
భాగ్యనగరవాసులారా.. మీకో ‘సన్’గతి చెప్పాలా.. భానుడు భగభగ మండుతున్నాడు. రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. న‘గరం’గరంగా మారుతోంది.. జర జాగ్రత్త! టెంపరేచర్ గ్రేడ్ పెరిగి 47 సెంటీగ్రేడ్‌ను టచ్ చేసే ప్రమాదం పొంచి ఉంది. నగర జీవనశైలిలో వేడికి అనుగుణంగా మార్పులు చేసుకోవడం ఎంత ముఖ్యమో, ఈ ఏడాది వేసవి గత ఏడాదితో పోల్చితే ఎంత భిన్నంగా ఉందో తెలుసుకోవడం కూడా అంతే అవసరం. వాతావరణ పరిశోధన నిపుణుల సూచనలను బట్టి చూస్తే ఈ వేసవి మరింతగా ఎండలు ఉండే అవకాశముంది. 2017లో నమోదైన 47 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలకు సమీపంగా ఈ ఏడాది వేసవి తాపం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిస్తోంది.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదికల ప్రకారం హైదరాబాద్‌లో ఈ వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చేరే అవకాశం ఉంది. అంతేకాకుండా అదనంగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయికి మించి ఉండే అవకాశం ఉంది. ఇది నగరవాసులకు మరింత అసౌకర్యాన్ని కలిగించవచ్చు.
ఈ వేసవిలో ఎల్‌నినో ప్రభావం కారణంగా వడదెబ్బ ఎక్కువగా ఉండే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా మే నెల వరకు వడదెబ్బ ఎక్కువగా ఉండే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు నగరవాసుల నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు.
వేసవి తాపానికి ముఖ్యమైన జాగ్రత్తలు..
వేడి తీవ్రత పెరిగే సమయంలో మన శరీరం నుంచి ఎక్కువగా చెమట రూపంలో నీరు పోయి డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తవచ్చు. అందువల్ల నీటిని రోజుకు కనీసం 3–4 లీటర్ల వరకు తాగడం, కొబ్బరి నీరు, నిమ్మకాయ రసం, బటర్ మిల్క్ లాంటి సహజ పానీయాలను
ఎక్కువగా తీసుకోవడం అవసరం.
ఇళ్ల నుంచి బయటకి వెళ్లే సమయాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకూడదు. వెళ్లాల్సి వచ్చినప్పుడు శరీరాన్ని కప్పి ఉంచేవిధంగా లైట్ కలర్ సూటీ దుస్తులు, కూలింగ్ గాగుల్స్, స్కార్ఫ్ లాంటి రక్షణ దుస్తులు ధరించాలి. సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి.
ఆహారం విషయంలో వేడికాలం అంటే జీర్ణశక్తి తక్కువగా ఉండే సమయం. తేలికపాటి ఆహారం, తాజా కూరగాయలు, పండ్లు, తేమ కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇంటిని చల్లగా ఉంచడానికి మొక్కలు, గాలి చక్కగా వచ్చేటట్లుగా విండోస్ ఏర్పాటు చేయడం మంచిది.
కొన్ని తాత్కాలిక వర్షాలు నమోదు కావచ్చన్న అంచనాలున్నా, అవి వేసవి తీవ్రతను తగ్గించేంతగా ప్రభావం చూపించవు. అంతేకాదు.. వర్షాల తర్వాత తేమ పెరగడం వల్ల ఉక్కిరిబిక్కిరి చేయగల వాతావరణం ఏర్పడే ప్రమాదమూ ఉంది. ఈ సమయంలో చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండటం అవసరం.
(చదవండి: ఏ క్షణమైనా గుండెపోటు తప్పదనుకున్నా..! కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్ లాస్ స్టోరీ)