6 రోజులు .. 680 కిలోమీటర్ల పరుగు
ఆమె ఖాతాలో అనేక రేస్‌లు పూర్తి చేసిన రికార్డులు ఉన్నాయి. భారతదేశపు అగ్రశ్రేణి అల్ట్రా రన్నర్‌గా పేరొందింది. పేరు మీనల్ కొటక్, గుర్గావ్‌వాసి.ఇటీవల 680కి పైగా కిలోమీటర్ల పరుగును 6 రోజుల్లో అంటే 144 గంటల్లో కవర్ చేసి సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది. తనను తాను మెరుగుపరుచుకోవాలనే సంకల్పంతో అల్ట్రారన్‌లలో పాల్గొంటున్నాను అని చెబుతోంది మీనల్ కొటక్.
‘‘పురుషుల రికార్డ్ ఇప్పటి వరకు 574.5 కిలోమీటర్ల ఉంటే, నా రికార్డ్ 680 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసింది. మిగతావారికంటే ఉన్నతంగా ఉండేలా నన్ను నేను మెరుగుపరుచుకోవాలన్నదే నా సంకల్పం. కిందటేడాది అమెరికాలోని మిల్వాకీలో జరిగిన అల్ట్రామారథాన్‌లో భారతదేశం తరపున పాల్గొన్న మల్టీ డే రికార్డ్ అసాధారణమైంది. ఇటీవల జరిగిన ఆరు రోజుల ఈవెంట్‌లోనూ నేనే ముందున్నాను.
ఈ రేసుతో ఆసియాలో టాప్ 5 యాక్టివ్ రన్నర్‌గా, ప్రపంచంలో టాప్ 12 యాక్టివ్ 6–డే ఉమెన్ అల్ట్రారన్నర్‌లలో ఒకరిగా ఉన్నాను. నా మనుగడ కోసం మొండిగా పోరాడతాను. సుదీర్ఘమైన చలి, ఒంటరితనం దేనినీ లెక్కచేయను. చాలా కఠినమైన సాధన. నా ఎమోషన్స్ అన్నీ సమం చేసుకుంటూ ప్రయత్నం చేశాను. చివరకు నా సంకల్పం మనసు, శరీరంపై గెలిచింది. మార్చిన పరుగు
2014లో ఒక ట్రెడ్‌మిల్ పరుగు నా రన్నింగ్ సామర్థ్యాన్ని, శక్తిని గ్రహించేలా చేసింది. నా బలాన్ని గుర్తించిన సరైన వ్యక్తుల సహాయంతో ఢిల్లీ హాఫ్ మారథాన్‌లో పరుగెత్తాను. 34 సంవత్సరాల వయసులో వృత్తిపరమైన రన్నింగ్ అనుభవం లేకుండా పాల్గొన్న ఆ మారథాన్ నా జీవిత గమనాన్ని మార్చింది. ఆ సమయంలోనే మహిళా అల్ట్రారన్నర్‌లు చాలా తక్కువ మంది ఉన్నారని తెలిసి, ఆసక్తి కలిగింది. మారథాన్‌లకు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించి, చరిత్ర సృష్టించాలనుకున్నాను. 2017లో 24 గంటల పరుగు విభాగంలో భారతదేశం నుంచిప్రాతినిధ్యం వహించాను. అక్కడ నుంచి అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నా సామర్థ్యాన్ని గుర్తించింది. వారు నాకున్న రికార్డులన్నీ పరిశీలించారు. అలా 2017లో బెల్‌ఫాస్ట్‌లో తొలిసారిగా భారతదేశానికిప్రాతినిధ్యం వహించాను. ఆ తర్వాత 2018లో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాను.
డిప్రెషన్ నుంచి కోలుకొని...
2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో దేశానికిప్రాతినిధ్యం వహించడానికి కొంత కాలానికి ముందు కాలికి తీవ్ర గాయమైంది. అనేక కారణాల వల్ల డిప్రెషన్ బారిన పడ్డాను. నా కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో బెడ్‌రెస్ట్‌లో ఉండటం వల్ల చాలా బాధపడ్డాను. మొత్తానికి ఆ ఒత్తిడిని జయించి ఇప్పుడు నా 44 ఏళ్ల వయసులో 680 కిలోమీటర్ల పరుగును సాధించేంతగా ఎదిగాను. ఏడాది కిందట అమెరికాలో 72 గంటల్లో 379 కిలోమీటర్లు పరుగును పూర్తి చేశాను. మూడేళ్లుగా ఈ రేసులను ట్రాక్ చేస్తున్నాను. ఇక్కడ ఆటలో మనసు శక్తి ఎంతటిదో తెలుసుకున్నాను.
ప్రణాళికతో దినచర్య
మల్టీడే రేసులు 24 గంటల రేసుల కంటే భిన్నంగా ఉంటాయి. ఒక క్రీడాకారుడు ఇక్కడ రోజుల తరబడి పరిగెత్తడంలో ఎన్నో ప్రణాళికలను అమలు పరచాల్సి ఉంటుంది. దీంతో గతంలోకంటే ఎక్కువ ప్రేరణ, మద్దతు అవసరం అవుతుంది. ఈ రేసులోకి వెళ్లడానికి మొదటి మూడు రోజులు ఆలోచించాను. ఒకసారి శిక్షణ మొదలుపెట్టాక ఇక ప్రణాళికలను అనుసరించేలా నా దినచర్య మారిపోయింది. రన్నింగ్ కోసం మాత్రమే కాదు ఒక రేసర్‌గా మిమ్మల్ని మీరు ఆవిష్కరించు కోవాలంటే పోషకాహారం వంటి అనేక ఇతర అంశాలు ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఒక గంట లేదా రెండు గంటలు నిద్ర, బట్టలు మార్చుకోవడం, ఆహారం తీసుకోవడం, కాళ్లకు బొబ్బలు రాకుండా చూసుకోవడం... వీటన్నింటిపైనా శిక్షణప్రారంభించనప్పటి నుండే శ్రద్ధ వహించాలి. మల్టీ డే రేసింగ్ ఆరోగ్య పోటీగా కూడా మార్చుకోవచ్చు.
ఇప్పటివరకు భారత దేశం నుండి ఏ మహిళ కూడా మల్టీ డే మారథాన్‌లో పాల్గొనలేదు. ఈ విషయం నన్ను ఆలోచించేలా, రికార్డ్‌ను సాధించేలా చేసింది. అల్ట్రారన్ రేస్‌లో మొదటి భారతీయ మహిళను నేనే అవుతానని అనుకోలేదు. మానవ పరిమితులన్నీ అధిగమించడానికి ఒక అడుగు ముందుకు వేసినందుకు సంతోషంగా ఉన్నాను. నా భర్త సచిన్ ఉద్యోగి అయినప్పటికీ నా ముఖ్యమైన రన్నింగ్‌రేసులన్నింటికీ తప్పక హాజరై, నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు’’ తన విజయపరంపరను వెనకాల ఉన్న రహస్యాలను వివరించింది మీనల్ కొటక్.
Comments
Please login to add a commentAdd a comment