Pradeep Mehra: ఈ కుర్రాడి కథ మన పిల్లలకు స్ఫూర్తి | Lessons Children Can Learn From Pradeep Mehra, The 19 Year Old Midnight Runner | Sakshi
Sakshi News home page

Pradeep Mehra: ప్రదీప్‌ మెహ్రా నుంచి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి?

Published Tue, Mar 22 2022 11:28 PM | Last Updated on Wed, Mar 23 2022 10:02 AM

Lessons Children Can Learn From Pradeep Mehra, The 19 Year Old Midnight Runner - Sakshi

డ్యూటీ ముగించుకుని ఇంటికి పరుగు సాధన చేస్తూ వెళుతున్న ప్రదీప్‌ మెహ్రా

స్కూల్‌కు ఏసి బస్‌.
అడిగిన వెంటనే షూస్‌.
కోరిన సీట్‌ రాకపోయినా

డొనేషన్‌ సీట్‌.
ఉద్యోగానికి తెలిసిన
మిత్రుడి కంపెనీలో రికమండేషన్‌.
పిల్లలు వారి శక్తి వారు ఎప్పుడు తెలుసుకోవాలి?
కుటుంబానికి సమాజానికి శక్తిగా
ఎప్పుడు నిలబడాలి?
కష్టాలను ఎదుర్కొనడమూ
ప్రతికూలతను జయించడమూ జీవితమే
అని ఎప్పుడు తెలుసుకోవాలి.
పిల్లల్ని గారం చేసి బొత్తిగా బలహీనులను చేస్తున్నామా?
నోయిడాలో అర్ధరాత్రి 10 కిలోమీటర్లు పరిగెడుతూ యువతకు సందేశం ఇచ్చిన ప్రదీప్‌ మెహ్రా నుంచి
మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి?

ముందు ప్రదీప్‌ మెహ్రా గురించి తెలుసుకొని మళ్లీ మన పిల్లల దగ్గరకు వద్దాం. మొన్నటి శనివారం రోజు. అర్ధరాత్రి. ఢిల్లీ సమీపంలో ఉండే నోయిడా. సినిమా దర్శకుడు వినోద్‌ కాప్రి తన కారులో వెళుతుంటే ఒక యువకుడు బ్యాక్‌ప్యాక్‌తో పరిగెడుతూ వెళుతున్నాడు. అయితే అతడు అర్జెంటు పని మీద పరిగెడుతున్నట్టుగా లేడు. ఒక వ్యాయామంగా పరిగెడుతున్నట్టున్నాడు. వినోద్‌ కాప్రికి ఆశ్చర్యం వేసింది... ఈ టైమ్‌లో ఈ కుర్రాడు ఎందుకు పరిగెడుతున్నాడు అని. కారులో అతణ్ణే ఫాలో అవుతూ అద్దం దించి మాట్లాడుతూ అదంతా వీడియో రికార్డ్‌ చేశాడు.

‘ఎందుకు పరిగెడుతున్నావ్‌?’
‘వ్యాయామం కోసం’
‘ఈ టైమ్‌లోనే ఎందుకు?’
‘నేను మెక్‌డోనాల్డ్స్‌లో పని చేస్తాను. వ్యాయామానికి టైం ఉండదు. అందుకని ఇలా రాత్రి డ్యూటీ అయ్యాక పరిగెడుతూ నా రూమ్‌కు చేరుకుంటాను’
‘నీ రూమ్‌ ఎంతదూరం?’
‘10 కిలోమీటర్లు ఉంటుంది’
‘అంత దూరమా? కారెక్కు. దింపుతాను’
‘వద్దు. నా ప్రాక్టీసు పోతుంది’
‘ఇంతకీ ఎందుకు వ్యాయామం?’
‘ఆర్మీలో చేరడానికి’

ఆ సమాధానంతో వినోద్‌ కాప్రి ఎంతో ఇంప్రెస్‌ అయ్యాడు. ఇంతకీ ఆ అబ్బాయి పేరు ప్రదీప్‌ మెహ్రా. వయసు 19. ఊరు ఉత్తరాఖండ్‌ అల్మోరా. నోయిడాలోని బరోలాలో తన అన్న పంకజ్‌తో కలిసి రూమ్‌లో ఉంటున్నాడు. తల్లి సొంత ఊరిలో జబ్బు పడి ఆస్పత్రిలో ఉంది. తండ్రి ఆమెకు తోడుగా ఉన్నారు. అన్నదమ్ములు నగరానికి వచ్చి కష్టపడుతున్నారు. ప్రదీప్‌కు ఆర్మీలో చేరాలని కోరిక. ఆ లోపు బతకడానికి నోయిడా సెక్టార్‌ 16లో ఉండే మెక్‌డొనాల్డ్స్‌లో చేరాడు. ఉదయం నుంచి రాత్రి వరకూ డ్యూటీ. మళ్లీ వంట పని. వీటి వల్ల వ్యాయామానికి టైమ్‌ ఉండదు. అందువల్ల ప్రతిరోజూ డ్యూటీ అయ్యాక (రాత్రి 10.40కి) బ్యాక్‌ప్యాక్‌ తగిలించుకుని బరోలా వరకు పరుగు మొదలెడతాడు. ‘కనీసం కలిసి భోం చేద్దాం రా’ అని వినోద్‌ కాప్రి అడిగితే ప్రదీప్‌ మెహ్రా చెప్పిన జవాబు ‘వద్దు. రూమ్‌లో అన్నయ్య ఎదురు చూస్తుంటాడు. నేను వెళ్లి వండకపోతే పస్తు ఉండాల్సి వస్తుంది. వాడికి నైట్‌ డ్యూటీ’ అన్నాడు. 

వినోద్‌ కాప్రి ఈ వీడియోను ఆదివారం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తే గంటల వ్యవధి లో 40 లక్షల మంది చూశారు. ప్రదీప్‌ను ప్రశంసలతో దీవెనలతో ముంచెత్తారు. ఆర్మీ నుంచి రైటర్‌ అయిన ఒక ఉన్నతాధికారి ప్రదీప్‌ ఆర్మీలో చేరడానికి  తాను ట్రైనింగ్‌ ఇప్పిస్తానన్నాడు. ఒక సినిమా నిర్మాత వెంటనే ప్యూమా నుంచి బూట్లు, బ్యాక్‌ప్యాక్‌ బ్యాగ్‌ పంపించాడు. ఆనంద్‌ మహీంద్ర అయితే ‘ఇలాంటి వాళ్లే నా సోమవారం రోజును ఉత్సాహంగా మొదలెట్టిస్తారు’ అని ట్వీట్‌ చేశాడు. ‘ఈ కాలపు పిల్లలు ఇతణ్ణి చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అన్నారు ఎందరో. నిజం. తప్పక నేర్చుకోవాల్సింది ఉంది.

ప్రదీప్‌ మెహ్రా నుంచి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి?
1. లక్ష్యం కలిగి ఉండటం: ప్రదీప్‌ మెహ్రాకు ఒక లక్ష్యం ఉంది. తనకేం కావాలో అతడు నిశ్చయించుకున్నాడు. కాని అందుకు ఎన్నో ఆటంకాలు, బాధ్యతలు అడ్డుగా నిలిచి ఉన్నాయి. వాటిని తృణీకరించకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని అతడు నిశ్చయించుకున్నాడు. 
2. చిత్తశుద్ధి: లక్ష్యం కలిగి ఉండటమే కాదు. దానిని చేరుకునే చిత్తశుద్ధి కూడా ఉండాలి. ప్రదీప్‌ తన రొటీన్‌ను ఏ మాత్రం మార్చుకోవడం లేదు. ఉదయాన్నే లేచి వంట, మళ్లీ రాత్రి రూమ్‌కు వెళ్లి వంట, మధ్యలో డ్యూటీ... ఇవన్నీ చేస్తూ పరుగు. రోజూ రాత్రిళ్లు అతడు పరిగెడుతుంటే ఎందరో లిఫ్ట్‌ ఇస్తామని అడుగుతారు. ఈ ఒక్కరోజు బండెక్కుదాం అని అనుకోకుండా పరుగెడుతున్నాడు. దర్శకుడు వినోద్‌ కాప్రి అడిగినా అతడు కారు ఎక్కలేదు.

3. కుటుంబం ముఖ్యం: ప్రదీప్‌కు కుటుంబం ముఖ్యం అనే బాధ్యత ఉంది. కుటుంబం పట్ల ఎంతో ప్రేమ ఉంది. అన్న పట్ల అనురాగం ఉంది. అన్న పస్తు ఉండకుండా త్వరగా వెళ్లి వంట చేయాలని ఉంది. ఆర్మిలో చేరి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉంది. ఈ దృష్టి ముఖ్యం.
4. ఆకర్షణలకు లొంగకపోవడం: గత 24 గంటల్లో ప్రదీప్‌ స్టార్‌ అయిపోయాడు. ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. మీడియా వెంటపడుతోంది. ప్రదీప్‌ వయసున్న కుర్రాళ్లు తబ్బిబ్బయ్యి ఆ ఊపులో కొట్టుకుని పోవచ్చు. కాని ‘నన్ను డిస్ట్రబ్‌ చేయకండి. పని చేసుకోనివ్వండి’ అన్నాడు ప్రదీప్‌.
5. కష్టేఫలీ: ‘మిడ్‌నైట్‌ రన్నర్‌’గా కొత్త హోదా పొందాక ‘నువ్వు ఇచ్చే సందేశం’ అని అడిగితే ‘కష్టపడాలి. కష్టపడితే లోకం తల వొంచుతుంది’ అని జవాబు చెప్పాడు. 

పిల్లలను పూర్తి కంఫర్ట్‌ జోన్‌లో పెట్టాలని తల్లిదండ్రులు ఆరాటపడటంలో తప్పు లేదు. కాని సవాళ్లను ఎదుర్కొని, ఎదురుదెబ్బలకు తట్టుకుని, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుని, విలువలు కోల్పోకుండా కష్టపడి పైకి రావాలని పిల్లలకు చెప్పడానికి ప్రదీప్‌ మెహ్రాకు మించిన సజీవ ఉదాహరణ లేదు. తాతల, తండ్రుల జీవితాల్లోని విజయగాథలు ఈనాటి పిల్లల జీవితాల్లో ఉంటున్నాయా అని చూసుకుంటే వారిని ఉక్కుముక్కల్లా పెంచుతున్నామా లేదా ఇట్టే తెలిసిపోతుంది. ఇవాళ పరిశీలించి చూడండి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement