అహ్మదాబాద్: ఒక మహిళను భర్తతో కలిసి నివశించాలని, కాపురం చేయాలని కోర్టులు బలవంతం చేయలేవని గుజరాత్ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కుటుంబ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. అంతేకాకుండా ముస్లిం చట్టం బహుభార్యత్వం అనుమతిస్తోంది కానీ ప్రోత్సహించలేదని, అందువల్ల ఒక వ్యక్తి తొలిభార్య అతనితో కలిసి ఉండేందుకు నిరాకరించవచ్చని కూడా వ్యాఖ్యానించింది. సవతులతో కలిసి జీవించాలని భార్యను బలవంతం చేసే హక్కును భర్తకు ఇవ్వలేదని తెలిపింది.
ఈ సందర్భంగా ఉమ్మడి పౌరస్మృతి ఒక ఆశగా మిగలకూడదన్న ఢిల్లీ హైకోర్టు అభిప్రాయాన్ని గుజరాత్ హైకోర్టు గుర్తు చేసింది. దాంపత్య హక్కులు కేవలం భర్తకు మాత్రమే సొంతమైనవి కాదని జస్టిస్ పార్దివాలా, జస్టిస్ నీరల్ మెహతాల బెంచ్ అభిప్రాయపడింది. ఈ విషయంలో తీర్పు ఇచ్చేముందు భార్య అభిప్రాయాన్ని కుటుంబ కోర్టు తెలుసుకోవాలని సూచించింది. 2010లో పిటిషనర్ మహిళకు ఒక వ్యక్తితో వివాహమైంది. 2015లో వీరికి ఒక కుమారుడు కలిగాడు. నర్సుగా ఆమెను ఆస్ట్రేలియాకు పంపాలన్న భర్తకుటుంబ నిర్ణయంతో వ్యతిరేకించి 2017లో ఆమె అత్తింటి నుంచి బయటకు వచ్చింది. దీనిపై భర్త కుటుంబ కోర్టును ఆశ్రయించగా కాపురానికి వెళ్లాలని ఆమెను కోర్టు ఆదేశించింది. దీనిపై ఆ మహిళ హైకోర్టుకు వెళ్లింది. విచారణ జరిపిన కోర్టు బలవంతంగా కాపురం చేయించడం జరగదని తేల్చిచెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment