అర్ధరాత్రి కాపు కాసి..
అర్ధరాత్రి కాపు కాసి..
Published Tue, Aug 30 2016 10:37 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
* వ్యక్తి దారుణ హత్య
* వివాహేతర సంబంధమే కారణం?
* నిందితుల కోసం పోలీసుల గాలింపు
గుంటూరు రూరల్ : అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వ్యక్తిని గొంతు కోసి హత్య చేసిన సంఘటన సోమవారం అర్థరాత్రి మండలంలోని ఓబులునాయుడుపాలెంలో చోటు చేసుకుంది. సంఘటనా స్థలిలో పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన యేమినేడి వెంకటప్పయ్యకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు యేమినేడి వెంకటేశ్వరరావు (43) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, టీడీపీలో కీలకంగా పనిచేస్తుంటాడు. మృతునికి ఇంకా వివాహం కానందున ఒంటరిగా నివసిస్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గుంటూరు నుంచి ఇంటికి వచ్చి నిద్రించాడని స్థానికులు చెబుతున్నారు. తెల్లవారుజామున ఇంటి ముందు విగత జీవుడై పడి వుండడంతో స్థానికులు గమనించి పక్కనే నివసిస్తున్న మృతుని బంధువులకు తెలియజేయగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన విషయం తెలిసిన సౌత్‌జోన్ డీఎస్పీ బి.శ్రీనివాస్, రూరల్ మండలం నల్లపాడు సీఐ కె.శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాగ్ స్క్వాడ్ మృతదేహం వద్ద నుంచి గ్రామంలోని ప్రధాన రహదారి ఎన్‌హెచ్ 16 వరకూ వచ్చి వెనుదిరిగింది. క్లూస్ టీం ఆధారాలు సేకరించారు.నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.\
వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల అనుమానం..
మృతుడికి గ్రామంలో ఇద్దరు ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉండడం, గ్రామంలో అధికారపార్టీలో పోరు నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందన్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం నడుపుతున్న మహిళకు చెందిన వ్యక్తులే మరో ఇద్దరు ముగ్గురితో కలిసి ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోనుంచి బయటవరకూ పెనుగులాట జరిగిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో నిందితులు పోలీసులకు లొంగినట్టు విశ్వసనీయ సమాచారం.
Advertisement
Advertisement