కలిసి నడుద్దాం... | Hyderabad K Runners Group | Sakshi
Sakshi News home page

కలిసి నడుద్దాం...

Apr 2 2025 3:20 AM | Updated on Apr 2 2025 3:20 AM

Hyderabad K Runners Group

రోజూ వాకింగ్‌ చేస్తూ ఉంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని మనకు తెలిసిందే! వాకింగ్‌ చేసేవారు గ్రూప్‌గా కలిసి పర్యావరణ ఆరోగ్యాన్నీ బాగు చేద్దామనుకుంటే... ఆ పనిని హైదరాబాద్‌ కె రన్నర్స్‌ గ్రూప్‌ మూడేళ్లుగా చేస్తోంది. ఈ గ్రూప్‌లో డాక్టర్లు, ఐటీ నిపుణులు,  గృహిణులు సభ్యులుగా ఉన్నారు. వృత్తి, ఉద్యోగాలు, పిల్లల బాధ్యతలు నిర్వర్తిస్తూనే పర్యావరణ, ఆరోగ్య అవగాహననూ స్వచ్ఛందంగా  కల్పిస్తూ ఎంతో మందికి స్ఫూర్తి కలిగిస్తున్నారు. పర్యావరణ హితం కోరేవారంతా తమతో కలిసి  నడవచ్చు అంటూ చెబుతున్న ఈ గ్రూప్‌ సభ్యుల  సూచనను మనమూ అమలుచేద్దాం...

విందు వినోదాలలో పాల్గొనడం మన చుట్టూ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించుకోవడానికి. ఆ ఆనందంలో పర్యావరణానికి హాని చేస్తున్నామా అనే ఆలోచన చేయడమే కాదు మేలు కలిగే పనులనూ అమలులో పెట్టి చూపుతోంది కె రన్నర్‌ గ్రూప్‌. మూడేళ్లక్రితం ఇద్దరితో మొదలైన ఇప్పుడు 35 మందితో తమ చుట్టూ ఉన్నవారికి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తోంది. విందు కార్యక్రమాలలో యూజ్‌ అండ్‌ థ్రోకు ‘నో’ చెబూతూ స్టీల్‌ ప్లేట్స్‌ను వెంట తీసుకెళుతున్నారు. 

వాకింగ్‌కి వెళుతూ రోడ్డు పక్కల పడి ఉన్న ప్లాస్టిక్‌ను సేకరించి, గార్బేజ్‌కు పంపిస్తున్నారు. వారాంతాల్లో చెరువులు, కోటలలో పేరుకు పోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగిస్తున్నారు. వీధుల్లో చేరే మూగజీవాలకు ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పనుల ఒత్తిడిలోనూ అనేక ప్రయోజనకర పనులను ఎంచుకుంటున్నారు.

వాకింగ్‌ చేస్తూ... ప్లాస్టిక్‌ సేకరిస్తూ...
మా గ్రూప్‌లో నలభై ఏళ్ల నుంచి అరవై ఏళ్ల వయసు వాళ్లున్నారు. ఎవరి కాలనీలలో వారు రోజూ వాకింగ్, రన్నింగ్‌ చేసినా ప్రతి నెలా అందరూ కలిసేలా కంటి ఆరోగ్యం, క్యాన్సర్‌ అవేర్‌నెస్, ఉమెన్‌ పవర్‌.. అంటూ రన్‌ని ఏర్పాటు చేస్తుంటాం. దీనిలో భాగంగానే మా చుట్టూ ఉన్నవారిలో ఆరోగ్య స్పృహ పెంచడం, ప్లాస్టిక్‌ ఫ్రీ జోన్స్‌ని చేయాలనుకున్నాం. అందుకే, రోజూ వాకింగ్‌ వెళ్లినా వెంట ఓ బ్యాగ్‌ తీసుకెళ్లి, పడేసిన ప్లాస్టిక్‌ కవర్లు, బాటిల్స్‌ సేకరించి, ఒక చోట డంప్‌ చేస్తున్నాం. 

ఇటీవల భువనగిరి ఫోర్ట్, అక్కడి చెరువు వద్ద ప్లాస్టిక్‌ ఫ్రీ జోన్‌గా చేయాలని సంకల్పించుకొని, వెళ్లి మా పనులు మొదలుపెట్టాం. రైతులు–వినియోగదారుల మధ్య దళారులు లేకుండా 35 కుటుంబాలకు నేరుగా కూరగాయలు, ఇతర ధాన్యం చేరేలా చూస్తున్నాం. ఇప్పుడు నేరుగా కస్టమర్లే రైతులు అడిగి, తమకు కావల్సినవి తెప్పించుకుంటున్నారు. రైతులు పువ్వులతో చేసిన ఆర్గానిక్‌ కలర్స్‌ని మా గ్రూప్‌ అంతా హోళీకి ఉపయోగించాం.  – శోభా కార్తీక్, కరాటే ఇన్‌స్ట్రక్టర్‌

పార్టీకి వెళితే... స్టీల్‌ ప్లేట్, స్పూన్‌
బయట పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను చూసి, మా గ్రూప్‌ సభ్యులు యూజ్‌ అండ్‌ త్రో వస్తువులు వాడవద్దని ముందే నిర్ణయించుకున్నాం. దీంతో నేను మా పాప కోసం కేక్‌ కొనడానికి బేకరీకి వెళ్లినా వెంట స్టీల్‌ బాక్స్‌ తీసుకెళతాను. ఏదైనా పార్టీకి వెళ్లినా స్టీల్‌ ప్లేట్, స్పూన్, టీ కప్పు వెంటే ఉంటుంది. ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు. చెప్పడమే కాదు చేసి చూపితేనే అందరూ ఈ పద్ధతిని అవలంబిస్తారు. కొత్తపేటౖ రెతు మార్కెట్‌కి వెళ్లినప్పుడు అక్కడివాళ్లు టీ కోసం యూజ్‌ అండ్‌ త్రో కప్స్‌ ఎక్కువ వాడుతుండటం చూశాం. వాటిల్లో తాగడం ఆరోగ్యానికీ మంచిది కాదు.

అందుకని, సిరామిక్‌ కప్పుల సెట్స్‌ తీసుకెళ్లి అక్కడి వర్కర్స్‌కి ఇచ్చి, ఎందుకు ప్లాస్టిక్‌ మంచిదో కాదో వివరించి వచ్చాం. మా రన్నర్స్‌ గ్రూప్‌లోని 28 మందిమి కలిసి ఇటీవల భువనగిరి కోట శుభ్రం చేయడానికి వెళ్లాం. అక్కడంతా రేపర్స్, పాలిథిన్‌ కవర్స్, ప్లాస్టిక్‌ బాటిల్స్‌... కనిపించాయి. మైక్రో ప్లాస్టిక్‌కి అయితే కొదవే లేదు. మేం కోట దిగి కిందకు వచ్చేసరికి వెంట తీసుకెళ్లిన బ్యాగులన్నీ నిండిపోయాయి. మా గ్రూప్‌లో జంతుప్రేమికులూ ఉన్నారు. 

వీధికుక్కలు దాడి చేస్తున్నాయని వాటిని కొట్టడం, చంపడం చేస్తుంటారు. వాటికి సరైన ఆహారం లేకనే అలా చేస్తుంటాయి. కారణాలు అన్వేషించాలి కానీ, చంపేస్తే ఎలా? అందుకే వాటికి కావల్సిన ఆహారం వండిపెట్టడం, అనారోగ్యంగా ఉన్నవాటికి చికిత్స అందించటం వంటివి గత పదేళ్లుగా చేస్తున్నాం. న్యూస్‌ పేపర్స్‌ని సేకరించి, స్కూల్‌ పిల్లల చేత బ్యాగులు చేయించి కూరగాయల మార్కెట్‌ దగ్గర కస్టమర్లకు ఇవ్వాలనే ప్లాన్‌ చేస్తున్నాం. – శ్రావణి, ఆర్కిటెక్ట్‌

బంధుమిత్రులలోనూ అవగాహన
మా గ్రూప్‌లో మల్టీ టాస్కింగ్‌ చేస్తున్న లాయర్లు, డాక్టర్లు, సాఫ్ట్‌వేర్లు, వివిధ రంగాలలో వర్క్‌ చేస్తున్నవారున్నారు. సిటీలో వివిధ చోట్ల నుంచి  రన్‌లో పాల్గొనడానికి వచ్చే ఫ్రెండ్స్‌ ఉన్నారు. ప్రతిరోజూ వాకింగ్, రన్నింగ్‌కి కేటాయించే టైమ్, తీసుకోవాల్సిన హెల్తీ ఫుడ్‌ గురించి ఎవరి ఫిట్‌నెస్‌ బట్టి వారికి షెడ్యూల్‌ చేసుకుంటాం. 

నోబుల్‌ కాజెజ్‌ రన్స్‌ అన్నింటిలోనూ పాల్గొంటుంటాం. ఈ ప్రయోజనాలను మరికొందరికి అందించాలనే ఆలోచనతో బంధు, మిత్రులలోనూ, మా పిల్లలను కూడా రన్నర్స్‌ గ్రూప్‌లలో పాల్గొనేలా ఎంకరేజ్‌ చేస్తున్నాం. చుట్టూ ఉన్నవారిలో ఆరోగ్య అవగాహనతో ప్లాస్టిక్‌ ఫ్రీ జోన్స్‌ చేయాలనుకున్నాం. రన్‌ గ్రూప్‌ పార్టీలలో పర్యావరణ హితంగా ఏమేం చేయచ్చు అనే అంశాల మీద చర్చించుకొని, వారాంతాల్లో ఆ కార్యక్రమాలను నిర్వహిస్తుంటాం. – డాక్టర్‌ శిరీష, గైనకాలజిస్ట్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement