∙ఇస్లాం వెలుగు
అల్లాహ్ స్త్రీలపై పురుషులకు కొంత ఆధిక్యత ప్రసాదించడం వల్ల, పురుషులు తమ సంపదను స్త్రీల కోసం ఖర్చు పెడుతున్నందువల్ల పురుషులు స్త్రీలపై వ్యవహార కర్తలవుతారు. కనుక సుగుణవతులైన స్త్రీలు తమ భర్తకు విధేయత చూపుతూ వారి కనుసన్నలలో నడుచుకుంటారు. పురుషులు (ఇంటిపట్టున) లేనప్పుడు దేవుని రక్షణలో వారి హక్కులు కాపాడుతుంటారు. మీ మాటలకు ఎదురు చెప్పి తిరగబడతారని భయం ఉన్న స్త్రీలకు (నయానా భయానా) నచ్చజెప్పండి. (అలా దారికి రాకపోతే) వారిని మీ పడకల నుండి వేరు చేయండి. ఆ తరువాత వారు మీకు విధేయులయిపోతే ఇక వారిని అనవసరంగా వేధించడానికి సాకులు వెతకకండి. పైన అందరికంటే అధికుడు, అత్యున్నతుడైన అల్లాహ్ ఉన్నాడని గుర్తుంచుకోండి.
భార్యాభర్తల మధ్య సంబంధాలు చెడిపోతాయని భయం ఉంటే భర్త బంధువుల నుండి ఒక మధ్యవర్తిని భార్య బంధువుల నుండి ఒక మధ్యవర్తిని పెట్టుకోండి. వారిద్దరు కలిసి పరిస్థితిని చక్కదిద్దదలచుకుంటే అల్లాహ్ దంపతుల మధ్య సానుకూలత కలిగిస్తాడు. అల్లాహ్ సర్వజ్ఞాని. సమస్తమూ ఎరిగినవాడు. (దివ్య ఖుర్‌ఆన్: 4:34–35)
వివరణ: భార్య విననప్పుడు నచ్చజెప్పడం, పడకగదికి దూరంగా ఉండటం, విధేయత కనబరిస్తే ఆమెను మనసారా స్వీకరించడం ఎంత దానశీలి అయినా, ఎన్నిసార్లు దైవపూజలు చేసే వారయినా, భార్యని కొట్టే వారిని ప్రవక్త అభిమానించేవారు కాదు. 35 ఆయత్ (వాక్యం)లో అల్లాహ్ ఎంతోమంచి పరిష్కారం చూపాడు. భార్యాభర్తల మధ్య పొసగనపుడు అటువైపు నుండి ఒక మధ్యవర్తి ఇటువైపు నుండి ఒకరు మధ్యవర్తిత్వం వహించి వారిద్దరి మధ్య సమాధానం కుదిరిస్తే ఆ దంపతులు కూడా సమాధాన పడితే ఇద్దరి మధ్య అల్లాహ్ సానుకూలత కలిగిస్తాడు.
మనిషికి దేవుడు మంచి చెడుల విచక్షణ జ్ఞానం, స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఇచ్చాడు. కాబట్టి వాటిని ఆయన అడ్డుకోకుండా స్వయంగా మనిషి సంకల్పించుకుంటే అల్లాహ్ దానిని పరిపూర్ణం చేస్తాడు. ఏ విషయంలోనూ ఎవరికీ బలవంతం పెట్టాడు. మనిషి విచక్షణను బట్టి అల్లాహ్ ఆ మనిషితో వ్యవహరిస్తాడు. కాబట్టి మనుషులమైన మనం మంచిని ఆలోచిస్తూ మంచినే కాంక్షిస్తూ మంచి చేస్తుంటే దేవుడు కూడా సహకరిస్తాడు. అంతా మంచే జరుగుతుంది. అల్లాహ్ మనందరికీ మంచి చేసే భాగ్యాన్ని కలుగజేయుగాక ఆమీన్ (తథాస్తు)
ఆధారం: అంతిమ దైవ గ్రంథం ఖుర్‌ఆన్ భావామృతం
– మొహమ్మద్ అబ్దుల్ రషీద్
Comments
Please login to add a commentAdd a comment