Telangana police.. బైక్‌పై వస్తున్న తమపట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, అర్ధరాత్రి నడిరోడ్డుపై అరగంట పాటు నిలబెట్టారని, అవసరం లేని ప్రశ్న లతో ఇబ్బంది పెట్టారని హైదరాబాద్‌లో పని చేస్తున్న భార్యాభర్తలు.. డీజీపీకి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ముదిగొండ మండలం కమలాపురం గ్రామానికి చెందిన బొమ్మగాని దుర్గారావు, ఆయన భార్య భవాని హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
శనివారం రాత్రి భార్యా భర్తలతో పాటు, భవాని సోదరుడు వెంకటేశ్ ఒకే బైక్‌పై కమలాపురం వస్తున్నారు. నేలకొండపల్లి వచ్చేసరికి రాత్రి 12.20 అయింది. ఆ సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు తమను ఆపి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతూ ఇబ్బంది పెట్టారని దుర్గారావు, భవాని ఆరోపించారు. తాను సమాధానం చెబుతున్నా పట్టించుకోకుండా, తన భార్యను ప్రశ్నించారని తాళిబొట్టు, పెళ్లిఫొటోలు చూపించినా వినకుండా జీపు ఎక్కమంటూ దురుసుగా ప్రవర్తించారని దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాము బైక్‌పై వస్తున్నామని చెప్పినా.. బస్ టికెట్లు చూపించమని అడిగారని, మీదే కులం అంటూ ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. పోలీసులు మద్యం మత్తులో ఉన్నారని, అరగంట పాటు తమను రోడ్డుపైనే నిలబెట్టారని, ఈ ఘటనను వీడియో తీస్తుంటే మొబైల్ లాక్కుని.. తనపై చేయి చేసుకునే ప్రయత్నం చేశారని దుర్గారావు వాపోయారు. తమకు జరిగిన అవమానంపై మంత్రి కేటీఆర్, డీజీపీతో పాటు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనర్‌ను కలసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ విషయమై ఆదివారం నేలకొండపల్లి ఎస్సై స్రవంతిని వివరణ కోరగా తమ సిబ్బంది విధుల్లో భాగంగానే వారిని వివరాలడిగారని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఆబ్కారీకి నకిలీ మకిలి! కోట్లలలో అక్రమార్జన
Comments
Please login to add a commentAdd a comment