హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టు అరుదైన ఘట్టానికి వేదిక అయ్యింది. గురువారం అర్ధరాత్రి 1గం.(శుక్రవారం) దాకా కేసుల విచారణ జరిగింది. అందులో వెకేషన్ బెంచ్ ఆ ప్రొసీడింగ్స్ చేపట్టడం మరీ విశేషం.
మే 6 నుంచి మే 31వ తేదీదాకా తెలంగాణ హైకోర్టుకు సెలవులు. ఈ నేపథ్యంలో అత్యవసర కేసుల విచారణ కోసం వెకేషన్ బెంచ్‌లు పని చేస్తాయి. అయితే గురువారం ఒక్కరోజే లిస్ట్‌లో ఉన్న 250 కేసులు విచారణ చేపట్టింది జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన డివిజన్ బెంచ్. ఉదయం 10.30ని. మొదలైన బెంచ్ విచారణ.. తెల్లవారుఝామున 1గం. దాకా సాగింది. తెలంగాణ హైకోర్టు చరిత్రలోనే ఇదొక అరుదైన ఘట్టమని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇక..
బీజేపీ వేసిన ప్రైవేట్ పిటీషన్ ను అర్థరాత్రి 1 గంటకు విచారించింది ఈ వెకేషన్ బెంచ్. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి క్రిమినల్ కోర్టులో సీఆర్పీసీ సెక్షన్ 299, 300 ప్రకారం ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే.. దీనిని నాంపల్లి కోర్టు స్వీకరించకుండా వాయిదా వేసింది. దీంతో.. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలంటూ దాఖలైన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు గురువారం అర్ధరాత్రి ఒంటిగంటకు విచారణ చేపట్టింది. అయితే ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని.. అర్ధరాత్రి ఒంటి గంటకు విచారించాల్సినంత ముఖ్య విషయం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
సాధారణంగా వెకేషన్ కోర్టులో అత్యవసర పిటిషన్‌లు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుంది. గురువారం వెకేషన్ బెంచ్ జాబితాలో ఉన్న కేసుల విచారణ పూర్తయి.. ఈ కేసు విచారణ వచ్చేటప్పటికి సమయం అర్ధరాత్రి ఒంటిగంట అయింది. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ కేసు కోసం అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఎందుకు వేచి ఉన్నారు? ఇందులో అంత అతస్యవసరం ఏముంది? అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై సూచనలు తెలుసుకుని చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఆదేశాలు జారీచేసింది. విచారణను జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది.
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఆరోపణలున్నాయి.
సంబంధిత వార్త: ఆ వీడియోతో నాకు సంబంధం లేదు: సీఎం రేవంత్
Comments
Please login to add a commentAdd a comment