సాక్షి, హైదరాబాద్: అది శాంతిభద్రతలను రక్షించే కీలకమైన పోలీసు విభాగం.. కానీ మంచి పోస్టింగ్ కావాలంటే ‘సిఫార్సు’ కావాల్సిందే, లేదంటే లూప్‌లైన్‌లో కాలం వెళ్లదీయాల్సిందేనన్నది ఆ శాఖలో అనధికార నినాదం! కొన్ని జిల్లాల్లో ఎస్పీ స్థాయి నుంచి ఎస్సై దాకా నేతల సిఫార్సు లేనిదే పోస్టింగ్ దక్కలేని పరిస్థితి ఉందన్నది బహిరంగంగా మాట్లాడుకునే రహస్యం! ఇలా మంచి పోస్టింగ్ కోసం రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్న కొందరు పోలీసు అధికారులు.. సంబంధిత నేతకుగానీ, వారి కుటుంబ సభ్యులు, అనుచరులకుగానీ వ్యతిరేకంగా చర్యలు తీసుకోగలరా అన్నది ప్రశ్నార్థకం.
ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కుమారుడు రాఘవేంద్రరావు ఘటనతో ఈ ‘సిఫార్సు’ల వ్యవహారం పోలీసుశాఖలో తీవ్ర కలవరం రేపుతోంది. వనమా రాఘవేంద్రరావుపై ఎన్నో ఏళ్లుగా ఫిర్యాదులున్నా పోలీసు అధికారులు పెద్దగా స్పందించకపోవడానికి కారణమూ ఇదేనన్న చర్చ జరుగుతోంది. ఇంటెలిజెన్స్ వర్గాలూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుండటం పోలీసు ఉన్నతాధికారులను ఒత్తిడిలోకి నెట్టేస్తోంది.
చెప్పినట్టు వినాల్సిందే..
కొత్తగూడెం పాల్వంచలో జరిగిన వ్యవహారంలో పోలీసుశాఖ ముందే స్పందించి ఉంటే.. ఈ స్థాయిలో వ్యవహారాలు జరిగేవి కాదన్న వాదన వినిపిస్తోంది. 2017 నుంచే వనమా రాఘవేంద్రరావుపై హత్య, ఆత్మహత్యకు ప్రేరేపించారన్న కేసులు ఉన్నా యి. 2018లో ఒక క్రిమినల్ కేసు, 2019లో మరొకటి, 2020లో ఇంకొకటి.. ఇలా నాలుగుకుపైగా క్రిమినల్ కేసులున్నాయి. అయితే రామ కృష్ణ కుటుంబం ఆత్మహత్యతో పాటు మరికొన్ని కేసుల్లోనూ బాధితులు పోలీసులపైనా ఆరోపణలు చేస్తున్నారు. తాము స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్తున్నారు.
దీనికి కారణం రాఘవ తన తండ్రి సిఫార్సు లేఖలతో ఇప్పించిన పోస్టింగ్‌లే అనడంలో ఏమాత్రం సందేహం లేదన్న వాదన వినిపిస్తోంది. రాఘవ ఇప్పించిన పోస్టింగ్‌లో ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా వెళ్లలేని స్థితిలో పోలీసు అధికారులు ఉండిపోవడం వివాదాస్పదంగా మారిందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారం, సదరు సెల్ఫీ వీడియో సోషల్‌మీడియాలో సంచలనం కావడంతో.. ఇప్పుడు తప్పనిసరిగా చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
పోస్టింగ్‌కో రేటు పెట్టి..
రాష్ట్ర పోలీసుశాఖలో కొన్నిచోట్ల ఎస్పీ స్థాయి అధికారులకు పోస్టింగ్ దక్కాలంటే భారీ రేటు ఉందని.. డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్, ఎస్సై పోస్టింగులకు ఒక్కో రేటు ఉందని ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు పోస్టింగ్ సిఫార్సుల కోసం ప్రజాప్రతినిధులకు లక్షల రూపాయలు ఇస్తున్నారని పోలీసు వర్గాలే చెప్తున్నాయి. ఎస్సై పోస్టింగ్ సిఫార్సు కోసం రూ.5లక్షలు, సీఐ స్థాయిలో రూ.10 లక్షలదాకా.. డీఎస్పీ/ఏసీపీ పోస్టింగ్ కోసం రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు వసూలవుతున్నట్టు పేర్కొంటున్నాయి. కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ ఎస్పీ బదిలీ వివాదాస్పదంగా మారుతోంది. ఏకంగా రూ.45 లక్షలు ఇచ్చి సంబంధిత అధికారి ఎస్పీగా పోస్టింగ్ తెచ్చుకున్నట్టు చర్చ జరుగుతోంది.
ఎక్కడ చూసినా.. బెదిరింపులు, కబ్జాలు..
►ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల కుమారుల వ్యవహారం వివాదాస్పదంగా మారుతున్నట్టు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సహకరించకపోతే ఏకంగా ఏసీబీ దాడులు చేయిస్తామని పోలీస్, రెవెన్యూ సిబ్బందిని బెదిరించే స్థాయికి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే కుమారుడు ఇసుక రవాణాలో తమకు పూర్తిగా సహకరించే అధికారులకు పోస్టింగ్ ఇప్పించుకున్నట్టు ఆరోపణలున్నాయి.
►ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే తరఫున ఆయన సోదరుడు పోలీసు అధికారులతో సెటిల్‌మెంట్లు చేస్తున్నట్టు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే భార్య, ఇద్దరు అల్లుళ్ల పెత్తనం మరీ మితిమీరినట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్తున్నాయి. బెదిరింపులు, కబ్జాలు సహా సదరు నియోజకవర్గంలో వారు ఎలా చెప్తే పోలీసు అధికారులు అలా వినాల్సిందేనన్న ఆరోపణలున్నాయి. మరో ఎమ్మెల్యే కుమారుడు అన్నీ తానై డీఎస్పీ నుంచి ఎస్సై దాకా పోస్టింగ్‌లకు సిఫార్సులు చేయిస్తున్నట్టు చెప్తున్నారు.
►నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఓ కీలక ఎమ్మెల్యే సోదరుడు నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ నడిపిస్తున్నాడన్న ఫిర్యాదులు వస్తే.. సదరు బాధితులపైనే ఉల్టా కేసులు పెట్టించి హింసించారన్న ఆరోపణలున్నాయి. మరో ఎమ్మెల్యే సోదరుడు తన ఇసుక దందాకు అడ్డొస్తున్న వారిపై పోలీసుల సాయంతో అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఓ సీనియర్ ఎమ్మెల్యే తనయులపైనా భూకబ్జా, ఇసుక దందా ఆరోపణలున్నాయి. మరో ఎమ్మెల్యే సోదరుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ.. భూకబ్జాదారులతో చేతులు కలిపి విలువైన భూములను కాజేసినట్టు నిఘా విభాగం ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చింది.
►ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ ఎమ్మెల్యే కుమారుడు పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ మాఫియాకు సహకరిస్తున్నారని ఫిర్యాదులున్నా పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే జిల్లాలో ఓ ఎమ్మెల్యేకన్నా ఆయన కుటుంబ సభ్యులదే ఎక్కువ పెత్తనమన్న విమర్శలున్నాయి. వారు ఏకంగా రూ.2 వేల కోట్ల విలువైన భూములకు నకిలీ పత్రాలు సృష్టించి కాజేశారని.. దానిపై ఫిర్యాదు చేసిన వారిపై అక్రమంగా కేసులు పెట్టించారన్న ఆరోపణలూ ఉన్నాయి.
►ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ఓ ఎమ్మెల్యే సోదరుడు తానే ఎమ్మెల్యే అయినట్టుగా వ్యవహరించడం, భూకబ్జా వ్యవహారాలు మానవ హక్కుల సంఘం దాకా వచ్చాయి. సదరు ఎమ్మెల్యే సోదరుడు బెదిరింపులు, అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ మూడు ఫిర్యాదులు అందాయి. ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే భార్య పోలీస్, రెవెన్యూ అధికారుల ద్వారా వసూలు చేస్తున్న కమిషన్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ఉల్టా వారిపైనే కేసులు నమోదుచేయడంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
►ఖమ్మంలో వనమా రాఘవ వ్యవహారం ఇటీవలే బయటపడింది. మరో ఎమ్మెల్యే భర్త కూడా ప్రతీదందాలో తన వాటా అంటూ వసూలు చేస్తున్నారని.. ఇవ్వకపోతే పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అదే విధంగా ఓ ఎమ్మెల్సీకి వరుసకు సోదరుడయ్యే వ్యక్తి చేస్తున్న పనులు ఎస్పీస్థాయి అధికారులకు కూడా చికాకు తెప్పించాయని, వారు ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసే వరకు వ్యవహారం వెళ్లిందని సమాచారం.
►వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఓ సీనియర్ ఎమ్మెల్యే కుమారుడు ప్రభుత్వ పోస్టింగ్‌లలో జోక్యం చేసుకుంటున్నారని.. పోలీసు, రెవెన్యూ అధికారుల ద్వారా రియల్ ఎస్టేట్ వెంచర్లలో వాటాలు వసూలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే చీకటి వ్యవహారాలకు పోలీసులు సెక్యూరిటీ కల్పించడం ఇటీవల వివాదాస్పదమైంది.
►మెదక్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే సోదరుడు తప్పుడు కేసులు నమోదు చేయిస్తానంటూ కొందరిపై బెదిరింపులకు దిగినట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
సిఫార్సులతో చేతులు కట్టేస్తున్నారు!
ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలుంటే తప్ప పోస్టింగులు ఇవ్వద్దొన్న మౌఖిక ఆదేశాలుండటంతో పోలీసు ఉన్నతాధికారులు సైతం చేతులు కట్టేసుకోవాల్సి వస్తోందన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 80శాతం పోస్టింగులు సిఫార్సు లేఖల ద్వారానే జరుగుతున్నాయని.. ప్రతిభ, అంకితభావ సేవలను దృష్టిలో పెట్టుకొని మిగతా వారికి అవకాశం కల్పిస్తున్నా నాలుగు రోజుల ముచ్చటగానే మిగిలిపోతోందని ఉన్నతాధికారవర్గాలు చెప్తున్నాయి.
సమర్థవంతమైన అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని, అక్రమాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు సహకరిస్తున్న అధికారులపై ఎప్పటిప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలిస్తున్నా మార్పు రావడం లేదని వాపోతున్నాయి. వ్యవస్థలో మార్పు రాకపోతే మరింత విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా సిఫార్సు లేఖలతో కాకుండా.. సమర్థత ఆధారంగా పోస్టింగులు ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment