
పరిచయం లేని మహిళలకు అర్ధరాత్రిళ్లు మెసేజ్‌లు పంపడం.. అశ్లీలత కిందకే వస్తుందని ముంబై సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ మాజీ కార్పొరేటర్‌కు అశ్లీల సందేశాలు పంపాడనే కేసులో ఓ వ్యక్తికి కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది.
‘‘మీరంటే ఇష్టం, మీరు చూడడానికి బాగున్నారు, అందంగా ఉన్నారు, మీకు వివాహం అయ్యిందా? లేదా?, మీరు సన్నగా ఉన్నారు!!..’’ అంటూ.. తెలియని మహిళలకు అర్ధరాత్రిళ్లు సందేశాలు పంపడం సరికాదు. ఈ చర్య అశ్లీలత(Obscene) కిందకే వస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్లు, వాళ్ల భాగస్వాములు ఇలాంటి వాటిని తట్టుకోలేరు. ప్రత్యేకించి.. ఒకరికొరు పరిచయం లేని సమయంలో అస్సలు భరించలేరు’’ అని అడిషనల్ సెషన్స్ జడ్జి డీజీ ధోబ్లే వ్యాఖ్యానించారు.
అయితే రాజకీయ వైరంతోనే ఆమె తనపై తప్పుడు కేసు పెట్టిందని ఆ వ్యక్తి వాదించగా.. కోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. ఏ మహిళ తెలిసి తెలిసి తప్పుడు కేసుతో తన పరువును పణంగా పెట్టాలనుకోదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిందితుడు బాధిత మహిళకు వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ప్రాసిక్యూషన్ రుజువు చేసిందని, కాబట్టి నిందితుడు ట్రయల్ కోర్టు విధించిన శిక్షకు అర్హుడు అని సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది.
ముంబై బోరివాలీ ఏరియాకు చెందిన మాజీ కార్పొరేటర్‌కు.. 2016 జనవరిలో నార్సింగ్ గుడే అనే వ్యక్తి వాట్సాప్ సందేశాలు పంపాడు. ‘‘మీరు చూడడానికి బాగుంటారు.. మీరంటే ఇష్టం. మీకు పెళ్లైందా?’’ అంటూ అర్ధరాత్రిళ్లు మెసేజ్‌లు పంపాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేసు నమోదు చేసుకుని నార్సింగ్‌ను అరెస్ట్ చేశారు ఆరేళ్ల తర్వాత.. మేజిస్ట్రేట్ కోర్టు నార్సింగ్‌ను దోషిగా నిర్ధారించి.. మూడు నెలల శిక్షను విధించింది. అయితే ఈ శిక్షను అతను సవాల్ చేయగా.. తాజాగా ట్రయల్ కోర్టు తీర్పును సెషన్స్ కోర్టు సమర్థించింది.
Comments
Please login to add a commentAdd a comment