
ఇంటిల్లిపాదికి శక్తిని ఇవ్వడానికి కష్టపడే మహిళలు ఎలాంటి ఆహారం తీసుకుంటారో ఒకసారి గమనిస్తే కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. అందరూ తిన్నాక మిగిలినదో, ఫ్రిజ్‌లో ఉంచి తీసినవి తినడమో చాలా మంది చేస్తుంటారు. సమయానుకూలంగా ఆహారాన్ని తీసుకోరు. ఈ నిర్లక్ష్యం వల్లే ప్రపంచవ్యాప్తంగా మహిళలు, గర్భిణులు 30 శాతానికి పైగా రక్త హీనతతో బాధపడుతున్నారని నివేదికలు చూపుతున్నాయి. పోషకాలపై దృష్టి అవసరం
జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కేవలం ఆహార ప్లానింగ్ వల్లనే కాదు... తిన్నది జీర్ణం కాకపోవడం, మలబద్దకం వంటి వాటితోనూ వస్తుంటాయి. తమ శరీరానికి ఏ ఆహారాలు సరిపడుతున్నాయో, సమస్య దేని వల్ల వస్తుందో తెలుసుకోవాలి. అప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి అనే అవగాహన కలుగుతుంది. సహజంగా మహిళలు రుతుక్రమంలో ఉన్నప్పుడు ప్రతి నెలా కొంత రక్తం పోతుంటుంది.
దానిని భర్తీ చేయడానికి ఐరన్ సమృద్ధిగా లభించే బీట్‌రూట్, వేరుశనగ వంటి నట్స్ తీసుకోవాలి. ఆహారం తయారు చేసినప్పుడే ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి. ఖరీదైన ఆహారంలోనే పోషకాలు ఉంటాయనుకుంటే పొరబాటు. ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు, తృణధాన్యాలనూ ఆహారంలో చేర్చుకోవాలి.
పరీక్షలతో లోపాల గుర్తింపు
ఆహారం ద్వారా శరీరానికి పోషక విలువలు ఎంతమేరకు అందుతున్నాయి, హార్మోన్ల స్థితి ఎలా ఉంది.. అనే విషయాలు అర్థం చేసుకోవడానికి కొన్ని రక్తపరీక్షలు, ఫంక్షనల్ టెస్ట్‌లు ఉన్నాయి. వీటి ద్వారా పోషకాహార లోపాలను గుర్తించవచ్చు. హార్మోన్ల అసమతుల్యతను అంచనా వేయడంలోనూ, ఇతర ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడంలోనూ ఈ టెస్టులు సహాయపడతాయి.
కండరాల పటుత్వానికి
40 నుంచి 50 ఏళ్ల మహిళల్లో కండరాల పటుత్వం తగ్గుతుంది. ఈ వయసులో సమతుల ఆహారంపై దృష్టిపెట్టకపోతే ఆ తర్వాత వయసులో మరిన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అందుకని ఐరన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, జింక్, మెగ్నీషియం, బీ కాంప్లెక్స్, విటమిన్ డి ... ఉండే ఆహారాలతోపాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్ తీసుకోవాలి. విశ్రాంతికీ ప్రాధాన్యత ఇవ్వాలి
సమతుల ఆహారం తీసుకోవడానికి ఎంత శ్రద్ధ చూపుతామో పనుల వల్ల అలసిన శరీరానికి తగినంత విశ్రాంతినివ్వాలి అనే విషయంలోనూ అంతే జాగ్రత్త చూపాలి. అందుకు ఎనిమిది గంటల పాటు కంటినిండా నిద్ర ఉండాలి. ఒత్తిడిని బ్యాలెన్స్ చేసుకోగలగాలి.
రుతుక్రమ దశలోనూ, మెనోపాజ్ దశలోనూ భావోద్వేగాలలో మార్పు మహిళల్లో ఎక్కువ చూస్తుంటాం. ఆహారం నుంచి తగినన్ని పోషకాలు అందక΄ోతే నిపుణుల సాయంతో సప్లిమెంట్స్ వాడాలి. ప్రతి పోషకాన్నీ కవర్ చేస్తూ సరైన ఆహారం తీసుకోవడం, ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం.
– డాక్టర్ సమత తూళ్ల, ఎమ్.డి, మెడికల్ డైరెక్టర్, కో–ఫౌండర్, పిఎమ్‌ఎక్స్ హెల్త్
(చదవండి: పేరెంట్స్ 'నో' చెప్పడం నేర్చుకోవాలి..! హెచ్చరిస్తున్న నిపుణులు)