
మంగళవారం మారిషస్‌లో ప్రధాని నవీన్ రామ్‌గులాంతో మోదీ
భారత్‌కు, గ్లోబల్ సౌత్‌కు మధ్య ఒక వంతెన
భారతదేశ కుటుంబంలో ఒక అంతర్భాగం
ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి మోదీ స్పషీ్టకరణ
మోదీ రెండు రోజుల మారిషస్ పర్యటన ప్రారంభం
మోదీకి ఘన స్వాగతం పలికిన మారిషస్ ప్రభుత్వం
తరలివచ్చిన ప్రధానమంత్రి, మంత్రివర్గం
పోర్ట్ లూయిస్: భారత్‌కు, గ్లోబల్ సౌత్‌కు మధ్య మారిషస్ ఒక వంతెన అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మారిషస్ కేవలం భాగస్వామ్య దేశం మాత్రమే కాదని, భారతదేశ కుటుంబంలో ఒక అంతర్భాగమని చెప్పారు. మారిషస్ అంటే ‘మినీ ఇండియా’ అని అభివర్ణించారు. ఆయన మంగళవారం మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్‌లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్‌చంద్ర రామ్‌గూలమ్, వీణా దంపతులు, మంత్రివర్గ సభ్యులు సైతం పాల్గొన్నారు.
భారత్, మారిషస్ మధ్య బలమైన చారిత్రక సంబంధాలు ఉన్నాయని మోదీ గుర్తుచేశారు.ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డులను రామ్‌గూలమ్ దంపతులకు మోదీ అందజేశారు. మారిషస్‌లోని ఏడో తరం భారతీయులకు కూడా ఈ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అంతకుముందు రెండు రోజుల పర్యటన నిమిత్తం మారిషస్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి చిరస్మరణీయమైన స్వాగతం లభించింది.
రాజధాని పోర్ట్ లూయిస్‌లోని సర్ సీవూసాగర్ రామ్‌గూలమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గూలమ్‌తోపాటు ఉప ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నేషనల్ అసెంబ్లీ స్పీకర్, ప్రతిపక్ష నేత, విదేశాంగ మంత్రి, కేబినెట్ సెక్రెటరీ తదితరులు ఘన స్వాగతం పలికారు. మోదీని స్వాగతించడానికి మొత్తం మంత్రివర్గం తరలిరావడం గమనార్హం. మంత్రులు, అధికారులు సహా 200 మందికి ఆయన కోసం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
బిహారీ సంప్రదాయ స్వాగతం
మారిషస్‌లో నివసిస్తున్న భారతీయులు ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికారు. మోదీ బస చేసిన హోటల్ వద్ద భారతీయ మహిళలు సంప్రదాయ బిహారీ సాంస్కృతిక సంగీతభరిత నృత్యం ‘గీత్ గవాయ్’తో ఆయనను స్వాగతించారు. అలాగే భోజ్‌పురి సంప్రదాయ గీతం ఆలపించారు. భారత త్రివర్ణ పతాకం చేతబూని ‘భారత్ మాతాకీ జై’ అని బిగ్గరగా నినదించారు. తనకు లభించిన అపూర్వమైన గౌరవ మర్యాదల పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
మారిషస్ అధ్యక్షుడికి గంగాజలం బహూకరణ
మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్‌కు ప్రధాని మోదీ అరుదైన కానుక అందజేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం వద్ద జరిగిన మహా కుంభమేళా సమయంలో ఇత్తడి, రాగి పాత్రలో సేకరించిన పవిత్ర గంగజలాన్ని బహూకరించారు. బిహార్‌లో సాగు చేసిన సూపర్‌ఫుడ్ మఖానాతోపాటు మరికొన్ని బహుమతులు సైతం అందించారు. అలాగే ధరమ్ గోకుల్ భార్య బృందా గోకుల్‌కు బనారసీ చీరను కానుకగా ఇచ్చారు. గుజరాత్ కళాకారులు తయారు చేసిన సందేలి చెక్కపెట్టెలో ఈ చీరను అందజేశారు. అలాగే ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డును ధరమ్ గోకుల్ దంపతులకు అందించారు.
దివంగత నేతలకు నివాళులు
భారత్, మారిషస్ ప్రధానమంత్రులు మోదీ, నవీన్‌చంద్ర రామ్‌గూలమ్ సర్ సీవూసాగర్ రామ్‌గూలమ్ బొటానికల్ గార్డెన్‌ను సందర్శించారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. మారిషస్ దివంగత నేత సీర్ సీవూసాగర్ రామ్‌గూలమ్ సమాధి వద్ద మోదీ పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులల్పించారు. అలాగే మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని అనిరుధ్ జగన్నాథ్ సమాధి వద్ద నివాళులల్పించారు. వారిని స్మరించుకున్నారు.
మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం
భారత ప్రధానమంత్రి మోదీని తమ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించనున్నట్లు మారిషస్ ప్రధాని రామ్‌గూలమ్ ప్రకటించారు. మోదీకి ప్రతిష్టాత్మక ‘ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషియన్’ అవార్డు అందజేస్తామని వెల్లడించారు. ఈ పురస్కారం అందుకోనున్న మొట్టమొదటి భారత ప్రధానిగా మోదీ రికార్డుకెక్కబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment