ల్యాండ్ గ్రాబింగ్ కేసులో చిక్కి తప్పించుకునేందుకు ఈ ఎత్తు
ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్న అక్కడి కాప్స్
ఇందులో భాగంగా నగరానికి చేరుకున్న గోవా పోలీసులు
ఈ నిందితుడిపై తెలంగాణ, ఏపీల్లోనే అనేక మోసం కేసులు
సాక్షి, హైదరాబాద్: గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడి ఓ ల్యాండ్ గ్రాబింగ్ కేసులో సులేమాన్ మహ్మద్ ఖాన్‌ను శుక్రవారం పట్టుకున్నారు..లాకప్‌లో ఉన్న అతగాడు సెంట్రీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు రూ.3 కోట్ల ఆఫర్ ఇచ్చాడు...అతడి వల్లోపడిన కానిస్టేబుల్ తన ఉద్యోగం పోగొట్టుకోవడంతో పాటు శనివారం అరెస్టు అయ్యాడు. పరారీలో ఉన్న సులేమాన్ కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందం ఆదివారం నగరానికి చేరుకుంది. ఇతడికి నగరంతో సంబంధాలు ఉండటంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో మోసాల కేసులు ఉన్నాయి. దీంతో గోవా పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గాలిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో నష్టాలతో...
గోవాలోని తివం ప్రాంతానికి చెందిన సులేమాన్ తండ్రి శాండ్ కాంట్రాక్టర్. పదో తరగతితోనే చదువుకు స్వస్థి చెప్పిన ఇతగాడు 1989లో నిర్మాణరంగ కార్మికుడిగా మారాడు. 1992లో మేస్త్రీగా, 1995 నాటికి కాంట్రాక్టర్ వరకు ఎదిగాడు. ఈ రంగంలో భారీగా ఆర్జించి రియల్టర్ అవతారం ఎత్తిన ఇతగాడు గోవా చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీగా ప్లాట్లు కొన్నాడు. 2007–2009 వరకు ఏర్పడిన ఆర్థికమాంద్యంతో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. దీని ప్రభానికి తీవ్రంగా నష్టపోయిన సులేమాన్ తన మకాంను పుణేకు మార్చాడు.
జీపీఏ రద్దు చేసుకున్నందుకు మహిళ హత్య
పుణేలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని భావించిన సులేమాన్ అందుకు అవసరమైన పెట్టుబడి లేకపోవడంతో మోసాలు ప్రారంభించాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి అక్కడి గ్యాంగ్‌స్టర్ గజానన్ మార్నేతో విభేదాలు ఏర్పడ్డాయి. దీనికితోడు ఓ ల్యాండ్ విషయంలో విమల్‌రావు దేశ్‌ముఖ్ అనే వ్యాపారిని మోసం చేయడంతో కేసు నమోదైంది. దీంతో ఓ పక్క మాఫియా, మరోపక్క పోలీసుల నుంచి సులేమాన్‌కు ఒత్తిడి పెరిగింది.
అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నాల్లో పోలీసులకు చిక్కిన ఇతగాడు దాదాపు వంద రోజులు పుణేలోని ఎరవాడ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చాక మళ్లీ గోవా వెళ్లిన సులేమాన్ రియల్ ఎస్టేట్ దందా మొదలెట్టాడు. 2014లో ఖరీదైన స్థలానికి సంబంధించి 75 ఏళ్ల వృద్ధురాలికి అడ్వాన్స్ ఇచ్చిన సులేమాన్ ఆమెతో జీపీఏ చేసుకున్నాడు. సరైన సమయానికి చెల్లింపులు చేయలేకపోవడంతో ఆమె దీన్ని రద్దు చేసుకుంది. కక్షకట్టిన అతగాడు ఆమెకు విషం ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడు.
కందిలో షెల్టర్ ఏర్పాటు చేసుకుని కొన్నాళ్లు...
అక్కడ నుంచి 2016లో సంగారెడ్డికి వలస వచ్చిన ఇతగాడు గచ్చిబౌలి, మహబూబ్‌నగర్, విజయవాడ, విశాఖపట్నంలో పలు మోసాలు చేశాడు. కరెన్సీ మార్పిడి, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో దండుకున్నాడు. 2018 జూలైలో మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో బస చేశాడు. ఆన్‌లైన్ ద్వారా విదేశీ కరెన్సీ మారి్పడి చేసే ఏజెన్సీల వివరాలు తెలుసుకున్నాడు. ఒకరికి ఫోన్ చేసి 30 వేల అమెరికన్ డాలర్లు కావాలని చెప్పాడు. ఆ నెల 10న సదరు వ్యాపారికి గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్దకు రమ్మని చెప్పి, కారులో వెళ్లి ఎక్కించుకున్నాడు. ఓఆర్‌ఆర్ అప్పా జంక్షన్ వద్దకు తీసుకువెళ్లి, తుపాకీతో బెదిరించి డాలర్లు తీసుకుని పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఆ ఏడాది ఆగస్టు 10న సులేమాన్‌ను అరెస్టు చేసి తుపాకీ, తూటాలు, డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెయిల్ పొందిన తర్వాత అతడు గోవాకే వెళ్లిపోయాడు.
కాపలా ఉన్న కానిస్టేబుల్‌కే టోకరా...
అక్కడ భూ కబ్జాలు ప్రారంభించిన సులేమాన్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అతడి కోసం క్రైమ్ బ్రాంచ్ పోలీసులతో ఓ సిట్ ఏర్పాటు చేశారు. ముమ్మరంగా గాలించి ఎట్టకేలకు గురువారం పట్టుకుని లాకప్‌లో ఉంచారు. అక్కడ కానిస్టేబుల్ అమిత్ నాయక్‌ను కాపలాగా ఉంచారు. అమిత్‌తో మాటలు కలిపిన సులేమాన్..ఈ ఉద్యోగంలో ఏం వస్తుందంటూ అతడిని నమ్మించాడు. తనను వదిలేసి, తనతో పాటు వస్తే బెంగళూరు వెళ్లిన వెంటనే రూ.3 కోట్లు ఇస్తానని నమ్మించాడు. ఇతడి మాటలను నమ్మిన అమిత్ అదే పని చేసి, అతడితో కలిసి హుబ్లీ వరకు వెళ్లాడు. అక్కడ అమిత్ కళ్లుగప్పిన సులేమాన్ పరారయ్యాడు. వీరిద్దరి కోసం గాలించడానికి ఏర్పాటైన ప్రత్యేక బృందాలు శనివారం అమిత్‌ను పట్టుకున్నాయి. సులేమాన్ కోసం వేటాడుతూ ఓ బృందం ఆదివారం హైదరాబాద్ చేరుకుంది. నగరంతో పాటు సంగారెడ్డి, మహబూబ్‌నగర్, విజయవాడ, విశాఖపటా్నల్లోనూ ముమ్మరంగా గాలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment