బుదియా సింగ్.. నీ పరుగెక్కడ? | budhia sing details | Sakshi
Sakshi News home page

బుదియా సింగ్.. నీ పరుగెక్కడ?

Published Sat, Jul 25 2015 4:06 AM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM

బుదియా సింగ్.. నీ పరుగెక్కడ?

బుదియా సింగ్.. నీ పరుగెక్కడ?

మూడేళ్లకే మారథాన్ పరుగు.. నాలుగేళ్ల పసివయసులోనే నలభై మైళ్ల రికార్డు పరుగు.. పసి వయసులో ఏకంగా 48 మారథాన్‌లు పూర్తిచేసిన అద్వితీయ పరుగు.. ఒడిశా వండర్ కిడ్ జీవితమే ఓ పరుగు. బుడిబుడి అడుగుల బుదియా సింగ్ పరుగు ఆగనంత వరకూ అతడి గమ్యం పరుగెడుతునే ఉంది. నేటికీ ఆ గమ్యం రేసుగుర్రంలా పరుగెడుతూనే ఉంది. బుదియానే దాన్ని అందుకోలేనంత వెనకబడ్డాడు. భారత దేశపు సూపర్‌స్టార్ ఇప్పుడు ఒంటరయ్యాడు.
 
పరుగు మొదలైందిలా..
ఒకరోజు బుదియా ఏదో తప్పు చేశాడు. దీనికి ప్రతిఫలంగా గ్రౌండ్ చుట్టూ పరుగెత్తమంటూ కోచ్ ఆదేశించాడు. కొంత సమయం గడిచింది. కోచ్ దాస్ ఏదో పనిమీద బయటకు వెళ్లాడు. ఓ ఐదు గంటల తర్వాత మళ్లీ గ్రౌండ్‌కు వచ్చాడు. అప్పుడే అతనికి గుర్తుకొచ్చింది బుదియాకు విధించిన శిక్ష. మూడేళ్ల ఈ చిన్నారి అప్పటికీ రౌండ్లు కొడుతూనే ఉన్నాడు. దీంతో ఆశ్చర్యపోవడం కోచ్ వంతైంది. ఐదుగంటల పాటు రన్నింగ్ చేసినా అలసిపోని బుదియాను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అన్ని చెకప్‌లూ చేయించాడు. గుండెపోటు సాధారణ స్థితిలోనే ఉంది. అప్పుడే బిరించీ దాస్‌కు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. బుదియాకు మారథాన్ ట్రైనింగ్ ఇస్తే ఎలా ఉంటుందీ అన్నదే అది.
 
ఒడిశాలోని ఓ మారుమూల ప్రాంతానికి.. అందులోనూ ఓ మురికివాడకూ మాత్రమే బుదియా ఒకప్పుడు తెలుసు. తర్వాత ప్రపంచమే అతన్ని తెలుసుకుంది. తడబాటు లేకుండా నడవడమే కష్టం అనుకునే వయసులో పదుల కొద్దీ కిలోమీటర్లు అవలీలగా పరుగెత్తేసే బుదియాను అందరూ సూపర్ స్టార్ అన్నారు. వండర్ కిడ్ అంటూ ఆకాశానికెత్తేశారు. అక్కడే ఉంటే పెద్ద స్టారై కూర్చునేవాడే. ఒక్కసారిగా నేలకు లాగేశారు. ప్రపంచంలోని అతిపిన్న మారథాన్ రన్నర్ విధివంచిత గాధ ఇది.

బాల్యం..
చిన్నతనంలోనే బుదియా సింగ్ తండ్రిని కోల్పోయాడు. తల్లి అతన్ని వద్దనుకుంది. దారినపోయే ఓ దానయ్యకు బుదియాను 2004లో రూ.800కు అమ్మేసింది. తర్వాత తన దారి తాను చూసుకుంది. తన ప్రమేయం లేకుండానే బుదియా ఎవరెవరి చేతుల్లోనో పడ్డాడు. చివరకు ప్రముఖ జూడో కోచ్ బిరించీ దాస్ కంటపడ్డాడు. కోచ్‌గానే గాక అనాథ పిల్లల సంరక్షుడిగానూ దాస్ పేరున్నవాడు. బుదియాను కూడా అక్కున చేర్చుకున్నాడు. చిన్నారులకు అథ్లెటిక్స్‌లో కోచింగ్ ఇచ్చే అతడు క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉండేవాడు.

