పెళ్లి మంత్రాలన్నీ నిజాలే చెబుతాయి.నిజాయితీగా ఉండాలనే చెబుతాయి.పెళ్లి వేడుకను.. బట్టలు, నగలు, భోజనాలతోసరిపెట్టే ఈ రోజుల్లో..ప్రమాణాలు చేయించే మంత్రాలకున్న విలువ ఏమిటో ఎవరూ చెప్పడం లేదు!అందరూ ‘మ.. మ’తో సరిపెట్టుకుంటున్నారు.అందుకే పెళ్లిళ్లు.. మమకారం లేని ‘మ..మ’లుగా మిగిలిపోతున్నాయా?
హాస్పిటల్‌లో కన్సల్టేషన్ రూమ్ చల్లగా, నిశ్శబ్దంగా ఉంది. ‘డాక్టర్’... ‘చెప్పండి’... ‘ఒన్ మినిట్. నాకు డౌట్‌గా ఉంది. మీరసలు డాక్టరేనా?’నమ్మడం కష్టంగా ఉంది ఆమెకు.ఒక్కోరోజు మధ్యాహ్నం బాగా ఆలస్యమయ్యాక కొంచెం ఆకలిగా అనిపిస్తుంది. కిచెన్‌లోకి వెళ్లి తెల్లటి పింగాణి ప్లేట్ అందుకుని కొంచెం అన్నం పెట్టుకుంటుంది. డైనింగ్ టేబుల్ మీద కూచుని కొంచెం కూర వేసుకుంటుంది. ఆ తర్వాత తినాలనుకుంటుంది. ఆ తర్వాత డౌట్ వస్తుంది.‘ఇది అన్నమేనా?’నిద్ర సరిగ్గా పట్టి చాలా కాలమైంది ఆమెకు. నిద్రలో ఎందుకు ఉలిక్కిపడి లేస్తుందో తెలియదు. దేని పట్లా ఎందుకు ఆసక్తి ఉండటం లేదో అర్థం కాదు. ఇంతకు మునుపు కప్‌బోర్డ్‌లో నుంచి చిన్న నోట్ బుక్కు తీసుకుని రకరకాల ముగ్గులు ప్రాక్టీసు చేసేది. ఎన్ని చుక్కలు అడ్డం, ఎన్ని చుక్కలు నిలువు, ఏ చుక్కను ఏ చుక్కతో కలిపితే ముగ్గు అందంగా ఆకృతి దాలుస్తుంది అన్నీ తెలుసు ఆమెకు.ఇప్పుడు చుక్కలు చేతకాడవం లేదు. కలపడం చేత కావడం లేదు. ముగ్గు చెదిరిపోతోంది. పెళ్లి కూడా చెదిరిపోతుందా? పిల్లలు కూడా చెదిరిపోతారా? అంతా భయం. అవిశ్వాసం. అప్రశాంతత.‘ఇల్లు ఒక నరకంగా మారింది డాక్టర్. ఒక భర్తగా నేను చేయవలసిందంతా చేశాను’‘మీరు ఒక నిమిషం బయట కూర్చోండి’‘సరే’‘చెప్పండమ్మా. ఏంటి మీ సమస్య. నన్ను డాక్టర్ అనుకోవద్దు. మీ స్నేహితుడిగా భావించండి. రాసిన వెంటనే కాలిపోయే ఒక కాగితంలా భావించండి. విన్న వెంటనే నోటికి లక్క వేసిన గోతం సంచిలా భావించండి. నిర్భయంగా అన్నీ చెప్పండి. అవి ఈ గది దాటవు’‘నేను మళ్లీ భార్యగా మారాలి డాక్టర్. ప్రస్తుతం నేను డికెక్టివ్‌ని. లేకుంటే అనుమాన భూతాన్ని. లేదా అపనమ్మక ప్రేతాన్ని’...‘ఎందుకలా అనుకుంటున్నారు?’‘పదిహేడేళ్ల క్రితం పెళ్లయ్యింది. డిగ్రీ చదువుకున్నాడు. తను గవర్నమెంట్‌లో పెద్ద ఆఫీసర్. మామూలు గృహిణి ఎలా ఉండాలో అలా ఉన్నాను. ఇల్లు చూసుకున్నాను. వంట చూసుకున్నాను. పిల్లల్ని కన్నాను. స్కూళ్లకు పంపాను.డబ్బుంది.జీవిత భద్రత ఉంది. కాని ఏదో లేదని అనిపిస్తూ ఉండేది. నా భర్తకు నేను సరిపోయానా... లేదంటే నాకు నా భర్త సరిపోయాడా అనేదే నాకు అనుక్షణం బాధించే సమస్య. అతను నన్నెప్పుడూ కొట్టలేదు.తిట్టలేదు. నేను అడిగనవి కాదనలేదు. కాని నావాడుగా ఉన్నాడా లేదా అనేదే డౌట్. అతడు పెద్ద ఆఫీసరు కనుక అతడి కింద ఉమన్ స్టాఫ్ ఉంటే వారిలో ఎవరితో ఒకరితో క్లోజ్‌గా ఉండేవాడు. అలా అని నాకు తెలిసేది. ఇల్లు చూసుకోవాలా పిల్లలను చూసుకోవాలా ఈ గూఢచారి పని చూసుకోవాలా. నెలా రెండు నెలలు మూడు నెలలు నిఘా పెడితే దొరికేవాడు. ఫోన్లో ఉత్తరాలో వేళకు రాకపోవడమో. ఆ రాత్రి నేను గట్టిగా నిలదీసేదాన్ని. మామూలు మగాడైతే బొంకుతాడేమో. ఇతను అలా కాదు. నేరుగా దేవుని పటాన్ని నెత్తిన పెట్టుకుని ‘వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు. నేను ఏ తప్పూ చేయలేదు’ అనేవాడు.మనిషనేవాడెవడూ అంత ధైర్యంగా దేవుని ఒట్టు వేయడు. అందుకే నమ్మేదాన్ని. మళ్లీ మామూలు అయ్యేదాన్ని. ఒకటి రెండేళ్లు గడిచేవి. అతని కింద ఎవరో ఒక స్టాఫ్ కొత్తగా చేరేవారు. కథ మళ్లీ మొదలు’... ఆగింది.
మంచినీరు ముందు పెట్టాడు. ఒక గుక్క తాగి మళ్లీ మొదలెట్టింది.‘రెండోసారి చాలా పెద్ద గొడవ పెట్టుకున్నాను. భయపడిపోయాడు. బెంబేలు పడ్డాడు. ఏ తప్పూ చేయలేదు అన్నాడు. అప్పటికి నాకు ఇద్దరు పిల్లలు. ఒకరికి పదేళ్లు. ఒకరికి ఎనిమిది. వెంటనే పిల్లలను తీసుకొచ్చి వాళ్ల తల మీద చేయి వేసి ప్రమాణం చేశాడు. తన వల్ల ఎటువంటి తప్పూ జరగలేదన్నాడు. ఏ మనిషీ సొంత పిల్లలపై ఒట్టు వేసి అబద్ధం చెప్పడు కదా. నమ్మాను. రెండేళ్లు గడిచాయి. మళ్లీ మామూలు...’చూస్తూ అంది.‘నాకేమిటి? చక్కగా ఉంటాను. అనుకూలంగా మసలుకుంటాను. అయినా ఇతను ఇలా చేస్తూ ఉన్నాడంటే మొదట నా మీద నాకు నమ్మకం పోయింది. అతను పదే పదే అలా చేస్తూ ఉన్నాడంటే అతని మీద నమ్మకం పోయింది. మెల్ల మెల్లగా అన్నింటి మీదా నమ్మకం పోయింది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మా గొడవలు నేనొక్కదాన్నే సహించేదాన్ని. నా దృష్టిలో మాత్రమే అతడు చెడ్డవాడు. కాని ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వాళ్ల దృష్టిలో తండ్రి హీనుడు అని తెలిస్తే హీనుడైన తండ్రికి పుట్టామన్న న్యూనతతో వాళ్లు ఏమవుతారో అన్న భయం నన్ను నిద్రపోనివ్వడం లేదు. ఐ వాంట్ టు క్విట్. ఐ వాంట్ టు డై. నాకేదైనా ట్రీట్‌మెంట్ ఇచ్చి కాపాడండి. నా పిల్లల కోసమైనా’...డాక్టర్ తల పంకించాడు.‘మీకేం కాలేదమ్మా. ఇదసలు ఇష్యూయే కాదు. నిజానికి పేషెంట్ మీరు కాదు. మీ హజ్బెండ్. మీరు బయట కూచుని అతణ్ణి పంపండి’ఆమె లేచింది.అతడు వచ్చాడు.
‘చూడండి. ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడానికి కొందరు ఎక్స్‌క్యూజెస్ వెతుకుతుంటారు. భార్యలో లోపాలు ఏవో చెప్తూ ఉంటారు. మీ భార్యలో ఏ లోపాలూ లేవు. లోపాలు ఉన్నా ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకోవచ్చని ఏ సంస్కారం చెప్పదు. మీలో ఏదో అసంతృప్తి ఉంది. బలహీనత ఉంది. ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకోవడం వల్ల మీరు సాధించాననుకుంటున్న ఏదో విజయం ఉంది. అటువైపు కూడా ఏవో అవసరాల వల్ల, అసంతృప్తుల వల్ల మీకు దగ్గరవుతూ ఉండొచ్చు. మీ అసంతృప్తి, అవతలి అసంతృప్తి మీ ఇద్దరి కాపురాలను సంక్షోభంలో పడేయడమే తప్ప మీకు తెచ్చే ప్రయోజనం లేదు. మీభార్య ఇలా కావడానికి మీరే కారణమని మీ అంతరాత్మకు తెలుసు కదూ’‘తెలుసు డాక్టర్’‘మీ భార్యను ఇలా చేసి మీ పిల్లలను డిస్ట్రబ్ చేసి మీరు సాధించేది ఏమిటి? ఆమె మీతో విడాకులు తీసుకోవచ్చు. పిల్లల్ని తీసుకొని వెళ్లిపోవచ్చు. కాని ఆమె కుటుంబానికి ఒక విలువ ఇవ్వాలనుకుంటోంది. ఆ విలువను మీరు పదే పదే ఛిద్రం చేస్తున్నారు. మిమ్మల్ని నేను పూర్తిగా మార్చలేను. మారాల్సింది మీరే. కాని మీ అదుపు తప్పిన కాంక్షను గాడిలో పెట్టేందుకు మాత్రం వైద్య సహాయం అందించగలను. రోజుకో బంగారుగుడ్డు పెట్టే బాతును ఆశపడి చంపిన వ్యక్తి కథ మీరు వినే ఉంటారు’‘విన్నాను’‘నేనేమంటానంటే అసలు ఏ గుడ్డూ పెట్టకపోయినా మన ఇంట్లో ప్రాణాలతో కళకళలాడుతూ ఉండే ఒక బాతు ఉండటమే అదృష్టం అంటాను. జీవరహితమైన జీవితమే పెద్ద శాపం. మీ భార్య చెట్టు మొత్తం ఎండిపోయి చివరి చిగురుతో ఉన్నారు. ఆమెను అర్థం చేసుకోండి. ఆమె చేయి పట్టుకోండి. ఆమెను నిజంగా ప్రేమించండి’‘అ... అలాగే. ఐయామ్ సారీ’‘అది ఆమెకు చెప్పండి. అదీ అబద్ధపు సారీ కాదు. నిజమైనా సారీ. ఆమెకు ఈ లోకం మీద నమ్మకం కలిగించే సారీ. సరేనా’అతడు నటన లేని పరివర్తనతో లేచి నిలబడ్డాడు.
– ఫ్యామిలీ డెస్క్
ఇన్‌పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి సైకియాట్రిస్ట్
Comments
Please login to add a commentAdd a comment