పచ్చని చెట్ల కిందే ఐటీ ఉద్యోగుల జాబ్
చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం
హైస్పీడ్ ఇంటర్నెట్, మీటింగ్ హాల్స్ సదుపాయం
వారాంతంలో కుటుంబంతో కలిసి అక్కడే ఎంజాయ్
‘కలెక్టివ్ ఫామింగ్ గేటెడ్ కమ్యూనిటీ’లతో కొత్త ట్రెండ్
ఐటీ జాబ్ అంటే వరుస మీటింగ్‌లు, టార్గెట్లతో బిజీబిజీ.. వీకెండ్ వస్తే తప్ప వ్యక్తిగత జీవితానికీ, కుటుంబానికీ టైం ఇవ్వలేని పరిస్థితి. అలా కాకుండా ఉద్యోగమే పచ్చని చెట్ల కింద, చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, జీవ వైవిధ్యం మధ్యలో ఉంటే.. ఎంత బాగుంటుందో కదూ! అవును.. అచ్చం అలాంటి వాతావరణాన్నే కోరుకుంటున్నారు నేటి యువ ఐటీ ఉద్యోగులు, ఎంటర్‌ప్రెన్యూర్స్. వీరి అభిరుచికి తగ్గట్టుగానే పలు నిర్మాణ సంస్థలు ‘కలెక్టివ్ ఫామింగ్ గేటెడ్ కమ్యూనిటీ’లకు శ్రీకారం చుట్టాయి. ఈ నయా ట్రెండ్ గురించే ఈ కథనం.. – సాక్షి, సిటీబ్యూరో
నగరంలోని గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ అపార్ట్ మెంట్లతో జనసాంద్రత పెరిగిపోతుంది. దీంతో రోడ్లు, నీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. అత్యాధునిక వసతులున్న లగ్జరీ కమ్యూనిటీల్లో నివాసం ఉంటున్నా సరే నాణ్యమైన జీవితం గగనమైపోతోంది. పచ్చని ప్రకతిలో, స్వచ్ఛమైన గాలి పీల్చలేని పరిస్థితి.
ప్రస్తుత జనాభా అవసరాలకు వెడల్పాటి రోడ్లు వేసినా.. కొన్నేళ్లకు పెరిగే జనాభా, వాహనాల రద్దీకి అవి ఇరుకుగా మారిపోతున్నాయి. పోనీ, నగరానికి కాస్త దూరంగా విశాలమైన స్థలంలో వీకెండ్ హోమ్ లేదా ఫామ్ హౌస్ సొంతంగా కట్టుకోవాలన్నా, దాన్ని నిరంతరం నిర్వహణ చేయాలన్నా కష్టంతో కూడుకున్న పని. దీనికి పరిష్కారంగా కొందరు డెవలపర్లు ‘కలెక్టివ్ ఫామింగ్ గేటెడ్ కమ్యూనిటీ’ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు.
ఇదీ ప్రత్యేకత..
కరోనాతో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకే గదిలో గంటల కొద్దీ కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయడం బోర్ కొట్టేసింది. దీంతో ఉద్యోగస్తులకు అనారోగ్య సమస్యలతో పాటు కంపెనీలకు ఉత్పాదకత తగ్గుతోంది. దీంతో ఇప్పుడు నగరంలో వర్క్ ఫ్రం ఫామ్ కల్చర్ హల్‌చల్ చేస్తోంది. పచ్చని ప్రకృతిలో నివాసం, అక్కడి నుంచే ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా ఆధునిక ఏర్పాట్లు ఉండటమే వీటి ప్రత్యేకత. సాధ్యమైనంత వరకూ పచ్చని చెట్లు, జీవ వైవిధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ, కొద్దిపాటి స్థలంలోనే నిర్మాణాలుంటాయి. రోడ్డు కనెక్టివిటీ బాగున్న ప్రాంతాలను ఎంచుకొని కాలుష్యానికి దూరంగా, ఆరోగ్యానికి దగ్గరగా ప్రత్యేక వసతులు ఏర్పాటు చేస్తున్నారు.
70 శాతం ఐటీ ఉద్యోగులే..
చేవెళ్ల, షాద్‌నగర్, శామీర్‌పేట, శంషాబాద్, ఘట్‌కేసర్, హయత్‌నగర్ వంటి నగరం నలువైపులా ఈ తరహా ప్రాజెక్టులను చేపడుతున్నారు. వీటిల్లో గృహాలు 600 గజాల నుంచి 1,800 గజాల మధ్య ఉంటాయి. 70 శాతం మంది ఐటీ ఉద్యోగులే ఉంటున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బహుళ జాతి కంపెనీలకు చెందిన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు కస్టమర్లుగా ఉన్నారు.
ఇంటర్నెట్, మీటింగ్ రూమ్‌లు..
ప్రత్యేకంగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థతో హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. ఉద్యోగులకు విద్యుత్ అంతరాయం కలగకుండా జనరేటర్లు, సౌర విద్యుత్ ఏర్పాట్లు కూడా ఉంటాయి. బృంద చర్చల కోసం 10–20 మంది కూర్చునేందుకు వీలుగా కాన్ఫరెన్స్ హాల్, బోర్డ్ రూమ్స్ ఉంటాయి. నేటి యువతరానికి అవసరమైన స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి సదుపాయాలు కూడా
ఉంటాయి.
రచ్చబండలతో సోషల్ బంధం..
వేప, రావి వంటి చెట్లతో పాటు ఆకు కూరలు, కూరగాయలతో పాటు వ్యవసాయం కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ల లోపలికి ఓనర్లకైనా సరే వాహనాలకు ప్రవేశం ఉండదు. అత్యవసర వెహికిల్స్‌కు మినహా ప్రధాన ద్వారం వద్దే వాహనాలను పార్కింగ్ చేసి, అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ బగ్గీలో ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్తుంటూ దారికి ఇరువైపులా కనుచూపుమేర పచ్చని గడ్డితో ల్యాండ్ స్కేపింగ్ ఉంటుంది. చిన్న కొలనులో సందడి చేసే బాతులు, కొంగలు, పిచ్చుకల కిలకిలలు, తుమ్మెదలు, సీతాకోక చిలుకల సందడితో కనువిందుగా ఉంటుంది. పాత తరహాలో ఇంటి పక్కనే రచ్చబండలుంటాయి. దీంతో ఇరుగుపొరుగు వారితో సోషల్ బంధం పెరుగుతుంది.
స్థానికులకు ఉపాధి..
వీకెండ్‌లో మాత్రమే వచ్చే కస్టమర్ల గృహాలను మిగిలిన రోజుల్లో నిర్వహణ అంతా కమ్యూనిటీయే చూసుకుంటుంది. గార్డెనింగ్, వంట వాళ్లు అందరూ స్థానిక గ్రామస్తులనే నియమించుకోవడంతో వారికీ ఉపాధి కల్పించినట్లవుతుంది.
– నగేష్ కుమార్, ఎండీ, ఆర్గానో
ఈ వాతావరణం బాగుంది..
ప్రతిరోజూ ట్రాఫిక్ చిక్కుల్లో నరకం అనుభవిస్తూ ఆఫీసుకు వెళ్లే సరికి అలసిపోయినట్లు అయిపోతోంది. దీంతో ఏకాగ్రత తగ్గిపోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు వచ్చాక ఆహ్లాదకర వాతావరణంలో పనిచేయడం చాలా బాగుంది. ఉత్పాదకత పెరిగింది.
– సీహెచ్ శ్రీనివాస్, ఫార్మా ఉద్యోగి
ప్రతీది ఇక్కడే అందుబాటులో..
శివారు ప్రాంతంలో ప్రాజెక్ట్ అంటే మొదట్లో భయమనిపించినా ఇక్కడికి వచ్చాకే తెలిసింది ప్రతి ఒక్కటీ ఇక్కడే అందుబాటులో ఉంది. సేంద్రీయ ఆహార ఉత్పత్తులతో నిత్యావసరాలు, మినీ థియేటర్ వంటి అన్ని రకాల సదుపాయాలున్నాయి. పైగా స్వచ్ఛమైన గాలి, వెలుతురు, చుట్టూ పచ్చని ప్రకృతితో ఎంతో ఆనందంగా ఉంది.
– చిందె స్వాతి, గృహిణి
Comments
Please login to add a commentAdd a comment