ఏదైనా జీవితంలో గుర్తుండిపోయే అనుభూతి కోసం సాధారణంగా ఏం చేస్తాం? ఒక బహుమతి ఇవ్వడమో లేదా వేడుకను అంగరంగ వైభవంగా జరపడమో చేస్తాం. ఇప్పుడు ట్రెండ్ మారింది. అతిథులకూ తీపి జ్ఞాపకం మిగిల్చేందుకు చలో మారిషస్ అంటున్నారు. భారతీయులకు సైతం మారిషస్ మేనియా పట్టుకుంది. విమానాన్ని మాత్రమే కాదు హోటల్‌ను సైతం పూర్తిగా బుక్ చేసుకుంటున్నారు. వంటవారు మొదలు వినోదం వరకు అంతా అతిథులకు నచ్చినట్టుగానే. అంతేకాదు అక్కడి ప్రకృతి అందాలూ ఆహ్వానితులను కనువిందు చేస్తున్నాయి.
పెళ్లంటే పెద్ద వేడుకే..
యూరప్ నుంచి అత్యధికులు తమ పెళ్లి వేడుకలకు మారిషస్‌ను వేదికగా చేసుకుంటున్నారు. ఎంత కాదన్నా ఏటా 10 వేల వివాహాలు జరుగుతున్నాయి. భారత్ నుంచి ఏడాదికి కనీసం 10 జంటలైనా తమ దేశంలో ఒక్కటవుతున్నారని మారిషస్ టూరిజం ప్రమోషన్ అథారిటీ (ఎంటీపీఏ) అంటోంది. ‘భారతీయుల పెళ్లి అంటే అదో వేడుక. భారతీయత ఉట్టిపడుతుంది.
కనీసం 50 మంది మొదలు 700 మంది వరకు హాజరవుతారు. అదే యూరప్ జంటల విషయంలో అతిథుల సంఖ్య 30కి మించదు’ అని ఎంటీపీఏ డిప్యూటీ డెరైక్టర్ విజయ్ హాల్దర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. అన్ని గదులనూ పూర్తిగా బుక్ చేసుకునే సౌకర్యాన్ని హోటళ్లు కల్పిస్తాయి. వంటవారినీ తెచ్చుకోవచ్చని చెప్పారు. బీచ్ ఒడ్డున వేడుక అంటే ఆ అనుభూతిని ఆస్వాదించాల్సిందేనని అన్నారు.
30 శాతం దాకా డిస్కౌంట్..
వివిధ దేశాల నుంచి ఏటా 10 లక్షల మంది పర్యాటకులు మారిషస్‌కు వస్తున్నారు. ఈ సంఖ్యను 13.5 లక్షలకు చేర్చాలన్నది ఎంటీపీఏ లక్ష్యం. అలాగే భారత్ నుంచి 2013లో 59 వేల మంది వచ్చారని, ఈ ఏడాది 60 వేలు అంచనా వేస్తున్నట్టు ఎంటీపీఏ ఇండియా మేనేజర్ వివేక్ ఆనంద్ తెలిపారు. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 10 శాతం మంది ఉంటారని చెప్పారు. హనీమూన్ కోసం వచ్చే జంటలకు 30 శాతం దాకా డిస్కౌంట్లను కొన్ని హోటళ్లు అందిస్తున్నాయని వివరించారు.
ఏటా భారత్ నుంచి 15 వేల జంటలు హనీమూన్ కోసం మారిషస్ వెళ్తున్నట్టు సమాచారం. కాగా, సింహం, పులి, చిరుతతో కలసి నడవాలంటే కసేలా నేచుర్ పార్క్ వెళ్లాల్సిందే. పోర్ట్ లూయిస్ మార్కెట్, ఎస్‌ఎస్‌ఆర్ బొటానికల్ గార్డెన్స్, గ్రాండ్ బేసిన్, చమారెల్ తదితర పర్యాటక ప్రదేశాలు చూడదగ్గవి. మారిషస్ విశేషాలను వెల్లడించేందుకు హైదరాబాద్‌తోసహా నాలుగు నగరాల్లో ఎంటీపీఏ రోడ్‌షో నిర్వహిస్తోంది.