మారథాన్ రన్నర్‌గా..
గంటల పాటు పరుగెత్తినా అలసిపోని ప్రత్యేక సామర్థ్యం ఈ పసివాడిని మారథాన్ రన్నర్‌ని చేసింది. నాలుగేళ్ల వయసులోనే 48 మారథాన్‌లు పూర్తి చేసిన బుదియా.. భువనేశ్వర్-పూరీ మధ్య 65 కి.మీ దూరాన్ని ఏడుగంటల్లోనే ఛేదించేసి ఔరా అనిపించాడు. దీంతో రాత్రికి రాత్రే సూపర్‌స్టార్ అయిపోయాడు. ప్రకటనలు, ప్రారంభోత్సవాలు, సన్మానాలు.. ఒకటేమిటి! బుదియా ఓ వెలుగు వెలిగాడు. ప్రపంచంలోని పిన్నవయసు మారథాన్ రన్నర్‌గా విశ్వఖ్యాతి గడించాడు.

కుదుపు..
భారత్‌కు అథ్లెటిక్స్‌లో ఒలింపిక్ పతకం సాధిస్తాడని అందరూ భావించిన బుదియా జీవితంలో అతిపెద్ద కుదుపు 2006లో వచ్చింది. ఇంత చిన్న వయసులో అంత పెద్ద దూరాలను ఎలా పరుగెడతాడంటూ కొందరు నానా గొడవా చేశారు. బుదియా హక్కులను కోచ్ కాలరాస్తున్నాడంటూ గోల పెట్టారు. ప్రభుత్వం కూడా వారితో సమ్మతించింది. బుదియాకు పదకొండేళ్లు వచ్చేంతవరకూ పరుగెత్తకూడదంటూ హుకుం జారీ చేసింది. మారథాన్‌లో పాల్గొనకుండా నిషేధం విధించడంతో బుదియా ప్రభుత్వ క్రీడా హాస్టల్ బాట పట్టాడు. మరోవైపు చిన్నారిని చిత్రహింసలకు గురి చేశాడన్న ఆరోపణతో బిరించీ దాస్‌పై కేసులు నమోదయ్యాయి.
 
బిరించీ హత్య..
ఇది జరిగిన కొన్నేళ్ల తర్వాత బిరించీ దాస్ హత్యకు గురయ్యాడు. దీంతో బుదియా ఒంటరయ్యాడు. హాస్టల్‌లోని సాధారణ విద్యార్థుల్లో ఒకరిగా మారిపోయాడు. అక్కడి ప్రభుత్వ కోచ్ బుదియా ప్రతిభను అంచనా వేయడంలో విఫలమైంది. అతడిని పూర్తిగా పరుగుకు దూరం చేసి, తరగతి గదులకే పరిమితం చేసింది. హాస్టల్‌లో భోజన సదుపాయం కూడా బాగాలేదని, అక్కడ ఇంకెంత మాత్రం ఉండలేనని బుదియా పదేపదే వాపోయాడు. అయితే అతడి మాటలు వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. దీంతో ప్రభుత్వ హాస్టల్‌కే పరిమితమయ్యాడు.
 
ప్రస్తుత పరిస్థితి..
ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయి అథ్లెట్‌గా కీర్తి పొందిన బుదియా ప్రస్తుతం జిల్లా స్థాయి అథ్లెట్ కూడా కాదు. అతని పతనానికి కారణం ఎవరని ప్రశ్నిస్తే.. సవాలక్ష సమాధానాలు. పుట్టు దారిద్య్రంలో ఉన్న బుదియాను, ఆకలేస్తే తిండికి నోచుకోని బుదియాను, సరైన బట్టకు, చదువుకూ నోచుకోని బుదియాను పట్టించుకోని హక్కుల నాయకులు, ప్రభుత్వం.. అతడి స్థాయి పెరిగాక మాత్రం పట్టించుకోవడం మొదలుపెట్టారు. ఓ రకంగా ఇదే అతని పతనానికి కారణం. ప్రభుత్వం చూపిన వల్లమాలిన ప్రేమే ఈ అసాధారణ చిన్నారిని సాధారణ బాలుడిగా మార్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement