కెనడా, మెక్సికోలపై భారీ సుంకం
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. వచ్చీరాగానే దాయాది దేశాలైన కెనడా, మెక్సికోలపై భారీ సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ తెలిపారు. అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు ట్రంప్ విస్తృత వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
కెనడా ‘చాలా చెడ్డ దేశం’
ట్రంప్ ప్రమాణ స్వీకార ప్రసంగంలో మాట్లాడుతూ అమెరికన్ పౌరులకు ప్రయోజనం చేకూర్చడానికి విదేశాంగ విధానంలో భాగంగా సుంకాలను ఉపయోగించనున్నట్లు చెప్పారు. కెనడా, మెక్సికో పెద్ద సంఖ్యలో వలసదారులను, ఫెంటానిల్(డగ్స్) అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయని ఆరోపించారు. కెనడాను ‘చాలా చెడ్డ దేశం’గా ముద్రవేశారు. ట్రంప్ ఇంత తీవ్రంగా స్పందించడంతో మరిన్ని దేశాల్లో అమెరికా సుంకాల విధానాలపై ఆందోళనలను రేకెత్తించింది. ఫిబ్రవరి 1 చివరితేది సమీపిస్తుండటంతో అమెరికాతో సరిహద్దు పంచుకుంటున్న ఇరుదేశాలకు ఇరువైపులా వ్యాపారం సాగిస్తున్నవారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితి ఎలా ఉంటుందో, ట్రంప్ పాలనలో అమెరికా వాణిజ్య సంబంధాల భవిష్యత్తు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
చర్చలకు సిద్ధం
ఈ ప్రకటనపై కెనడా, మెక్సికో దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కెనడియన్ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ మాట్లాడుతూ.. కెనడా యూఎస్ వాణిజ్య విధానాలపై ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. మెక్సికన్ అధికారులు సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి అమెరికాతో చర్చల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కానీ, దీనిపై ట్రంప్ అంత తేలికగా అంగీకరించరనే వాదనలున్నాయి. దాంతో మరికొంత కాలం ఈ దేశాలకు సుంకాల ఇబ్బందులు తప్పవని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇదీ చదవండి: ఈ–త్రీవీలర్స్‌లోకి టీవీఎస్..
సుంకాల పెంపుతో వినియోగదారులపైనే భారం
ట్రంప్ ప్రవేశపెడుతున్న సుంకాల విధింపు విధానాలపై విమర్శలు వస్తున్నాయి. ఇలా ఇష్టారీతినా టారిఫ్‌లను పెంచడంవల్ల తుదకు వినియోగదారులపైనే ఆ భారం పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తుందని వాదిస్తున్నారు. అయితే ట్రంప్ మద్దతుదారులు కొన్ని వస్తువులపై భవిష్యత్తులో తీసుకోబోయే పన్నుల కోతలు, వాటి క్రమబద్ధీకరణ వంటి ఇతర ప్రతిపాదనల వల్ల ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment