జీవితానికి రన్‌వే... | If Hyderabad Runners Club Marathon run | Sakshi
Sakshi News home page

జీవితానికి రన్‌వే...

Published Sat, Aug 23 2014 11:16 PM | Last Updated on Sat, Mar 23 2019 9:28 PM

జీవితానికి రన్‌వే... - Sakshi

జీవితానికి రన్‌వే...

వంద మైళ్ల ప్రయాణమైనా
 ఒక్క అడుగుతోనే మొదలవుతుంది...
 ఇదే నానుడితో నడక మొదలు పెట్టారీ మహిళలు.
 ఆ నడకను కాస్తా పరుగుగా మార్చి, సుదీర్ఘమైన పరుగుతో
 జీవితంలో కొత్త లక్ష్యాలు చూస్తున్నారు.
 క్వాలిటీ లైఫ్ కోసం ఒకరు ... జీవితంలో నిలబడడానికి ఒకరు... రికార్డు మారథాన్‌ల కోసం ఒకరు...
 ఇలా పరుగునే జీవితంగా మార్చుకున్నారు.
 హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ ఇవాళ  మారథాన్ నిర్వహిస్తున్న వేళ
 విభిన్నమైన జీవితాల నుంచి వచ్చిన ముగ్గురు మహిళల పరుగు ప్రయాణం గురించి...

 
అస్సాంకు చెందిన కస్తూరికి పరుగు కేవలం హాబీ. పుణే నుంచి వచ్చిన అపర్ణది జీవన్మరణ పోరాటం. హైదరాబాద్‌వాసి యాభెరైండేళ్ల పద్మది అధిక బరువు తగ్గాలనే చిన్న కోరిక. అక్కడి కోచ్ సలహాతో రన్‌ను ఓ సాహసంలా మొదలు పెట్టారు. రెండేళ్లు తిరక్కుండానే ఆమె ఇండియా, ఇండోనేషియాల్లో 12 హాఫ్ మారథాన్‌లను పూర్తి చేశారు. ఇప్పుడామె లక్ష్యం పరుగెడుతూ ఉండడమే. సునీతకు కొత్త ప్రదేశాలను చూడడం, ఫొటోగ్రఫీ ఇష్టం. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం, సామాజికంగా చైతన్యం తీసుకురావడం ఆమె అభిలాష. స్నేహితులతో హిమాలయాల్లో చేసిన ట్రెక్కింగ్ ఆమెను మారథాన్ వైపు మళ్లించింది. హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ నిర్వహిస్తున్న సామాజిక పరుగు ఉద్యమంలో పాల్గొనే వారిలో ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం.
 
ఆరేళ్ళక్రితం ముప్ఫై తొమ్మిదేళ్ళ వయసులో పరుగు ప్రారంభించిన సునీతకు ఇప్పుడు 45 ఏళ్లు. ఈ ఆరేళ్లలో 30 ఫుల్ మారథాన్‌లు, పది హాఫ్ మారథాన్‌లు చేశారు. వీటితోపాటు బెంగళూరులో 50 కి.మీ రేస్, న్యూజిలాండ్‌లో 100 కి.మీ రేస్‌లోనూ పాల్గొన్నారు. భారత్ నుంచి  పాల్గొన్న ఏకైక మహిళ ఆమె.
 
ఈ పరుగు ఎవరెస్టుకి తొలిమెట్టు!

ఈ ఏడాది హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ నిర్వహిస్తున్న మారథాన్ నాలుగోది. ఈ రన్‌లో పాల్గొనడం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి మొదటి మెట్టు అవుతుందంటారు పుణే నుంచి వచ్చిన అపర్ణ. ఆమెకు 44 ఏళ్ళు. ఎముకలను తినేసే వ్యాధితో బాధపడిన ఆమె ఎవరి మీదా ఆధారపడకుండా సొంత కాళ్ల మీద నిలబడాలనే తపనతోనే పరుగును ఓ యజ్ఞంలా చేస్తున్నారు. వీల్ చెయిర్‌కే పరిమితం కావాల్సిన జీవితాన్ని ఆమె పట్టుదలతో ట్రాక్‌లోకి తెచ్చుకున్నారు.

గత ఏడాది మే నెల నుంచి మారథాన్‌లలో ఆమె పాల్గొంటున్నారు. ఆమెకిది నాలుగో మారథాన్. ‘‘ఇప్పటి వరకు అన్నీ హాఫ్ మారథాన్‌లే. వచ్చే ఏడాది జనవరిలో ముంబయిలో ఫుల్ మారథాన్‌లో పాల్గొంటాను. నా లక్ష్యం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం. హైదరాబాద్‌లో నేల ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఈ నేల మీద పరిగెట్టిన అనుభవం హిమాలయాల అధిరోహణకు దోహదం చేస్తుందనే ఇక్కడికి వచ్చాను’’ అన్నారామె.

ఈ పరుగు తన ఆరోగ్యాన్ని కాపాడడమే కాక మానసిక స్థయిర్యాన్ని పెంచింది, కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలుగుతున్నారు. హాఫ్ మారథాన్‌ను రెండు గంటల పద్దెనిమిది నిమిషాల్లో పూర్తి చేసిన ఆమె... ఈ నేల మీద ఎంత సమయం పడుతుందో చూడాలంటున్నారు. నిజానికి ఆమె హాఫ్ మారథాన్ పూర్తి చేసిన సమయం సాధారణమైన వ్యక్తులు తీసుకునే సమయం కంటే తక్కువే. ఆమె ఇద్దరు కూతుళ్లు, కొడుకు తల్లిని చూసి స్ఫూర్తి పొందుతున్నారు. ఇంతకంటే కావల్సింది ఏముంది- అంటారామె.
 
మారిన జీవన శైలి!
 
ఇప్పటికి 12 హాఫ్ మారథాన్‌లు పూర్తి చేసిన పద్మ రెండు నెలల్లో 15 కిలోలు తగ్గారు. అప్పట్లో నాలుగ్గంటల నిద్రపోవడమే కష్టమయ్యేది, ఇప్పుడు ఏడు గంటల పాటు చక్కగా నిద్రపోగలుగుతున్నానంటారామె. అందరూ బృందంగా పరుగు పెట్టడం వల్ల సానుకూల ఆలోచనలు పెరుగుతాయంటారామె. ఆమె ఈ పరుగులో పాల్గొనడానికి రిలయెన్స్‌లో పని చేసే తన ఉద్యోగులను చైతన్యవంతం చేశారు. ‘‘నేను పొందిన ప్రయోజనాలు నా సహోద్యోగులు కూడా పొందాలనేదే నా తాపత్రయం.

మారథాన్ రన్ ప్రారంభించిన తర్వాత దేహం దానంతట అదే ఆహారపు అలవాట్లను మార్చుకుంది. ఇప్పుడు నూనెపదార్థాలను చూసినా తినాలపించడం లేదు. పండ్లు తినాలనే కోరిక పెరుగుతోంది. నీళ్లు తాగాలనే కోరిక కూడా ఎక్కువైంది. దేహమే అలా కోరుకుంటోంది. అంతకంటే పెద్ద విషయం మానసిక సమతుల్యత బాగా ఎక్కువైంది’’ అంటారామె. అలాంటి వారిలో వైశాలి, సయూరి దల్వీ లాంటి ఎందరో ఉన్నారు. ఐఐటి ప్రొఫెసర్ల నుంచి బ్యాంకింగ్ ఉన్నతోద్యోగుల వరకు వివిధ రంగాల వాళ్లు, ముఖ్యంగా మహిళలు మారథాన్‌లో పాల్గొంటున్నారు.

ఇంతటి సుదీర్ఘమైన పరుగులో పాల్గొంటున్న ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకమైన కారణం ఉన్నప్పటికీ అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట మాత్రం... ‘పరుగుతో దేహం, మెదడు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఎంతటి ఒత్తిడులనైనా తట్టుకుని వాటిని సమగ్రంగా నిర్వర్తించగలిగిన మనోనిశ్చలత్వం వచ్చింది. చీకాకులు దరి చేరడం లేదు. మనసు ఆహ్లాదంగా ఉంటోంది’ అని మాత్రమే. నిజమే! పరుగెత్తితే... పాలు తాగకపోయినా దేహం కోరినన్ని నీళ్లు తాగవచ్చు. అదే గొప్ప ఆరోగ్యం, ఆనందం.
 
- వాకా మంజులారెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement