Runner
-
‘మారతాను’ అనుకుంటే మారథాన్ గెలిచినట్టే!
పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలతోనే స్త్రీ జీవనం గడిచిపోతుంది. రొటీన్లో తన మనుగడ ప్రశ్నార్థకం అవుతుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంటుంది. జీవనశైలిని మార్పుకోవాలన్న ఒకే ఒక ఆలోచనతో ఇండియా ఫాస్టెస్ట్ ఔతాహ్సిక మారథానర్గా తనకై తాను ఓ గుర్తింపును సాధించారు కవితారెడ్డి.50 ఏళ్ల వయసులో ఆరు ప్రపంచ మారథాన్లను పూర్తిచేసి స్టార్ మెడల్స్‌ను సొంతం చేసుకున్నారు. ప్రపంచ మారథాన్ ల చరిత్రలో అత్యంత వేగవంతమైన భారతీయ మహిళా రన్నర్‌గా నిలిచారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో మారథాన్ రన్స్‌లో పాల్గొంటున్న కవితారెడ్డి ‘మన మైండ్, బాడీ చురుగ్గా ఉండాలంటే ముందు ఏదైనా క్రీడలలో పాల్గొనాలి’ అంటూ ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నారు.‘‘మన దేశంలో మహిళలు బయటకు వచ్చి, రన్స్‌లో పాల్గొడం తక్కువే. వారిని ఎంకరేజ్ చేయడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. పుట్టి పెరిగింది అనంతపూర్. డిగ్రీ పూర్తవుతూనే పెళ్లి, కుటుంబ బాధ్యతలు. ఎప్పుడూ క్రీడల్లో పాల్గొనలేదు. నలభైఏళ్ల వరకు గృహిణిగా, ఇద్దరు అబ్బాయిల పెంపకం, కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుంటూ వచ్చాను. వయసు పెరుగుతున్నప్పుడు జీవనశైలి సరిగా లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే, కొన్ని మార్పులు చేసుకోవాలనుకుని, పదేళ్ళక్రితం జిమ్‌లో చేరాను. కొన్నిరోజులు ఇబ్బందే అనిపించింది. కానీ, అదే సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. స్నేహితుల ద్వారా మారథాన్ల గురించి తెలిసింది. అలా జిమ్‌తో పాటు పదేళ్ల క్రితమే మారథాన్ జర్నీ స్టార్ట్ అయ్యింది. మా వారు దీపక్‌రెడ్డి ఉద్యోగరీత్యా హైదరాబాద్, బెంగళూరు, ముంబయ్, పుణెలలో నివసిస్తూ వచ్చాం. అలాగే, ఎక్కడ మారథాన్ జరిగినా పాల్గొంటూ వచ్చాను. మారథాన్లు నా జీవన విధానాన్నే మార్చాయి. వాటిల్లో ఎంజాయ్ చేయడమే పెరిగింది. దీంతో అదే ΄్యాషన్గా మారింది.సొంత గుర్తింపుకూతురు, భార్య, తల్లి.. సమాజం మనకో గుర్తింపునిస్తుంది. కానీ, మనకంటూ ఓ సొంత గుర్తింపును సాధించుకోవాలి. అందుకు ఏదో ఒక యాక్టివిటీని ఏర్పరుచుకోవాలి. గృహిణిగా, అమ్మగా గుర్తింపు ఉన్న నాకు ఇప్పుడు ‘మారథాన్ రన్నర్ కవితారెడ్డి’ అంటూ మరో గుర్తింపు వచ్చింది. ఈ ప్రయాణంలో ఎంతోమంది పరిచయం అయ్యారు. కాన్ఫిడెన్స్తోపాటు జీవనశైలిలోనూ మంచి మార్పులు వచ్చాయి. మద్దతు అవసరంమహిళలు మారథాన్‌లో పాల్గొనడానికి మన దగ్గర ఇంకా అంత ప్రోత్సాహం లేదనే చెప్పవచ్చు. తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ, ఇరుకు రోడ్లు, సౌకర్యాలు కూడా తక్కువే. విదేశాలలో మారథాన్ అంటే సిటీ మొత్తం ఒక పండగలా జరుగుతుంది. స్త్రీ–పురుష తేడా లేకుండా ఎంతోమంది వచ్చి హుషారుగా పాల్గొంటారు. సామాజికంగానూ ఇది ఐక్యతను సూచిస్తుంది. ఒక తెలియని ఎనర్జీ మనలోకి వచ్చేస్తుంది. దీనివల్ల చేయాలనుకున్న పనుల్లో వేగం కూడా ఉంటుంది. శిక్షణ తప్పనిసరిముందు మనకోసం సొంతంగా ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు కుటుంబం నుంచి అంతగా సపోర్ట్ రాకపోవచ్చు. కానీ, పరిస్థితులలో మంచి మార్పులు వచ్చాయి. నేడు మన జీవన విధానంలో ఆహారం, చేస్తున్న పనులకు ఏ మాత్రం ΄÷ంతన లేదు. అందుకే, మహిళలు తప్పనిసరిగా వ్యాయామాలు ఒక అలవాటుగా చేసుకోవాలి. ఏడాదికి రెండు మూడు హాఫ్ మారథాన్లలో పాల్గొంటుంటాను. ఆ తర్వాత ఫుల్ మారథాన్ ఉంటుంది. సాధారణంగా ఫుల్ మారథాన్లనే కౌంట్ చేస్తుంటారు. అందరూ ఆ డిస్టెన్స్‌లో పాల్గొనలేరు. అందుకని హాఫ్ మారథాన్లు, 5కె, 10కె రన్లు జరుగుతుంటాయి. రాబోయే ఫిబ్రవరిలో చండీగఢ్లోహాఫ్ మారథాన్ ఉంది. దానికి శిక్షణ తీసుకుంటున్నాను’ అని వివరించారు ఈ మారథాన్ రన్నర్. అడ్డంకులను అధిగమిస్తూ..ఎవరెస్ట్ బేస్ క్యాంప్, అంతకుముందు అంటార్కిటికా ఐస్ మారథాన్లు రెండు అత్యంత కష్టమైనవే. బోస్టన్‌లో పాల్గొన్న మారథాన్‌లో అయితే బలమైన ఈదురుగాలులు, వర్షం.. అత్యంత దారుణమైన వాతావరణ పరిస్థితులు. అయినా, 42.21 కి.మీ మారథాన్‌ని పూర్తి చేయాలి. లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆలోచన అడ్డంకులను అధిగమించేలా చేసింది. 3.05 గంటలలో లక్ష్యాన్ని చేరుకున్నా. ప్రకృతి విసిరే సవాళ్లను తట్టుకోవడానికి మహిళలే ముందుంటారు. పదేళ్లపాటు చేస్తున్న ఈ జర్నీలో ఇండియాతో పాటు న్యూయార్క్, లండన్, చికాగో, బెర్లిన్, బోస్టన్ – టోక్యోలలో జరిగిన ఆరు ఫుల్ మారథాన్లలో పాల్గొన్నాను. మెడల్స్ ΄÷ందాను. నన్ను చూసి మారథాన్లలో పాల్గొన్న మహిళలు చాలామంది ఉన్నారు.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అల్ట్రా రన్నర్ మీనల్
ఆమె ఖాతాలో అనేక రేస్‌లు పూర్తి చేసిన రికార్డులు ఉన్నాయి. భారతదేశపు అగ్రశ్రేణి అల్ట్రా రన్నర్‌గా పేరొందింది. పేరు మీనల్ కొటక్, గుర్గావ్వాసి.ఇటీవల 680కి పైగా కిలోమీటర్ల పరుగును 6 రోజుల్లో అంటే 144 గంటల్లో కవర్ చేసి సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది. తనను తాను మెరుగుపరుచుకోవాలనే సంకల్పంతో అల్ట్రారన్లలో పాల్గొంటున్నాను అని చెబుతోంది మీనల్ కొటక్. ‘‘పురుషుల రికార్డ్ ఇప్పటి వరకు 574.5 కిలోమీటర్ల ఉంటే, నా రికార్డ్ 680 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసింది. మిగతావారికంటే ఉన్నతంగా ఉండేలా నన్ను నేను మెరుగుపరుచుకోవాలన్నదే నా సంకల్పం. కిందటేడాది అమెరికాలోని మిల్వాకీలో జరిగిన అల్ట్రామారథాన్‌లో భారతదేశం తరపున పాల్గొన్న మల్టీ డే రికార్డ్ అసాధారణమైంది. ఇటీవల జరిగిన ఆరు రోజుల ఈవెంట్లోనూ నేనే ముందున్నాను.ఈ రేసుతో ఆసియాలో టాప్ 5 యాక్టివ్ రన్నర్‌గా, ప్రపంచంలో టాప్ 12 యాక్టివ్ 6–డే ఉమెన్ అల్ట్రారన్నర్లలో ఒకరిగా ఉన్నాను. నా మనుగడ కోసం మొండిగా పోరాడతాను. సుదీర్ఘమైన చలి, ఒంటరితనం దేనినీ లెక్కచేయను. చాలా కఠినమైన సాధన. నా ఎమోషన్స్ అన్నీ సమం చేసుకుంటూ ప్రయత్నం చేశాను. చివరకు నా సంకల్పం మనసు, శరీరంపై గెలిచింది. మార్చిన పరుగు2014లో ఒక ట్రెడ్మిల్ పరుగు నా రన్నింగ్ సామర్థ్యాన్ని, శక్తిని గ్రహించేలా చేసింది. నా బలాన్ని గుర్తించిన సరైన వ్యక్తుల సహాయంతో ఢిల్లీ హాఫ్ మారథాన్‌లో పరుగెత్తాను. 34 సంవత్సరాల వయసులో వృత్తిపరమైన రన్నింగ్ అనుభవం లేకుండా పాల్గొన్న ఆ మారథాన్ నా జీవిత గమనాన్ని మార్చింది. ఆ సమయంలోనే మహిళా అల్ట్రారన్నర్లు చాలా తక్కువ మంది ఉన్నారని తెలిసి, ఆసక్తి కలిగింది. మారథాన్లకు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించి, చరిత్ర సృష్టించాలనుకున్నాను. 2017లో 24 గంటల పరుగు విభాగంలో భారతదేశం నుంచిప్రాతినిధ్యం వహించాను. అక్కడ నుంచి అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నా సామర్థ్యాన్ని గుర్తించింది. వారు నాకున్న రికార్డులన్నీ పరిశీలించారు. అలా 2017లో బెల్ఫాస్ట్లో తొలిసారిగా భారతదేశానికిప్రాతినిధ్యం వహించాను. ఆ తర్వాత 2018లో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాను. డిప్రెషన్ నుంచి కోలుకొని...2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో దేశానికిప్రాతినిధ్యం వహించడానికి కొంత కాలానికి ముందు కాలికి తీవ్ర గాయమైంది. అనేక కారణాల వల్ల డిప్రెషన్ బారిన పడ్డాను. నా కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో బెడ్‌రెస్ట్‌లో ఉండటం వల్ల చాలా బాధపడ్డాను. మొత్తానికి ఆ ఒత్తిడిని జయించి ఇప్పుడు నా 44 ఏళ్ల వయసులో 680 కిలోమీటర్ల పరుగును సాధించేంతగా ఎదిగాను. ఏడాది కిందట అమెరికాలో 72 గంటల్లో 379 కిలోమీటర్లు పరుగును పూర్తి చేశాను. మూడేళ్లుగా ఈ రేసులను ట్రాక్ చేస్తున్నాను. ఇక్కడ ఆటలో మనసు శక్తి ఎంతటిదో తెలుసుకున్నాను.ప్రణాళికతో దినచర్యమల్టీడే రేసులు 24 గంటల రేసుల కంటే భిన్నంగా ఉంటాయి. ఒక క్రీడాకారుడు ఇక్కడ రోజుల తరబడి పరిగెత్తడంలో ఎన్నో ప్రణాళికలను అమలు పరచాల్సి ఉంటుంది. దీంతో గతంలోకంటే ఎక్కువ ప్రేరణ, మద్దతు అవసరం అవుతుంది. ఈ రేసులోకి వెళ్లడానికి మొదటి మూడు రోజులు ఆలోచించాను. ఒకసారి శిక్షణ మొదలుపెట్టాక ఇక ప్రణాళికలను అనుసరించేలా నా దినచర్య మారిపోయింది. రన్నింగ్ కోసం మాత్రమే కాదు ఒక రేసర్‌గా మిమ్మల్ని మీరు ఆవిష్కరించు కోవాలంటే పోషకాహారం వంటి అనేక ఇతర అంశాలు ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఒక గంట లేదా రెండు గంటలు నిద్ర, బట్టలు మార్చుకోవడం, ఆహారం తీసుకోవడం, కాళ్లకు బొబ్బలు రాకుండా చూసుకోవడం... వీటన్నింటిపైనా శిక్షణప్రారంభించనప్పటి నుండే శ్రద్ధ వహించాలి. మల్టీ డే రేసింగ్ ఆరోగ్య పోటీగా కూడా మార్చుకోవచ్చు.ఇప్పటివరకు భారత దేశం నుండి ఏ మహిళ కూడా మల్టీ డే మారథాన్‌లో పాల్గొనలేదు. ఈ విషయం నన్ను ఆలోచించేలా, రికార్డ్‌ను సాధించేలా చేసింది. అల్ట్రారన్ రేస్‌లో మొదటి భారతీయ మహిళను నేనే అవుతానని అనుకోలేదు. మానవ పరిమితులన్నీ అధిగమించడానికి ఒక అడుగు ముందుకు వేసినందుకు సంతోషంగా ఉన్నాను. నా భర్త సచిన్ ఉద్యోగి అయినప్పటికీ నా ముఖ్యమైన రన్నింగ్రేసులన్నింటికీ తప్పక హాజరై, నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు’’ తన విజయపరంపరను వెనకాల ఉన్న రహస్యాలను వివరించింది మీనల్ కొటక్. -
నా కుటుంబంతో సహా రోడ్డుపై నిల్చోబెట్టారు.. నాకేం జరిగినా పర్లేదు.. కానీ: అమర్దీప్
బిగ్ బాస్ సీజన్లో రైతుబిడ్డ తర్వాత పోటీలో నిలిచిన కంటెస్టెంట్ అమర్దీప్. హౌస్‌లో ఫుల్ అగ్రెసివ్‌గా కనిపించిన అమర్.. ఈ సీజన్ రన్నరప్‌గా నిలిచారు. రైతుబిడ్డతో చివరి వరకు పోటీపడిన అమర్దీప్ రన్నర్‌గా బయటికొచ్చాడు. అ?అయితే మాస్ మహారాజా రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అమర్.. అంతే సంతోషంగా బిగ్ బాస్ హౌస్ నుంచి తన ఇంటికి బయలుదేరాడు. కానీ ఊహించని విధంగా అతని కారుపై జరిగిన దాడి అతని అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. స్టూడియో బయట జరిగిన రాళ్లదాడితో అమర్ కుటుంబసభ్యులు, ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో అమర్దీప్ ఈ ఘటనపై తొలిసారి మాట్లాడారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇంతకీ అమర్దీప్ ఏమన్నారో తెలుసుకుందాం. అమర్దీప్ మాట్లాడుతూ.. 'అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు పాదాభివందనం. మీలో ఒక్కడిగా నన్ను చూశారు. ఇంతకన్నా నేను చెప్పుకోవడానికి ఏం లేదు. గెలవలేను అనుకున్నవాన్ని..గెలుపుదాకా తీసుకొచ్చి గెలిపించారు. ఇంతకు మించిన అదృష్టం లేదు. ఈ విషయంలో నేను ఫీల్ అవ్వాల్సిన లేదు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఎంటంటే.. చాలామంది నన్ను అడుగుతున్నారు. నేను ఈ విషయాన్ని చెప్పాలని కూడా అనుకోలేదు. బాధలో ఉండిపోయాను' అని అన్నారు. రాళ్లదాడిని ప్రస్తావిస్తూ..' కారు అద్దాలు పగలగొట్టారు.. బయటికి రా.. నీ అంతు చూస్తాం అన్నారు. నేను ఒక్కడినే ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. నాకేం భయం లేదు. ఎవరికీ భయపడను. భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన ఇంట్లో కూడా అమ్మ, అక్క, చెల్లి, భార్య ఉంటుంది. వాళ్లు మన పక్కన ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అని ఆలోచిస్తే బాగుండు అని నా అభిప్రాయం. కారు అద్దం పగలగొట్టినప్పుడు ఆ గాజు పెంకులన్నీ మా అమ్మ, భార్య తేజు మీద పడ్డాయి. ఎవరికీ ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. రాళ్లదాడి వల్ల ఏదైనా జరిగి ఉంటే ఈ రోజు నేను ఎవరినీ కోల్పోయేవాడినో నాకు తెలియదు' అని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుడే నేను గెలిచా.. ఇలాంటివీ ఎవరికీ జరగకూడదు. ఇంకెప్పుడు ఇలా చేయకండి. మీకు కోపముంటే తిట్టండి పడతాను. కామెంట్స్ పెట్టండి చూస్తాను. ఇంకా కోపముంటే వీడియోలు తీసి పెట్టండి. ఎలాగో పెట్టారు. నా కుటుంబాన్ని మొత్తం బాధపెట్టారు. అయినా నేను ఏది పట్టించుకోవడం లేదు. నేను అభిమానించే హీరో మాస్ మహారాజా రవితేజ గారే వచ్చి సినిమాలో అవకాశమిచ్చారు. అప్పుడే నేను గెలిచా. ఆ గెలుపుతోనే బయటికి వచ్చాను' అని అన్నారు. చాలా బాధేసింది.. కారు దాడిపై స్పందిస్తూ.. 'కానీ ఆనందంతో బయటకు వస్తాననుకున్న నన్ను నా కుటుంబంతో సహా రోడ్డుపై నిల్చోబెట్టారు. ఆ విషయంలో చాలా బాధేసింది. అయిన ఫర్వాలేదు. ఆ దేవుడు, అభిమానుల దయవల్ల మా ఇంట్లో వాళ్లకి ఏం కాలేదు. నాకు ఏం అయినా ఫర్వాలేదు. మన ఫ్యామిలీ పక్కన ఉన్నప్పుడు దయచేసి ఆలోచించండి. కప్పుపోతే తిరిగి తెచ్చుకోవచ్చు. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ మనిషి పోతే తిరిగి తీసుకురాలేం. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. చాలా రిక్వెస్ట్‌గా అడుగుతున్నా. దయచేసి ఇలా ఎవరిమీద ఇలా ప్రవర్తించకండి. నా మీద మీకు ఏదైనా కోపం ఉంటే చెప్పండి. ఎక్కడికి రమ్మన్నా వస్తా. కానీ దయచేసి ఇలా మాత్రం ఎవరికీ చేయకండి. థ్యాంక్యూ ఆల్. అందరికీ ధన్యవాదాలు' అని వీడియోలో వెల్లడించారు. కాగా.. బిగ్‌బాస్ షో ముగిసిన అనంతరం అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సులపై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. -
జానీ మాస్టర్ హీరోగా సినిమా.. టైటిల్ ఇదే!
ప్రముఖ కొరియోగ్రాఫర్, తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్‌కి కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ హీరోగా మారాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘రన్నర్’. పోలీసు బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంతో విజయ్ చౌదరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అరవింద్ 2' చిత్ర నిర్మాతలు విజయ భాస్కర్, జి. ఫణీంద్ర, ఎం. శ్రీహరి విజయ ఢమరుక ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు జానీ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ వెల్లడించడంతో పాటు ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పోలీస్ నేపథ్యంలో తండ్రీ కుమారుల మధ్య అనుబంధంతో సాగే కథతో సినిమా రూపొందిస్తున్నామని చిత్ర బృందం తెలియజేసింది. 'రన్నర్' ఫస్ట్ లుక్ చూస్తే... ఖాకీ ప్యాంట్ వేసిన జానీ మాస్టర్, షర్టులో వేరియేషన్ చూపించారు. ఒకవైపు ఖాకి ఉంటే... మరోవైపు ఖద్దర్ ఉంది. ఎందుకు అలా డిజైన్ చేశారు? ఆయన ఎవరికి నమస్తే పెడుతున్నారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చిత్రదర్శకుడు విజయ్ చౌదరి మాట్లాడుతూ 'ఇదొక డిఫరెంట్ థ్రిల్లర్ సినిమా. మణిశర్మ గారు అద్భుతమైన బాణీలు అందిస్తున్నారు. ఆయన ఇచ్చిన ట్యూన్లకు జానీ మాస్టర్ వేసే స్టెప్పులు అదిరిపోతాయి. ఇతర నటీనటులు, మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తాం’అన్నారు. హైదరాబాద్ నగరంలో కొన్నాళ్ళ క్రితం జరిగిన వాస్తవ ఘటనలు, సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు చేశాం'అని చిత్ర నిర్మాతలు విజయ భాస్కర్, జి. ఫణీంద్ర, ఎం. శ్రీహరి అన్నారు. -
ఉరకలేసిన ఉత్సాహం.. మారథాన్‌తో సరికొత్త జోష్
ఖైరతాబాద్/గచ్చిబౌలి: ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. ఆదివారం ఉదయం పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన ఫుల్ మారథాన్ గచ్చిబౌలి స్టేడియంలో ముగిసింది. దాదాపు 9 వేల మంది పాల్గొన్న ఈ మారథాన్ దేశంలోనే రెండవ అతిపెద్దదిగా నిర్వాహకులు పేర్కొంటున్నారు. అనంతరం హాఫ్ మారథాన్‌ను ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈఓ వైద్యనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. హాఫ్ మారథాన్‌లో 3240 మంది పాల్గొన్నారు. ఆ తరువాత 5కె ఫన్ రన్ ప్రారంభమైంది. ఈ రన్లో 5వేల మంది పాల్గొన్నారు. ఫుల్ మారథాన్ నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై ఎన్టీఆర్ గార్డెన్, ట్యాంక్‌బండ్ మీదుగా నెక్లెస్ రోడ్డు, ఖైరతాబాద్ ప్లై ఓవర్, రాజ్‌భవన్, పంజగుట్ట ప్లై ఓవర్, బంజారాహిల్స్ రోడ్‌నెం–2, కెబిఆర్ పార్క్, జూబ్లిహిల్స్ రోడ్‌నెం 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, భయో డైవర్సిటీ జంక్షన్, త్రిబుల్ ఐటి జంక్షన్, జిఎంసి బాలయోగి స్టేడియంకు చేరుకుంటారు. హాఫ్ మారథాన్‌లో పీపుల్స్ ప్లాజా నుంచి నేరుగా ఖైరతాబాద్ ప్లై ఓవర్ నుంచి ఫుల్ మారథాన్ రూట్లోనే జిఎంసి బాలయోగి స్టేడియానికి చేరుకున్నారు. ఉత్సాహంగా సాగిన మారథాన్‌లో రేస్ డైరెక్టర్ ప్రశాంత్ మోర్పారియో తదితరులు పాల్గొన్నారు. విజేతలకు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో బహుమతులు అందజేశారు. ఎన్ఎండీసీ చైర్మెన్, ఎండి సుమిత్ దేబ్, శాట్స్ చైర్మెన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండి, సీఈఓ వైద్యనాథన్‌లు విజేతలకు బహుమతులు అందజేశారు. -
ఢిల్లీ మహిళ ప్రపంచ రికార్డు... కాలినడకనే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా..
Golden Quadrilateral Run: ఇంతవరకు మనం ఎంతో మంది సాధించిన ప్రపంచ రికార్డుల గురించి విన్నాం. తమదైన నైపుణ్యం, ప్రతిభను కనబర్చి సాధించినవారు కొందరూ. మరికొంతమంది వినూత్న ఆవిష్కరణలతో రికార్డులు సృష్టించారు. అచ్చం అలాంటి కోవకు చెందిందే ఢిల్లీకి చెందిన ఈ మహిళ. వివరాల్లోకెళ్తే...ఢిల్లీకి చెందిన సుఫియా అనే అల్ట్రా రన్నర్ డిసెంబర్ 16, 2020న దేశ రాజధాని నుంచి తన పరుగును ప్రారంభించింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలను కలిపే జాతీయ రహదారుల నెట్వర్క్ అయిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ (బంగారు చతుర్భుజం)ని చుట్టి వచ్చింది ఈ 35 ఏళ్ల అథ్లెట్. ఆమె 6 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని సుమారు 110 రోజుల 23 గంటల 24 నిమిషాల్లో పూర్తి చేసింది. నిజం చెప్పాలంటే ఇది అత్యంత సాహసోపేతమైన ప్రయాణం. ఆమె ఒక దశలో ప్రయాణాన్ని విరమించుకోవాలనుకుంది. అంతేకాదు ఆమెకు ఈ ప్రయాణంలో ఎన్నో గాయాలయ్యాయని అయినప్పటికీ తన లక్ష్యం పైన దృష్టి కేంద్రీకరించానని చెబుతోంది. తాను ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ పరుగును తన భర్త మద్దతుతోనే పూర్తి చేయగలిగానని చెప్పింది. అంతేకాదు ఈ ప్రయాణంలో తనతో దాదాపు అన్ని నగరాల్లోని రన్నర్లు, సైక్లిస్టులు చేరారని తెలిపింది. ఈ ప్రయాణంలో తనకి కొంతమంది ప్రజలు ఆతిధ్యం ఇచ్చారని, ఒక్కోసారి రోడ్డు పక్కన షెల్టర్‌లోనే పడుకోవలసి వచ్చిందని చెపింది. ఈ మేరకు ఆదివారం ఆమె గిన్నిస్ సర్టిఫికేట్ అందుకున్న తర్వాత ఈ రికార్డును ధృవీకరించారు. అంతేకాదు ఆమె గతంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అత్యంత వేగంగా పరిగెత్తిన మహిళగా (87 రోజులు, 2 గంటలు, 17 నిమిషాలు; ఏప్రిల్ 25-జూలై 21, 2019) - తన పేరుతో మరొక గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పింది. ప్రస్తుతం సుఫియా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, పూర్తి సమయం అల్ట్రా రన్నింగ్‌లో మునిగిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. It a Guinness World Records and It's Officially Amazing!!🏆🏆🏆 SUFIYA KHAN is Fastest female to run along The Indian Golden Quadrilateral Road (6002km in 110 days 23 hours) Congratulations Sufiya Khan!!💪💪💪🥇🥇🥇 🇮🇳🇮🇳🇮🇳#guinessworldrecord#girlpower #womenpowerment pic.twitter.com/w88kJIOBpP — Mohammad Mohsin I.A.S (@mmiask) March 28, 2022 (చదవండి: విచిత్రమైన ఫిర్యాదు...మోదీ ఫోటో తీసేయమని బెదిరింపులు) -
Pradeep Mehra: ఈ కుర్రాడి కథ మన పిల్లలకు స్ఫూర్తి
స్కూల్‌కు ఏసి బస్. అడిగిన వెంటనే షూస్. కోరిన సీట్ రాకపోయినా డొనేషన్ సీట్. ఉద్యోగానికి తెలిసిన మిత్రుడి కంపెనీలో రికమండేషన్. పిల్లలు వారి శక్తి వారు ఎప్పుడు తెలుసుకోవాలి? కుటుంబానికి సమాజానికి శక్తిగా ఎప్పుడు నిలబడాలి? కష్టాలను ఎదుర్కొనడమూ ప్రతికూలతను జయించడమూ జీవితమే అని ఎప్పుడు తెలుసుకోవాలి. పిల్లల్ని గారం చేసి బొత్తిగా బలహీనులను చేస్తున్నామా? నోయిడాలో అర్ధరాత్రి 10 కిలోమీటర్లు పరిగెడుతూ యువతకు సందేశం ఇచ్చిన ప్రదీప్ మెహ్రా నుంచి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి? ముందు ప్రదీప్ మెహ్రా గురించి తెలుసుకొని మళ్లీ మన పిల్లల దగ్గరకు వద్దాం. మొన్నటి శనివారం రోజు. అర్ధరాత్రి. ఢిల్లీ సమీపంలో ఉండే నోయిడా. సినిమా దర్శకుడు వినోద్ కాప్రి తన కారులో వెళుతుంటే ఒక యువకుడు బ్యాక్‌ప్యాక్‌తో పరిగెడుతూ వెళుతున్నాడు. అయితే అతడు అర్జెంటు పని మీద పరిగెడుతున్నట్టుగా లేడు. ఒక వ్యాయామంగా పరిగెడుతున్నట్టున్నాడు. వినోద్ కాప్రికి ఆశ్చర్యం వేసింది... ఈ టైమ్‌లో ఈ కుర్రాడు ఎందుకు పరిగెడుతున్నాడు అని. కారులో అతణ్ణే ఫాలో అవుతూ అద్దం దించి మాట్లాడుతూ అదంతా వీడియో రికార్డ్ చేశాడు. ‘ఎందుకు పరిగెడుతున్నావ్?’ ‘వ్యాయామం కోసం’ ‘ఈ టైమ్‌లోనే ఎందుకు?’ ‘నేను మెక్‌డోనాల్డ్స్‌లో పని చేస్తాను. వ్యాయామానికి టైం ఉండదు. అందుకని ఇలా రాత్రి డ్యూటీ అయ్యాక పరిగెడుతూ నా రూమ్‌కు చేరుకుంటాను’ ‘నీ రూమ్ ఎంతదూరం?’ ‘10 కిలోమీటర్లు ఉంటుంది’ ‘అంత దూరమా? కారెక్కు. దింపుతాను’ ‘వద్దు. నా ప్రాక్టీసు పోతుంది’ ‘ఇంతకీ ఎందుకు వ్యాయామం?’ ‘ఆర్మీలో చేరడానికి’ ఆ సమాధానంతో వినోద్ కాప్రి ఎంతో ఇంప్రెస్ అయ్యాడు. ఇంతకీ ఆ అబ్బాయి పేరు ప్రదీప్ మెహ్రా. వయసు 19. ఊరు ఉత్తరాఖండ్ అల్మోరా. నోయిడాలోని బరోలాలో తన అన్న పంకజ్‌తో కలిసి రూమ్‌లో ఉంటున్నాడు. తల్లి సొంత ఊరిలో జబ్బు పడి ఆస్పత్రిలో ఉంది. తండ్రి ఆమెకు తోడుగా ఉన్నారు. అన్నదమ్ములు నగరానికి వచ్చి కష్టపడుతున్నారు. ప్రదీప్‌కు ఆర్మీలో చేరాలని కోరిక. ఆ లోపు బతకడానికి నోయిడా సెక్టార్ 16లో ఉండే మెక్‌డొనాల్డ్స్‌లో చేరాడు. ఉదయం నుంచి రాత్రి వరకూ డ్యూటీ. మళ్లీ వంట పని. వీటి వల్ల వ్యాయామానికి టైమ్ ఉండదు. అందువల్ల ప్రతిరోజూ డ్యూటీ అయ్యాక (రాత్రి 10.40కి) బ్యాక్‌ప్యాక్ తగిలించుకుని బరోలా వరకు పరుగు మొదలెడతాడు. ‘కనీసం కలిసి భోం చేద్దాం రా’ అని వినోద్ కాప్రి అడిగితే ప్రదీప్ మెహ్రా చెప్పిన జవాబు ‘వద్దు. రూమ్‌లో అన్నయ్య ఎదురు చూస్తుంటాడు. నేను వెళ్లి వండకపోతే పస్తు ఉండాల్సి వస్తుంది. వాడికి నైట్ డ్యూటీ’ అన్నాడు. వినోద్ కాప్రి ఈ వీడియోను ఆదివారం ట్విట్టర్లో పోస్ట్ చేస్తే గంటల వ్యవధి లో 40 లక్షల మంది చూశారు. ప్రదీప్‌ను ప్రశంసలతో దీవెనలతో ముంచెత్తారు. ఆర్మీ నుంచి రైటర్ అయిన ఒక ఉన్నతాధికారి ప్రదీప్ ఆర్మీలో చేరడానికి తాను ట్రైనింగ్ ఇప్పిస్తానన్నాడు. ఒక సినిమా నిర్మాత వెంటనే ప్యూమా నుంచి బూట్లు, బ్యాక్‌ప్యాక్ బ్యాగ్ పంపించాడు. ఆనంద్ మహీంద్ర అయితే ‘ఇలాంటి వాళ్లే నా సోమవారం రోజును ఉత్సాహంగా మొదలెట్టిస్తారు’ అని ట్వీట్ చేశాడు. ‘ఈ కాలపు పిల్లలు ఇతణ్ణి చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అన్నారు ఎందరో. నిజం. తప్పక నేర్చుకోవాల్సింది ఉంది. ప్రదీప్ మెహ్రా నుంచి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి? 1. లక్ష్యం కలిగి ఉండటం: ప్రదీప్ మెహ్రాకు ఒక లక్ష్యం ఉంది. తనకేం కావాలో అతడు నిశ్చయించుకున్నాడు. కాని అందుకు ఎన్నో ఆటంకాలు, బాధ్యతలు అడ్డుగా నిలిచి ఉన్నాయి. వాటిని తృణీకరించకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని అతడు నిశ్చయించుకున్నాడు. 2. చిత్తశుద్ధి: లక్ష్యం కలిగి ఉండటమే కాదు. దానిని చేరుకునే చిత్తశుద్ధి కూడా ఉండాలి. ప్రదీప్ తన రొటీన్‌ను ఏ మాత్రం మార్చుకోవడం లేదు. ఉదయాన్నే లేచి వంట, మళ్లీ రాత్రి రూమ్‌కు వెళ్లి వంట, మధ్యలో డ్యూటీ... ఇవన్నీ చేస్తూ పరుగు. రోజూ రాత్రిళ్లు అతడు పరిగెడుతుంటే ఎందరో లిఫ్ట్ ఇస్తామని అడుగుతారు. ఈ ఒక్కరోజు బండెక్కుదాం అని అనుకోకుండా పరుగెడుతున్నాడు. దర్శకుడు వినోద్ కాప్రి అడిగినా అతడు కారు ఎక్కలేదు. 3. కుటుంబం ముఖ్యం: ప్రదీప్‌కు కుటుంబం ముఖ్యం అనే బాధ్యత ఉంది. కుటుంబం పట్ల ఎంతో ప్రేమ ఉంది. అన్న పట్ల అనురాగం ఉంది. అన్న పస్తు ఉండకుండా త్వరగా వెళ్లి వంట చేయాలని ఉంది. ఆర్మిలో చేరి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉంది. ఈ దృష్టి ముఖ్యం. 4. ఆకర్షణలకు లొంగకపోవడం: గత 24 గంటల్లో ప్రదీప్ స్టార్ అయిపోయాడు. ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. మీడియా వెంటపడుతోంది. ప్రదీప్ వయసున్న కుర్రాళ్లు తబ్బిబ్బయ్యి ఆ ఊపులో కొట్టుకుని పోవచ్చు. కాని ‘నన్ను డిస్ట్రబ్ చేయకండి. పని చేసుకోనివ్వండి’ అన్నాడు ప్రదీప్. 5. కష్టేఫలీ: ‘మిడ్నైట్ రన్నర్’గా కొత్త హోదా పొందాక ‘నువ్వు ఇచ్చే సందేశం’ అని అడిగితే ‘కష్టపడాలి. కష్టపడితే లోకం తల వొంచుతుంది’ అని జవాబు చెప్పాడు. పిల్లలను పూర్తి కంఫర్ట్ జోన్లో పెట్టాలని తల్లిదండ్రులు ఆరాటపడటంలో తప్పు లేదు. కాని సవాళ్లను ఎదుర్కొని, ఎదురుదెబ్బలకు తట్టుకుని, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుని, విలువలు కోల్పోకుండా కష్టపడి పైకి రావాలని పిల్లలకు చెప్పడానికి ప్రదీప్ మెహ్రాకు మించిన సజీవ ఉదాహరణ లేదు. తాతల, తండ్రుల జీవితాల్లోని విజయగాథలు ఈనాటి పిల్లల జీవితాల్లో ఉంటున్నాయా అని చూసుకుంటే వారిని ఉక్కుముక్కల్లా పెంచుతున్నామా లేదా ఇట్టే తెలిసిపోతుంది. ఇవాళ పరిశీలించి చూడండి. Watch #PradeepMehra’s 20 second SPRINT to lift your Monday SPIRITS ❤️ https://t.co/UnHRbJPdNa pic.twitter.com/nLAVZxwauq — Vinod Kapri (@vinodkapri) March 21, 2022 -
మనాలి నుంచి లేహ్ వరకూ..చిరుతలా పరిగెత్తింది
అల్ట్రా రన్నర్ సూఫియా ఖాన్. లక్ష్యం 480 కిలోమీటర్లు. కాని మామూలు దారి కాదు. సముద్ర మట్టానికి 2000 మీటర్ల నుంచి 3000 మీటర్ల ఎత్తున. చలి, మంచు, పర్వతాల దారి. కాని 146 గంటల్లో సాధించింది. ఈ దారిలో పరిగెత్తిన మొదటి మహిళ ఆమె. ‘ప్రపంచం మొత్తం పరిగెత్తాలని ఉంది’ అంటోందామె. అందుకు లేసులు కూడా బిగిస్తోంది. సంప్రదాయ మారథాన్ గరిష్టంగా 42 కిలోమీటర్లు ఉంటుంది. దానికి మించిన మారథాన్‌ను ఆల్ట్రా మారథాన్ అంటారు. సూఫియా ఖాన్ ఆల్ట్రా రన్నర్. అంటే ఏకధాటిగా వందల కిలోమీటర్ల మారథాన్ చేసే రన్నర్ అన్నమాట. ప్రపంచంలో ఆమెలా పరిగెడుతున్నవారు... రికార్డ్స్ సృష్టిస్తున్నవారు బహుశా మరొకరు లేరు. ఎందుకంటే ఆమె కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పరిగెత్తి ఒక రికార్డు, గోల్డెన్ ట్రయాంగిల్ (జైపూర్, ఢిల్లీ, ఆగ్రా)లో పరిగెత్తి ఒక రికార్డు, తాజాగా మనాలి నుంచి లేహ్‌కు పరిగెత్తి ఒక రికార్డు నమోదు చేసింది. 35 ఏళ్ల వయసులో చిరుతలా పరిగెత్తే ఈమెను అందుకోవడం కష్టమేమి కాదు. కాకపోతే అందుకు మనమూ పరిగెత్తాల్సి ఉంటుంది. అజ్మీర్ అమ్మాయి అజ్మీర్‌లో పుట్టి పెరిగిన సూఫియాకు 16 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి ఆమెను పెంచింది. డిగ్రీ చేశాక ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చూసుకోమ్మా అంది. కాని సూఫియాకు ఏవియేషన్ రంగంలో పని చేయాలనిపించి ఒక ప్రయివేట్ ఎయిర్‌లైన్స్‌లో గ్రౌండ్స్టాఫ్గా చేరింది. అక్కడ బండ చాకిరీ. సంవత్సరాలు గడిచిపోతుండేవి. దానికి తోడు ఆరోగ్యం, ఉత్సాహం సన్నగిల్లడం కూడా. ‘నన్ను నేను ఒకరోజు అద్దంలో చూసుకుంటే నా ఫిట్నెస్ అంతా పోయిందనిపించింది. డ్యూటీ చేస్తూనే ఆరోగ్యం కాపాడుకోవాలంటే రోజూ ఒక 15 నిమిషాలన్నా పరిగెత్తాలని అనుకున్నాను. అలా పరిగెత్తడం మొదలెట్టాను. అప్పటి వరకూ నాకు ఆటలంటే ఇష్టం లేదు. కాని పరిగెడుతుంటే నా శరీరం చిరుతలా మారేది. నాకు పరుగు సరిౖయెనది అని ఇంకా సాధన చేశాను’ అంటుంది సూఫియా. మారథాన్‌లో సూఫియా సందేశం కోసం పరుగు పరుగులో ఆనందం తెలిశాక రొడ్డకొట్టుడు ఉద్యోగాన్ని వదిలేసింది సూఫియా. ఒక సందేశం కోసం తన పరుగును దేశానికి చూపాలనుకుంది. ‘మానవత్వమే ముఖ్యం’ అనే సందేశంతో 2018లో మొదట ఇండియన్ గోల్డెన్ ట్రయాంగిల్ మధ్య పరిగెత్తింది. 720 కిలోమీటర్ల ఈ దూరాన్ని 16 రోజుల్లో ముగించి రికార్డు స్థాపించిందామె. దాంతో ఆమె పరుగు మీద అందరి దృష్టి పడింది. ఆ తర్వాత 2019లో అంతకు మించి సాహసం చేసింది సూఫియా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 4000 కిలోమీటర్ల దూరం– శ్రీనగర్‌తో మొదలయ్యి లూధియానా మీదుగా గజియాబాద్, కోట, ఇండోర్, ముంబై, బెలగామ్, బెంగళూరు, మదురైలను దాటి కన్యాకుమారి వరకూ ఆమె పరిగెత్తింది. ఏప్రిల్ చివరి వారంలో మొదలెట్టి రోజుకు 50 కిలోమీటర్ల లెక్కన పరిగెడుతూ దాదాపు 90 రోజులలో ఆమె ఈ పరుగును పూర్తి చేసి మరో రికార్డును స్థాపించింది. ఇప్పుడు ‘నీ హద్దుల్ని దాటు’ అనే సందేశంతో మనాలి, లేహ్‌ల మధ్య పరిగెత్తింది. ‘నీ హద్దుల్ని దాటు’ స్త్రీలకు అన్నీ హద్దులే. స్త్రీలు చేసే సాహసాలకు అన్నీ ఆటంకాలే. అందుకే సూఫియా ‘నీ హద్దుల్ని దాటు’ అనే సందేశంతో సెప్టెంబర్ 25, 2021 ఉదయం తన ‘హిమాలయన్ ఆల్ట్రా రన్ ఎక్స్‌పెడిషన్’ మనాలి నుంచి మొదలెట్టింది. 480 కిలోమీటర్ల దూరాన్ని అక్టోబర్ 1న లేహ్‌లో ముగించింది. ఇలా ముగించడం సామాన్యం కాదు. ఇలా ముగించిన మహిళ గతంలో లేదు. అందుకే సూఫియా సాహసం గొప్ప స్ఫూర్తిదాయకం అయ్యింది. మనాలి సముద్ర మట్టానికి 6,700 అడుగుల ఎత్తు ఉంటుంది. లేహ్ 11, 500 అడుగుల ఎత్తు. ఈ రెండు ఎత్తుల మధ్య పరిగెత్తాలి. చలి ఈ దారిలో ఒక్కోసారి మైనస్ 5 డిగ్రీలు ఉంటుంది. ఆక్సిజన్ గాలిలో అరవై శాతమే ఉంటుంది. పెద్ద సవాలు. ‘అయినా నేను పరిగెత్తాను. దీనికి ముందు ఒక పదిహేను రోజులు ఈ పర్వతాల్లో క్యాంప్ వేసి ఇక్కడి వాతావరణానికి నా శరీరం అలవాటు పడేలా చేసుకున్నాను.’ అంది సూఫియా. ప్రాణాపాయం లెక్కచేయక మనాలి, లేహ్‌ల మధ్య రోడ్లు బాగుండవు. ఆ దారిలో వాహనాల్లో వెళుతున్నవాళ్లే ఆక్సిజన్ చాలక ఒక్కోసారి మరణిస్తారు. ‘నాక్కూడా ఆ దారిలో ఉండే గ్రామీణులు, ఆర్మీ వాళ్లు చాలా జాగ్రత్తలు, ప్రాణాపాయ పరిస్థితులు చెప్పారు. ప్రాణాయామం, యోగా వల్ల నా లంగ్స్‌ను గట్టి పరుచుకోవడం వల్ల నేను ధైర్యం చేశాను. కాని ఆ ధైర్యం చేయడం వల్ల ఎన్నో మనోహర దృశ్యాలు చూశాను. లడాఖ్ లోయ ముఖద్వారం ‘సర్చూ’, సింధూ నది ప్రవాహం, తంగ్లంగ్ లా పాస్... ఇవన్నీ జీవితంలో ఒక్కసారైనా చూడాలి’ అందామె. సూఫియాకు సపోర్ట్ టీమ్ ఉంటుంది. అది ఆమె వెంట ఉండి ఆ పరుగును, రాత్రి బసను ప్లాన్ చేస్తుంది. రెండుసార్లు గిన్నెస్‌బుక్‌లో ఎక్కిన సూఫియా తర్వాతి అంకం ‘ప్రపంచాన్ని పరుగుతో చుట్టి రావడమే’. ఆ రోజు కూడా బహుశా చూస్తాం. తథాస్తు. -
రష్మీ: ది రాకెట్.. మూడు రకాల లుక్స్‌లో తాప్సీ!
క్రీడల నేపథ్యంలో సాగే చిత్రాలు చేస్తూ తాప్సీ దూసుకెళుతున్నారు. ‘సూర్మ’ చిత్రంలో హాకీ ప్లేయర్‌గా, ‘సాండ్ కీ ఆంఖ్’లో షూటర్‌గా ఈ బ్యూటీ కనిపించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ‘రష్మీ: ది రాకెట్’ చిత్రం కోసం అథ్లెట్‌గా (రన్నర్), ‘శభాష్ మిథు’ (క్రికెట్ క్రీడాకారణి మిథాలీరాజ్ బయోపిక్) సినిమా కోసం క్రికెటర్‌గా మారారు తాప్సీ. ‘రష్మీ: ది రాకెట్’ సినిమా షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేశారు. ఈ చిత్రంలో తాప్సీ మూడు రకాల లుక్స్‌లో కనిపించనున్నారు. ఓ మారుమూల గ్రామానికి చెందిన యువతిగా, ఆ తర్వాత అథ్లెట్‌గా నేషనల్‌కు సెలెక్ట్ అయిన క్రీడాకారిణిగా, అంతర్జాతీయ వేదికలపై జరిగే పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే క్రీడాకారిణిగా.. ఇలా మూడు లుక్స్‌లో ప్రేక్షకులను అలరించనున్నారు తాప్సీ. ఈ లుక్స్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది కాస్ట్యూమ్ టీమ్. ఈ మూడు లుక్స్ తాప్సీ అభిమానులకు త్రిబుల్ ధమాకా అని చెప్పొచ్చు. ‘శభాష్ మిథు’ త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం ‘రన్ లోలా రన్’, ‘దోబార’, తమిళంలో విజయ్ సేతుపతితో ఓ సినిమా.. ఇలా తాప్సీ చేతిలో చాలా సినిమాలున్నాయి. ఇటీవల ఈ సినిమాల చిత్రీకరణల్లో భాగంగా రోజుకి 18 గంటలు పని చేశారట తాప్సీ. అంకితభావానికి చిరునామా తాప్సీ అని ఆయా చిత్రబృందాలు అభినందిస్తున్నాయి. చదవండి: డైరెక్టర్ శంకర్‌కు లైకా సంస్థ షాక్! -
రన్ రష్మీ రన్
రన్నింగ్ ట్రాక్‌లో రాకెట్లా దూసుకెళ్లాలి అంటే గ్రౌండ్లో గంటలు తరబడి కష్టపడాల్సిందే. ప్రస్తుతం అదే చేస్తున్నారు తాప్సీ. ‘రష్మి రాకెట్’ సినిమాలో రన్నర్‌గా కనిపించనున్నారామె. ఆకర్‡్ష ఖురానా దర్శకత్వం వహిస్తున్నారు. క్రీడాకారిణి శరీరాకృతి కోసం ఆల్రెడీ డైట్‌ను పూర్తిగా మార్చేశారు తాప్సీ. తాజాగా గ్రౌండ్లో శిక్షణకు దిగారు. ఈ పాత్రకు సంబంధించిన శిక్షణలో భాగంగా కొన్ని ఫొటోలను షేర్ చేశారు తాప్సీ. ‘రష్మి పాత్ర కోసం ఎగరడం, దూకడం, పరిగెత్తడం, స్కిప్పింగ్... అన్నీ చేస్తున్నాను. ఈ పాత్ర నా మీద కన్నా నా కండరాల మీద తీపి గాయాలు చేస్తోంది’’ అన్నారు తాప్సీ. -
ఆమె పరుగెడితే...
పరుగు... పరుగు... ఆమెకు తెలిసింది ఇదే. అందుకే 16 ఏళ్ల టీనేజ్ ప్రాయంలోనే 1980 మాస్కో ఒలింపిక్స్‌లో పాల్గొన్నది. అలా అని పాతికేళ్లొచ్చాక ఇక చాల్లే అని ఆటకు టాటా చెప్పేయలేదు. 34 ఏళ్ల వయసులోనూ పతకం సాధించింది. 35వ పడిలో జాతీయ రికార్డు సృష్టించింది. అందుకే ఆమె రాణి... పరుగుల రాణి. ఇలా అనగానే ఈపాటికే అర్థమై ఉంటుంది. ఆమె ఇంకెవరో కాదు పీటీ ఉష అని! నిజమే... భారత అథ్లెటిక్స్కే ఆమె ‘ఉష’స్సులాంటిది. అందుకే ‘ఆసియా’లో ఆమె తేజస్సే కొన్నేళ్లపాటు విరాజిల్లింది. పరుగుకు ప్రాణమిచ్చింది. పతకాల పంట పండించింది. భారత అథ్లెటిక్స్‌కు ఆమె నవశకం. నిజానికి ఉష క్రీడాకారిణి కావడం తండ్రికి ఇష్టం లేదు. ఎక్కడ తన తనయ గాయపడుతుందోనని వద్దన్నాడు. చదువులో ముందుండే విద్యార్థి కావడంతో ఉష కూడా ఆమె తల్లిలాగే టీచర్ అవుతుందనుకున్నారంతా. అయితే ఈ కేరళ కుట్టీ టీచర్ కాలేదు. కానీ ‘గోల్డెన్ గాళ్’గా ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత అయింది. ‘పరుగుల రాణిగా’..., ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్’గా అథ్లెటిక్స్‌లో భారత అతివ సత్తా ప్రపంచానికి చాటింది. హీట్స్‌లో వెనుదిరిగి ‘గ్రేటెస్ట్’గా ఎదిగింది... మాస్కో ఒలింపిక్స్ (1980)లో ఉష 16 ఏళ్ల ప్రాయంలో తొలిసారి అంతర్జాతీయ ట్రాక్‌లో బరిలోకి దిగింది. హీట్స్‌లోనే వెనుదిరిగింది. రెండేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ పతకం సొంతగడ్డపై సాధించింది. న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో (1982)లో టీనేజ్ స్ప్రింటర్ 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో రజతాలు సాధించడంతో అందరి కంటా పడింది. ఆ మరుసటి ఏడాదే (1983) కువైట్ ఆతిథ్యమిచ్చిన ఆసియా చాంపియన్‌షిప్‌లో పసిడి ఖాతా తెరిచాక అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. అచిరకాలంలోనే ఇవన్నీ సాధించాక కూడా ఆమె పతకాల దాహం తీరలేదు. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండే ఆమె పెళ్లయి... ఓ పిల్లాడికి తల్లి అయ్యాక కూడా పతకాలు సాధిస్తూనే వచ్చింది. అందుకే ‘ఈ శతాబ్దం భారత మేటి క్రీడాకారిణి’గా నిలిచింది. 1999లో ‘స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ద సెంచరీ’ అవార్డును హాకీ మాంత్రికుడు, దివంగత దిగ్గజం ధ్యాన్‌చంద్‌తో పంచుకుంది. ఆ దిగ్గజానికి సరితూగే అథ్లెట్ కచ్చితంగా ఉష అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రోమ్‌లో మిల్కా... లాస్‌ఏంజెలిస్‌లో ఉష... అచ్చు ‘ఫ్లయింగ్ సిఖ్’ మిల్కా సింగ్‌లాగే పరుగుల రాణి ఉషకూ ఒలింపిక్స్‌లో చేరువైనా చేతికందని పతకం తాలూకూ నిరాశ జీవితానికి సరిపడా ఉంది. 1984లో అమెరికాలోని లాస్ఏంజెలిస్ ఆతిథ్యమిచ్చిన ఒలింపిక్స్ క్రీడల్లో ఆమె సెకనులో వందోవంతు తేడాతో కాంస్యాన్ని కోల్పోయింది. 400 మీటర్ల హర్డిల్స్‌లో విదేశీ అథ్లెట్లకు దీటుగా పరుగెత్తిన మన ‘ఉష’స్సు పోడియం దాకా వెళ్లినట్లు కనిపించినా... చివరకు పోడియం మెట్లపై చూడలేకపోయాం. నవాల్ ఉల్ ముతవకీల్ (మొరాకో–54.61 సెకన్లు), జూడీ బ్రౌన్ (అమెరికా–55.20 సెకన్లు), క్రిస్టినా కొజొకారు (రొమేనియా–55.41 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు నెగ్గగా... 55.42 సెకన్లతో ఉష నాలుగో స్థానంతో తృప్తిపడింది. 1960లో మిల్కా సింగ్‌కు... 24 ఏళ్ల తర్వాత ఉషకు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పతకాలు గెలిచే భాగ్యం, పుటల్లోకెక్కే అదృష్టం సెకనులో దూరమయ్యాయి. క్షణభంగురంతో ఒలింపిక్స్ పతకమైతే చేజారింది కానీ... చేజిక్కాల్సినవి మాత్రం చేతికందకుండా పోలేదు. గెలిచేందుకు ఒక్క ఒలింపిక్సే లేవని... ఎన్నో చోట్లా ఎంతో మందిని ఓడించే స్థయిర్యం, సంకల్పం తనలో ఉన్నాయని ఏడాది తిరిగేసరికే ‘ఆసియా’ ఖండానికి చూపించింది ఉష. జకార్తాలో 1985లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో çపసిడి భరతం పట్టింది. పరుగు పెట్టిన ప్రతీ పోటీలో పతకం అంతు చూడకుండా విడిచిపెట్టలేదు. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పోటీలతో పాటు 400 మీ టర్ల హర్డిల్స్, 400 మీటర్ల రిలేలో ఉష బంగారమైంది. 100 మీ. రిలేలో సహచరుల బలం సరిపోలక కాంస్యం వచ్చింది లేదంటే ఆరో స్వర్ణం ఖాయమయ్యేది. ఈ క్రమంలో ఒకే ఆసియా చాంపియన్‌షిప్‌లో అత్యధికంగా ఆరు పతకాలు గెలిచిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఇక ఇక్కడి నుంచి ఈ పరుగుల రాణి ఆసియానేలింది. వరుసగా జరిగిన 1986 ఆసియా క్రీడలు (సియోల్, దక్షిణ కొరియా), 1987 ఆసియా చాంపియన్‌షిప్ (సింగపూర్)లలో పీటీ ఉష పరుగు పెడితే పతకం పని పట్టింది. సియోల్ గేమ్స్‌లో 100 మీటర్ల స్ప్రింట్‌లో రజతం గెలిచిన ఆమె 200 మీటర్లు, 400 మీటర్లు, 400 మీ. హర్డిల్స్, 4్ఠ400 మీటర్ల రిలే ఈవెంట్స్‌లో స్వర్ణాలు సాధించింది. సింగపూర్ చాంపియన్‌షిప్‌లో స్ప్రింట్‌లో బంగారం చేజారి రజతం వచ్చినా... మిగతా 400 మీటర్లు, 400 మీటర్ల హర్డిల్స్, 4్ఠ400 మీటర్ల రిలే ఈవెంట్లలో పసిడి పంతం మాత్రం వీడలేదు. వరుసగా మూడేళ్ల పాటు తన పరుగుకు అలుపు, పతకాలకు విరామం లేదని చాటింది. 1989 న్యూఢిల్లీలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో 4 స్వర్ణాలు, 2 రజతాలు, బీజింగ్ ఆసియా క్రీడల్లో (1990) మూడు రజతాలు... ‘అమ్మ’గా జపాన్ ఆసియా చాంపియన్‌షిప్ (1998)లో బంగారం గెలిచి ఎప్పటికీ తాను ‘గోల్డెన్ గాళ్’నేనంటూ సత్తా చాటిన ఉష 2000లో తన 20 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. ఓవరాల్‌గా ఎనిమిది ఆసియా చాంపియన్‌షిప్ పోటీల్లో ఉష 23 పతకాలు నెగ్గగా అందులో 14 స్వర్ణాలు ఉండటం విశేషం. -
తల్లి ఒలింపిక్స్ కలను కొడుకు సాకారం చేశాడు!
రియో: రియో ఒలింపిక్స్‌లో దక్షిణాఫ్రికా యువ సంచలనం వాన్ నికెర్క్ స్వర్ణం సాధించాడు. ప్రతిష్టాత్మకమైన 400 మీటర్స్ రన్నింగ్‌లో 43.03 సెకన్ల టైంమింగ్తో ప్రపంచ రికార్డ్ నెలకొల్పి మరీ ఈ విజయం సాధించాడు. నికెర్క్ ప్రదర్శనకు జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ సైతం ముగ్ధుడయ్యాడంటే నికెర్క్ ప్రదర్శన ఎంత అసాధారణమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ విజయం నికెర్క్కు అంత సులభంగా రాలేదు. దాని వెనుక అతడి తల్లి ఒడెస స్వాట్స్ బలమైన సంకల్పం ఉంది. స్వతహాగా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ అయిన స్వాట్స్ ఒలింపిక్స్ గురించి కలలుకన్నా.. ఆనాడు దేశంలో అధికారికంగా అమలులో ఉన్న వర్ణవివక్షత(అపార్థిడ్) మూలంగా.. కనీసం జాతీయ స్థాయిలో పోటీపడే అవకాశం కూడా దక్కలేదు. అయితే ఆమె తన కొడుకు నికెర్క్ ద్వారా ఆమె ఒలింపిక్స్ కలను సాకారం చేసుకుంది. 'నికెర్క్ నెలలు నిండకుండానే(29 వారాలకే) పుట్టడంతో డాక్టర్లు అసలు బ్రతుకుతాడో లేదో అనే సందేహం వ్యక్తం చేశారు. 24 గంటలు గడిస్తేగానీ ఏం చెప్పలేమని తెలిపారు. బ్రతికినా అంగవైకల్యం ఏర్పడే ప్రమాదముందన్నారు' అని స్వాట్ చెప్పుకొచ్చింది. అలాంటి తన కొడుకు నేడు ప్రపంచ వేదికపై నిల్చున్నాడని సంతోషం వ్యక్తం చేసింది. విజయం సాధించిన నికెర్క్తో పాటు తల్లి స్వాట్పై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. -
అండర్–16 రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నీ రన్నరప్‌గా జిల్లా జట్టు
మహబూబ్‌నగర్ క్రీడలు : స్కూల్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జింఖానా మైదానంలో జరిగిన అండర్–16 రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నీలో జిల్లా బాలుర జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 3–2 గోల్స్ తేడాతో జిల్లా జట్టుపై విజయం సాధించింది. జిల్లా జట్టు రెండో స్థానంలో నిలవడంపై సీనియర్ క్రీడాకారులు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. -
బుదియా సింగ్.. నీ పరుగెక్కడ?
మూడేళ్లకే మారథాన్ పరుగు.. నాలుగేళ్ల పసివయసులోనే నలభై మైళ్ల రికార్డు పరుగు.. పసి వయసులో ఏకంగా 48 మారథాన్లు పూర్తిచేసిన అద్వితీయ పరుగు.. ఒడిశా వండర్ కిడ్ జీవితమే ఓ పరుగు. బుడిబుడి అడుగుల బుదియా సింగ్ పరుగు ఆగనంత వరకూ అతడి గమ్యం పరుగెడుతునే ఉంది. నేటికీ ఆ గమ్యం రేసుగుర్రంలా పరుగెడుతూనే ఉంది. బుదియానే దాన్ని అందుకోలేనంత వెనకబడ్డాడు. భారత దేశపు సూపర్‌స్టార్ ఇప్పుడు ఒంటరయ్యాడు. పరుగు మొదలైందిలా.. ఒకరోజు బుదియా ఏదో తప్పు చేశాడు. దీనికి ప్రతిఫలంగా గ్రౌండ్ చుట్టూ పరుగెత్తమంటూ కోచ్ ఆదేశించాడు. కొంత సమయం గడిచింది. కోచ్ దాస్ ఏదో పనిమీద బయటకు వెళ్లాడు. ఓ ఐదు గంటల తర్వాత మళ్లీ గ్రౌండ్‌కు వచ్చాడు. అప్పుడే అతనికి గుర్తుకొచ్చింది బుదియాకు విధించిన శిక్ష. మూడేళ్ల ఈ చిన్నారి అప్పటికీ రౌండ్లు కొడుతూనే ఉన్నాడు. దీంతో ఆశ్చర్యపోవడం కోచ్ వంతైంది. ఐదుగంటల పాటు రన్నింగ్ చేసినా అలసిపోని బుదియాను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అన్ని చెకప్లూ చేయించాడు. గుండెపోటు సాధారణ స్థితిలోనే ఉంది. అప్పుడే బిరించీ దాస్‌కు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. బుదియాకు మారథాన్ ట్రైనింగ్ ఇస్తే ఎలా ఉంటుందీ అన్నదే అది. ఒడిశాలోని ఓ మారుమూల ప్రాంతానికి.. అందులోనూ ఓ మురికివాడకూ మాత్రమే బుదియా ఒకప్పుడు తెలుసు. తర్వాత ప్రపంచమే అతన్ని తెలుసుకుంది. తడబాటు లేకుండా నడవడమే కష్టం అనుకునే వయసులో పదుల కొద్దీ కిలోమీటర్లు అవలీలగా పరుగెత్తేసే బుదియాను అందరూ సూపర్ స్టార్ అన్నారు. వండర్ కిడ్ అంటూ ఆకాశానికెత్తేశారు. అక్కడే ఉంటే పెద్ద స్టారై కూర్చునేవాడే. ఒక్కసారిగా నేలకు లాగేశారు. ప్రపంచంలోని అతిపిన్న మారథాన్ రన్నర్ విధివంచిత గాధ ఇది. బాల్యం.. చిన్నతనంలోనే బుదియా సింగ్ తండ్రిని కోల్పోయాడు. తల్లి అతన్ని వద్దనుకుంది. దారినపోయే ఓ దానయ్యకు బుదియాను 2004లో రూ.800కు అమ్మేసింది. తర్వాత తన దారి తాను చూసుకుంది. తన ప్రమేయం లేకుండానే బుదియా ఎవరెవరి చేతుల్లోనో పడ్డాడు. చివరకు ప్రముఖ జూడో కోచ్ బిరించీ దాస్ కంటపడ్డాడు. కోచ్‌గానే గాక అనాథ పిల్లల సంరక్షుడిగానూ దాస్ పేరున్నవాడు. బుదియాను కూడా అక్కున చేర్చుకున్నాడు. చిన్నారులకు అథ్లెటిక్స్‌లో కోచింగ్ ఇచ్చే అతడు క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉండేవాడు. మారథాన్ రన్నర్‌గా.. గంటల పాటు పరుగెత్తినా అలసిపోని ప్రత్యేక సామర్థ్యం ఈ పసివాడిని మారథాన్ రన్నర్‌ని చేసింది. నాలుగేళ్ల వయసులోనే 48 మారథాన్లు పూర్తి చేసిన బుదియా.. భువనేశ్వర్-పూరీ మధ్య 65 కి.మీ దూరాన్ని ఏడుగంటల్లోనే ఛేదించేసి ఔరా అనిపించాడు. దీంతో రాత్రికి రాత్రే సూపర్‌స్టార్ అయిపోయాడు. ప్రకటనలు, ప్రారంభోత్సవాలు, సన్మానాలు.. ఒకటేమిటి! బుదియా ఓ వెలుగు వెలిగాడు. ప్రపంచంలోని పిన్నవయసు మారథాన్ రన్నర్‌గా విశ్వఖ్యాతి గడించాడు. కుదుపు.. భారత్‌కు అథ్లెటిక్స్‌లో ఒలింపిక్ పతకం సాధిస్తాడని అందరూ భావించిన బుదియా జీవితంలో అతిపెద్ద కుదుపు 2006లో వచ్చింది. ఇంత చిన్న వయసులో అంత పెద్ద దూరాలను ఎలా పరుగెడతాడంటూ కొందరు నానా గొడవా చేశారు. బుదియా హక్కులను కోచ్ కాలరాస్తున్నాడంటూ గోల పెట్టారు. ప్రభుత్వం కూడా వారితో సమ్మతించింది. బుదియాకు పదకొండేళ్లు వచ్చేంతవరకూ పరుగెత్తకూడదంటూ హుకుం జారీ చేసింది. మారథాన్‌లో పాల్గొనకుండా నిషేధం విధించడంతో బుదియా ప్రభుత్వ క్రీడా హాస్టల్ బాట పట్టాడు. మరోవైపు చిన్నారిని చిత్రహింసలకు గురి చేశాడన్న ఆరోపణతో బిరించీ దాస్‌పై కేసులు నమోదయ్యాయి. బిరించీ హత్య.. ఇది జరిగిన కొన్నేళ్ల తర్వాత బిరించీ దాస్ హత్యకు గురయ్యాడు. దీంతో బుదియా ఒంటరయ్యాడు. హాస్టల్లోని సాధారణ విద్యార్థుల్లో ఒకరిగా మారిపోయాడు. అక్కడి ప్రభుత్వ కోచ్ బుదియా ప్రతిభను అంచనా వేయడంలో విఫలమైంది. అతడిని పూర్తిగా పరుగుకు దూరం చేసి, తరగతి గదులకే పరిమితం చేసింది. హాస్టల్లో భోజన సదుపాయం కూడా బాగాలేదని, అక్కడ ఇంకెంత మాత్రం ఉండలేనని బుదియా పదేపదే వాపోయాడు. అయితే అతడి మాటలు వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. దీంతో ప్రభుత్వ హాస్టల్‌కే పరిమితమయ్యాడు. ప్రస్తుత పరిస్థితి.. ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయి అథ్లెట్‌గా కీర్తి పొందిన బుదియా ప్రస్తుతం జిల్లా స్థాయి అథ్లెట్ కూడా కాదు. అతని పతనానికి కారణం ఎవరని ప్రశ్నిస్తే.. సవాలక్ష సమాధానాలు. పుట్టు దారిద్య్రంలో ఉన్న బుదియాను, ఆకలేస్తే తిండికి నోచుకోని బుదియాను, సరైన బట్టకు, చదువుకూ నోచుకోని బుదియాను పట్టించుకోని హక్కుల నాయకులు, ప్రభుత్వం.. అతడి స్థాయి పెరిగాక మాత్రం పట్టించుకోవడం మొదలుపెట్టారు. ఓ రకంగా ఇదే అతని పతనానికి కారణం. ప్రభుత్వం చూపిన వల్లమాలిన ప్రేమే ఈ అసాధారణ చిన్నారిని సాధారణ బాలుడిగా మార్చింది. -
రన్నర్ గెబ్రెసెలాసీ రిటైర్మెంట్
మాంచెస్టర్: సుదూరపు పరుగులో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విఖ్యాత అథ్లెట్ హెయిలీ గెబ్రెసెలాసీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇథియోపియాకు చెందిన 42 ఏళ్ల గెబ్రెసెలాసీ తన 25 ఏళ్ల కెరీర్లో రెండు ఒలింపిక్ స్వర్ణాలు(అట్లాంటా, సిడ్నీ), ఎనిమిది ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్స్‌ను సాధించాడు. ఆదివారం జరిగిన గ్రేట్ మాంచెస్టర్ రన్లో చివరిసారి పాల్గొన్న అతను 16వ స్థానంలో నిలిచాడు. 1500 మీటర్లు, 5 వేలు, 10 వేల మీటర్ల రేసులతోపాటు మారథాన్లోనూ పాల్గొన్న గెబ్రెసెలాసీ మొత్తం 27 సార్లు ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. ‘అంతర్జాతీయ పరుగు పందేల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నాను కానీ పరుగుకు దూరం కావడంలేదు. పరుగు ఆపలేను. అదే నా జీవితం’ అని గెబ్రెసెలాసీ అన్నాడు.