
నగర వాసుల కోసం హైదరాబాద్ మెట్రో ఒక ప్రకటన చేసింది. ఆ రెండు రూట్‌లలో..
సాక్షి, హైదరాబాద్: నగర వాసులకు కాస్త ఊరట కలిగించే వార్త అందించింది హైదరాబాద్ మెట్రో. అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడపాలని నిర్ణయించుకుంది. అయితే అది కొన్నిరోజుల వరకు, రెండు రూట్లలో మాత్రమే!. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ కొనసాగినన్ని రోజులు ఈ సౌకర్యం ఉంటుందని హైదరాబాద్ మెట్రో రైలు ప్రకటించింది.
మియాపూర్-ఎల్బీనగర్, నాగోల్ –రాయదుర్గం కారిడార్లలో ఈ వెసులుబాటు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం స్టేషన్ల నుంచి ఆఖరి రైలు అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరి గమ్యస్థానాన్ని రాత్రి 1 గంటకు చేరుకుంటుందని హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. నుమాయిష్ సందర్శకులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఆయన.
అయితే.. జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో చివరి రైలు మాత్రం రాత్రి 11 గంటలకు మాత్రమే బయలుదేరుతుందని ఆయన స్పష్టంచేశారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నుమాయిష్ ఎగ్జిబిషన్ వద్ద ఉన్న గాందీభవన్ స్టేషన్‌లో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. నుమాయిష్ షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 15 వరకు మెట్రో సేవల పొడిగింపు కొనసాగనుంది.