రన్నర్ గెబ్రెసెలాసీ రిటైర్మెంట్
మాంచెస్టర్: సుదూరపు పరుగులో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విఖ్యాత అథ్లెట్ హెయిలీ గెబ్రెసెలాసీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇథియోపియాకు చెందిన 42 ఏళ్ల గెబ్రెసెలాసీ తన 25 ఏళ్ల కెరీర్‌లో రెండు ఒలింపిక్ స్వర్ణాలు(అట్లాంటా, సిడ్నీ), ఎనిమిది ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్స్‌ను సాధించాడు. ఆదివారం జరిగిన గ్రేట్ మాంచెస్టర్ రన్‌లో చివరిసారి పాల్గొన్న అతను 16వ స్థానంలో నిలిచాడు. 1500 మీటర్లు, 5 వేలు, 10 వేల మీటర్ల రేసులతోపాటు మారథాన్‌లోనూ పాల్గొన్న గెబ్రెసెలాసీ మొత్తం 27 సార్లు ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు.
‘అంతర్జాతీయ పరుగు పందేల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నాను కానీ పరుగుకు దూరం కావడంలేదు. పరుగు ఆపలేను. అదే నా జీవితం’ అని గెబ్రెసెలాసీ అన్నాడు.