సమైక్యంగా మళ్లీ..సమరసీమకు..
Published Thu, Feb 6 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
సాక్షి, కాకినాడ :ప్రభుత్వోద్యోగులు మళ్లీ పోరుబాట పట్టారు. ‘సమైక్యాంధ్రే’ తమ సమరలక్ష్యమని ఎలుగెత్తారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో నేపథ్యంలో.. విభజనను నిరసిస్తూ ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు బుధవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలోని ఎన్జీఓలు సమ్మెబాట పట్టారు. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా సుమారు 32 వేలమంది విధులు గురువారం నుంచి విధులను బహిష్కరించనున్నారు. ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది మినహా రెవెన్యూ, సివిల్ సప్లయిస్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, కమర్షియల్, రవాణా, ఆర్‌డబ్ల్యూఎస్, డ్వామా, జెడ్పీ, దేవాదాయ, చేనేత, విద్య, వైద్యఆరోగ్యం, పశుసంవర్ధక,
గంథాలయ, కార్మిక, సాంఘిక, బీసీ, వికలాంగుల, మైనార్టీ సంక్షేమ తదితర శాఖలతో పాటు ఎక్సైజ్ మినిస్టీరియల్ స్టాఫ్ కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో గురువారం లగాయతు మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడనున్నాయి. గ్రామ స్థాయిలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్‌ల నుంచి తహశీల్దార్ వరకు అధికారులు, సిబ్బందితో పాటు కలెక్టర్, జేసీ, ఏజేసీ, డీఆర్వోల వద్ద పనిచేసే అటెండర్లు, డ్రైవర్లతో సహా సమ్మెలోకి వెళ్లనున్నారు. శుక్రవారం నుంచి కార్పొరేషన్, మున్సిపాలిటీల సిబ్బంది కూడా సమ్మెలోకి రానున్నారు. ఈనెల 10 నుంచి సమ్మె బాటపట్టాలని హౌసింగ్ సిబ్బంది నిర్ణయించారు.
ట్రెజరీ, కోఆపరేటివ్, వ్యవసాయం, ఇరిగేషన్ తదితర శాఖల సిబ్బంది సమ్మెలో పాల్గొనే విషయంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఎన్నికల ముందస్తు ఏర్పాట్ల ప్రక్రియపై సమ్మె తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందిని ఈనెల 10లోగా బదిలీ చేయాల్సి ఉంది. అయితే వారు సమ్మె బాట పట్టనుండడంతో ఆ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవచ్చు.
అన్ని శాఖలూ సమ్మెలోకి రావాలి..
కాగా బుధవారం సాయంత్రం కాకినాడలోని ఏపీ ఎన్జీఓ సంఘ భవన్‌లో రాష్ర్ట ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘ నేతలతో పాటు గతంలో జరిగిన సమైక్య సమ్మెలో పాల్గొన్న వివిధ ప్రభుత్వశాఖల జేఏసీ నాయకులు, కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జవహర్ అలీ, గోదావరి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంధి బాబ్జి, మున్సిపల్ జేఏసీ నాయకులు డీవీఎస్‌ఎన్ మూర్తి పాల్గొన్నారు. ఎన్జీఓల సంఘం పిలుపు మేరకు గతంలో మాదిరిగానే సమ్మెలో పాల్గొంటామని వివిధ ప్రభుత్వశాఖల జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
సమైక్యాంధ్ర సాధన కోసం చేస్తున్న సమ్మెలో ప్రతి ప్రభుత్వోద్యోగీ పాల్గొనాలని ఆశీర్వాదం, ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్ పిలుపునిచ్చారు. విభజనను అడ్డుకునే ఆఖరి ఘట్టంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన బాధ్యత సమైక్యవాదులపై ఉందన్నారు. సమావేశానంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ విభజన బిల్లును అడ్డుకునేందుకు గత ఏడు నెలలుగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్న వైఎస్సార్ సీపీతో పాటు టీడీపీ, కాంగ్రెస్ సీమాంధ్ర నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న విభజన బిల్లును కూడా అడ్డుకొని సమైక్యతను కాపాడాలన్నారు. ఉద్యమ తీవ్రత ఢిల్లీకి తెలియాలంటే గతంలో మాదిరిగానే ప్రభుత్వశాఖలన్నీ సమ్మెబాట పట్టాలన్నారు.
ప్రస్తుతానికి పోరుబాట పడుతున్నది వీరే..
గెజిటెడ్ అధికారులు 3,354
ఎన్జీఓలు 16,823
క్లాస్-4 ఉద్యోగులు 6680
ప్రభుత్వ డ్రైవర్లు 530
వీఆర్‌ఏలు 2631
వీఆర్వోలు 2185
Advertisement
Advertisement