‘నూతన’ సందడి
నూతన సంవత్సరం సందర్భంగా
నెల్లూరులో మంగళవారం సందడి వాతావరణం నెలకొంది. కొత్త ఏడాదికి స్వాగతం పలికే సన్నాహాల్లో ప్రజలు మునిగితేలడంతో ఎక్కడ చూసినా కోలాహలం కనిపించింది. కొనుగోలుదారులతో వస్త్ర దుకాణాలు కిటకిటలాడాయి.
ఇక కేకులు, స్వీట్లు దుకాణాల వారు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. ఆ దుకాణాలన్నీ జనంతో కిక్కిరిశాయి. సండే మార్కెట్ ఇసుకేస్తే రాలనంత రద్దీగా మారింది. అర్ధరాత్రి 12 గంటలు కాగానే సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
-సాక్షి, నెల్లూరు.
కొత్త ఏడాదికి సుస్వాగతం
కొత్త ఆశలకు చిగురింపజేస్తున్న 2014కు హృదయ పూర్వక స్వాగతం. జిల్లా వాసులకు తీరని కష్టాలు మిగిల్చిన 2013 మాదిరి కాకూడదని విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా రైతులు, ఇతర వర్గాల హృదయాల్లో ఆనందం నింపేలా నీ రాక ఉండాలని ఆశిస్తున్నాం. గడచిన ఏడాది రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో సమైక్య ఉద్యమం పాలనను స్తంభింపజేసింది. విద్యుత్, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో మనిషి జీవనం రోజురోజుకూ దుర్భరమవుతోంది. దేశానికి వెన్నముకగా నిలిచిన రైతన్న బతుకును వర్షాభావ పరిస్థితులు కోలుకోలేని దెబ్బతీశాయి. వీటన్నిటికి 2013 మూగసాక్షిగా నిలిచింది. పేరుకు డెల్టా అయినా జిల్లాలో 40 శాతం ఆయకట్టుకు నీళ్లు అందక వ్యవసాయం అటకెక్కింది.
మెట్టరైతుల కష్టాలు చెప్పుకుంటే తీరేవికాదు. పదిహేనేళ్లలో ఎప్పుడూ లేనంత కరువుకు 2013 కారణమైంది. అందుకే జిల్లా వాసుల్లో అనంతమైన సంతోషాన్ని నింపేలా కోరినంత వాన , దాచుకోలేనంత పంట దిగుబడి నీ కాలంలో రావాలి. అలాగే కరెంట్ కష్టాలను అంతమొందించాలి. కోవూరు చక్కెర ఫ్యాక్టరీ బకాయిలు చెల్లించేలా పాలకులు, అధికారుల మనసును మార్చి వేసే ఏడాదిగా చెరకు రైతుల హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించాలి.
వైఎస్సార్ మరణానంతరం నిలిచిన జలయజ్ఞం పనులను తిరిగి ప్రారంభించేందుకు పాలకుల్లో మార్పు తీసుకురావాలి. వైఎస్సార్ హయాంలో సంగం, నెల్లూరు ఆనకట్టల నిర్మాణంతో పాటు డెల్టా, నాన్‌డెల్టా కాలువల ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. వీటితో పాటు కనిగిరి, నెల్లూరు, సర్వేపల్లి రిజర్వాయర్లు, కనుపూరు, గండిపాళెం కుడి, ఎడమ కాలువ పనులు చేపట్టారు. వాటిని కొనసాగించే మంచి పనికి నీ రాకే మలుపుకావాలి. కృష్ణపట్నం-బళ్లారి ఫోర్‌లేన్ రోడ్డు పనులు పూర్తి చేసే అవకాశాన్ని వేరే ఏడాదికి దక్కనివ్వక మంచి పేరును సొంతం చేసుకోవాలి.
పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధిగాంచిన విదేశీపక్షుల విడిది కేంద్రం పులికాట్ సరస్సుకు వచ్చేందుకు సరైన రోడ్డు వేసేందుకు నీ కాలంలోనే జరగాలి. భూమి అంటే ఒక స్టేటస్ సింబల్. భూమిలేని నిరుపేదలకు ఏడో విడత భూపంపిణీలో కాస్తంత భూమి కల్పించి సామాన్యుల కోసం వచ్చిన కాలంగా చరిత్రకెక్కాలి. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో ప్రతి ఒక్కరి శ్రేయోభిలాషిగా నీరాక(2014)ను ఉండాలి. ఎన్నికాలాలు మారినా నీ హయాం సువర్ణయుగమని తరతరాలు చెప్పుకునేలా నీదైన ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ ....
ఇట్లు
జిల్లా ప్రజలు
-సాక్షి, నెల్లూరు.
నూతనోత్సాహం
Published Wed, Jan 1 2014 4:37 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement