
వాస్తవానికి ఇల్లు అనగానే అక్కడ మనకే భయాలూ ఉండవని ఫీలవుతాం. మన ఇంటిని మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. అక్కడ నిర్భయంగా ఫీలవుతూ హాయిగా ఉంటాం. కానీ అక్కడా మనకు అడుగడుగునా అపాయాలు పొంచి ఉంటాయి. అది సోఫాలో కావచ్చు. కర్టెన్ల వెనకాల కావచ్చు. డైనింగ్ టేబుల్‌ను తుడిచే స్పాంజి కావచ్చు. ఇక్కడా, అక్కడా అని కాకుండా మన ఇంట్లోనే ప్రతిచోటా ముప్పులెలా పొంచి ఉంటాయో, వాటిని తెలుసుకుని మనమెలా జాగ్రత్తపడాలో చూద్దాం...
ఇంట్లో ఉన్నవన్నీ మన ఉపయోగానికి అనుకుంటాం. మనకు ఉపయోగపడుతున్నాయని మనం భావించే అవన్నీ మనకు ఎలాంటి కీడు చేస్తున్నాయో తెలుసుకుందాం.
ప్లాస్టిక్ అనేది ఓ అందమైన విషం...
చాలామంది డైనింగ్ టేబుల్స్ మీద ఉండే డిన్నర్‌సెట్‌ల తాలూకు సూప్ బౌల్స్, కూరలు వడ్డించడానికి వాడే ప్లాస్టిక్ గిన్నెలన్నీ పైకి కనిపించేటంతటి అందమైనవి కావు. నిజానికి ఇవన్నీ ‘మెలామైన్’ అనే ఒక రకం ప్లాస్టిక్ పదార్థంతో తయారవుతాయి.
ఇందులోకి వేడి వేడి కూరలు, పులుసులు తీయగానే వేడికి ఆహారంతోపాటు ఆ మెలామైన్ అనే ప్లాస్టిక్ కూడా నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయన నివేదిక ప్రకారం దేహంలోకి వెళ్లిన మెలామైన్ కారణంగా కిడ్నీలో రాళ్లు వస్తాయని తేలింది. గతంలో జరిగిన ఈ అధ్యయనంలో భాగంగా...
కొంతమంది వాలంటీర్లకు మెలామైన్ బౌల్స్‌లో నూడుల్స్ ఇచ్చారు. మరికొందరికి పింగాణీ బౌల్స్‌లో అదే పదార్థాన్ని వడ్డించారు. నిర్ణీత కాలవ్యవధి తర్వాత ఈ రెండు గ్రూపుల వారికి నిర్వహించిన మూత్ర పరీక్షల్లో మెలామైన్ బౌల్స్‌లో తిన్నవారి మూత్రంలో మెలామైన్ మోతాదులు దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువనీ, దాంతో కిడ్నీఫెయిల్యూర్ అవకాశాలూ ఎక్కువని తేలింది. క్యాన్సర్ ముప్పు కూడా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. ∙
మైక్రోవేవ్ ఓవెల్‌లో ఉంచి వేడి చెయవద్దు
వడ్డించడానికి మెలామైన్ బౌల్‌లోకి పులుసునో, కూరనో తీశాక... ఇక అందులోని పదార్థాన్ని వేడిచేయడం కోసం ఆ బౌల్‌ను మైక్రోవేవ్ ఒవెన్‌లో ఉంచి వేడిచేయకూడదని అమెరికన్ ప్రమాణాల సంస్థ ఎఫ్‌డీఏ గట్టిగా చెబుతోంది. ఈ ప్లాస్టిక్ బౌల్స్‌లో ఉంచుకుని వేడి వేడి ఆహారం తింటే అది హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ స్రావంపై దాని దుష్ప్రభావం ఉంటుందని పేర్కొంది.
ఫలితంగా ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంతో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చు. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గుతాయంటున్నారు. ఇలాంటి బౌల్స్‌లో తినే చాలామందిలో డయాబెటిస్ రిస్క్ పెరుగుతున్నట్లుగా మరో అధ్యయనంలో తేలింది.
అనేక ముప్పుల పుట్ట ఆ మెలామైన్ బౌల్
స్థూలకాయం వస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. దీంతో రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ రిస్క్‌లు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ బౌల్స్‌లో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమైపోయి జ్ఞాపకశక్తి తగ్గే ముప్పు ఉందనీ, అలాగే వెంటవెంటనే మూడ్స్ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు కూడా గుర్తించారు. ఫలితంగా అల్జీమర్స్ వంటి నాడీసంబంధమైన సమస్యలూ పెరుగుతున్నాయంటూ అనేక అధ్యయనాల్లో తేలింది.
పరిష్కారమిది
వేడివేడి సూప్‌లను వడ్డించాలనుకుంటే పింగాణీ బౌల్స్ లేదా పింగాణీ ప్లేట్లే ఆరోగ్యదాయకం. గాజు బౌల్స్ లేదా గాజు ప్లేట్లు కూడా వాడుకోవచ్చు.
నల్లాల్లోంచి ఈ–కొలై...
దీర్ఘకాలం పాటు నిల్వ ఉండే నీళ్లు... కొళాయి (నల్లా/పంపు) నుంచి వస్తున్నప్పుడు అందులో ఆ నీళ్లతో పాటు ‘ఈ–కొలై’ (ఎష్చరీషియా కొలై) అనే ఏకకణ పరాన్న జీవులూ రావచ్చు. ఎందుకంటే అవి నిల్వ ఉండే నీళ్లలో పెరిగి, ఆ నీళ్లను కలుషితం చేస్తాయి. ఈ నీటితో ఆహారాలను కడిగినప్పుడూ లేదా ఆహారం తింటున్నప్పుడు... కలుషితమైన ఆ నీళ్లను తాగినప్పుడు ‘ఈ–కొలై’ సూక్ష్మజీవులు ఒంట్లోకి ప్రవేశించే అవకాశముంది.
దాంతో నీళ్ల విరేచనాల వంటి ప్రమాదముంది. నిజానికి ఆ నీళ్లతో వంట చేసే సమయంలో మరిగించినప్పుడు ఈ–కొలై నశించిపోవచ్చు. కానీ నీళ్లను మరిగించకుండా వాడే పానీపూరీ/ గప్‌చుప్ / గోల్‌గప్పా’ వంటి వాటిల్లో... ఈ–కొలై ఉన్న నీటిని ఉపయోగిస్తే నీళ్ల విరేచనాల ముప్పు తప్పదు. పైగా దూర్రప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ ఇలాంటి ఈ–కొలై ఉన్న నీళ్లను వాడితే ఆరోగ్య సమస్యలతోపాటు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఇతరత్రా అనేక ఇతర సమస్యలతోనూ ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశముంటుంది.
పరిష్కారమిది
ఇంటికి దూరంగా దూర్రప్రాంతాల్లో ప్రయాణాలు చేస్తున్నవారు మరిగించకుండా తయారు చేసే ఆహారాలనూ లేదా వేడిగా లేని ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిది
కర్టెయిన్‌లతో కల్లోలాలిలా...
గతంలో మన ఇళ్లలో బట్టతో నేసిన కర్టెయిన్లు ఉండేవి. మాసి΄ోగానే ఉతుక్కునేందుకు వీలుగా ఉండేవి. కొద్దికాలంలో పాడైపోతే మళ్లీ కొత్త కర్టెయిన్‌లు తెచ్చుకోవాల్సి వచ్చేది. ఆ తర్వాత బట్టలతో చేసిన కర్టెయిన్లు కాకుండా మరింత కాలం మన్నడానికి ప్లాస్టిక్ వంటి పదార్థంతో రూపొందించిన కర్టెయిన్లను వాడటం మొదలుపెట్టాం.
అవి కాల ప్రభావానికి లోనై పాడైపోకుండా చాలాకాలం మన్నికతో ఉంటాయని ఆశపడ్డాం. ఇక బాత్‌రూమ్‌ల విషయానికి వస్తే... అక్కడ నీళ్లతో తడిసి పాడైపోకుండా ఉండటం కోసం, అలాగే షవర్ కర్టెయిన్లుగా పిలిచే వాటర్‌ప్రూఫ్ మెటీరియల్‌తో తయారైనవే ఎక్కువగా వాడుతున్నాం. ‘థాలేట్’ అనే పదార్థంతో తయారయ్యే ఈ ప్లాస్టిక్ కర్టెయిన్లు ఎటు పడితే అటు వంగేందుకు ఎలా పడితే అలా వంచేందుకు వీలుగా రూపొందుతాయి. ఈ షవర్ కర్టయిన్లే కాకుండా, ఇండ్లలో అలంకరణ కోసం ఉపయోగించే వాల్‌పేపర్లు, ఫ్లెక్సీలు కూడా ఈ థాలేట్ అనే పదార్థంతోనే తయారవుతాయి.
ఈ థాలేట్ అనే పదార్థంతో తయారయ్యే అన్ని రకాల ఉత్పాదనలు పురుష సెక్స్ హార్మోన్‌పై దుష్ప్రభావం చూపుతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు వీటి వల్ల వీర్యం క్వాలిటీ దెబ్బతింటుందని కూడా నిర్ద్వంద్వంగా తేలింది. ఈ తరహా ప్లాస్టిక్‌తో తయారయ్యే ఉత్పాదనల మీది నుంచి వచ్చే గాలి పీల్చడం కారణంగా అలర్జీలు, శ్వాససంబంధ సమస్యలు ఉత్పన్నం కావడం జరగవచ్చు. ఆస్తమా, పిల్లికూతల వంటి లక్షణాలు కనిపించవచ్చు.
ఇళ్లలో గర్భవతులు ఉంటే అది వారికి మరీ ప్రమాదం. ఇవి ఉపయోగించడం అంటే... ఇళ్లను అందంగా చేసి, ఆ ఇండ్లలో పుట్టి పెరగబోయే పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే. ఎందుకంటే ఇలాంటివి ఉపయోగించే ఇళ్లలో పెరిగే పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) వంటివి కనిపించే అవకాశాలు ఎక్కువ. మరీ ముఖ్యంగా నాలుగు నుంచి తొమ్మిదేళ్ల పిల్లల్లో ఈ ధోరణులు మరింత ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువని మౌంట్ సినాయ్ మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనల ఫలితాలు తెలుపుతున్నాయి.
పరిష్కారమిది
ఇంట్లో డోర్ కర్టెయిన్లు, షవర్ కర్టెయిన్లు కేవలం నేసిన బట్టతో తయారైన నిరపాయకరమైన కర్టెయిన్లనే వాడాలి. అలంకరణ కోసం అమర్చేవీ, ఫర్నిచర్‌లు... ప్లాస్టిక్ లేదా పీవీసీతో తయారు చేసిన వాటి కంటే కలపతో చేసినవే మంచివని గుర్తుంచుకోవాలి.
వంటచేసే ప్రదేశంలో ధారాళంగా గాలి...
చాలామంది వంటగదిని ఇరుకుగా రూపొందించుకుంటారు. కేవలం వంట సమయంలో తప్ప మిగతా వేళల్లో అక్కడ పెద్దగా ఉండబోమనే అభిప్రాయంతో వంటగదిని ఇరుగ్గా నిర్మించుకుంటారు. నిజానికి కిచెన్‌లోకి ధారాళంగా గాలి వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు పెద్దగా కిరోసిస్ స్టవ్‌లు ఉపయోగించడం లేదుగానీ... గతంలో ఇలాంటివి ఎక్కువగా వాడేవారు.
అలాగే కట్టెలపొయ్యి మీద కూడా వంటలు చేసుకునేవారు. వంటగది ఇరుగ్గా ఉంటే అక్కడ ఇంధనం మండే సమయంలో కార్బన్ డై ఆక్సైడ్‌తో పాటు కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికరమైన వాయువులు వెలువడే అవకాశాలు ఎక్కువే. ఒక్కోసారి వాటివల్ల ప్రాణాపాయం కలిగే అవకాశమూ ఉండవచ్చు. అందుకే కిచెన్ తగినంత విశాలంగా, గాలి ఆడేలా ఉండాలి. ఒక్కోసారి గ్యాస్ వాటర్ హీటర్స్ నుంచి కూడా విషవాయువులు వెలువడే ప్రమాదం ఉంది.
పరిష్కారమిది
వంటగది విశాలంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. అనవసరమైన వస్తువులతో దాన్ని నింపేయవద్దు. బొగ్గులు, నిప్పుల మీద చేసే వంటలను కిచెన్‌లో చేయకపోవడమే మంచిది. అలాంటి వంటకాలను ఆరుబయటే చేయాలి. ఆర్థిక స్తోమత ఉన్నవారు వంటిళ్లలో పొగ, కార్బన్‌మోనాక్సైడ్ డిటెక్టర్లను, ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లను అమర్చుకోవడం వల్ల ఎన్నో అనర్థాలూ, ప్రమాదాలు తప్పుతాయి.
సోఫాలో కూర్చుండే విషాలూ అనేకం...
ఇటీవల ఆధునికమైన ఇంటి ఫర్నిచర్‌తో పాటు కొన్ని రకాల సోఫాల వంటి వాటిని నిప్పు అంటుకోకుండా ఉండేందుకు వాటిని ఫైర్ రెసిస్టెంట్ పదార్థాలతో తయారు చేస్తున్నారు. ఈ ఫైర్ రెసిస్టెంట్ రసాయనాలను ‘ఫ్లేమ్ రిటార్డెంట్స్’ అంటారు. మనం ఈ ఫర్నిచర్‌తోపాటు సోఫాలపై చేతులు ఉంచినప్పుడు ఈ రసాయనాలూ చేతులపైకి చేరతాయి. ఆ చేతులతోనే మనం ఏవైనా ఆహారపదార్థాలను తిన్నప్పుడు అవి నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి.
ఇలాంటి విషపదార్థాలన్నీ మన వినాళ గ్రంథుల వ్యవస్థ (ఎండోక్రైన్ సిస్టమ్)ను దెబ్బతీస్తాయి. దాంతో మన గ్రంథుల నుంచి స్రవించే అనేక ఎంజైముల, అలాగే జీవరసాయనాల సమతౌల్యం దెబ్బతినడానికి అవకాశముంది. దాంతో మన ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద వాటి తాలూకు దుష్ప్రభావం పడే అవకాశం ఉంది. దాంతో కొన్ని రకాల ప్రత్యుత్పత్తి సంబంధిత వ్యాధులూ (రీప్రోడక్టివ్ డిజార్డర్స్) రావచ్చు. ఒక్కోసారి కొన్ని క్యాన్సర్లు వచ్చేందుకూ అవకాశముంది.
పరిష్కారమిది :
సోఫాలను క్రమం తప్పకుండా వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రపరుచుకుంటూ ఉండాలి. ఇలా శుభ్రపరిచే సమయంలో ఎయిర్‌ఫిల్టర్ ఉపయోగించడం మరింత శ్రేయస్కరం. సోఫా మీద కూర్చున్న తర్వాత ఏదైనా తినాల్సి వస్తే... చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తినేముందు నోటిని నీళ్లతో పుక్కిలించడం అవసరం. (ఇది సోఫాలోని విష రసాయనాలనుంచే కాకుండా, ఈ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల ఇతరత్రా జబ్బులు వచ్చే అవకాశాలూ తగ్గుతాయి).
మౌల్డ్ (బూజు)కు ఆస్కారమివ్వద్దు...
బ్రెడ్ ప్యాకెట్ తెరచి కొన్ని స్లైస్‌లు తిన్నతర్వాత, అలాగే ఉంచేస్తే మిగతా స్లైస్‌లపైన బూజు రావడం చాలామంది అనుభవంలోకి వచ్చే విషయమే. ఈ బూజునే మౌల్డ్ అంటారు. ఈ బూజు నుంచి వచ్చే గాలులు పీల్చినప్పుడు ముక్కులు బిగుసుకుపోవడం, ఊపిరితిత్తుల్లోకి వెళ్లే గాలిగొట్టాలు (విండ్‌పైప్స్) సన్నబడినట్లుగా మారి ఆయాసం, ఆస్తమా రావడం చాలామందిలో కనిపించే సమస్యే. ఇక చూసుకోకుండా అలాంటి బ్రెడ్ స్లైస్ తింటే విరేచనాల వంటి అనారోగ్యాలు తప్పవు. అందుకే డైనింగ్ టేబుల్ మీద ఉండే బ్రెడ్ వంటి ఆహారాలకు మౌల్డ్ సోకనివ్వకుండా తాజాగా ఉన్నప్పుడే తినేయాలి.
పరిష్కారమిది
తేమ ఎక్కువగా ఉండే చోట్ల ఆహారాలను నిల్వ చేయడం వల్ల మౌల్డ్ వెంటనే వస్తుంది. అందుకే అలాంటి వాతావరణం ఉండేచోట్ల ఆహారాన్ని నిల్వ చేయకూడదు. మన వంటపాత్రలను వీలైనంత వరకు డిష్–వాషింగ్ సోప్‌తో కడిగి పెట్టుకోవాలి. పల్లెల్లో కొందరు మట్టితో గిన్నెలు కడుగుతుంటారు. అలా మట్టితో కడగడం ఎంతమాత్రమూ సబబు కాదు. ఎందుకంటే మట్టిలో సైతం మన ఆరోగ్యానికి కీడు చేసే సూక్ష్మజీవులు ఉండే అవకాశముంది. అందుకే పల్లెల్లోని వారు సబ్బు ఉపయోగించకపోతే గిన్నెలు తోమడానికి బూడిదను ఉపయోగించడం మంచిది. ఎందుకంటే మట్టితో పోలిస్తే బూడిదలో హానికరమైన పదార్థాలు అంతగా ఉండవు.
ప్లాస్టికే కాదు... ‘నాన్‌స్టిక్’ కూడా...
ఈమధ్యకాలంలో వంట చేస్తున్నప్పుడు పదార్థాలు ఆ పాత్రల అడుగు భాగాన అంటుకుపోకుండా ఉండే గిన్నెలు, పెనం వంటివాటిని ఉపయోగించేందుకు గృహిణులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇలా అడుగున అంటకుండా ఉండే వంట పాత్రలను ‘నాన్‌స్టిక్ కుక్‌వేర్’ అంటారన్న విషయం తెలిసిందే. పాత్రలు శుభ్రపరచుకునేటప్పుడు ఈ తరహా వంటసామగ్రి, గిన్నెలు కడగడానికి వీలుగా, సౌకర్యంగా తేలిగ్గా కడగడానికి వీలుగా ఉంటాయి.
దాంతో ఈ తరహా నాన్‌స్టిక్ వంటపాత్రలకు డిమాండ్ పెరుగుతోంది. కానీ నాన్‌స్టిక్ కుక్‌వేర్‌లో వండిన ఆహారం అంత ఆరోగ్యకరమైనది కాదని అనేక అధ్యయనాల్లో తేలింది. ఇలాంటి వంటపాత్రలను ఉపయోగించడం వల్ల ఆ వంటలను తిన్న పిల్లలకు భవిష్యత్తులో స్థూలకాయం, డయాబెటిస్ వంటివి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువని తేలింది.
అంతేకాదు... ఈ వంటపాత్రల్లో వండిన ఆహారం తిన్నవారిలో దీర్ఘకాలంలో హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, హార్మోన్‌ల అసమతౌల్యత వంటివి వచ్చేందుకు అవకాశాలూ ఎక్కువే. అంతేకాదు... వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గే అవకాశాలూ ఎక్కువేనని ఆ అధ్యయనాల్లో తేలింది. వ్యాధి నిరోధకత కోసం వేసే టీకాల ప్రభావం కూడా మందగిస్తుందన్నది పరిశోధకుల మరోమాట.
అనేక అధ్యయనాల్లో తేలిన ఈ విషయాలన్నింటినీ ‘జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్’ నివేదికల్లో ప్రచురితమయ్యాయి. ఇక మరో హెల్త్ జర్నల్ అయిన ‘ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ పర్‌స్పెక్టివ్’ నివేదికల ప్రకారం... ఈ తరహా గృహ ఉపకరణాలు వాడేవారిలో వంధ్యత్వం (ఇన్‌ఫెర్టిలిటీ) లేదా పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గి΄ోవడం వంటి సమస్యలు వస్తుంటాయని తెలుస్తోంది.
పరిష్కారమిది
వంట΄పాత్రలుగా టెఫ్లాన్ కోటింగ్ ఉన్న నాన్‌స్టిక్ కుక్‌వేర్‌కు బదులుగా మామూలు స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలనే ఉపయోగించాలి. కనీసం ఇంట్లో ఎవరైనా గర్భవతులుగా ఉన్నప్పుడు ఈ తరహా నాన్‌స్టిక్ గృహోపకరణాలను ఉపయోగించడం సరికాదు. అంతేకాదు... ఒకవేళ కొన్ని వంటలు చేయడానికి అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద వండాల్సి వస్తే... అలాంటప్పుడు నాన్‌స్టిక్ కుక్‌వేర్‌ను వాడకపోవడమే మంచిది. ఇలాంటి నాన్‌స్టిక్ వంటసామగ్రిని ఉపయోగించేవారు ఆ పొగలూ, గాలులు (ఫ్యూమ్స్) కిచెన్ విస్తరించకుండా, ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోయేలా ఎగ్జాస్ట్ ఫ్యాన్ అమర్చడం మంచిది.
బాత్‌రూమ్‌ల్లోనూ హానికర రసాయనాలు!
బాత్‌రూమ్‌లో కూడా హానికరమైన రసాయనాలు ఉండేందుకు అవకాశాలెక్కువ. అక్కడ ఉపయోగించే షాంపూలలో హానికరమైన రసాయనాలు ఉండవచ్చు. ఇక సువాసన వెలువరించేందుకు కొన్ని రకాల సబ్బుల్లో చేర్చే కొన్ని రకాల సుగంధ ద్రవ్యాల వల్ల కూడా చర్మంపై అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు రావచ్చు.
పరిష్కారమిది
రసాయనాలు తక్కువగా ఉండేలా... చాలావరకు స్వాభావికమైన ఆర్గానిక్ పదార్థాలతో చేసిన సబ్బులు, షాంపులు ఉపయోగించడం మంచిది.
ఇళ్లలో ఎలుకలతో కలకలం...
ఇంటి కిచెన్‌లోకి అర్ధరాత్రి వెళ్లినప్పుడు ఆహారపదార్థాలను ఎలుకలు తింటున్నట్లుగా గమనిస్తే... ఎలుకలు అలా ఆహారాలను తాకడం చాలా ప్రమాదమని గుర్తుంచుకోవాలి. ఎలుకలు ఆహార పదార్థాలను తాకడం వల్ల ‘లెప్టోస్పైరోసిస్’ అనే వ్యాధి వస్తుంది. అది స్ప్లీన్, మూత్రపిండాలు, మెదడును దెబ్బతీసే ప్రమాదం ఉందని తెలుసుకోవాలి.
పరిష్కారమిది
కిచెన్‌లోని ఆహార పదార్థాలను ఎలుకల నుంచి దూరంగా ఉంచాలి. వాటిని మెస్‌తో ఉన్న కప్‌బోర్డులలో ఉంచి ఎలుకలు తాకని విధంగా జాగ్రత్తపడాలి.
బొద్దింకల నుంచీ జాగ్రత్త...
ఎందుకంటే బొద్దింకలకు ఆహారం కానిదేదీ ఈ లోకంలో లేదు. అందుకే ఈ ప్రపంచంలోని ఏ కిచెన్ కూడా బొద్దింలు లేకుండా ఉండదంటే అది అతిశయోక్తి కాదు. బొద్దింకలనుంచి వెనువెంటనే వచ్చే ప్రమాదమేమీ పెద్దగా లేకపోయినా... ఆహారాన్ని కలుషితం చేసే పనులను అవి కూడా చేస్తాయి. దాంతో ఆరోగ్యానికి నీళ్ల విరేచనాల వంటి ముప్పు ఉండవచ్చు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే... బొద్దింకలు అలర్జీని, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. కాబట్టి ఆస్తమా బాధితులు తమ ఇండ్లలోకి బొద్దింకలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
పరిష్కారమిది
ఆహారాన్ని బొద్దింకలు తాకకుండా ఉండేలా మెష్ ఉండే సురక్షితమైన చోట ఉంచుకోవాలి. బొద్దింకలు బాగా తేమగా, తడిగా, వెలుగు అంతగా ప్రసరించని చోట పెరుగుతాయి. కాబట్టి ఇంట్లోని ప్రతి ప్రదేశమూ పొడిగా, వెలుతురూ,గాలీ ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. దాంతో బొద్దింకలు వృద్ధి కావు.
షూస్, సాక్స్... పాదరక్షలు ఇంటి బయటనే
ఒకసారి వేసుకున్న సాక్స్ (మేజోళ్లు) మళ్లీ రెండుమూడు రోజులు వేసుకుంటే దుర్వాసన వస్తాయన్నది తెలిసిందే. సాక్స్‌లో బ్యాక్టీరియా పెరగడం వల్ల ఇలా దుర్వాసన వస్తుంటుంది. ఆ సాక్స్‌తోనే ఇంట్లోకి వచ్చి అక్కడ విప్పితే ఆ బ్యాక్టీరియా ఇంట్లోకీ వచ్చేసే అవకాశాలుంటాయి. దాంతో ఇంట్లోని వాతావరణం కలుషితం కావచ్చు.
పరిష్కారమిది షూజ్, పాదరక్షలూ, సాక్స్ వంటివి ఇంటి బయటే వదలాలి. సాక్స్ ఉతికి పొడిగా మారాకే ఇంట్లోకి తీసుకురావాలి. వీలైనంతవరకు చెప్పులు, పాదరక్షలు, షూస్ స్టాండ్, సాక్స్ వంటివి ఇంటి బయట ఉండటమే మంచిది. చివరిగా... పైన పేర్కొన్న జాగ్రత్తలను పాటించడం వల్ల ఆరోగ్యాల్ని పదిలంగా కాపాడుకోవచ్చు.
డాక్టర్ కె. శివరాజు, సీనియర్ ఫిజీషియన్