quality of life
-
అనారోగ్య అగ్రరాజ్యం.. బయటపడిన అమెరికా డొల్లతనం
అమెరికా అనగానే మనలో చాలామంది పులకించిపోతారు. అది అకారణమైనా సకారణమైనా అగ్ర రాజ్యాన్ని బలంగా నమ్ముతారు. అందుకు కొన్ని సత్యాలు, కొన్ని అర్ధసత్యాలు, మరిన్ని అసత్యాలు కారణం కావచ్చు. అలాంటి దేశాన్ని ‘అనారోగ్య దేశం’ అనటం నమ్మశక్యం కాదు. అంతగా దాని ప్రతిష్ఠ నెలకొని ఉంది. అయితే అక్కడ కొన్ని అంశాల్లో ప్రగతి తక్కువేమీ కాదు. వాటిలో జీవన ప్రమాణాలు పెరగడం, ఎక్కువ మందికి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటం, పొగత్రాగడం తగ్గటం, వివాహపూర్వ గర్భిణీలు తగ్గడం, జాతుల మధ్య వివక్ష అంతరాలు తగ్గడం లాంటివి ముఖ్యమైనవి. వీటిని పరిశీలించినప్పుడు సాధారణంగా ఆశావహ అంచనాతో అమెరికా అన్ని విధాలా ఆరోగ్యకరమైన దిశగా పయనిస్తోంది అనుకుంటాము. కానీ గత రెండు దశాబ్దాల పరిణామాలను నిశితంగా గమనిస్తే వీటిలో వాస్తవం ఉన్నట్లు కనిపించదు. కోవిడ్–19 నేపథ్యంలో బయటపడిన అమెరికా డొల్లతనం, ఇటీవలి ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ లోని గణాంక వివరాలు ఇందుకు తార్కాణం. అమెరికాలో శిశుమరణాలు ఆందోళనకరంగానే ఉన్నాయి. 2019లో కోవిడ్–19 ముందు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో– ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) దేశాల్లో అమెరికా స్థానం చాలా దేశాల కన్నా ఈ విషయంలో అథమ స్థితిలో ఉంది. అమెరికన్ల జీవన ప్రమాణం జర్మనీ కన్నా 2.5 ఏళ్లు, కెనడా కన్నా 3.2 ఏళ్లు, ఫ్రాన్స్ కన్నా నాలుగు సంవత్సరాలు తక్కువగా ఉంది. యూరో పియన్ యూనియన్, ఆసియాకు చెందిన ఓఈసీడీ దేశాల్లోకన్నా తక్కువగా... 33వ స్థానంలో ఉంది. కోవిడ్ మృత్యుహేల అమెరికాలోని పరిస్థితులను మరింత దిగజార్చింది. కోవిడ్ మరణాలు అన్ని సంపన్న దేశాల్లో కన్నా అక్కడ ఎక్కువగా నమోద య్యాయి. అమెరికాలో ప్రతి లక్ష మందికి 332 మరణాలు సంభవించగా ఫ్రాన్స్‌లో ఇవి 240, జర్మనీలో 194, కెనడాలో 128. అలాగే అమెరికాలో జీవన ప్రమాణం 2021లో 76.4కి పడిపోయింది. ఇది 1996 తర్వాత అతి తక్కువ. దీనితో అక్కడ ఓ పాతిక సంవత్సరాల ప్రగతి తుడిచిపెట్టుకు పోయినట్లయింది. ఇదే సమయంలో అక్కడ మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుదల మరో రకపు ప్రతికూలత సూచిస్తోంది. అక్కడి పౌర సమాజంలో అధిక సంఖ్యాకులలో గల ఊబకాయం అనేక రకాల రుగ్మతలకు కారణంగా పరిగణిస్తున్నారు. జీవన ప్రమాణాలు ఉండవలసిన స్థాయిలో ఉండకపోవడానికి ఇదొక కారణంగా పేర్కొంటున్నారు. 2000 నుండి 2020 సంవత్సరం వరకూ ఊబకాయులు 30.5 శాతం నుండి 41.9 శాతానికి పెరిగారు. ఊబకాయం అనేక వ్యాధులకు కారకం. వాటిలో ముఖ్యమైనది చక్కెర వ్యాధి. మొత్తంగా అమెరికాలోని ఈ పరిస్థితులను గమనించినప్పుడు... అక్కడి గొప్పదైన సంపద, వైద్య సాంకేతికత, అత్యంత ఎక్కువ ఆరోగ్య సంరక్షణ తలసరి వ్యయం, ప్రజారోగ్య వ్యవస్థ వంటి సమస్తం సంక్షోభంలో ఉండి అత్యంత పేలవంగా పనితీరు కనపరుస్తూ ఉన్నట్లు స్పష్టమౌతుంది. మెరిసేదంతా బంగారం కాదనే నానుడిని అమెరికా ప్రస్తుత పరిస్థితి నిరూపిస్తోంది. (క్లిక్ చేయండి: జీవ వైవిధ్యం రక్షణ లక్ష్యాలు నెరవేరేనా?) – బి. లలితానంద ప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ -
ప్రపంచంలో ఉత్తమ, చెత్త నగరాలివే
లండన్: అత్యున్నత జీవన ప్రమణాలు కలిగివున్న నగరాల జాబితాలో ఆస్ట్రియా రాజధాని వియన్నా మొదటిస్థానంలో నిలిచింది. ప్రముఖ కన్సల్టెంట్ సంస్థ మెర్సర్.. ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో అభిప్రాయసేకరణ నిర్వహించి వెల్లడించిన జాబితాలో వియన్నా వరుసగా ఎనిమిదోసారి అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ జాబితాలో అత్యంత చెత్తనగరంగా బాగ్దాద్ చివరిస్థానంలో నిలిచింది. రాజకీయ స్థిరత్వం, ఆరోగ్య సంరక్షణ, విద్య, క్రైమ్, వినోదం మరియు రవాణా ప్రమాణాలు లాంటి విషయాలను పరిగణలోకి తీసుకొని మెర్సర్ ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో లండన్, పారిస్, టోక్యో, న్యూయార్క్ నగరాలు టాప్ 30లో కూడా చోటు దక్కించుకోలేకపోవడం గమనార్హం. వియన్నాతో పాటు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్, న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్, జర్మనీలోని మ్యూనిచ్, కెనడాలోని వాంకోవర్లు వరుసగా టాప్ 5లో నిలిచాయి. ఆసియా నుంచి అగ్రస్థానంలో సింగపూర్(25వ ర్యాంకు) నిలిచింది. అమెరికా నుంచి ఈ జాబితాలో టాప్‌లో నిలిచిన నగరం శాన్ఫ్రాన్సిస్కో(29వ ర్యాంకు). -
జీవితానికి రన్‌వే...
వంద మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది... ఇదే నానుడితో నడక మొదలు పెట్టారీ మహిళలు. ఆ నడకను కాస్తా పరుగుగా మార్చి, సుదీర్ఘమైన పరుగుతో జీవితంలో కొత్త లక్ష్యాలు చూస్తున్నారు. క్వాలిటీ లైఫ్ కోసం ఒకరు ... జీవితంలో నిలబడడానికి ఒకరు... రికార్డు మారథాన్ల కోసం ఒకరు... ఇలా పరుగునే జీవితంగా మార్చుకున్నారు. హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ ఇవాళ మారథాన్ నిర్వహిస్తున్న వేళ విభిన్నమైన జీవితాల నుంచి వచ్చిన ముగ్గురు మహిళల పరుగు ప్రయాణం గురించి... అస్సాంకు చెందిన కస్తూరికి పరుగు కేవలం హాబీ. పుణే నుంచి వచ్చిన అపర్ణది జీవన్మరణ పోరాటం. హైదరాబాద్‌వాసి యాభెరైండేళ్ల పద్మది అధిక బరువు తగ్గాలనే చిన్న కోరిక. అక్కడి కోచ్ సలహాతో రన్‌ను ఓ సాహసంలా మొదలు పెట్టారు. రెండేళ్లు తిరక్కుండానే ఆమె ఇండియా, ఇండోనేషియాల్లో 12 హాఫ్ మారథాన్లను పూర్తి చేశారు. ఇప్పుడామె లక్ష్యం పరుగెడుతూ ఉండడమే. సునీతకు కొత్త ప్రదేశాలను చూడడం, ఫొటోగ్రఫీ ఇష్టం. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం, సామాజికంగా చైతన్యం తీసుకురావడం ఆమె అభిలాష. స్నేహితులతో హిమాలయాల్లో చేసిన ట్రెక్కింగ్ ఆమెను మారథాన్ వైపు మళ్లించింది. హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ నిర్వహిస్తున్న సామాజిక పరుగు ఉద్యమంలో పాల్గొనే వారిలో ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. ఆరేళ్ళక్రితం ముప్ఫై తొమ్మిదేళ్ళ వయసులో పరుగు ప్రారంభించిన సునీతకు ఇప్పుడు 45 ఏళ్లు. ఈ ఆరేళ్లలో 30 ఫుల్ మారథాన్లు, పది హాఫ్ మారథాన్లు చేశారు. వీటితోపాటు బెంగళూరులో 50 కి.మీ రేస్, న్యూజిలాండ్‌లో 100 కి.మీ రేస్‌లోనూ పాల్గొన్నారు. భారత్ నుంచి పాల్గొన్న ఏకైక మహిళ ఆమె. ఈ పరుగు ఎవరెస్టుకి తొలిమెట్టు! ఈ ఏడాది హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ నిర్వహిస్తున్న మారథాన్ నాలుగోది. ఈ రన్లో పాల్గొనడం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి మొదటి మెట్టు అవుతుందంటారు పుణే నుంచి వచ్చిన అపర్ణ. ఆమెకు 44 ఏళ్ళు. ఎముకలను తినేసే వ్యాధితో బాధపడిన ఆమె ఎవరి మీదా ఆధారపడకుండా సొంత కాళ్ల మీద నిలబడాలనే తపనతోనే పరుగును ఓ యజ్ఞంలా చేస్తున్నారు. వీల్ చెయిర్‌కే పరిమితం కావాల్సిన జీవితాన్ని ఆమె పట్టుదలతో ట్రాక్‌లోకి తెచ్చుకున్నారు. గత ఏడాది మే నెల నుంచి మారథాన్లలో ఆమె పాల్గొంటున్నారు. ఆమెకిది నాలుగో మారథాన్. ‘‘ఇప్పటి వరకు అన్నీ హాఫ్ మారథాన్‌లే. వచ్చే ఏడాది జనవరిలో ముంబయిలో ఫుల్ మారథాన్‌లో పాల్గొంటాను. నా లక్ష్యం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం. హైదరాబాద్‌లో నేల ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఈ నేల మీద పరిగెట్టిన అనుభవం హిమాలయాల అధిరోహణకు దోహదం చేస్తుందనే ఇక్కడికి వచ్చాను’’ అన్నారామె. ఈ పరుగు తన ఆరోగ్యాన్ని కాపాడడమే కాక మానసిక స్థయిర్యాన్ని పెంచింది, కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలుగుతున్నారు. హాఫ్ మారథాన్‌ను రెండు గంటల పద్దెనిమిది నిమిషాల్లో పూర్తి చేసిన ఆమె... ఈ నేల మీద ఎంత సమయం పడుతుందో చూడాలంటున్నారు. నిజానికి ఆమె హాఫ్ మారథాన్ పూర్తి చేసిన సమయం సాధారణమైన వ్యక్తులు తీసుకునే సమయం కంటే తక్కువే. ఆమె ఇద్దరు కూతుళ్లు, కొడుకు తల్లిని చూసి స్ఫూర్తి పొందుతున్నారు. ఇంతకంటే కావల్సింది ఏముంది- అంటారామె. మారిన జీవన శైలి! ఇప్పటికి 12 హాఫ్ మారథాన్లు పూర్తి చేసిన పద్మ రెండు నెలల్లో 15 కిలోలు తగ్గారు. అప్పట్లో నాలుగ్గంటల నిద్రపోవడమే కష్టమయ్యేది, ఇప్పుడు ఏడు గంటల పాటు చక్కగా నిద్రపోగలుగుతున్నానంటారామె. అందరూ బృందంగా పరుగు పెట్టడం వల్ల సానుకూల ఆలోచనలు పెరుగుతాయంటారామె. ఆమె ఈ పరుగులో పాల్గొనడానికి రిలయెన్స్‌లో పని చేసే తన ఉద్యోగులను చైతన్యవంతం చేశారు. ‘‘నేను పొందిన ప్రయోజనాలు నా సహోద్యోగులు కూడా పొందాలనేదే నా తాపత్రయం. మారథాన్ రన్ ప్రారంభించిన తర్వాత దేహం దానంతట అదే ఆహారపు అలవాట్లను మార్చుకుంది. ఇప్పుడు నూనెపదార్థాలను చూసినా తినాలపించడం లేదు. పండ్లు తినాలనే కోరిక పెరుగుతోంది. నీళ్లు తాగాలనే కోరిక కూడా ఎక్కువైంది. దేహమే అలా కోరుకుంటోంది. అంతకంటే పెద్ద విషయం మానసిక సమతుల్యత బాగా ఎక్కువైంది’’ అంటారామె. అలాంటి వారిలో వైశాలి, సయూరి దల్వీ లాంటి ఎందరో ఉన్నారు. ఐఐటి ప్రొఫెసర్ల నుంచి బ్యాంకింగ్ ఉన్నతోద్యోగుల వరకు వివిధ రంగాల వాళ్లు, ముఖ్యంగా మహిళలు మారథాన్‌లో పాల్గొంటున్నారు. ఇంతటి సుదీర్ఘమైన పరుగులో పాల్గొంటున్న ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకమైన కారణం ఉన్నప్పటికీ అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట మాత్రం... ‘పరుగుతో దేహం, మెదడు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఎంతటి ఒత్తిడులనైనా తట్టుకుని వాటిని సమగ్రంగా నిర్వర్తించగలిగిన మనోనిశ్చలత్వం వచ్చింది. చీకాకులు దరి చేరడం లేదు. మనసు ఆహ్లాదంగా ఉంటోంది’ అని మాత్రమే. నిజమే! పరుగెత్తితే... పాలు తాగకపోయినా దేహం కోరినన్ని నీళ్లు తాగవచ్చు. అదే గొప్ప ఆరోగ్యం, ఆనందం. - వాకా మంజులారెడ్డి