mid night
-
అర్ధరాత్రి దాకా.. తెలంగాణ హైకోర్టులో అరుదైన ఘట్టం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టు అరుదైన ఘట్టానికి వేదిక అయ్యింది. గురువారం అర్ధరాత్రి 1గం.(శుక్రవారం) దాకా కేసుల విచారణ జరిగింది. అందులో వెకేషన్ బెంచ్ ఆ ప్రొసీడింగ్స్ చేపట్టడం మరీ విశేషం. మే 6 నుంచి మే 31వ తేదీదాకా తెలంగాణ హైకోర్టుకు సెలవులు. ఈ నేపథ్యంలో అత్యవసర కేసుల విచారణ కోసం వెకేషన్ బెంచ్‌లు పని చేస్తాయి. అయితే గురువారం ఒక్కరోజే లిస్ట్‌లో ఉన్న 250 కేసులు విచారణ చేపట్టింది జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన డివిజన్ బెంచ్. ఉదయం 10.30ని. మొదలైన బెంచ్ విచారణ.. తెల్లవారుఝామున 1గం. దాకా సాగింది. తెలంగాణ హైకోర్టు చరిత్రలోనే ఇదొక అరుదైన ఘట్టమని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇక.. బీజేపీ వేసిన ప్రైవేట్ పిటీషన్ ను అర్థరాత్రి 1 గంటకు విచారించింది ఈ వెకేషన్ బెంచ్. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి క్రిమినల్ కోర్టులో సీఆర్పీసీ సెక్షన్ 299, 300 ప్రకారం ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే.. దీనిని నాంపల్లి కోర్టు స్వీకరించకుండా వాయిదా వేసింది. దీంతో.. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలంటూ దాఖలైన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు గురువారం అర్ధరాత్రి ఒంటిగంటకు విచారణ చేపట్టింది. అయితే ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని.. అర్ధరాత్రి ఒంటి గంటకు విచారించాల్సినంత ముఖ్య విషయం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.సాధారణంగా వెకేషన్ కోర్టులో అత్యవసర పిటిషన్లు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుంది. గురువారం వెకేషన్ బెంచ్ జాబితాలో ఉన్న కేసుల విచారణ పూర్తయి.. ఈ కేసు విచారణ వచ్చేటప్పటికి సమయం అర్ధరాత్రి ఒంటిగంట అయింది. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ కేసు కోసం అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఎందుకు వేచి ఉన్నారు? ఇందులో అంత అతస్యవసరం ఏముంది? అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై సూచనలు తెలుసుకుని చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఆదేశాలు జారీచేసింది. విచారణను జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది.రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఆరోపణలున్నాయి. సంబంధిత వార్త: ఆ వీడియోతో నాకు సంబంధం లేదు: సీఎం రేవంత్ -
అర్థరాత్రుళ్లు.. ఉలిక్కిపడి నిద్ర లేస్తున్నారా? దీనివల్లే కావొచ్చు
కొంతమందికి ఇలా పడుకోగానే అలా నిద్ర పడుతుంది. మరికొందరికి ఎంత ప్రయత్నించినా ఓ పట్టాన నిద్రపట్టదు. మరికొందరు నిద్రలేమి సమస్యతో తెగ ఇబ్బంది పడతారు. ఇంకొందరు అర్థరాత్రుళ్లు 1-4 గంటల మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు మేలుకుంటారు. ఆ తర్వాత ఎంత నిద్రపోదాం అని ప్రయత్నించినా నిద్రపట్టదు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. రాత్రి పడుకున్నామంటే తెల్లారే వరకు లేవకూడదు. అలా అయితేనే మంచి నిద్ర పట్టినట్లు. నిద్రలో పదేపదే మెలకువ వస్తే వారు జాగ్రత్త పడాల్సిందే. అర్థరాత్రుళ్లు మనం లేచే సమయాన్ని బట్టి మనం ఏ విషయం గురించి ఆందోళన చెందుతున్నామో ఇట్టే తెలుసుకోవచ్చట. అర్థరాత్రి 1 గంటలకు.. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో సాధారణంగా గాఢ నిద్రలో ఉంటారు. కానీ ఆ సమయంలో నిద్రలేస్తున్నారంటే.. మీరు మానసికంగా చాలా స్ట్రెస్‌లో ఉన్నట్లు అర్థం. 2 గంటలకు.. ఈ సమయంలో నిద్రలేస్తున్నారంటే.. మీ శరీరం చాలా అలిసిపోతుందని, దానికి కాస్త రెస్ట్ అవసరమని గ్రహించాలి. దీనికోసం ఎక్సర్సైజ్, మంచి డైట్ వంటివి రెగ్యులర్ రొటీన్లో అలవాటు చేసుకోవాలి. 3 గంటలకు.. తెల్లవారుజామున 3 గంటలకు మెలవకువ వస్తుందంటే కాస్త భయానకంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ సమయాన్ని డెవిల్స్ అవర్ అని పిలుస్తారు. ఈ సమయంలో ఆత్మలు కలలోకి వస్తాయని కొందరి విశ్వాసం. అయితే మరికొందరు పరిశోధకులు మాత్రం తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేవడం మంచిదని సూచిస్తున్నారు. ఇది ధ్యానం చేయడానికి సరైన సమయంగా చెబుతున్నారు. ఎంత త్వరగా పడుకుంటే అంత త్వరగా నిద్రలేవొచ్చు అని, కాబట్టి ఇది ఒక రకంగా మంచిదే అంటున్నారు. రాత్రి 3.30 నిమిషాలు ఈ సమయంలో నిద్ర లేస్తున్నారంటే మీరు మంచి అభివృద్ది పథంలో కొనసాగుతున్నట్లు అర్థమట. ఈ సమయంలో దేవతలు సంచరిస్తుంటారనే విశ్వాసం కూడా ఉంది. తెల్లవారుజామున 4గంటలకు.. తెల్లవారుజామున 4 గంటలకు ఉలిక్కి పడి లేస్తున్నారంటే మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు అర్థం. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని, చాలా నిరాశతో ఉన్నట్లు ఈ సమయం సూచిస్తుందట. ఉదయం 4.30 గంటలకు.. ఈ సమయంలో మీరు మేల్కొనడం మంచిదే అని పరిశోధనల్లో వెల్లడైంది. చాలా పాజిటివ్ మైండ్‌తో జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలకు విశ్వం మీకు మార్గనిర్దేశం చేస్తుందని కొందరి నమ్మకం. ఉదయం 5గంటలకు.. అకస్మాత్తుగా 5 గంటలకు తరచూ లేస్తున్నారంటే జీర్ణవ్యవస్థలో ఏదైనా సమస్యల వల్ల కావొచ్చట. సాయంత్రం వేళల్లో సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఇందుకు కారణం. అంతుకే నైట్ టైం లైట్ ఫుడ్‌ను తీసుకోవాలి. ఇలాంటి వాళ్లు రాత్రి 7 గంటలు లేదా అంతకంటే ముందే భోజనాన్ని తినేలా ప్లాన్ చేసుకుంటే మంచిది. -
HYD: ఆ రెండు లైన్లలో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు
సాక్షి, హైదరాబాద్: నగర వాసులకు కాస్త ఊరట కలిగించే వార్త అందించింది హైదరాబాద్ మెట్రో. అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడపాలని నిర్ణయించుకుంది. అయితే అది కొన్నిరోజుల వరకు, రెండు రూట్లలో మాత్రమే!. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ కొనసాగినన్ని రోజులు ఈ సౌకర్యం ఉంటుందని హైదరాబాద్ మెట్రో రైలు ప్రకటించింది. మియాపూర్-ఎల్బీనగర్, నాగోల్ –రాయదుర్గం కారిడార్లలో ఈ వెసులుబాటు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం స్టేషన్ల నుంచి ఆఖరి రైలు అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరి గమ్యస్థానాన్ని రాత్రి 1 గంటకు చేరుకుంటుందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. నుమాయిష్ సందర్శకులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఆయన. అయితే.. జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో చివరి రైలు మాత్రం రాత్రి 11 గంటలకు మాత్రమే బయలుదేరుతుందని ఆయన స్పష్టంచేశారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నుమాయిష్ ఎగ్జిబిషన్ వద్ద ఉన్న గాందీభవన్ స్టేషన్లో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. నుమాయిష్ షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 15 వరకు మెట్రో సేవల పొడిగింపు కొనసాగనుంది. -
AP: అర్ధరాత్రి వరకు హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపార వేళలను పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బార్ అండ్ రెస్టారెంట్లు మినహా ఇతర ఆహార దుకాణాలు ఉదయం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(ఎఫ్ఏసీ) జి.అనంతరాము మార్గదర్శకాలు విడుదల చేశారు. కోవిడ్ నేపథ్యంలో జారీ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల గడువు మార్చితో ముగియడంతో కొత్త ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ఏపీ హోటల్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు వ్యాపార వేళలను పెంచినట్టు తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ వ్యాపారులు, వినియోగదారులు విధిగా మాస్క్ ధరించడంతో పాటు శానిటైజర్ వాడాలని సూచించారు. చదవండి: (ఎలాంటి కాన్పులైనా అమ్మకు 5,000) -
TS Police: ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇదేనా.. అర్ధరాత్రి రోడ్డుపై భార్యాభర్తలను..
Telangana police.. బైక్‌పై వస్తున్న తమపట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, అర్ధరాత్రి నడిరోడ్డుపై అరగంట పాటు నిలబెట్టారని, అవసరం లేని ప్రశ్న లతో ఇబ్బంది పెట్టారని హైదరాబాద్‌లో పని చేస్తున్న భార్యాభర్తలు.. డీజీపీకి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ముదిగొండ మండలం కమలాపురం గ్రామానికి చెందిన బొమ్మగాని దుర్గారావు, ఆయన భార్య భవాని హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. శనివారం రాత్రి భార్యా భర్తలతో పాటు, భవాని సోదరుడు వెంకటేశ్ ఒకే బైక్‌పై కమలాపురం వస్తున్నారు. నేలకొండపల్లి వచ్చేసరికి రాత్రి 12.20 అయింది. ఆ సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు తమను ఆపి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతూ ఇబ్బంది పెట్టారని దుర్గారావు, భవాని ఆరోపించారు. తాను సమాధానం చెబుతున్నా పట్టించుకోకుండా, తన భార్యను ప్రశ్నించారని తాళిబొట్టు, పెళ్లిఫొటోలు చూపించినా వినకుండా జీపు ఎక్కమంటూ దురుసుగా ప్రవర్తించారని దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. తాము బైక్‌పై వస్తున్నామని చెప్పినా.. బస్ టికెట్లు చూపించమని అడిగారని, మీదే కులం అంటూ ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. పోలీసులు మద్యం మత్తులో ఉన్నారని, అరగంట పాటు తమను రోడ్డుపైనే నిలబెట్టారని, ఈ ఘటనను వీడియో తీస్తుంటే మొబైల్ లాక్కుని.. తనపై చేయి చేసుకునే ప్రయత్నం చేశారని దుర్గారావు వాపోయారు. తమకు జరిగిన అవమానంపై మంత్రి కేటీఆర్, డీజీపీతో పాటు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనర్‌ను కలసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ విషయమై ఆదివారం నేలకొండపల్లి ఎస్సై స్రవంతిని వివరణ కోరగా తమ సిబ్బంది విధుల్లో భాగంగానే వారిని వివరాలడిగారని తెలిపారు. ఇది కూడా చదవండి: ఆబ్కారీకి నకిలీ మకిలి! కోట్లలలో అక్రమార్జన -
Pradeep Mehra: ఈ కుర్రాడి కథ మన పిల్లలకు స్ఫూర్తి
స్కూల్‌కు ఏసి బస్. అడిగిన వెంటనే షూస్. కోరిన సీట్ రాకపోయినా డొనేషన్ సీట్. ఉద్యోగానికి తెలిసిన మిత్రుడి కంపెనీలో రికమండేషన్. పిల్లలు వారి శక్తి వారు ఎప్పుడు తెలుసుకోవాలి? కుటుంబానికి సమాజానికి శక్తిగా ఎప్పుడు నిలబడాలి? కష్టాలను ఎదుర్కొనడమూ ప్రతికూలతను జయించడమూ జీవితమే అని ఎప్పుడు తెలుసుకోవాలి. పిల్లల్ని గారం చేసి బొత్తిగా బలహీనులను చేస్తున్నామా? నోయిడాలో అర్ధరాత్రి 10 కిలోమీటర్లు పరిగెడుతూ యువతకు సందేశం ఇచ్చిన ప్రదీప్ మెహ్రా నుంచి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి? ముందు ప్రదీప్ మెహ్రా గురించి తెలుసుకొని మళ్లీ మన పిల్లల దగ్గరకు వద్దాం. మొన్నటి శనివారం రోజు. అర్ధరాత్రి. ఢిల్లీ సమీపంలో ఉండే నోయిడా. సినిమా దర్శకుడు వినోద్ కాప్రి తన కారులో వెళుతుంటే ఒక యువకుడు బ్యాక్‌ప్యాక్‌తో పరిగెడుతూ వెళుతున్నాడు. అయితే అతడు అర్జెంటు పని మీద పరిగెడుతున్నట్టుగా లేడు. ఒక వ్యాయామంగా పరిగెడుతున్నట్టున్నాడు. వినోద్ కాప్రికి ఆశ్చర్యం వేసింది... ఈ టైమ్‌లో ఈ కుర్రాడు ఎందుకు పరిగెడుతున్నాడు అని. కారులో అతణ్ణే ఫాలో అవుతూ అద్దం దించి మాట్లాడుతూ అదంతా వీడియో రికార్డ్ చేశాడు. ‘ఎందుకు పరిగెడుతున్నావ్?’ ‘వ్యాయామం కోసం’ ‘ఈ టైమ్‌లోనే ఎందుకు?’ ‘నేను మెక్‌డోనాల్డ్స్‌లో పని చేస్తాను. వ్యాయామానికి టైం ఉండదు. అందుకని ఇలా రాత్రి డ్యూటీ అయ్యాక పరిగెడుతూ నా రూమ్‌కు చేరుకుంటాను’ ‘నీ రూమ్ ఎంతదూరం?’ ‘10 కిలోమీటర్లు ఉంటుంది’ ‘అంత దూరమా? కారెక్కు. దింపుతాను’ ‘వద్దు. నా ప్రాక్టీసు పోతుంది’ ‘ఇంతకీ ఎందుకు వ్యాయామం?’ ‘ఆర్మీలో చేరడానికి’ ఆ సమాధానంతో వినోద్ కాప్రి ఎంతో ఇంప్రెస్ అయ్యాడు. ఇంతకీ ఆ అబ్బాయి పేరు ప్రదీప్ మెహ్రా. వయసు 19. ఊరు ఉత్తరాఖండ్ అల్మోరా. నోయిడాలోని బరోలాలో తన అన్న పంకజ్‌తో కలిసి రూమ్‌లో ఉంటున్నాడు. తల్లి సొంత ఊరిలో జబ్బు పడి ఆస్పత్రిలో ఉంది. తండ్రి ఆమెకు తోడుగా ఉన్నారు. అన్నదమ్ములు నగరానికి వచ్చి కష్టపడుతున్నారు. ప్రదీప్‌కు ఆర్మీలో చేరాలని కోరిక. ఆ లోపు బతకడానికి నోయిడా సెక్టార్ 16లో ఉండే మెక్‌డొనాల్డ్స్‌లో చేరాడు. ఉదయం నుంచి రాత్రి వరకూ డ్యూటీ. మళ్లీ వంట పని. వీటి వల్ల వ్యాయామానికి టైమ్ ఉండదు. అందువల్ల ప్రతిరోజూ డ్యూటీ అయ్యాక (రాత్రి 10.40కి) బ్యాక్‌ప్యాక్ తగిలించుకుని బరోలా వరకు పరుగు మొదలెడతాడు. ‘కనీసం కలిసి భోం చేద్దాం రా’ అని వినోద్ కాప్రి అడిగితే ప్రదీప్ మెహ్రా చెప్పిన జవాబు ‘వద్దు. రూమ్‌లో అన్నయ్య ఎదురు చూస్తుంటాడు. నేను వెళ్లి వండకపోతే పస్తు ఉండాల్సి వస్తుంది. వాడికి నైట్ డ్యూటీ’ అన్నాడు. వినోద్ కాప్రి ఈ వీడియోను ఆదివారం ట్విట్టర్లో పోస్ట్ చేస్తే గంటల వ్యవధి లో 40 లక్షల మంది చూశారు. ప్రదీప్‌ను ప్రశంసలతో దీవెనలతో ముంచెత్తారు. ఆర్మీ నుంచి రైటర్ అయిన ఒక ఉన్నతాధికారి ప్రదీప్ ఆర్మీలో చేరడానికి తాను ట్రైనింగ్ ఇప్పిస్తానన్నాడు. ఒక సినిమా నిర్మాత వెంటనే ప్యూమా నుంచి బూట్లు, బ్యాక్‌ప్యాక్ బ్యాగ్ పంపించాడు. ఆనంద్ మహీంద్ర అయితే ‘ఇలాంటి వాళ్లే నా సోమవారం రోజును ఉత్సాహంగా మొదలెట్టిస్తారు’ అని ట్వీట్ చేశాడు. ‘ఈ కాలపు పిల్లలు ఇతణ్ణి చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అన్నారు ఎందరో. నిజం. తప్పక నేర్చుకోవాల్సింది ఉంది. ప్రదీప్ మెహ్రా నుంచి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి? 1. లక్ష్యం కలిగి ఉండటం: ప్రదీప్ మెహ్రాకు ఒక లక్ష్యం ఉంది. తనకేం కావాలో అతడు నిశ్చయించుకున్నాడు. కాని అందుకు ఎన్నో ఆటంకాలు, బాధ్యతలు అడ్డుగా నిలిచి ఉన్నాయి. వాటిని తృణీకరించకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని అతడు నిశ్చయించుకున్నాడు. 2. చిత్తశుద్ధి: లక్ష్యం కలిగి ఉండటమే కాదు. దానిని చేరుకునే చిత్తశుద్ధి కూడా ఉండాలి. ప్రదీప్ తన రొటీన్‌ను ఏ మాత్రం మార్చుకోవడం లేదు. ఉదయాన్నే లేచి వంట, మళ్లీ రాత్రి రూమ్‌కు వెళ్లి వంట, మధ్యలో డ్యూటీ... ఇవన్నీ చేస్తూ పరుగు. రోజూ రాత్రిళ్లు అతడు పరిగెడుతుంటే ఎందరో లిఫ్ట్ ఇస్తామని అడుగుతారు. ఈ ఒక్కరోజు బండెక్కుదాం అని అనుకోకుండా పరుగెడుతున్నాడు. దర్శకుడు వినోద్ కాప్రి అడిగినా అతడు కారు ఎక్కలేదు. 3. కుటుంబం ముఖ్యం: ప్రదీప్‌కు కుటుంబం ముఖ్యం అనే బాధ్యత ఉంది. కుటుంబం పట్ల ఎంతో ప్రేమ ఉంది. అన్న పట్ల అనురాగం ఉంది. అన్న పస్తు ఉండకుండా త్వరగా వెళ్లి వంట చేయాలని ఉంది. ఆర్మిలో చేరి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉంది. ఈ దృష్టి ముఖ్యం. 4. ఆకర్షణలకు లొంగకపోవడం: గత 24 గంటల్లో ప్రదీప్ స్టార్ అయిపోయాడు. ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. మీడియా వెంటపడుతోంది. ప్రదీప్ వయసున్న కుర్రాళ్లు తబ్బిబ్బయ్యి ఆ ఊపులో కొట్టుకుని పోవచ్చు. కాని ‘నన్ను డిస్ట్రబ్ చేయకండి. పని చేసుకోనివ్వండి’ అన్నాడు ప్రదీప్. 5. కష్టేఫలీ: ‘మిడ్నైట్ రన్నర్’గా కొత్త హోదా పొందాక ‘నువ్వు ఇచ్చే సందేశం’ అని అడిగితే ‘కష్టపడాలి. కష్టపడితే లోకం తల వొంచుతుంది’ అని జవాబు చెప్పాడు. పిల్లలను పూర్తి కంఫర్ట్ జోన్లో పెట్టాలని తల్లిదండ్రులు ఆరాటపడటంలో తప్పు లేదు. కాని సవాళ్లను ఎదుర్కొని, ఎదురుదెబ్బలకు తట్టుకుని, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుని, విలువలు కోల్పోకుండా కష్టపడి పైకి రావాలని పిల్లలకు చెప్పడానికి ప్రదీప్ మెహ్రాకు మించిన సజీవ ఉదాహరణ లేదు. తాతల, తండ్రుల జీవితాల్లోని విజయగాథలు ఈనాటి పిల్లల జీవితాల్లో ఉంటున్నాయా అని చూసుకుంటే వారిని ఉక్కుముక్కల్లా పెంచుతున్నామా లేదా ఇట్టే తెలిసిపోతుంది. ఇవాళ పరిశీలించి చూడండి. Watch #PradeepMehra’s 20 second SPRINT to lift your Monday SPIRITS ❤️ https://t.co/UnHRbJPdNa pic.twitter.com/nLAVZxwauq — Vinod Kapri (@vinodkapri) March 21, 2022 -
‘డార్లింగ్’ ప్రదీప్.. ఆర్మీలో చేరేందుకు ఏం చేస్తున్నాడంటే.. వీడియో వైరల్
లక్నో: సోషల్ మీడియాలో ఓ యువకుడు చేసిన ఫీట్ సంచలనంగా మారింది. ప్రస్తుతం అతను సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాడు. ఇంతకీ అతను ఏం చేశాడంటే.. ప్రతీ రోజు రాత్రి 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తాడు. ఎందుకో కారణం తెలిస్తే మీరు ఫిదా అయిపోతారు. వివరాల్లోకి వెళ్తే.. నోయిడాకు చెందిన ప్రదీప్(19) పట్టణంలోని వీధుల్లో రాత్రి వేళ పరిగెత్తుతుండగా ఫిల్మ్ మేకర్ వినోద్ కాప్రీ చూశాడు. ఇంతలో వినోద్.. ప్రదీప్ దగ్గరికి వెళ్లి ఎందుకిలా పరిగెత్తుతున్నావని ప్రశ్నించగా.. అతడు చెప్పిన సమాధానం విని ఫిదా అయిపోయాడు. తాను ప్రతీ రోజు ఇలాగే 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తానని ప్రదీప్ చెప్పాడు. ఎందుకని మళ్లీ ప్రశ్నించగా.. తన కల భారత ఆర్మీలో చేరడమేనని.. అందుకే తాను ఇలా ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలిపాడు. ఈ క్రమంలో వినోద్.. ఉదయం సమయంలో రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు కదా అని అడగ్గా.. తాను మెక్‌డోనాల్డ్ సెక్టార్-16లో పని చేస్తున్నానని అన్నాడు. ఉదయాన్నే 8 గంటలకు లేచి వంట చేయాలని చెప్పాడు. తన తల్లి అనారోగ్యం కారణంగా మంచానపడిందని చెప్పిన ప్రదీప్.. తన తమ్ముడికి సైతం వంట చేసిపెట్టాలని సమాధానం ఇచ్చాడు. అందుకే తాను రాత్రి సమయంలోనే ఇలా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తానని వివరించాడు. ప్రదీప్ రన్నింగ్ కొనసాగిస్తూనే ఇలా సమాధానాలు చెప్పడం విశేషం. చివరకు.. ప్రదీప్‌ను వినోద్ కాప్రీ తన కారులో ఇంటి వద్ద దింపుతానని చెప్పగా.. అతను నో చెప్పాడు. కారులో వస్తే ఈరోజు ప్రాక్టీస్ మిస్ అవుతానని చెప్పడంతో వినోద్ మరోసారి ఫిదా అయిపోయాడు. కాగా, అతను రన్నింగ్ చేస్తున్న విషయంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ఇది నిజంగా స్ఫూర్తిదాయకం. అయితే నా #MondayMotivation ఏమిటో మీకు తెలుసా? అతను చాలా గ్రేట్, రైడ్ ఆఫర్‌ను తిరస్కరించడం వాస్తవం. అతనికి సహాయం అవసరం లేదు. ఆయనే ఆత్మనిర్భర్ అంటూ ట్విట్టర్లో వీడియోను షేర్ చేశాడు. Inspiring…all the best #Pradeep 👏🏼👏🏼👏🏼 https://t.co/Y1YMQBV5jW — Sai Dharam Tej (@IamSaiDharamTej) March 21, 2022 ప్రదీప్ వీడియోపై టాలీవుడ్ హీర్ సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. స్పూర్తిదాయకం.. ఆద్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేశారు. The only impossible journey is the one you never begin 👍 Video Via @vinodkapri pic.twitter.com/ue5x482T2s — Defence Squad (@Defence_Squad_) March 20, 2022 టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ స్పందిస్తూ.. What an exemplary person 🌟 Run #Pradeep Run 🏃♂️ https://t.co/hAibkgRU7U — Krish Jagarlamudi (@DirKrish) March 20, 2022 -
అర్ధరాత్రి పార్టీ.. మద్యం మత్తులో చిందులు.. నటులపై కేసు
సాక్షి, బెంగళూరు: నగరంలోని కెంగేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ రిసార్టులో ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి పార్టీ చేసుకుంటున్న టీవీ నటులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీరియళ్లలో నటించే రక్షిత్–అనూషా దంపతులు, ఇతరులు అభిషేక్, రంజన్, రాకేశ్, రవిచంద్రన్‌లు అర్ధరాత్రి 1.30 సమయంలో మద్యం మత్తులో చిందులేస్తుండగా పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. చదవండి: (భార్య మృతితో భర్త ఆత్మహత్య) -
తెలంగాణ: హైదరాబాద్‌లో అర్దరాత్రి లాఠీగ్యాంగ్ హల్చల్
-
Hyderabad: అర్దరాత్రి లాఠీగ్యాంగ్ హల్చల్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన లాక్డౌన్లో కొందరు నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా తిరుగుతున్నారు. అయితే అలాంటి వారిపై పోలీసులు కాకుండా కొందరు ముప్పేట దాడి చేస్తున్నారు. ఓ గ్యాంగ్ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ దాడులకు పాల్పడుతున్నారు. ఎవరైనా బయటికి వస్తే ముప్పేట దాడి చేస్తుండడంతో కలకలం రేపుతోంది. అయితే ఆ దాడికి పాల్పడుతున్న వారిని పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజీలో ఇద్దరిని గుర్తించినట్లు సమాచారం. దీనిపై బాలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. అర్దరాత్రి బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షహీన్ నగర్ రోడ్లపై ఒక్కో బైక్‌పై ఇద్దరిద్దరు వ్యక్తులు హల్చల్ చేస్తున్నారు. కొందరు బైకులపై తిరుగుతూ లాఠీలు చేత బట్టుకొని కనిపించిన వారిని చితకబాదుతున్నారు. అయితే వారిని మొదట పోలీసులుగా స్థానికులు భావించారు. కానీ వారు జులాయి గ్యాంగ్‌గా గుర్తించారు. నాలుగు, ఐదు బైక్‌లపై పోలీస్ డ్రెస్ లేకుండా సంచరిస్తూ లాఠీలతో దాడి చేస్తుండడంతో స్థానికులు సీసీ ఫుటేజీలో గమనించారు. వారు పోలీసులు కాదని గుర్తించి బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
హిజ్రాల ఆగడాలు.. ఇళ్ల ముందు అసభ్యకర వస్తువులు
ఫిలింనగర్: ఫిలింనగర్‌లోని గౌతంనగర్ బస్తీలో కొందరు హిజ్రాలు అద్దెకుంటున్నారని వీరి ఆగడాలతో తమకు కంటిమీద కునుకు లేకుండా పోతోందని, అరుపులు కేకలతో న్యూసెన్స్ చేస్తున్నారని దీనిపై ప్రశ్నిస్తే తమపై దాడులకు దిగుతున్నారని బస్తీకి చెందిన ఎం. చంద్రకళ అనే మహిళతో పాటు పలువురు ఆదివారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి తమ ఇళ్ల తలుపులు బాదుతున్నారని, తెరవకపోతే ఇళ్ల ముందు అసభ్యకర వస్తువులను పడేస్తున్నారని చిన్న పిల్లలు వీరిని చూసి భయపడుతున్నారని ఆరోపించారు. వీరి ఆగడాలను నియంత్రించాలని ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలని కోరారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అర్ధరాత్రి ఓటు.. ఎవరికి చేటు.?
పోలింగ్ సుదీర్ఘంగా సాగింది.. మునుపెన్నడూ లేని విధంగా చాలాచోట్ల అర్థరాత్రి వరకూ ఓటర్లు లైన్లో నిలబడి ఓటు వేశారు. మధ్యాహ్నం వరకూ మందకొడిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత నుంచి ఊపందుకుంది. చైతన్యం పెరిగి ఓటు వినియోగించుకోవడం బాగానే ఉన్నా.. అర్థరాత్రి వరకూ సాగిన పోలింగ్‌పైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. రాత్రివేళ దొరికిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అధికార పార్టీ శతవిధాలా ప్రయత్నించిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ దీన్ని గట్టిగా ఎదర్కొని ఓట్లు కొల్లగొట్టాలన్న టీడీపీ ఆశలను వమ్ము చేసిందన్న వాదనలు ఉన్నాయి. మరోవైపు అర్ధరాత్రి ఓటింగ్.. పెరిగిన పోలింగ్ ప్రభుత్వంపై పేరుకుపోయిన వ్యతిరేకతకు అద్దం పడుతోందని.. అందువల్ల ఆ ఓట్లన్నీ తమవేనని వైఎస్సార్సీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే మహిళలు ఎక్కువగా పాల్గొన్నందున ఆ ఓట్లన్నీ తమవేనని టీడీపీ బింకం ప్రదర్శిస్తోంది. విశాఖసిటీ: జిల్లా ఓటర్లు సత్తా చాటారు. ఓటు వేసి సగర్వంగా తలెత్తారు. అర్థరాత్రి వరకూ లైన్లో నిలబడి ఓటు వేశారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన సార్వత్రిక సమరంలో దాదాపు అన్ని చోట్లా అధిక శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం వరకూ సాధారణ పోలింగ్ శాతం మాత్రమే నమోదైంది. అయితే.. సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత పోలింగ్ బూత్‌లవైపు లక్షల అడుగులు పడ్డాయి. ఒక్కొక్కరుగా వచ్చి లైన్లో నిలబడటంతో వందలు.. వేల మంది సాయంత్రం 6 గంటలకల్లా పోలింగ్ స్టేషన్‌కు చేరుకోవడంతో రాత్రి వరకూ బారులు తీరారు. దాంతో చివరి ఓటర్ల తీర్పు ఎవరివైపు మొగ్గు చూపిందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పోలింగ్ ఎవరికి మేలు.? పెరిగిన పోలింగ్ శాతం ఏ పార్టీకి మేలు చేస్తుందన్నదే చిక్కుముడిగా మారింది. అర్థరాత్రి వరకూ సాగిన పోలింగ్‌లో మహిళలు, యువకులే ఎక్కువగా ఉన్నారు. ఓటర్లు పట్టుదలతో ఓటు వెయ్యడం వెనుక కారణాలు ఏంటన్న విషయమై అన్ని పార్టీల అభ్యర్థులూ వీలైనంత మంది నుంచి తెలుసుకు నే ప్రయత్నం ఇంకా చేస్తునే ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రచారం చెయ్యగా.. ఈసారి ఎవరిదారి వారు ఎంచుకోవడంతో చివరి ఓటింగ్ తమకే లాభిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఎక్కువగా ఉండటంతో ఎలాగైనా సుపరిపాలన అందించే పార్టీకి అధికారం ఇవ్వాలన్న తలంపుతో ఓటర్లు చైతన్యవంతులై ముందుకొచ్చారనేది ప్రతి ఒక్కరి వాదన. ఓట్ల కొనుగోలుకు టీడీపీ ప్రయత్నం అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోరాదన్న రీతిలో టీడీపీ వ్యవహరించింది. సాయంత్రం తర్వాత వచ్చిన ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ఎత్తుగడలకు దిగారు. నగరంలోని ఉత్తరం, దక్షిణం, పెందుర్తితో పాటు పలు నియోజకవర్గాల్లో అర్థరాత్రి వరకూ ఓటింగ్ సాగింది. ఇదే అదనుగా మరోసారి డబ్బులు పంపిణీ చేసి ఓట్లు కొనుగోలు చేయాలని ప్లాన్ చేశారు. వీరి ఎత్తుగడలను చాలా చోట్ల ప్రజలు తిప్పికొట్టారు. పోలింగ్ ముగిసే చివరి వరకూ ఓటర్లను ప్రలోభ పెట్టే పనిలోనే టీడీపీ శ్రేణులు వ్యవహరించాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని రాంజీ ఎస్టేట్స్, తాటిచెట్లపాలెంలో జరిగిన సంఘటనలే దీనికి నిదర్శనం. ఈవీఎంలు మొరాయించాయంటూ టీడీపీ కార్యకర్తలు కొందరు తప్పుడు ప్రచారాలు చేసి ఓటర్లను బయటకు పంపించి గేట్లు వెయ్యడం, రాంజీ ఎస్టేట్‌లోని పోలింగ్ బూత్‌లలో గంటా అనుచరులు చేసిన హల్చల్ కారణంగా ఓటర్లు ఇబ్బంది పడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన వైఎస్సార్సీపీ ఓటర్లకు మద్దతుగా ధర్నాలు చేయడంతో అధికారులు, పోలీసులు వచ్చి ప్రలోభాలకు చెక్ పెట్టారు. అర్ధరాత్రీ చురుగ్గా ఓటర్లు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ప్రతి ఓటరూ తమ హక్కు వినియోగించుకునేందుకు తహతహలాడారు. ఉత్తర నియోజకవర్గంలోని రాంజీ ఎస్టేట్‌లో 229, 204 పోలింగ్ బూత్‌లలో రాత్రి 11.30 గంటల వరకూ పోలింగ్ జరిగింది. దక్షిణ నియోజకవర్గం కొబ్బరితోటలో రాత్రి 11 గంటల వరకూ సాగింది. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రాత్రి 11 గంటల వరకు, పాయకరావుపేట నియోజకవ ర్గం నక్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అర్థరాత్రి 12 గంటల వరకు, చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలంలో వేకువ జామున 3.30 గంటల వరకూ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మావో ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ అని ప్రకటించినా.. అరకు, పాడేరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో రాత్రి 11 గంటల వరకూ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతగిరి మండలం వేంగడ పంచాయతీలో అర్థరాత్రి ఒంటి గంట వరకూ పోలింగ్ జరిగింది. -
వృద్ధాశ్రమంలో అర్ధరాత్రి జడ్జి తనిఖీలు
-
హైదరాబాద్‌లో అర్ధరాత్రి దారుణ హత్య
-
అర్ధరాత్రి ఘోరం
► అదుపుతప్పి వ్యవసాయబావిలోకి దూసుకెళ్లిన టవేరా ► ఇద్దరు మృతి, అయిదుగురికి తీవ్ర గాయాలు ► శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన ► తిరుపతి సమీపంలోని పెరుమాళ్లపల్లెలో ప్రమాదం ► బాధితులందరూ ఒకే కుటుంబానికి చెందిన తమిళనాడు వాసులు ► క్షతగాత్రులను రుయాకు తరలించిన పోలీసులు తిరుపతి క్రైం: శుక్రవారం అర్ధరాత్రి 12.15 గంటల ప్రాంతంలో.. తిరుపతి ఎమ్మార్ పల్లె సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టవేరా వాహనం అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. దాదాపు 150 మీటర్ల వరకు రోడ్డు పక్కకు వెళ్లింది. అనంతరం సుబ్రమణ్యంరెడ్డి అనే రైతుకు చెందిన వ్యవసాయ బావిలో పడిపోయింది. దాదాపు 75 అడుగుల లోతులో వాహనం ఇరుక్కు పోయింది. పోలీసులు అందించిన వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లా చెంగం గ్రామానికి చెందిన షణ్ముగం, విజయ్, శివ, సరసు, సుకన్య, షకీలతో పాటు డ్రైవర్ తిరుమల శ్రీవారి దర్శనానికి గురువారం వచ్చారు. శుక్రవారం తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయాన్ని దర్శించారు. అనంతరం స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో తిరుపతి ఎమ్మార్‌పల్లె పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెరుమాళ్లపల్లె పంచాయతీ ఆంజనేయస్వామి గుడి ఎదురుగా వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్‌తోపాటు సుకన్య అనే మహిళ మృతి చెందింది. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో పోలీసుల, ఫైర్ సిబ్బంది క్షతగాత్రులను బావిలో నుంచి రక్షించి రుయా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో క్షతగాత్రుల రోదనలు మిన్నంటాయి. శబ్ధం విని ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు టవేరా వాహనం వ్యవసాయ బావిలో పడడంతో భారీశబ్ధం వచ్చింది. దీంతో స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి. 108కు, పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది, 108 సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. -
అర్ధరాత్రి నుంచి క్యాబ్ డ్రైవర్ల నిరవధిక సమ్మె
-
అర్ధరాత్రి నుంచే అమ్మసన్నిధికి..
సకల విద్యలకు అధిష్టాన దేవత అయిన సరస్వతీదేవి అవతారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. రాత్రి 12 గంటల సమయంలో దుర్గగుడి పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి. అర్ధరాత్రి 12.30 గంటలకు సుప్రభాత సేవతో ఆలయంలో అర్చకస్వాములు వైదిక కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం శనివారం తెల్లవారుజామున 1.10 గంటలకు అమ్మవారికి ప్రత్యేక హారతులిచ్చి తలుపులు తెరిచారు. తొలుత ఈవో సూర్యకుమారి దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం ఇతర ప్రముఖులను అంతరాలయంలోకి అనుమతించారు. ఆ తర్వాత సాధారణ భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిచ్చారు. – విజయవాడ (వన్‌టౌన్) -
ఉనికిలి సొసైటీలో చోరీ
ఉనికిలి(అత్తిలి) : ఉనికిలి విశాల సహకార పరపతి సంఘం భవనంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన మండలంలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అత్తిలి మండలం ఉనికిలిలో మెయిన్‌రోడ్డు పక్కన ఉన్న సొసైటీ ప్రధాన ద్వారం తలుపులను పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు సేల్స్ కౌంటర్లోని రూ.రెండులక్షల నగదుతోపాటు నాలుగు సీసీ కెమెరాలు, రెండు కంప్యూటర్లు, ఎల్సీడీ టీవీని అపహరించుకుపోయారు. రికార్డు గదికి నిప్పటించారు. నగదు ఉన్న సొరుగులోని స్ట్రాంగ్‌రూం తాళాలు తీసుకున్న దొంగలు బంగారు ఆభరణాలు భద్రపరిచే రూం తెరిచేందుకు విఫలయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో వెళ్తూ వెళ్తూ.. రికార్డులు భద్రపరిచిన గదికి నిప్పంటించారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సొసైటీ భవనం పక్కనే నివాసం ఉంటున్న వృద్ధురాలు సుబ్బలక్ష్మి పొగలు రావడాన్ని గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సొసైటీ అధ్యక్షుడు వట్టికూటి సూర్యనారాయణఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. అగ్నిమాపక సిబ్బందికి వచ్చి మంటలను పూర్తిస్థాయిలో అదుపు చేశారు. ఎస్ఐ వి.వెంకటేశ్వరరావు సొసైటీకి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తణుకు సీఐ చింతా రాంబాబు కూడా వచ్చి సొసైటీని పరిశీలించారు. ఏలూరు నుంచి వేలి ముద్ర నిపుణలు రప్పించి ఆధారాలు సేకరించారు. పోలీసు జాగిలంతో తనిఖీలు చేపట్టారు. జాగిలం పశువుల ఆస్పత్రి వరకూ వచ్చి ఆగింది. సొసైటీ కార్యదర్శి రావి చిట్టిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వి.వెంకటేశ్వరరావు తెలిపారు. -
అర్ధరాత్రి కాపు కాసి..
* వ్యక్తి దారుణ హత్య * వివాహేతర సంబంధమే కారణం? * నిందితుల కోసం పోలీసుల గాలింపు గుంటూరు రూరల్ : అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వ్యక్తిని గొంతు కోసి హత్య చేసిన సంఘటన సోమవారం అర్థరాత్రి మండలంలోని ఓబులునాయుడుపాలెంలో చోటు చేసుకుంది. సంఘటనా స్థలిలో పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన యేమినేడి వెంకటప్పయ్యకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు యేమినేడి వెంకటేశ్వరరావు (43) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, టీడీపీలో కీలకంగా పనిచేస్తుంటాడు. మృతునికి ఇంకా వివాహం కానందున ఒంటరిగా నివసిస్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గుంటూరు నుంచి ఇంటికి వచ్చి నిద్రించాడని స్థానికులు చెబుతున్నారు. తెల్లవారుజామున ఇంటి ముందు విగత జీవుడై పడి వుండడంతో స్థానికులు గమనించి పక్కనే నివసిస్తున్న మృతుని బంధువులకు తెలియజేయగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన విషయం తెలిసిన సౌత్‌జోన్ డీఎస్పీ బి.శ్రీనివాస్, రూరల్ మండలం నల్లపాడు సీఐ కె.శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాగ్ స్క్వాడ్ మృతదేహం వద్ద నుంచి గ్రామంలోని ప్రధాన రహదారి ఎన్‌హెచ్ 16 వరకూ వచ్చి వెనుదిరిగింది. క్లూస్ టీం ఆధారాలు సేకరించారు.నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.\ వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల అనుమానం.. మృతుడికి గ్రామంలో ఇద్దరు ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉండడం, గ్రామంలో అధికారపార్టీలో పోరు నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందన్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం నడుపుతున్న మహిళకు చెందిన వ్యక్తులే మరో ఇద్దరు ముగ్గురితో కలిసి ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోనుంచి బయటవరకూ పెనుగులాట జరిగిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో నిందితులు పోలీసులకు లొంగినట్టు విశ్వసనీయ సమాచారం. -
చేతబడి
శర్మిష్ట మంచం దగ్గరకు చేరుకుని, పరిస్థితిని గమనించాడు. నాడి పట్టి చూశాడు. కనురెప్పలు తెరిచి చూశాడు. రెండు నిమిషాలు కళ్లు మూసుకుని ధ్యానంలోకి జారుకున్నాడు. కళ్లు తెరిచాక అన్నాడు... ‘‘ఎవరో బిడ్డ మీద మారణ ప్రయోగం చేస్తున్నారు’’. మూసిన కన్ను తెరవకుండా మంచం మీద పడి ఉంది శర్మిష్ట. నెలరోజులుగా ఇదే స్థితిలో ఉంది. ఒక్కోరోజు ఒళ్లు కాలిపోతున్నంతగా జ్వరం... ఒక్కోరోజు ఇక అవే అంతిమ ఘడియలన్నట్లుగా చల్లబడిపోయే శరీరం. మామూలుగా ఆమె చలాకీగానే ఉండేది. నవ్వుతూ తుళ్లుతూ కాలేజీకి వెళ్లేది. అందరితోనూ కలివిడిగా ఉండేది. ఆరు నెలల కిందటే ఆమెలో అనూహ్యమైన మార్పులు మొదలయ్యాయి. ఎవరికీ అంతుచిక్కని మార్పులు. ఒంట్లో రకరకాల నొప్పులు... అర్ధరాత్రివేళ ఉలిక్కిపడి లేచి సంధి ప్రేలాపనలు! కాలం గడుస్తున్న కొద్దీ చిక్కిశల్యమవుతోంది. శర్మిష్టది కాస్త కలిగిన కుటుంబమే. తండ్రి దేబాశీష్ జిల్లాలో ఉన్నతాధికారి. తల్లి మమత సాదాసీదా గృహిణి. ఒక్కగానొక్క కూతురైన శర్మిష్టని కళ్లలో పెట్టుకుని పెంచుకున్నారు. తనకి ఉన్నట్టుండి జబ్బు చేయడంతో దేబాశీష్ బెంగటిల్లిపోయారు. చాలామంది వైద్యులకు చూపించారు. రకరకాల పరీక్షలు జరిపించారు. అయినా ఆమె పరిస్థితికి కారణమేంటో అంతు చిక్కలేదు. ఇంతకీ శర్మిష్టకు ఏం జరిగింది? ఎందుకిలా కృశించిపోయింది? సమాధానం ఇద్దరికి మాత్రమే తెలుసు. అర్ధరాత్రి దాటుతోంది. బిప్రొ, కళియాబాబా ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. వారి మధ్య వెలుగుతున్న హోమగుండం. హోమగుండంలో ఏవేవో పదార్థాలు వేస్తూ, వినీ వినిపించనట్లు తదేక దీక్షతో మంత్రోచ్ఛాటన సాగిస్తున్నాడు కళియాబాబా. చేతులు కట్టుకుని నిశ్శబ్దంగా జరుగుతున్న తతంగాన్ని గమనిస్తున్నాడు బిప్రొ. బిప్రొ గురించి అతడి ఇంటి చుట్టుపక్కల వాళ్లకు తప్ప పెద్దగా ఎవరికీ తెలీదు గానీ, కళియాబాబా గురించి కలకత్తా వరకు కూడా చాలామందికి తెలుసు. భూతవైద్యుడిగా, తాంత్రికుడిగా కళియాబాబా శక్తిసామర్థ్యాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. ఊరవతల శ్మశానపు ప్రహారీని ఆనుకున్న పాడుబడ్డ గదిలో ఉంటాడతను. ఇప్పుడు ఆ గదిలోనే ఉన్నాడు. అతడి ఎదురుగా బిప్రొ. హోమగుండానికి దిగువన అడుగు పొడవున్న పిండిబొమ్మ. దాని మీద చెల్లాచెదురుగా చల్లిన పసుపు, కుంకుమలు. బొమ్మకు అక్కడక్కడా గుండుసూదులు గుచ్చి ఉన్నాయి. మంత్రోచ్ఛాటన ముగించాక ఆ బొమ్మను ఎడమ చేతిలోకి తీసుకున్నాడు కళియాబాబా. ఆ బొమ్మవైపే కొన్ని క్షణాలు తదేకంగా చూశాడు. బొమ్మ చెవిలో ఏదో చెప్పాడు. బొమ్మను మళ్లీ యథాస్థానంలో పెట్టేసి, దానికి మరో నాలుగు గుండుసూదులు గుచ్చాడు. బిప్రొ వైపు ఒక చూపు చూసి... ‘‘ఇక చెప్పు’’ అన్నాడు. ‘‘నీ దయవల్ల అంతా సజావుగానే ఉంది. ఆమె మూసిన కన్ను తెరవడం లేదు. ఎవరూ కారణాన్ని కనుక్కోలేకపోతున్నారు. ఊరకే వైద్యుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్లేం చేస్తార్లే..!’’ విజయగర్వంతో చిన్నగా నవ్వాడు కళియాబాబా. ‘ఔను వాళ్లేం చేస్తార్లే’... అంటూ ఈసారి కాస్త పెద్దగానే నవ్వాడు. మరీ వికటాట్టహాసం కాదు గానీ, ఆ నవ్వు చూస్తే ఎవరికైనా వెన్నులోంచి వణుకు పుడుతుంది. ‘‘ఇంకెన్నాళ్లు...?’’ అడిగాడు బిప్రొ. ‘‘ఓపిక పట్టలేవూ..! మీ పట్నపోళ్లంతా ఇంతే. అస్సలు ఓపిక ఉండదు. ఇప్పుడే కదా ఆశ్వయుజం మొదలైంది. మాఘ పున్నమి నాటికి అంతా అయిపోతుంది’’ కాస్త విసుక్కుంటూ బదులిచ్చాడు కళియాబాబా. ‘‘కోపం తెచ్చుకోకు గురూ..! ఏదో ఆత్రం కొద్దీ అడిగాను’’ సర్దిచెబుతున్న ట్లుగా అన్నాడు బిప్రొ. ‘‘సర్లే... సర్లే... మళ్లీ వచ్చే మంగళవారం కనిపించు. మరో నాలుగు సూదులు గుచ్చేద్దాం’’... అప్పటి తతంగానికి ముగింపు పలికాడు కళియాబాబా. ‘‘వస్తా’’ అంటూ ఊరివైపు బయలుదేరాడు బిప్రొ. వీధి అరుగు మీద కుర్చీ వేసుకుని కూర్చున్నాడు బిప్రొ. దీర్ఘంగా ఆలోచిస్తు న్నాడు. సరిగ్గా ఏడాది కిందట జరిగిందా సంఘటన. అది తలచుకుంటే చాలు... ఇప్పటికీ మనసు కుతకుతలాడిపోతుంది. ఆరోజు ఎప్పట్లాగే హుషారుగా ఆఫీసుకెళ్లాడు. ఉదయం నుంచి కలెక్షన్లు బాగానే ఉన్నాయి. ఏవేవో పనుల మీద ఎవరెవరో వస్తుంటారు. వాళ్లకు అవసరం, తనకు అవకాశం. చెయ్యి తడిపితే చాలు, ఎలాంటి సర్టిఫికేట్నైనా పుట్టించగలడు తను. అందుకేగా తనకు అంత డిమాండ్ మరి! సాయంత్రంలోగా రాబోయే కలెక్షన్ల గురించి మనసులోనే లెక్కలేసుకుంటూ తాపీగా లంచ్‌కి వెళ్లాడు. తినేసి వచ్చి భుక్తాయాసంతో సీట్లో కూలబడ్డాడు. అప్పటికే ఒక రైతు తన కోసం ఎదురు చూస్తున్నాడు. కొడుకు చదువు కోసం క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటూ వచ్చాడతను. పదిరోజులుగా తిరుగుతున్నాడు. అతడిని చూడగానే విసుగ్గా ముఖం చిట్లించాడు బిప్రొ. ‘‘ఇవాళైనా డబ్బు తెచ్చావా? డబ్బు చెల్లిస్తేనే పనులయ్యేది’’ అలవాటుగా దీర్ఘాలు తీస్తూ అన్నాడు. ‘‘తెచ్చా సార్’’ అంటూ ఐదు వంద నోట్లు చేతిలో పెట్టాడా రైతు. బిప్రొ కళ్లు మిలమిల్లాడాయి. ఆ రైతు నుంచి ఎప్పట్లాగే లాకేత్వమే సమాధానంగా వస్తుందనుకున్నాడు. కానీ డబ్బు చేతిలో పెట్టేసరికి హుషారు పెరిగింది. ‘‘సరే... బయట కూర్చో. తహశీల్దారు సారు ఖాళీ అయ్యాక సంతకం పెట్టించి పిలుస్తా’’ అన్నాడు. రైతు నెమ్మదిగా బయటకు వెళ్లి, వసారాలోని బెంచీ మీద కూర్చున్నాడు. ఐదు నిమిషాలైనా గడవక ముందే అరడజను మంది బిప్రొ సీటు దగ్గరకు దూసుకొచ్చారు. వాళ్లలో ఒకతను ‘‘బల్లకు ఉన్న అరలన్నింటినీ సోదా చేయండి. ఇతని జేబులు కూడా’’ అంటూ మిగిలిన వాళ్లను ఆదేశించాడు. వాళ్లు పని మొదలుపెట్టారు. ‘‘ఏయ్.... ఏంటిది..? ఎవరు మీరు..?’’ తత్తరపడుతూ ప్రశ్నించాడు బిప్రొ. తనిఖీకి ఆదేశించిన వ్యక్తి జేబులోంచి తన ఐడీ కార్డు తీసి చూపించాడు. బిప్రొ ముఖం పాలిపోయింది. వచ్చిన వాళ్లు ఏసీబీ తనిఖీ బృందం అధికారులు. అంతకు ముందే బిప్రొను కలుసుకున్న రైతుకు డబ్బులిచ్చి పంపింది వాళ్లే. రైతు ఇచ్చిన నోట్లు బిప్రొ చొక్కా జేబులో దొరికాయి. అక్కడికక్కడే అరెస్టు చేశారు. అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు ఏడీఎం దేబాశీష్. కోర్టు విచారణ తర్వాత బిప్రొ డిస్మిస్సయ్యాడు. అప్పటి నుంచి దేబాశీష్పై పగబట్టాడు బిప్రొ. అతడిని ఎలాగైనా దెబ్బకొట్టాలి. దేబాశీష్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (తెలుగు రాష్ట్రాల్లో జాయింట్ కలెక్టర్‌తో సమానం). తానేమో ఉద్యోగం పోగొట్టుకున్న గుమస్తా. అతణ్ని ఏమీ చేయ లేడు. అందుకే ఇంటర్ చదువుకుంటున్న అతని కూతురు శర్మిష్టను ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. శర్మిష్ట అంటే తండ్రికి పంచప్రాణాలని తెలుసు. అందుకే ఆమెను టార్గెట్ చేసుకున్నాడు. కళియాబాబా దగ్గరకు వెళ్లాడు. అడిగినంత డబ్బు ముట్టజెప్పాడు. తన కసి తీరాలన్నాడు. అతడు చెప్పినట్లే శర్మిష్టపై బాబా ప్రయోగం మొదలెట్టాడు. మామూలు క్షుద్రప్రయోగం కాదు, ఏకంగా మారణ ప్రయోగమే! వైద్యులు తన కూతురు ప్రాణాలు కాపాడలేరని అర్థమైపోయింది మమతకు. ఆరోజే ఊరి నుంచి వచ్చిన ఆమె అన్నయ్య ప్రదీప్ కూడా అదే మాటన్నాడు. ‘‘ఇదేదో ప్రయోగంలా ఉంది’’ అని కూడా అన్నాడతను. పరిష్కారం గురించి అన్నాచెల్లెళ్లు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ‘‘ఒకసారి చిన్మయ స్వామి దగ్గరకు వెళదాం’’ అన్నాడు ప్రదీప్. ఇద్దరూ బయల్దేరారు. బజారు వీధికి వెనుక ఒక ఇరుకు గల్లీలో సాదాసీదా పాతకాలం పెంకుటింటికి చేరుకున్నారు. ముందు గదిలోని వాలుకుర్చీలో కూర్చుని ఉన్నాడు స్వామి. ‘‘ఎవరు మీరు?’’ ప్రశ్నించాడాయన. అన్నాచెల్లెళ్లు తమను తాము పరిచయం చేసుకున్నారు. సమస్య చెప్పుకున్నారు. ‘‘ఇంటికి వచ్చి బిడ్డను చూస్తా’’ అన్నాడు చిన్మయస్వామి. చేతికర్ర, భుజాన సంచి, ఒక కమండలం పుచ్చుకుని వాళ్లతో కలసి అప్పటికప్పుడే బయలుదేరాడు. శర్మిష్ట మంచం దగ్గరకు చేరుకుని, పరిస్థితిని గమనించాడు. నాడి పట్టి చూశాడు. కనురెప్పలు తెరిచి చూశాడు. రెండు నిమిషాలు కళ్లు మూసుకుని ధ్యానంలోకి జారుకున్నాడు. కళ్లు తెరిచాక అన్నాడు... ‘‘ఎవరో బిడ్డ మీద మారణ ప్రయోగం చేస్తున్నారు’’. హడలిపోయారు వాళ్లు. ‘‘మీరే నా బిడ్డకు కాపాడాలి స్వామీ’’... కన్నీళ్లతో చేతులు జోడించి వేడుకుంది మమత. ‘‘మరేం ఫర్వాలేదు... విరుగుడు చేస్తా’’ అభయం ఇచ్చాడాయన. శర్మిష్ట జబ్బకు ఒక రక్షరేకు చుట్టాడు. నుదుట సిందూరం అద్దాడు. ఆమె మంచం చుట్టూ ముగ్గుపొడితో గిరి గీశాడు. ఇంటి బయటకు వచ్చి, ఇంటికి నాలుగువైపులా కూడా గిరి గీశాడు. ‘‘ఇక భయం లేదు. మంగళవారం నాటికి బిడ్డ లేచి కూర్చుంటుంది’’ అని చెప్పి నిష్ర్కమించాడు. ఆ మంగళవారం ఎప్పట్లాగే సూర్యోదయమైంది. కానీ శర్మిష్ట ఎప్పటిలాగా మూసిన కన్ను తెరవకుండా మంచాన పడి లేదు. మెల్లగా కళ్లు తెరిచింది. తనంతట తానే లేచి, మంచానికి చారబడి కూర్చుంది. తల్లి సాయంతో బాత్రూమ్కు వెళ్లి ముఖం కడుక్కుని వచ్చింది. ‘తినడానికేమైనా కావాలి’ అడిగింది. కూతురి నోట వచ్చిన ఆ ఒక్క మాటకే మమత ఆనందంతో ఉప్పొంగిపోయింది. వెంటనే టిఫిన్ తెచ్చి తినిపించింది. అంతలో బయట ఏవో అరుపులు వినిపిస్తే పరుగు పరుగున వెళ్లింది. ఏమైంది అని అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిని అడిగింది. ‘‘కళియాబాబా చచ్చిపోయాడు’’ చెప్పాడతను. ఔను..! కళియాబాబా నెత్తురు కక్కుకుని చచ్చిపోయాడు. తన గదిలో వెలుగుతున్న హోమగుండం దగ్గరే ఒరిగిపోయాడు. మరి బిప్రొ సంగతి! అతడికి పిచ్చెక్కింది. ప్రస్తుతం రాంచీలోని మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడు! - కాద్రా -
అర్ధరాత్రి దోచేశారు..
విజయనగరం : విజయనగరం జిల్లాలోని బాబామెట్ట ప్రాంతంలో దొంగలు శనివారం రాత్రి భారీ చోరీలకు పాల్పడ్డారు. స్థానికులైన పి.రఘువర్మ, వెంకట పైడిరాజు ఇళ్ల కిటికీల గ్రిల్స్ తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించారు. ఇళ్లలో వారు నిద్రిస్తున్న గదులకు బయట గడియ పెట్టి విలువైన ఆభరణాలు ఎత్తుకుపోయారు. రఘువర్మ ఇంట్లో 15 తులాల బంగారు ఆభరణాలు, పైడిరాజు ఇంట్లో 30 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండిని తస్కరించారు. అదే విధంగా రఘువర్మ ఇంట్లోనే వేరొక పోర్షన్లో ఉండే కార్తీక్ ఇంట్లోకి చొరబడి రూ.4 వేల నగదును దొంగిలించారు. బాధితుల ఫిర్యాదుతో ఆదివారం ఉదయం టూటౌన్ పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌ను కూడా రప్పించారు. -
మిడ్నైట్ రైడ్ వివాదం
మరికొంత సమయం కావాలి న్యూఢిల్లీ: మిడ్నైట్ రైడ్ వివాదంపై శుక్రవారం స్థాయీ నివేదికను ఇవ్వడంలో దర్యాప్తు అధికారులు విఫలమయ్యారు. ఉగాండా మహిళలపట్ల అనుచితంగా ప్రవర్తించారన్న కేసులో గుర్తుతెలియని వ్యక్తులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ వివాదానికి సంబంధించి న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి పేరు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తమపై దాడిచేసిన వారికి సోమ్‌నాథ్ భారతి నేతృత్వం వహించినట్లు బాధితురాలైన ఉగాండా మహిళ స్పష్టం చేసిన నేపథ్యంలో కేసు దర్యాప్తు సులభతరమవుతందని భావించారు. అయినప్పటికీ దర్యాప్తు అధికారులు ఇప్పటిదాకా తమ పని ఎందాకా వచ్చిందో కోర్టుకు తెలపడంలో విఫలమయ్యారు. కేసుకు సంబంధించి సాక్షుల పేర్లతో కూడిన ఓ సీల్డ్ కవర్‌ను న్యాయమూర్తి చేత్నాసింగ్‌కు అందజేశారు. పూర్తిస్థాయి నివేదికను ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. కనీసం నెలరోజులైనా గడువు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. కోర్టువర్గాలు అందించిన వివరాల ప్రకారం... న్యాయమూర్తికి అందజేసిన కవర్లో దాదాపు 40 మంది సాక్షుల పేర్లున్నాయి. అందులో 12 మంది ఆఫ్రికన్ మహిళలు ఉండగా మిగతావారు స్థానికులు. ఈ 12 మంది వాంగ్మూలాలను న్యాయమూర్తి సమక్షంలో రికార్డు చేశారు. ఇదిలాఉండగా దర్యాప్తు ప్రాథమిక స్థాయిలోనే ఉందని, పూర్తిస్థాయి నివేదికకు నెలరోజుల సమయం పడుతుందని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. జనవరి 19న ఈ కేసుకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తులపై భారత శిక్షాస్మృతి, సెక్షన్ 153ఏ, 323, 354, 509, 506, 147 ప్రకారం మాలవీయనగర్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఉగాండా మహిళ ఫిర్యాదు మేరకు కోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. బాధితుల్లో రెండో మహిళ కూడా కోర్టును ఆశ్రయించి, ప్రత్యేక కేసు నమోదు చేయాలని కోరిందని, అయితే ఈ ఘటనను కూడా ఒకే కేసుగా పరిగణించి దర్యాప్తు చేయాలని కోర్టు సూచిందన్నారు. -
సమైక్యంగా మళ్లీ..సమరసీమకు..
సాక్షి, కాకినాడ :ప్రభుత్వోద్యోగులు మళ్లీ పోరుబాట పట్టారు. ‘సమైక్యాంధ్రే’ తమ సమరలక్ష్యమని ఎలుగెత్తారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో నేపథ్యంలో.. విభజనను నిరసిస్తూ ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు బుధవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలోని ఎన్జీఓలు సమ్మెబాట పట్టారు. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా సుమారు 32 వేలమంది విధులు గురువారం నుంచి విధులను బహిష్కరించనున్నారు. ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది మినహా రెవెన్యూ, సివిల్ సప్లయిస్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, కమర్షియల్, రవాణా, ఆర్డబ్ల్యూఎస్, డ్వామా, జెడ్పీ, దేవాదాయ, చేనేత, విద్య, వైద్యఆరోగ్యం, పశుసంవర్ధక, గంథాలయ, కార్మిక, సాంఘిక, బీసీ, వికలాంగుల, మైనార్టీ సంక్షేమ తదితర శాఖలతో పాటు ఎక్సైజ్ మినిస్టీరియల్ స్టాఫ్ కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో గురువారం లగాయతు మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడనున్నాయి. గ్రామ స్థాయిలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల నుంచి తహశీల్దార్ వరకు అధికారులు, సిబ్బందితో పాటు కలెక్టర్, జేసీ, ఏజేసీ, డీఆర్వోల వద్ద పనిచేసే అటెండర్లు, డ్రైవర్లతో సహా సమ్మెలోకి వెళ్లనున్నారు. శుక్రవారం నుంచి కార్పొరేషన్, మున్సిపాలిటీల సిబ్బంది కూడా సమ్మెలోకి రానున్నారు. ఈనెల 10 నుంచి సమ్మె బాటపట్టాలని హౌసింగ్ సిబ్బంది నిర్ణయించారు. ట్రెజరీ, కోఆపరేటివ్, వ్యవసాయం, ఇరిగేషన్ తదితర శాఖల సిబ్బంది సమ్మెలో పాల్గొనే విషయంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఎన్నికల ముందస్తు ఏర్పాట్ల ప్రక్రియపై సమ్మె తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందిని ఈనెల 10లోగా బదిలీ చేయాల్సి ఉంది. అయితే వారు సమ్మె బాట పట్టనుండడంతో ఆ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవచ్చు. అన్ని శాఖలూ సమ్మెలోకి రావాలి.. కాగా బుధవారం సాయంత్రం కాకినాడలోని ఏపీ ఎన్జీఓ సంఘ భవన్లో రాష్ర్ట ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘ నేతలతో పాటు గతంలో జరిగిన సమైక్య సమ్మెలో పాల్గొన్న వివిధ ప్రభుత్వశాఖల జేఏసీ నాయకులు, కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జవహర్ అలీ, గోదావరి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంధి బాబ్జి, మున్సిపల్ జేఏసీ నాయకులు డీవీఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు. ఎన్జీఓల సంఘం పిలుపు మేరకు గతంలో మాదిరిగానే సమ్మెలో పాల్గొంటామని వివిధ ప్రభుత్వశాఖల జేఏసీ నేతలు స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర సాధన కోసం చేస్తున్న సమ్మెలో ప్రతి ప్రభుత్వోద్యోగీ పాల్గొనాలని ఆశీర్వాదం, ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్ పిలుపునిచ్చారు. విభజనను అడ్డుకునే ఆఖరి ఘట్టంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన బాధ్యత సమైక్యవాదులపై ఉందన్నారు. సమావేశానంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ విభజన బిల్లును అడ్డుకునేందుకు గత ఏడు నెలలుగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్న వైఎస్సార్ సీపీతో పాటు టీడీపీ, కాంగ్రెస్ సీమాంధ్ర నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న విభజన బిల్లును కూడా అడ్డుకొని సమైక్యతను కాపాడాలన్నారు. ఉద్యమ తీవ్రత ఢిల్లీకి తెలియాలంటే గతంలో మాదిరిగానే ప్రభుత్వశాఖలన్నీ సమ్మెబాట పట్టాలన్నారు. ప్రస్తుతానికి పోరుబాట పడుతున్నది వీరే.. గెజిటెడ్ అధికారులు 3,354 ఎన్జీఓలు 16,823 క్లాస్-4 ఉద్యోగులు 6680 ప్రభుత్వ డ్రైవర్లు 530 వీఆర్ఏలు 2631 వీఆర్వోలు 2185 -
2 రోజులు..రూ. 5 కోట్లు
కామారెడ్డి, న్యూస్‌లైన్: కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేం దుకు డిసెంబర్ 31న యువకులు పెద్ద ఎత్తున విందులు చేసుకున్నారు. మంగళవారం అర్ధరా త్రి వరకు తాగి, తూగారు. అర్ధరాత్రి దాటాక కొ త్త సంవత్సరంలోకి అడుగుపెట్టగానే కేరింత లు కొడుతూ ఎంజాయ్ చేశారు. జనవరి 1 బుధవారం కూడా పెద్ద ఎత్తున విందులు, వినోదాలు కొనసాగాయి. నిజామాబాద్, కామారె డ్డి, ఆర్మూర్, బోధన్ పట్టణాలతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు సాగాయి. దుకాణాల వద్ద వందలా ది మంది బారులు తీరారు. రెండు రోజులకు కలిపి దాదాపు రూ.ఐదు కోట్ల విలువైన మ ద్యం అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. న్యూ ఇయర్ వేడుకల కోసం దుకాణాల యజమానులు ముందస్తుగానే మద్యం పెద్ద ఎత్తున తె ప్పించి పెట్టారు. మాంసం అమ్మకాలూ పెద్ద ఎ త్తున సాగాయి. ముఖ్యంగా కోడి మాంసం అమ్మకాలు ఎక్కువగా సాగినట్టు తెలుస్తోంది. పండుగలను మరిపించిన వేడుకలు సాధారణంగా పండుగల సమయంలో అన్ని వర్గాల ప్రజలు విందులు చేసుకుంటారు. ముఖ్యంగా దసరా పండుగ సందర్భంగా మాం సాహారం తినే ప్రతీ ఇంటిలో మాంసం వండుకుంటారు. తాగే అలవాటు ఉన్నవారు మద్యం తెచ్చుకుని విందు చేసుకుంటారు. పేద, ధనిక తేడా లేకుండా అందరూ విందులతో ఊరట పొందుతారు. ఆ సందర్భంలో మద్యం దుకాణాలు, మాంసం దుకాణాల వద్ద రద్దీ కనిపించే ది. ఈ సారి నూతన సంవత్సరం సందర్భంగా జనం మద్యం, మాంసం దుకాణాల వద్ద ఎగబడడం చూస్తే ఈ వేడుకలు సంప్రదాయ పండుగలను మరిపించాయనే చెప్పాలి. సంబరాలను ‘మత్తు’గా చేసుకోవడానికే ఇష్ట పడ్డారని చెప్పాలి. -
నూతనోత్సాహం
‘నూతన’ సందడి నూతన సంవత్సరం సందర్భంగా నెల్లూరులో మంగళవారం సందడి వాతావరణం నెలకొంది. కొత్త ఏడాదికి స్వాగతం పలికే సన్నాహాల్లో ప్రజలు మునిగితేలడంతో ఎక్కడ చూసినా కోలాహలం కనిపించింది. కొనుగోలుదారులతో వస్త్ర దుకాణాలు కిటకిటలాడాయి. ఇక కేకులు, స్వీట్లు దుకాణాల వారు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. ఆ దుకాణాలన్నీ జనంతో కిక్కిరిశాయి. సండే మార్కెట్ ఇసుకేస్తే రాలనంత రద్దీగా మారింది. అర్ధరాత్రి 12 గంటలు కాగానే సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. -సాక్షి, నెల్లూరు. కొత్త ఏడాదికి సుస్వాగతం కొత్త ఆశలకు చిగురింపజేస్తున్న 2014కు హృదయ పూర్వక స్వాగతం. జిల్లా వాసులకు తీరని కష్టాలు మిగిల్చిన 2013 మాదిరి కాకూడదని విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా రైతులు, ఇతర వర్గాల హృదయాల్లో ఆనందం నింపేలా నీ రాక ఉండాలని ఆశిస్తున్నాం. గడచిన ఏడాది రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో సమైక్య ఉద్యమం పాలనను స్తంభింపజేసింది. విద్యుత్, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో మనిషి జీవనం రోజురోజుకూ దుర్భరమవుతోంది. దేశానికి వెన్నముకగా నిలిచిన రైతన్న బతుకును వర్షాభావ పరిస్థితులు కోలుకోలేని దెబ్బతీశాయి. వీటన్నిటికి 2013 మూగసాక్షిగా నిలిచింది. పేరుకు డెల్టా అయినా జిల్లాలో 40 శాతం ఆయకట్టుకు నీళ్లు అందక వ్యవసాయం అటకెక్కింది. మెట్టరైతుల కష్టాలు చెప్పుకుంటే తీరేవికాదు. పదిహేనేళ్లలో ఎప్పుడూ లేనంత కరువుకు 2013 కారణమైంది. అందుకే జిల్లా వాసుల్లో అనంతమైన సంతోషాన్ని నింపేలా కోరినంత వాన , దాచుకోలేనంత పంట దిగుబడి నీ కాలంలో రావాలి. అలాగే కరెంట్ కష్టాలను అంతమొందించాలి. కోవూరు చక్కెర ఫ్యాక్టరీ బకాయిలు చెల్లించేలా పాలకులు, అధికారుల మనసును మార్చి వేసే ఏడాదిగా చెరకు రైతుల హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించాలి. వైఎస్సార్ మరణానంతరం నిలిచిన జలయజ్ఞం పనులను తిరిగి ప్రారంభించేందుకు పాలకుల్లో మార్పు తీసుకురావాలి. వైఎస్సార్ హయాంలో సంగం, నెల్లూరు ఆనకట్టల నిర్మాణంతో పాటు డెల్టా, నాన్‌డెల్టా కాలువల ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. వీటితో పాటు కనిగిరి, నెల్లూరు, సర్వేపల్లి రిజర్వాయర్లు, కనుపూరు, గండిపాళెం కుడి, ఎడమ కాలువ పనులు చేపట్టారు. వాటిని కొనసాగించే మంచి పనికి నీ రాకే మలుపుకావాలి. కృష్ణపట్నం-బళ్లారి ఫోర్‌లేన్ రోడ్డు పనులు పూర్తి చేసే అవకాశాన్ని వేరే ఏడాదికి దక్కనివ్వక మంచి పేరును సొంతం చేసుకోవాలి. పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధిగాంచిన విదేశీపక్షుల విడిది కేంద్రం పులికాట్ సరస్సుకు వచ్చేందుకు సరైన రోడ్డు వేసేందుకు నీ కాలంలోనే జరగాలి. భూమి అంటే ఒక స్టేటస్ సింబల్. భూమిలేని నిరుపేదలకు ఏడో విడత భూపంపిణీలో కాస్తంత భూమి కల్పించి సామాన్యుల కోసం వచ్చిన కాలంగా చరిత్రకెక్కాలి. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో ప్రతి ఒక్కరి శ్రేయోభిలాషిగా నీరాక(2014)ను ఉండాలి. ఎన్నికాలాలు మారినా నీ హయాం సువర్ణయుగమని తరతరాలు చెప్పుకునేలా నీదైన ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ .... ఇట్లు జిల్లా ప్రజలు -సాక్షి, నెల్లూరు.