- పీపుల్స్ ప్లాజా నుంచి బాలయోగి స్టేడియం వరకు
- 20 వేల మందికి పైగా రన్నర్స్ పాల్గొనే అవకాశం
- మారథాన్‌ను ప్రారంభించనున్న కేటీఆర్
- పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక హైదరాబాద్ మారథాన్‌కు సర్వం సిద్ధమైంది. ప్రజల్లో సమైక్యతా భావాన్ని, సామాజిక దృక్పథాన్ని, ఆరోగ్య స్పృహను పెంపొందించే లక్ష్యంతో తలపెట్టిన ఈ మారథాన్‌ను ఆదివారం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ రన్నర్స్‌తోపాటు వేలాది మంది హైదరాబాదీలు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు పాల్గొనే ఈ వేడుకకు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై పరుగును ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ వేడుకల్లో నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పాల్గొంటారు.
జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహించే మారథాన్ ముగింపు కార్యక్రమంలో సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ మారథాన్ రేస్ డైరెక్టర్ అభిజీత్ మధ్నూకర్ పాల్గొంటారు. కార్పొరేట్ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ నిపుణులతో పాటు సుమారు 20 వేల మంది యువతీ, యువకులు మారథాన్‌లో పాలుపంచుకోనున్నారు. జీవితాన్ని ఉత్తేజితం చేసే, ఉత్సాహభరితంగా మార్చే ఈ పోటీల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని ప్రజల్లో స్ఫూర్తి నింపనున్నారు. అలాగే తాము ఎంచుకున్న రంగాల్లో విజయం సాధించిన విజేతలు, నిజజీవిత హీరోలు మారథాన్‌కు సరికొత్త సొబగులు అద్దనున్నారు.
మరోవైపు 40కి పైగా స్వచ్ఛంద సంస్థలు తమ లక్ష్యాలను మారథాన్ ద్వారా ప్రజలకు తెలియజేయనున్నాయి. అలాగే పలు రంగాల్లో సేవలందజేస్తున్న స్వచ్ఛంద సంస్థల సందేశాన్ని తెలుపుతూ పలువురు రన్నర్స్ మారథాన్‌లో ప్లకార్డులను ప్రదర్శిస్తారు. మారథాన్‌లో గెలుపొందే స్త్రీ, పురుషులకు మూడు విభాగాల నుంచి రూ.7.2 లక్షల ప్రైజ్‌మనీని అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరోవైపు మారథాన్ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
మూడు విభాగాల్లో మారథాన్..
మారథాన్‌లో రకరకాల ఈవెంట్స్ ఉంటాయి. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కే రన్‌గా మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. మొదట 42.2 కి.మీ. ఫుల్ మారథాన్ ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది. పీపుల్స్ ప్లాజా వద్ద మంత్రి కేటీఆర్ దీనిని ప్రారంభిస్తారు.
ఫుల్ మారథాన్ సాగేదిలా..
పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమయ్యే ఫుల్ మారథాన్.. ఎన్టీఆర్ రోడ్, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, రాజ్‌భవన్ రోడ్, పంజాగుట్ట ఫ్లైఓవర్, బంజారాహిల్స్ రోడ్–2, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, జూబ్లీహిల్స్ రోడ్–36, మాదాపూర్ పోలీస్‌స్టేషన్, సైబర్‌టవర్స్, మైండ్‌స్పేస్ సర్కిల్, బయోడైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, త్రిపుల్‌ఐటీ జంక్షన్, విప్రో సర్కిల్, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి జంక్షన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీదుగా జీఎంసీ బాలయోగి స్టేడియానికి చేరుకుని అక్కడ ముగుస్తుంది.
హాఫ్ మారథాన్ దారి ఇదీ..
ఇక 21.1 కి.మీ. మేర సాగే హాఫ్ మారథాన్ ఉదయం 6 గంటలకు పీపుల్స్‌ప్లాజా వద్ద ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, రాజ్‌భవన్ రోడ్, పంజాగుట్ట ఫ్లైఓవర్, బంజారాహిల్స్ రోడ్–2, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, జూబ్లీహిల్స్ రోడ్–36, మాదాపూర్ పోలీస్‌స్టేషన్, సైబర్‌టవర్స్, మైండ్‌స్పేస్ సర్కిల్, బయోడైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, త్రిపుల్‌ఐటీ జంక్షన్ నుంచి బాలయోగి స్టేడియానికి చేరుకుని ముగుస్తుంది.
హైటెక్స్ నుంచి 10 కె రన్..
హైటెక్స్ ఎక్స్‌పో గ్రౌండ్ వద్ద ఉదయం 7 గంటలకు 10కె రన్ ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి సైబర్‌టవర్స్, మైండ్‌స్పేస్ సర్కిల్, బయోడైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఐఐఐటీ జంక్షన్ మీదుగా బాలయోగి స్టేడియానికి చేరుకుంటుంది.