Real estate business man
-
నన్ను వదిలేస్తే రూ.3 కోట్లు ఇస్తా!
సాక్షి, హైదరాబాద్: గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడి ఓ ల్యాండ్ గ్రాబింగ్ కేసులో సులేమాన్ మహ్మద్ ఖాన్‌ను శుక్రవారం పట్టుకున్నారు..లాకప్‌లో ఉన్న అతగాడు సెంట్రీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు రూ.3 కోట్ల ఆఫర్ ఇచ్చాడు...అతడి వల్లోపడిన కానిస్టేబుల్ తన ఉద్యోగం పోగొట్టుకోవడంతో పాటు శనివారం అరెస్టు అయ్యాడు. పరారీలో ఉన్న సులేమాన్ కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందం ఆదివారం నగరానికి చేరుకుంది. ఇతడికి నగరంతో సంబంధాలు ఉండటంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో మోసాల కేసులు ఉన్నాయి. దీంతో గోవా పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గాలిస్తున్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్లో నష్టాలతో... గోవాలోని తివం ప్రాంతానికి చెందిన సులేమాన్ తండ్రి శాండ్ కాంట్రాక్టర్. పదో తరగతితోనే చదువుకు స్వస్థి చెప్పిన ఇతగాడు 1989లో నిర్మాణరంగ కార్మికుడిగా మారాడు. 1992లో మేస్త్రీగా, 1995 నాటికి కాంట్రాక్టర్ వరకు ఎదిగాడు. ఈ రంగంలో భారీగా ఆర్జించి రియల్టర్ అవతారం ఎత్తిన ఇతగాడు గోవా చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీగా ప్లాట్లు కొన్నాడు. 2007–2009 వరకు ఏర్పడిన ఆర్థికమాంద్యంతో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. దీని ప్రభానికి తీవ్రంగా నష్టపోయిన సులేమాన్ తన మకాంను పుణేకు మార్చాడు. జీపీఏ రద్దు చేసుకున్నందుకు మహిళ హత్య పుణేలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని భావించిన సులేమాన్ అందుకు అవసరమైన పెట్టుబడి లేకపోవడంతో మోసాలు ప్రారంభించాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి అక్కడి గ్యాంగ్‌స్టర్ గజానన్ మార్నేతో విభేదాలు ఏర్పడ్డాయి. దీనికితోడు ఓ ల్యాండ్ విషయంలో విమల్రావు దేశ్‌ముఖ్ అనే వ్యాపారిని మోసం చేయడంతో కేసు నమోదైంది. దీంతో ఓ పక్క మాఫియా, మరోపక్క పోలీసుల నుంచి సులేమాన్‌కు ఒత్తిడి పెరిగింది. అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నాల్లో పోలీసులకు చిక్కిన ఇతగాడు దాదాపు వంద రోజులు పుణేలోని ఎరవాడ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చాక మళ్లీ గోవా వెళ్లిన సులేమాన్ రియల్ ఎస్టేట్ దందా మొదలెట్టాడు. 2014లో ఖరీదైన స్థలానికి సంబంధించి 75 ఏళ్ల వృద్ధురాలికి అడ్వాన్స్ ఇచ్చిన సులేమాన్ ఆమెతో జీపీఏ చేసుకున్నాడు. సరైన సమయానికి చెల్లింపులు చేయలేకపోవడంతో ఆమె దీన్ని రద్దు చేసుకుంది. కక్షకట్టిన అతగాడు ఆమెకు విషం ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడు. కందిలో షెల్టర్ ఏర్పాటు చేసుకుని కొన్నాళ్లు... అక్కడ నుంచి 2016లో సంగారెడ్డికి వలస వచ్చిన ఇతగాడు గచ్చిబౌలి, మహబూబ్‌నగర్, విజయవాడ, విశాఖపట్నంలో పలు మోసాలు చేశాడు. కరెన్సీ మార్పిడి, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో దండుకున్నాడు. 2018 జూలైలో మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్లో బస చేశాడు. ఆన్లైన్ ద్వారా విదేశీ కరెన్సీ మారి్పడి చేసే ఏజెన్సీల వివరాలు తెలుసుకున్నాడు. ఒకరికి ఫోన్ చేసి 30 వేల అమెరికన్ డాలర్లు కావాలని చెప్పాడు. ఆ నెల 10న సదరు వ్యాపారికి గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్దకు రమ్మని చెప్పి, కారులో వెళ్లి ఎక్కించుకున్నాడు. ఓఆర్ఆర్ అప్పా జంక్షన్ వద్దకు తీసుకువెళ్లి, తుపాకీతో బెదిరించి డాలర్లు తీసుకుని పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఆ ఏడాది ఆగస్టు 10న సులేమాన్‌ను అరెస్టు చేసి తుపాకీ, తూటాలు, డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెయిల్ పొందిన తర్వాత అతడు గోవాకే వెళ్లిపోయాడు. కాపలా ఉన్న కానిస్టేబుల్‌కే టోకరా... అక్కడ భూ కబ్జాలు ప్రారంభించిన సులేమాన్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అతడి కోసం క్రైమ్ బ్రాంచ్ పోలీసులతో ఓ సిట్ ఏర్పాటు చేశారు. ముమ్మరంగా గాలించి ఎట్టకేలకు గురువారం పట్టుకుని లాకప్‌లో ఉంచారు. అక్కడ కానిస్టేబుల్ అమిత్ నాయక్‌ను కాపలాగా ఉంచారు. అమిత్‌తో మాటలు కలిపిన సులేమాన్..ఈ ఉద్యోగంలో ఏం వస్తుందంటూ అతడిని నమ్మించాడు. తనను వదిలేసి, తనతో పాటు వస్తే బెంగళూరు వెళ్లిన వెంటనే రూ.3 కోట్లు ఇస్తానని నమ్మించాడు. ఇతడి మాటలను నమ్మిన అమిత్ అదే పని చేసి, అతడితో కలిసి హుబ్లీ వరకు వెళ్లాడు. అక్కడ అమిత్ కళ్లుగప్పిన సులేమాన్ పరారయ్యాడు. వీరిద్దరి కోసం గాలించడానికి ఏర్పాటైన ప్రత్యేక బృందాలు శనివారం అమిత్‌ను పట్టుకున్నాయి. సులేమాన్ కోసం వేటాడుతూ ఓ బృందం ఆదివారం హైదరాబాద్ చేరుకుంది. నగరంతో పాటు సంగారెడ్డి, మహబూబ్‌నగర్, విజయవాడ, విశాఖపటా్నల్లోనూ ముమ్మరంగా గాలిస్తోంది. -
ప్లాట్స్ ఎలా అమ్ముతావో చూస్తా.. రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఎమ్మెల్యే వార్నింగ్
సాక్షి, బోథ్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.. బెదిరింపుల ఆడియో బయటకు లీక్ అవడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బోథ్‌లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఎమ్మెల్యే బెదిరింపులకు గురిచేశాడు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే బాపురావు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద మధ్యవర్తి సాయంతో కొంత భూమి కొనుగోలు చేశారు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిరణ్.. సదరు మధ్యవర్తిని భూమికి సంబంధించి రూ.28 లక్షలు ఇవ్వాలని కోరారు. దీంతో, అతను ఎమ్మెల్యే బాపురావును ఆశ్రయించడంతో ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఫోన్ చేశాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కిరణ్‌కు బెదిరింపులకు గురిచేశాడు. వెంచర్ ఎలా వేశావ్.. ప్లాట్లు ఎలా అమ్ముతావో చూస్తానంటూ ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చాడు. ఇక, ఎమ్మెల్యే బెదిరింపుల అనంతరం రియల్ ఎస్టేట్ కిరణ్.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులు కోరినట్టు సమాచారం. అయితే, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో ఉన్నతాధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే చర్చ నడుస్తోంది. -
ఐటీ దాడుల్లో బయటపడ్డ రూ.100 కోట్ల నల్లధనం
న్యూఢిల్లీ: బిహార్ కేంద్రంగా పనిచేస్తున్న రియల్ ఎస్టేట్, వజ్రాల ఆభరణాల వ్యాపార సంస్థలపై దాడుల్లో రూ.100 కోట్ల పైచిలుకు లెక్కల్లో చూపని నల్లధనం బయటపడింది. ఈ నెల 17న బిహార్, ఢిల్లీల్లో 30 ప్రాంతాల్లో ఈ సొత్తును గుర్తించినట్లు ఆదాయ పన్ను శాఖ మంగళవారం తెలిపింది. వజ్రాల ఆభరణాల సంస్థకు చెందిన రూ.5 కోట్ల నగదు, నగలను స్వా«దీనం చేసుకుని, 14 బ్యాంకు లాకర్లకు సీల్ వేసినట్లు తెలిపింది. ‘‘కస్టమర్లకు అడ్వాన్సుల పేరుతో మరో రూ.12 కోట్ల లెక్క చూపని ధనం, రూ.80 కోట్ల మేర వెల్లడించని నగదు లావాదేవీలను గుర్తించాం’’ అని పేర్కొంది. చదవండి: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ దాడులు, కీలక పత్రాలు స్వాధీనం -
నమ్మించి.. రియల్టర్ కిడ్నాప్
పీఎం పాలెం (భీమిలి): ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి పరిచయమైన రౌడీషీటర్ అతడినే కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. ఓ ల్యాండ్ డెవలప్మెంట్ విషయపై ఒప్పందం చేసుకుందామని పిలిచి.. కారులో ఎక్కించుకుని అపహరించేందుకు ప్రయత్నించాడు. రూ.కోటి ఇస్తేనే విడిచిపెడతానని బెదిరించడంతో... ఆ వ్యాపారి రూ.50 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించాడు. పోలీసుల రంగ ప్రవేశంతో కథ అడ్డం తిరిగింది. దీంతో రియల్టర్‌ను కారులో నుంచి తోసేసి కిడ్నాపర్ పరారయ్యాడు. నగర శివారులో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పీఎం పాలెం సీఐ రవికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమిలి ప్రాంతానికి చెందిన టీడీపీ నేత పాచి రామకృష్ణ కొన్నాళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అతనిపై మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి హత్యకేసులో నిందితుడైన రౌడీషీటర్ కోలా వెంకట హేమంత్ (30) దృష్టి పడింది. సులువుగా డబ్బులు సంపాదించేందుకు రామకృష్టకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తాను అలకనందా రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. బాగా నమ్మకం పెరిగాక ఓ ల్యాండ్ డెవలప్మెంట్ విషయపై ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం రుషికొండ సమీపానికి వస్తే ఒప్పందం పూర్తి చేసుకుందామని రామకృష్ణను హేమంత్ పిలిచాడు. నిజమేనని నమ్మిన రామకృష్ణ రుషికొండ వెళ్లగా... ముందుగా రచించుకున్న ప్రణాళిక ప్రకారం కారులో కూర్చున్న రామకృష్ణను హేమంత్ తాళ్లతో బంధించాడు. కోటి రూపాయలు చెల్లిస్తేనే విడిచిపెడతానని బెదిరించాడు. అనంతరం కారును విజయనగరం వైపు తీసుకుని బయలుదేరాడు. సీసీ కెమెరా పుటేజీతో అప్రమత్తం రామకృష్ణను హేమంత్ బెదిరించి కారులో తీసుకెళ్లిపోతున్న తతంగం అంతా సమీపంలోని ఓ రిసార్టు సీసీ కెమెరాలో రికార్డు కాగా గమనించిన అక్కడి సిబ్బంది విషయాన్ని నగర సీపీ సీహెచ్ శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన సీపీ పీఎంపాలెం పోలీసులను అప్రమత్తం చేశారు. కిడ్నాపర్ వాడుతున్న కారు డ్రైవర్ సెల్ ఫోను నంబరు లొకేషన్ ఆధారంగా కారుని గుర్తించి పోలీసులు వెంబడించారు. అప్పటికే బాధితుడు రామకృష్ట తనను విడిచిపెడితే రూ.50 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇంతలో పోలీసులు తనను వెంబడిస్తున్నారని తెలుసుకున్న కిడ్నాపర్ హేమంత్ కథ అడ్డం తిరిగిందని భావించి రామకృష్ణను కారు లోనుంచి బయటకు తోసేసి పరారయ్యాడు. అనంతరం జరిగిన సంఘటనపై రామకృష్ణ పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం డీసీపీ గరుడ సుమిత్ సునీల్ పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ కేసుకు సంబంధించి సమగ్ర వివరాలు సేకరించారు. ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందన్న విషయమై ఆరా తీశారు. హత్య కేసులో జైలుకెళ్లి వచ్చి... కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు కోలా వెంకట హేమంత్‌కు కరుడుగట్టిన నేర చరిత్ర ఉంది. భీమిలి పోలీస్ స్టేషన్లో గతంలో రౌడీషీట్ తెరిచారు. భూ దందాలు, సెటిల్మెంట్లు చేస్తుంటాడు. ఈ క్రమంలో అనేక కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. కొన్నేళ్ల కిందట నగరంలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ లీడర్, మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు. రూ.1.35 కోట్ల విలువైన ప్లాటు కొనుగోలు విషయమై విజయారెడ్డి ఇంటికి వెళ్లి మరీ భయంకరంగా హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి బంగారు నగలు అపహరించుకుని ఆమె కారులోనే పరారయ్యాడు. నగలు విక్రయించగా వచ్చిన డబ్బులతో ప్రియురాలితో కలిసి విజయవాడలో జల్సాలు చేశాడు. ఈ కేసులో నాలుగో పట్టణ పోలీసులు హేమంత్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అనంతరం బయటకు వచ్చినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. (చదవండి: ఆహ్లాదం మాటున సుడి‘గండాలు’) -
రియల్ వ్యాపారి దారుణ హత్య: కళ్లల్లో కారం కొట్టి.. రాళ్లతో కొట్టి చంపి
యర్రగొండపాలెం(ప్రకాశం జిల్లా): రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నెలకొన్న పోటీ హత్యకు దారి తీసింది. బుధవారం స్థానిక గోశాలకు సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి అచ్యుత ఆదినారాయణ (40)ను అదే వ్యాపారం చేసే కొంతమంది దాడి చేసి దారుణంగా హత్య చేశారు. వివరాలు.. ఆదినారాయణ తన అన్నదమ్ములతో కలిసి స్థానిక పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద స్టీల్ వ్యాపారం చేసుకుంటున్నాడు. యర్రగొండపాలెంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకుంటున్న తరుణంలో అతడు స్థలాలను కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తున్నాడు. ఇటీవల కాలంలో స్థానిక త్రిపురాంతకం రోడ్డులో కొంత స్థలం కొనుగోలు చేశాడు. చదవండి: బరితెగించిన హిజ్రాలు.. బైక్‌పై వెళ్తున్న దంపతులను అడ్డగించి.. అదే స్థలాన్ని రియల్ వ్యాపార ప్రత్యర్థులు కూడా కొనుగోలు చేయడంతో వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కాలంలో స్థానిక మాచర్ల రోడ్డులో ఉన్న తన ప్లాట్ల వద్దకు మోటారు బైక్‌పై వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆదినారాయణను ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్రయతి్నంచారు. అప్పుడు తప్పించుకున్న ఆదినారాయణ నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. గోశాలలో సభ్యుడైన ఆదినారాయణ అక్కడ జరుగుతున్న పనులను అప్పుడప్పుడూ వెళ్లి పర్యవేక్షిస్తుంటాడు. దీన్ని అదనుగా చేసుకొని ప్రత్యర్థులు కిరాయి గూండాలకు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తెలిసింది. ఆయన వెంట మోటారు బైక్‌పై మరో వస్త్ర వ్యాపారి నారాయణ సింగ్ కూడా ఉన్నాడు. ప్రత్యక్ష సాక్షి అయిన సింగ్ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు తాను ఆదినారాయణ కలిసి గోశాల నుంచి మోటారు బైక్‌పై పట్టణంలోకి వస్తున్న సమయంలో ముగ్గురు గుర్తు తెలియని దుండగులు మద్యం తాగి తూలుతున్నట్లు నటిస్తూ మోటారు బైక్‌కు అడ్డంగా వచ్చారని తెలిపాడు. తాము మోటారు బైక్ నిలిపిన వెంటనే వారు తమ కళ్లలో కారం చల్లి ఆదినారాయణను రాళ్లతో కొట్టారని, తనను లాగి పక్కకు నెట్టారని సింగ్ పోలీసులకు వివరించాడు. గతంలో కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించారని, అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతుడి బంధువులు ఆరోపిస్తూ బస్టాండ్ సెంటర్లో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న వెంటనే మార్కాపురం డీఎస్పీ కిశోర్ కుమార్ హుటాహుటిన వచ్చి విచారణ చేపట్టారు. -
అల్లుడి బాగోతం.. పిల్లనిచ్చిన మామను సుపారీ గ్యాంగ్‌తో..
సాక్షి, హుబ్లీ(కర్ణాటక): మామను కిడ్నాప్ చేయించిన అల్లుడి ఉదంతం నగరంలో చోటు చేసుకుంది. నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ తన అల్లుడు పవన్‌తో కలిసి శుక్రవారం ఒక స్థలాన్ని చూసేందుకు వెళ్లారు. ఈక్రమంలో దుండగులు దాడి చేసి శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేశారు. తన మామ కిడ్నాప్ అయినట్లు అల్లుడు పవన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పవన్ వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఆసీఫ్, సమీర్, మంజునాథ, ఖలీల్ అనే నిందితులతో తన మామను కిడ్నాప్ చేయించినట్లు పవన్ అంగీకరించాడు. దీంతో అతనితోపాటు మిగతా నిందితులను అరెస్ట్ చేసి శ్రీనివాస్‌ను సురక్షితంగా ఇంటికి చేర్చినట్లు విద్యాగిరి పోలీసులు తెలిపారు. అయితే కిడ్నాప్‌ను ఎందుకు చేయించారనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
అనుమానాస్పద స్థితిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతి
సాక్షి, ఆదోని(కర్నూలు) : పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి దిబ్బనకల్ గ్రామ సరిహద్దు పొలాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించిన ఆనవాళ్లు, పక్కనే బాటిల్, స్కూటీ ఉండటంతో హత్యనా? ఆత్మహత్యనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఇందిరా నగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి నాయీ బ్రాహ్మణ బసవరాజు(42) నివాసముంటున్నాడు. బార్బర్ షాపుతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. మృతుడికి భార్య సువర్ణమ్మ, కొడుకులు సునీల్‌కుమార్, వేణుగోపాల్, కూతురు సునీత ఉన్నారు. ఆదివారం సాయంత్రం రోజూ మాదిరిగా బయటకు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి వెళ్లాడు. రాత్రి 8 గంటలైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానంతో తెలిసిన చోటల్లా విచారించారు. 10 గంటల తరువాత ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఫోన్ చేయగా రింగ్ అయింది కానీ లిఫ్ట్ చేయలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వెతకడం ప్రారంభించారు. సెల్‌ఫోన్ ఉన్నట్లు మొదట ఢణాపురం, తర్వాత మిల్టన్ హైటెక్ స్కూల్ ఏరియాల్లో చూపించడంతో అక్కడా వెదికారు. మిల్టన్ హైటెక్ స్కూల్, బాటమారెమ్మ గుడి సమీపంలోని కొండ ప్రాంతం వైపు వెళ్లగా స్కూటీ కనిపించింది. ఫోన్ రింగ్ కూడా స్కూటీలో నుంచి వినింపించింది. కాస్త ముందుకు వెళ్లి చూడగా, ఓ కొండ దిగువన బండరాయి మధ్య కాలిపోయిన మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలం పరిశీలన దిబ్బనకల్ సరిహద్దు ప్రాంతంలోని ఓ కొండ దిగువన రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు తెలుసుకున్న డీఎస్పీ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. టూ టౌన్ సీఐ భాస్కర్, తాలూకా ఎస్ఐ రామాంజులు సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. రెండు లీటర్లు వాటర్ బాటిల్, చెప్పులు పడివుండటాన్ని గమనించి, పెట్రోల్ పోసి తగులబెట్టారా? లేక ముందుగానే హత్యచేసి ఆపై పెట్రోల్‌పోసి నిప్పంటించారా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని డీఎస్పీ చెప్పారు. కుటుంబ సభ్యులను ఆరా తీశారు. నా చావుకు కారణం నేనే.. ‘నా చావుకు నేనే కారణం. ఎవరు కాదు. ఇంట్లో వాళ్లు, బయటి వాళ్లకు ఎలాంటి సంబంధం లేదు. తన ఆరోగ్యం బాగాలేని కారణంగానే నేను చనిపోతున్నాను’. అని నోట్‌బుక్‌లో సూసైడ్ నోట్ రాసి ఉంచినట్లు తాలూకా ఎస్ఐ రామాంజులు తెలిపారు. అయినా మృతిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామనిన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
తవ్వుడు.. పోస్కపోవుడు..
మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. నగరం చుట్టుపక్కల, ఆనుకుని ఉన్న భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. ఇక్కడ కొన్న వ్యవసాయ భూములను చదును చేసేందుకు మట్టి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇంకేముంది అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భూముల నుంచి, అనుమతులు లేకుండా ట్రాక్టర్ల ద్వారా మట్టి తోలకాలు విచ్చలవిడిగా చేపడుతున్నారు. నగరంలో నిర్మించే ఇళ్ల నిర్మాణానికి కూడా అక్రమార్కులు ఇక్కడి నుంచే మట్టిని తరలిస్తున్నారు. ఇదంతా రెవెన్యూ, మైనింగ్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, ఖమ్మం: నగరానికి అతిసమీపంలో ఉన్న ఖమ్మంరూరల్ మండలంతోపాటు కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం అర్బన్ మండలాల్లో మట్టిదందా నిరాటంకంగా కొనసాగుతోంది. కొందరు అక్రమార్కులు రూరల్ మండలం గుర్రాలపాడు, తెల్దారుపల్లి, ఏదులాపురం, ముత్తగూడెం, ఆరెకోడు, గుదిమళ్ల, ఎం.వెంకటాయపాలెం తదితర గ్రామాలను ఎంచుకుని రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే యథేచ్ఛగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ట్రక్కు మట్టిని రూ.600 నుంచి రూ.700 వరకు అమ్ముకుంటూ వ్యాపారాన్ని మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ, ప్రైవేట్ భూముల నుంచి మట్టిని తరలించాలన్నా.. లేదా ప్రైవేట్ భూమిని చదును చేసుకోవాలన్నా సంబంధిత వీఆర్వోకు దరఖాస్తు చేసుకోవాలి. వీఆర్వో సంబంధిత ప్రదేశానికి వెళ్లి పర్యావరణానికి ముప్పు రాదనుకుంటేనే అనుమతివ్వాలి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమిలో ఏమైనా తవ్వకాలు జరపాలంటే మైనింగ్, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. అందుకోసం కొంత నగదును ప్రభుత్వానికి సెస్ రూపేణా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటివేమీ లేకుండానే మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. తాము తమ భూమిని చదును చేసుకుని.. అందులో నుంచి తీసే మట్టిని తమ అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారుల నుంచి సదరు భూమి యజమాని అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఏవైనా రెవెన్యూ, మైనింగ్ అధికారుల నుంచి అనుమతి తీసుకుని మాత్రమే మట్టిని తరలించాల్సి ఉంటుంది. జరుగుతోందిలా.. అయితే అంతా తామే చూసుకుంటామని రైతులను నమ్మించి అక్రమార్కులు తమ పని కానిచ్చేస్తున్నారు. దీనిని ఆసరా చేసుకున్న మట్టి అక్రమ రవాణాదారులు సదరు రైతుకు చెందిన భూమిలో మట్టిని తీసి.. ఎలాంటి అనుమతి లేకుండానే రియల్ ఎస్టేట్ ప్లాట్లకు, ఇతర అవసరాలకు రేయింబవళ్లు తరలిస్తున్నారు. గతంలో వెంకటగిరిలో ఇదే విషయమై అక్రమార్కులను అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై దాడి చేసిన విషయం విదితమే. నాలుగు రోజుల క్రితం కూడా అక్రమార్కులను అడ్డుకున్న అధికారులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. లక్షల ట్రిప్పులు తరలింపు.. మండలంలోని గుర్రాలపాడు, ముత్తగూడెం, తెల్దారుపల్లి, ఏదులాపురం ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అనుమతి లేకుండానే మట్టిని తవ్వి లక్షల ట్రిప్పులు తరలించారు. దీంతో ప్రభుత్వ భూములను పీల్చిపిప్పి చేస్తున్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వం ఆ భూముల్లో ఏవైనా నిర్మాణాలు చేయాలంటే లోతైన పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తున్నాయి. పట్టించుకోని అధికారులు పగలూ, రాత్రి తేడా లేకుండా మట్టిని అక్రమంగా తరలిస్తున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. వీఆర్వోలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే విషయాన్ని ప్రతీ రోజు గమనించాల్సి ఉండగా.. తమ కళ్లెదుటే వందలాది ట్రక్కుల మట్టి తరలిస్తున్నా ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం రాజకీయ పార్టీల నుంచి వచ్చే ఒత్తిళ్లు ఒక ఎత్తయితే.. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు మట్టిని తరలించే అక్రమార్కుల నుంచి ఆమ్యామ్యాలు అందడం మరో కారణమనే బలమైన ఆరోపణలున్నాయి. నామమాత్రపు దాడులు ఫలానా గ్రామంలోని శివారు ప్రాంతంలో మట్టిని తరలిస్తున్నారనే సమాచారం మేరకు వీఆర్వో అక్కడికి వెళ్లి మందలిస్తే.. ఆ ఒక్కరోజు తోలకాలు నిలిపివేస్తున్నారు. మరుసటి రోజు నుంచి మళ్లీ మట్టి తోలకాలు చేపడుతున్నారు. మూడు రోజుల క్రితం గొల్లగూడెం, గుర్రాలపాడు రెవెన్యూ పరిధిలో కొందరు అక్రమార్కులు ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తుండగా.. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను, జేసీబీని సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. అనంతరం నాయకుల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో వారికి జరిమానా వేసి వదిలేశారు. అక్రమార్కుల మధ్య ఘర్షణ మండలంలో ఇటీవల అక్రమార్కుల మధ్య మట్టిని తరలించే విషయంలో ఘర్షణ జరిగినట్లు తెలిసింది. ఏదులాపురం, ఆరెంపుల, గొల్లగూడెం, ముత్తగూడెం పరిధిలో మట్టిని తాము తరలించే ప్రాంతానికి మీరు రావడం ఏమిటని ఇంకొందరు అక్రమార్కులు ఘర్షణ పడినట్లు తెలిసింది. ఈ వ్యవహారం పెద్దకు వద్దకు వెళ్లడంతో ఇరువర్గాలకు సర్ది చెప్పినట్లు తెలిసింది. చర్యలు తీసుకుంటాం.. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో నుంచి మట్టిని తరలించాలంటే తప్పకుండా రెవెన్యూ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. అలా కాకుండా అక్రమంగా మట్టిని తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే అక్రమంగా మట్టిని తరలించే వారిని.. గుర్తించి కొందరికి జరిమానా విధించాం. అనుమతులు లేకుండా మట్టిని తరలించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు. – అశోక్‌చక్రవర్తి, తహసీల్దార్, ఖమ్మం రూరల్ -
అర్ధరాత్రి కాపు కాసి..
* వ్యక్తి దారుణ హత్య * వివాహేతర సంబంధమే కారణం? * నిందితుల కోసం పోలీసుల గాలింపు గుంటూరు రూరల్ : అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వ్యక్తిని గొంతు కోసి హత్య చేసిన సంఘటన సోమవారం అర్థరాత్రి మండలంలోని ఓబులునాయుడుపాలెంలో చోటు చేసుకుంది. సంఘటనా స్థలిలో పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన యేమినేడి వెంకటప్పయ్యకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు యేమినేడి వెంకటేశ్వరరావు (43) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, టీడీపీలో కీలకంగా పనిచేస్తుంటాడు. మృతునికి ఇంకా వివాహం కానందున ఒంటరిగా నివసిస్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గుంటూరు నుంచి ఇంటికి వచ్చి నిద్రించాడని స్థానికులు చెబుతున్నారు. తెల్లవారుజామున ఇంటి ముందు విగత జీవుడై పడి వుండడంతో స్థానికులు గమనించి పక్కనే నివసిస్తున్న మృతుని బంధువులకు తెలియజేయగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన విషయం తెలిసిన సౌత్‌జోన్ డీఎస్పీ బి.శ్రీనివాస్, రూరల్ మండలం నల్లపాడు సీఐ కె.శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాగ్ స్క్వాడ్ మృతదేహం వద్ద నుంచి గ్రామంలోని ప్రధాన రహదారి ఎన్‌హెచ్ 16 వరకూ వచ్చి వెనుదిరిగింది. క్లూస్ టీం ఆధారాలు సేకరించారు.నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.\ వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల అనుమానం.. మృతుడికి గ్రామంలో ఇద్దరు ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉండడం, గ్రామంలో అధికారపార్టీలో పోరు నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందన్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం నడుపుతున్న మహిళకు చెందిన వ్యక్తులే మరో ఇద్దరు ముగ్గురితో కలిసి ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోనుంచి బయటవరకూ పెనుగులాట జరిగిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో నిందితులు పోలీసులకు లొంగినట్టు విశ్వసనీయ సమాచారం.