
సంసార రథంలో చెరో సగమై...
‘కష్టాల్లో, సుఖాల్లో భర్తకు తోడుగా’ అంటుంటారు. కష్టాలు, సుఖాల్లోనే కాదు... వృత్తిలోనూ భర్తకు తోడూ నీడగా ఉంటుంది జ్యోతి. భర్త డ్రైవర్, భార్య క్లీనర్!
జ్యోతి ఎందుకు క్లీనర్ కావాల్సి వచ్చింది? కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే... లారీ డ్రైవర్ అయిన భర్త శోభనాద్రి దూరప్రాంతాలకు వెళుతుండేవాడు.
ఇదీ చదవండి: ప్రియుడితో మాజీ సీఎం కుమార్తె పెళ్లి : వైభవంగా
‘ఎక్కడ ఉన్నాడో... ఏం తింటున్నాడో’ అని ఎప్పుడూ భర్త గురించి బెంగగా ఉండేది. అందుకు తగ్గట్టే డ్యూటీ దిగి ఇంటికి వచ్చిన భర్త బక్కచిక్కి కనిపించే వాడు.
ఒకరోజు అడిగింది...
‘నేను నీతోపాటే వస్తాను’
‘మరి ఇల్లు?’ అన్నాడు భర్త.
‘బండే మన ఇల్లు’ అన్నది ఆమె. ఇక ఆరోజు నుంచి బండే వారి ఇల్లు, బండే స్వర్గసీమ. లారీ ఎక్కడికి కిరాయికి వెళ్లినా క్లీనర్‌గా జ్యోతి భర్త వెంటే వెళుతుంది. లారీలోనే వంట సామగ్రి ఏర్పాటు చేసుకుని, మార్గ మధ్యంలో భర్తకు అవసరమైన భోజనం, టీ, అల్పాహారం వంటివి ఏర్పాటు చేస్తుంది.

గతంలో దూర ప్రాంతాలకు వెళ్లిన సందర్భాల్లో సరైన భోజనం లేక శోభనాద్రి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. భర్త వెంట వెళితే ఇబ్బందులు ఉండవని జ్యోతి భావించింది. రాత్రి పూట భర్త డ్రైవింగ్ చేస్తుంటే నిద్ర రాకుండా ఉండేందుకు భర్తతో ముచ్చట్లు పెడుతూ అతడిని అప్రమత్తం చేస్తుంటానని చెబుతోంది జ్యోతి. కోళ్ల దాణా, ధాన్యం, బొగ్గు, మొక్కజొన్న వంటివి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు రవాణా చేస్తుంటామని, భార్య తోడు రావడం వల్ల ఇంటి బెంగ కూడా ఉండదని శోభనాద్రి చెబుతున్నాడు.
చదవండి: ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!
‘పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేశాం. బాధ్యతలు తీరిపోయాయి. ఇక మా ఇద్దరి జీవనం ఇలా కలిసిమెలిసి సాగిపోతోంది’ అని భార్యాభర్తలు చెబుతున్నారు. వీరిది ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామం.
జి.వి.వి. సత్యనారాయణ, సాక్షి, కొవ్వూరు