చేతబడి
శర్మిష్ట మంచం దగ్గరకు చేరుకుని, పరిస్థితిని గమనించాడు. నాడి పట్టి చూశాడు. కనురెప్పలు తెరిచి చూశాడు. రెండు నిమిషాలు కళ్లు మూసుకుని ధ్యానంలోకి జారుకున్నాడు. కళ్లు తెరిచాక అన్నాడు... ‘‘ఎవరో బిడ్డ మీద మారణ ప్రయోగం చేస్తున్నారు’’.
మూసిన కన్ను తెరవకుండా మంచం మీద పడి ఉంది శర్మిష్ట. నెలరోజులుగా ఇదే స్థితిలో ఉంది. ఒక్కోరోజు ఒళ్లు కాలిపోతున్నంతగా జ్వరం... ఒక్కోరోజు ఇక అవే అంతిమ ఘడియలన్నట్లుగా చల్లబడిపోయే శరీరం. మామూలుగా ఆమె చలాకీగానే ఉండేది. నవ్వుతూ తుళ్లుతూ కాలేజీకి వెళ్లేది. అందరితోనూ కలివిడిగా ఉండేది. ఆరు నెలల కిందటే ఆమెలో అనూహ్యమైన మార్పులు మొదలయ్యాయి. ఎవరికీ అంతుచిక్కని మార్పులు. ఒంట్లో రకరకాల నొప్పులు... అర్ధరాత్రివేళ ఉలిక్కిపడి లేచి సంధి ప్రేలాపనలు! కాలం గడుస్తున్న కొద్దీ చిక్కిశల్యమవుతోంది.
శర్మిష్టది కాస్త కలిగిన కుటుంబమే. తండ్రి దేబాశీష్ జిల్లాలో ఉన్నతాధికారి. తల్లి మమత సాదాసీదా గృహిణి. ఒక్కగానొక్క కూతురైన శర్మిష్టని కళ్లలో పెట్టుకుని పెంచుకున్నారు. తనకి ఉన్నట్టుండి జబ్బు చేయడంతో దేబాశీష్ బెంగటిల్లిపోయారు. చాలామంది వైద్యులకు చూపించారు. రకరకాల పరీక్షలు జరిపించారు. అయినా ఆమె పరిస్థితికి కారణమేంటో అంతు చిక్కలేదు. ఇంతకీ శర్మిష్టకు ఏం జరిగింది? ఎందుకిలా కృశించిపోయింది? సమాధానం ఇద్దరికి మాత్రమే తెలుసు.
అర్ధరాత్రి దాటుతోంది. బిప్రొ, కళియాబాబా ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. వారి మధ్య వెలుగుతున్న హోమగుండం. హోమగుండంలో ఏవేవో పదార్థాలు వేస్తూ, వినీ వినిపించనట్లు తదేక దీక్షతో మంత్రోచ్ఛాటన సాగిస్తున్నాడు కళియాబాబా. చేతులు కట్టుకుని నిశ్శబ్దంగా జరుగుతున్న తతంగాన్ని గమనిస్తున్నాడు బిప్రొ. బిప్రొ గురించి అతడి ఇంటి చుట్టుపక్కల వాళ్లకు తప్ప పెద్దగా ఎవరికీ తెలీదు గానీ, కళియాబాబా గురించి కలకత్తా వరకు కూడా చాలామందికి తెలుసు.
భూతవైద్యుడిగా, తాంత్రికుడిగా కళియాబాబా శక్తిసామర్థ్యాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. ఊరవతల శ్మశానపు ప్రహారీని ఆనుకున్న పాడుబడ్డ గదిలో ఉంటాడతను. ఇప్పుడు ఆ గదిలోనే ఉన్నాడు. అతడి ఎదురుగా బిప్రొ.
హోమగుండానికి దిగువన అడుగు పొడవున్న పిండిబొమ్మ. దాని మీద చెల్లాచెదురుగా చల్లిన పసుపు, కుంకుమలు. బొమ్మకు అక్కడక్కడా గుండుసూదులు గుచ్చి ఉన్నాయి. మంత్రోచ్ఛాటన ముగించాక ఆ బొమ్మను ఎడమ చేతిలోకి తీసుకున్నాడు కళియాబాబా. ఆ బొమ్మవైపే కొన్ని క్షణాలు తదేకంగా చూశాడు. బొమ్మ చెవిలో ఏదో చెప్పాడు. బొమ్మను మళ్లీ యథాస్థానంలో పెట్టేసి, దానికి మరో నాలుగు గుండుసూదులు గుచ్చాడు. బిప్రొ వైపు ఒక చూపు చూసి... ‘‘ఇక చెప్పు’’ అన్నాడు.
‘‘నీ దయవల్ల అంతా సజావుగానే ఉంది. ఆమె మూసిన కన్ను తెరవడం లేదు. ఎవరూ కారణాన్ని కనుక్కోలేకపోతున్నారు. ఊరకే వైద్యుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్లేం చేస్తార్లే..!’’
విజయగర్వంతో చిన్నగా నవ్వాడు కళియాబాబా. ‘ఔను వాళ్లేం చేస్తార్లే’... అంటూ ఈసారి కాస్త పెద్దగానే నవ్వాడు. మరీ వికటాట్టహాసం కాదు గానీ, ఆ నవ్వు చూస్తే ఎవరికైనా వెన్నులోంచి వణుకు పుడుతుంది.
‘‘ఇంకెన్నాళ్లు...?’’ అడిగాడు బిప్రొ.
‘‘ఓపిక పట్టలేవూ..! మీ పట్నపోళ్లంతా ఇంతే. అస్సలు ఓపిక ఉండదు. ఇప్పుడే కదా ఆశ్వయుజం మొదలైంది. మాఘ పున్నమి నాటికి అంతా అయిపోతుంది’’ కాస్త విసుక్కుంటూ బదులిచ్చాడు కళియాబాబా.
‘‘కోపం తెచ్చుకోకు గురూ..! ఏదో ఆత్రం కొద్దీ అడిగాను’’ సర్దిచెబుతున్న ట్లుగా అన్నాడు బిప్రొ.
‘‘సర్లే... సర్లే... మళ్లీ వచ్చే మంగళవారం కనిపించు. మరో నాలుగు సూదులు గుచ్చేద్దాం’’... అప్పటి తతంగానికి ముగింపు పలికాడు కళియాబాబా.
‘‘వస్తా’’ అంటూ ఊరివైపు బయలుదేరాడు బిప్రొ.
వీధి అరుగు మీద కుర్చీ వేసుకుని కూర్చున్నాడు బిప్రొ. దీర్ఘంగా ఆలోచిస్తు న్నాడు. సరిగ్గా ఏడాది కిందట జరిగిందా సంఘటన. అది తలచుకుంటే చాలు... ఇప్పటికీ మనసు కుతకుతలాడిపోతుంది.
ఆరోజు ఎప్పట్లాగే హుషారుగా ఆఫీసుకెళ్లాడు. ఉదయం నుంచి కలెక్షన్లు బాగానే ఉన్నాయి. ఏవేవో పనుల మీద ఎవరెవరో వస్తుంటారు. వాళ్లకు అవసరం, తనకు అవకాశం. చెయ్యి తడిపితే చాలు, ఎలాంటి సర్టిఫికేట్‌నైనా పుట్టించగలడు తను. అందుకేగా తనకు అంత డిమాండ్ మరి!
సాయంత్రంలోగా రాబోయే కలెక్షన్ల గురించి మనసులోనే లెక్కలేసుకుంటూ తాపీగా లంచ్‌కి వెళ్లాడు. తినేసి వచ్చి భుక్తాయాసంతో సీట్లో కూలబడ్డాడు. అప్పటికే ఒక రైతు తన కోసం ఎదురు చూస్తున్నాడు. కొడుకు చదువు కోసం క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటూ వచ్చాడతను. పదిరోజులుగా తిరుగుతున్నాడు.
అతడిని చూడగానే విసుగ్గా ముఖం చిట్లించాడు బిప్రొ. ‘‘ఇవాళైనా డబ్బు తెచ్చావా? డబ్బు చెల్లిస్తేనే పనులయ్యేది’’ అలవాటుగా దీర్ఘాలు తీస్తూ అన్నాడు.
‘‘తెచ్చా సార్’’ అంటూ ఐదు వంద నోట్లు చేతిలో పెట్టాడా రైతు.
బిప్రొ కళ్లు మిలమిల్లాడాయి. ఆ రైతు నుంచి ఎప్పట్లాగే లాకేత్వమే సమాధానంగా వస్తుందనుకున్నాడు. కానీ డబ్బు చేతిలో పెట్టేసరికి హుషారు పెరిగింది.
‘‘సరే... బయట కూర్చో. తహశీల్దారు సారు ఖాళీ అయ్యాక సంతకం పెట్టించి పిలుస్తా’’ అన్నాడు.
రైతు నెమ్మదిగా బయటకు వెళ్లి, వసారాలోని బెంచీ మీద కూర్చున్నాడు. ఐదు నిమిషాలైనా గడవక ముందే అరడజను మంది బిప్రొ సీటు దగ్గరకు దూసుకొచ్చారు. వాళ్లలో ఒకతను ‘‘బల్లకు ఉన్న అరలన్నింటినీ సోదా చేయండి. ఇతని జేబులు కూడా’’ అంటూ మిగిలిన వాళ్లను ఆదేశించాడు. వాళ్లు పని మొదలుపెట్టారు.
‘‘ఏయ్.... ఏంటిది..? ఎవరు మీరు..?’’ తత్తరపడుతూ ప్రశ్నించాడు బిప్రొ. తనిఖీకి ఆదేశించిన వ్యక్తి జేబులోంచి తన ఐడీ కార్డు తీసి చూపించాడు. బిప్రొ ముఖం పాలిపోయింది. వచ్చిన వాళ్లు ఏసీబీ తనిఖీ బృందం అధికారులు. అంతకు ముందే బిప్రొను కలుసుకున్న రైతుకు డబ్బులిచ్చి పంపింది వాళ్లే. రైతు ఇచ్చిన నోట్లు బిప్రొ చొక్కా జేబులో దొరికాయి. అక్కడికక్కడే అరెస్టు చేశారు.
అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు ఏడీఎం దేబాశీష్. కోర్టు విచారణ తర్వాత బిప్రొ డిస్మిస్సయ్యాడు.
అప్పటి నుంచి దేబాశీష్‌పై పగబట్టాడు బిప్రొ. అతడిని ఎలాగైనా దెబ్బకొట్టాలి. దేబాశీష్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (తెలుగు రాష్ట్రాల్లో జాయింట్ కలెక్టర్‌తో సమానం). తానేమో ఉద్యోగం పోగొట్టుకున్న గుమస్తా. అతణ్ని ఏమీ చేయ లేడు. అందుకే ఇంటర్ చదువుకుంటున్న అతని కూతురు శర్మిష్టను ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. శర్మిష్ట అంటే తండ్రికి పంచప్రాణాలని తెలుసు. అందుకే ఆమెను టార్గెట్ చేసుకున్నాడు. కళియాబాబా దగ్గరకు వెళ్లాడు. అడిగినంత డబ్బు ముట్టజెప్పాడు. తన కసి తీరాలన్నాడు. అతడు చెప్పినట్లే శర్మిష్టపై బాబా ప్రయోగం మొదలెట్టాడు. మామూలు క్షుద్రప్రయోగం కాదు, ఏకంగా మారణ ప్రయోగమే!
వైద్యులు తన కూతురు ప్రాణాలు కాపాడలేరని అర్థమైపోయింది మమతకు. ఆరోజే ఊరి నుంచి వచ్చిన ఆమె అన్నయ్య ప్రదీప్ కూడా అదే మాటన్నాడు. ‘‘ఇదేదో ప్రయోగంలా ఉంది’’ అని కూడా అన్నాడతను. పరిష్కారం గురించి అన్నాచెల్లెళ్లు సుదీర్ఘంగా చర్చించుకున్నారు.
‘‘ఒకసారి చిన్మయ స్వామి దగ్గరకు వెళదాం’’ అన్నాడు ప్రదీప్. ఇద్దరూ బయల్దేరారు. బజారు వీధికి వెనుక ఒక ఇరుకు గల్లీలో సాదాసీదా పాతకాలం పెంకుటింటికి చేరుకున్నారు. ముందు గదిలోని వాలుకుర్చీలో కూర్చుని ఉన్నాడు స్వామి.
‘‘ఎవరు మీరు?’’ ప్రశ్నించాడాయన.
అన్నాచెల్లెళ్లు తమను తాము పరిచయం చేసుకున్నారు. సమస్య చెప్పుకున్నారు. ‘‘ఇంటికి వచ్చి బిడ్డను చూస్తా’’ అన్నాడు చిన్మయస్వామి. చేతికర్ర, భుజాన సంచి, ఒక కమండలం పుచ్చుకుని వాళ్లతో కలసి అప్పటికప్పుడే బయలుదేరాడు.
శర్మిష్ట మంచం దగ్గరకు చేరుకుని, పరిస్థితిని గమనించాడు. నాడి పట్టి చూశాడు. కనురెప్పలు తెరిచి చూశాడు.
రెండు నిమిషాలు కళ్లు మూసుకుని ధ్యానంలోకి జారుకున్నాడు. కళ్లు తెరిచాక అన్నాడు... ‘‘ఎవరో బిడ్డ మీద మారణ ప్రయోగం చేస్తున్నారు’’.
హడలిపోయారు వాళ్లు. ‘‘మీరే నా బిడ్డకు కాపాడాలి స్వామీ’’... కన్నీళ్లతో చేతులు జోడించి వేడుకుంది మమత.
‘‘మరేం ఫర్వాలేదు... విరుగుడు చేస్తా’’ అభయం ఇచ్చాడాయన.
శర్మిష్ట జబ్బకు ఒక రక్షరేకు చుట్టాడు. నుదుట సిందూరం అద్దాడు. ఆమె మంచం చుట్టూ ముగ్గుపొడితో గిరి గీశాడు. ఇంటి బయటకు వచ్చి, ఇంటికి నాలుగువైపులా కూడా గిరి గీశాడు. ‘‘ఇక భయం లేదు. మంగళవారం నాటికి బిడ్డ లేచి కూర్చుంటుంది’’ అని చెప్పి నిష్ర్కమించాడు.
ఆ మంగళవారం ఎప్పట్లాగే సూర్యోదయమైంది. కానీ శర్మిష్ట ఎప్పటిలాగా మూసిన కన్ను తెరవకుండా మంచాన పడి లేదు. మెల్లగా కళ్లు తెరిచింది. తనంతట తానే లేచి, మంచానికి చారబడి కూర్చుంది. తల్లి సాయంతో బాత్రూమ్‌కు వెళ్లి ముఖం కడుక్కుని వచ్చింది. ‘తినడానికేమైనా కావాలి’ అడిగింది. కూతురి నోట వచ్చిన ఆ ఒక్క మాటకే మమత ఆనందంతో ఉప్పొంగిపోయింది. వెంటనే టిఫిన్ తెచ్చి తినిపించింది. అంతలో బయట ఏవో అరుపులు వినిపిస్తే పరుగు పరుగున వెళ్లింది. ఏమైంది అని అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిని అడిగింది. ‘‘కళియాబాబా చచ్చిపోయాడు’’ చెప్పాడతను.
ఔను..! కళియాబాబా నెత్తురు కక్కుకుని చచ్చిపోయాడు. తన గదిలో వెలుగుతున్న హోమగుండం దగ్గరే ఒరిగిపోయాడు. మరి బిప్రొ సంగతి! అతడికి పిచ్చెక్కింది. ప్రస్తుతం రాంచీలోని మెంటల్ హాస్పిటల్‌లో ఉన్నాడు!
- కాద్రా