– మారథాన్ రన్నర్ కవితారెడ్డి
పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలతోనే స్త్రీ జీవనం గడిచిపోతుంది. రొటీన్‌లో తన మనుగడ ప్రశ్నార్థకం అవుతుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంటుంది. జీవనశైలిని మార్పుకోవాలన్న ఒకే ఒక ఆలోచనతో ఇండియా ఫాస్టెస్ట్ ఔతాహ్సిక మారథానర్‌గా తనకై తాను ఓ గుర్తింపును సాధించారు కవితారెడ్డి.
50 ఏళ్ల వయసులో ఆరు ప్రపంచ మారథాన్‌లను పూర్తిచేసి స్టార్ మెడల్స్‌ను సొంతం చేసుకున్నారు. ప్రపంచ మారథాన్ ల చరిత్రలో అత్యంత వేగవంతమైన భారతీయ మహిళా రన్నర్‌గా నిలిచారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో మారథాన్ రన్స్‌లో పాల్గొంటున్న కవితారెడ్డి ‘మన మైండ్, బాడీ చురుగ్గా ఉండాలంటే ముందు ఏదైనా క్రీడలలో పాల్గొనాలి’ అంటూ ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నారు.
‘‘మన దేశంలో మహిళలు బయటకు వచ్చి, రన్స్‌లో పాల్గొడం తక్కువే. వారిని ఎంకరేజ్ చేయడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. పుట్టి పెరిగింది అనంతపూర్. డిగ్రీ పూర్తవుతూనే పెళ్లి, కుటుంబ బాధ్యతలు. ఎప్పుడూ క్రీడల్లో పాల్గొనలేదు. నలభైఏళ్ల వరకు గృహిణిగా, ఇద్దరు అబ్బాయిల పెంపకం, కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుంటూ వచ్చాను.
వయసు పెరుగుతున్నప్పుడు జీవనశైలి సరిగా లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే, కొన్ని మార్పులు చేసుకోవాలనుకుని, పదేళ్ళక్రితం జిమ్‌లో చేరాను. కొన్నిరోజులు ఇబ్బందే అనిపించింది. కానీ, అదే సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. స్నేహితుల ద్వారా మారథాన్‌ల గురించి తెలిసింది.
అలా జిమ్‌తో పాటు పదేళ్ల క్రితమే మారథాన్ జర్నీ స్టార్ట్ అయ్యింది. మా వారు దీపక్‌రెడ్డి ఉద్యోగరీత్యా హైదరాబాద్, బెంగళూరు, ముంబయ్, పుణెలలో నివసిస్తూ వచ్చాం. అలాగే, ఎక్కడ మారథాన్ జరిగినా పాల్గొంటూ వచ్చాను. మారథాన్‌లు నా జీవన విధానాన్నే మార్చాయి. వాటిల్లో ఎంజాయ్ చేయడమే పెరిగింది. దీంతో అదే ΄్యాషన్‌గా మారింది.
సొంత గుర్తింపు
కూతురు, భార్య, తల్లి.. సమాజం మనకో గుర్తింపునిస్తుంది. కానీ, మనకంటూ ఓ సొంత గుర్తింపును సాధించుకోవాలి. అందుకు ఏదో ఒక యాక్టివిటీని ఏర్పరుచుకోవాలి. గృహిణిగా, అమ్మగా గుర్తింపు ఉన్న నాకు ఇప్పుడు ‘మారథాన్ రన్నర్ కవితారెడ్డి’ అంటూ మరో గుర్తింపు వచ్చింది. ఈ ప్రయాణంలో ఎంతోమంది పరిచయం అయ్యారు. కాన్ఫిడెన్స్‌తోపాటు జీవనశైలిలోనూ మంచి మార్పులు వచ్చాయి.
మద్దతు అవసరం
మహిళలు మారథాన్‌లో పాల్గొనడానికి మన దగ్గర ఇంకా అంత ప్రోత్సాహం లేదనే చెప్పవచ్చు. తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ, ఇరుకు రోడ్లు, సౌకర్యాలు కూడా తక్కువే. విదేశాలలో మారథాన్ అంటే సిటీ మొత్తం ఒక పండగలా జరుగుతుంది. స్త్రీ–పురుష తేడా లేకుండా ఎంతోమంది వచ్చి హుషారుగా పాల్గొంటారు. సామాజికంగానూ ఇది ఐక్యతను సూచిస్తుంది. ఒక తెలియని ఎనర్జీ మనలోకి వచ్చేస్తుంది. దీనివల్ల చేయాలనుకున్న పనుల్లో వేగం కూడా ఉంటుంది.
శిక్షణ తప్పనిసరి
ముందు మనకోసం సొంతంగా ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు కుటుంబం నుంచి అంతగా సపోర్ట్ రాకపోవచ్చు. కానీ, పరిస్థితులలో మంచి మార్పులు వచ్చాయి. నేడు మన జీవన విధానంలో ఆహారం, చేస్తున్న పనులకు ఏ మాత్రం ΄÷ంతన లేదు. అందుకే, మహిళలు తప్పనిసరిగా వ్యాయామాలు ఒక అలవాటుగా చేసుకోవాలి.
ఏడాదికి రెండు మూడు హాఫ్ మారథాన్‌లలో పాల్గొంటుంటాను. ఆ తర్వాత ఫుల్ మారథాన్ ఉంటుంది. సాధారణంగా ఫుల్ మారథాన్‌లనే కౌంట్ చేస్తుంటారు. అందరూ ఆ డిస్టెన్స్‌లో పాల్గొనలేరు. అందుకని హాఫ్ మారథాన్‌లు, 5కె, 10కె రన్‌లు జరుగుతుంటాయి. రాబోయే ఫిబ్రవరిలో చండీగఢ్‌లోహాఫ్ మారథాన్ ఉంది. దానికి శిక్షణ తీసుకుంటున్నాను’ అని వివరించారు ఈ మారథాన్ రన్నర్.
అడ్డంకులను అధిగమిస్తూ..
ఎవరెస్ట్ బేస్ క్యాంప్, అంతకుముందు అంటార్కిటికా ఐస్ మారథాన్‌లు రెండు అత్యంత కష్టమైనవే. బోస్టన్‌లో పాల్గొన్న మారథాన్‌లో అయితే బలమైన ఈదురుగాలులు, వర్షం.. అత్యంత దారుణమైన వాతావరణ పరిస్థితులు. అయినా, 42.21 కి.మీ మారథాన్‌ని పూర్తి చేయాలి. లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆలోచన అడ్డంకులను అధిగమించేలా చేసింది. 3.05 గంటలలో లక్ష్యాన్ని చేరుకున్నా. ప్రకృతి విసిరే సవాళ్లను తట్టుకోవడానికి మహిళలే ముందుంటారు. పదేళ్లపాటు చేస్తున్న ఈ జర్నీలో ఇండియాతో పాటు న్యూయార్క్, లండన్, చికాగో, బెర్లిన్, బోస్టన్ – టోక్యోలలో జరిగిన ఆరు ఫుల్ మారథాన్‌లలో పాల్గొన్నాను. మెడల్స్ ΄÷ందాను. నన్ను చూసి మారథాన్‌లలో పాల్గొన్న మహిళలు చాలామంది ఉన్నారు.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment