మరికొంత సమయం కావాలి
న్యూఢిల్లీ: మిడ్‌నైట్ రైడ్ వివాదంపై శుక్రవారం స్థాయీ నివేదికను ఇవ్వడంలో దర్యాప్తు అధికారులు విఫలమయ్యారు. ఉగాండా మహిళలపట్ల అనుచితంగా ప్రవర్తించారన్న కేసులో గుర్తుతెలియని వ్యక్తులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ వివాదానికి సంబంధించి న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి పేరు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తమపై దాడిచేసిన వారికి సోమ్‌నాథ్ భారతి నేతృత్వం వహించినట్లు బాధితురాలైన ఉగాండా మహిళ స్పష్టం చేసిన నేపథ్యంలో కేసు దర్యాప్తు సులభతరమవుతందని భావించారు. అయినప్పటికీ దర్యాప్తు అధికారులు ఇప్పటిదాకా తమ పని ఎందాకా వచ్చిందో కోర్టుకు తెలపడంలో విఫలమయ్యారు. కేసుకు సంబంధించి సాక్షుల పేర్లతో కూడిన ఓ సీల్డ్ కవర్‌ను న్యాయమూర్తి చేత్నాసింగ్‌కు అందజేశారు. పూర్తిస్థాయి నివేదికను ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. కనీసం నెలరోజులైనా గడువు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. కోర్టువర్గాలు అందించిన వివరాల ప్రకారం... న్యాయమూర్తికి అందజేసిన కవర్‌లో దాదాపు 40 మంది సాక్షుల పేర్లున్నాయి. అందులో 12 మంది ఆఫ్రికన్ మహిళలు ఉండగా మిగతావారు స్థానికులు. ఈ 12 మంది వాంగ్మూలాలను న్యాయమూర్తి సమక్షంలో రికార్డు చేశారు. ఇదిలాఉండగా దర్యాప్తు ప్రాథమిక స్థాయిలోనే ఉందని, పూర్తిస్థాయి నివేదికకు నెలరోజుల సమయం పడుతుందని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. జనవరి 19న ఈ కేసుకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తులపై భారత శిక్షాస్మృతి, సెక్షన్ 153ఏ, 323, 354, 509, 506, 147 ప్రకారం మాలవీయనగర్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఉగాండా మహిళ ఫిర్యాదు మేరకు కోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. బాధితుల్లో రెండో మహిళ కూడా కోర్టును ఆశ్రయించి, ప్రత్యేక కేసు నమోదు చేయాలని కోరిందని, అయితే ఈ ఘటనను కూడా ఒకే కేసుగా పరిగణించి దర్యాప్తు చేయాలని కోర్టు సూచిందన్నారు.
మిడ్‌నైట్ రైడ్ వివాదం
Published Fri, Feb 14 2014 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM
Advertisement
Advertisement