పరుగు... పరుగు... ఆమెకు తెలిసింది ఇదే. అందుకే 16 ఏళ్ల టీనేజ్ ప్రాయంలోనే 1980 మాస్కో ఒలింపిక్స్‌లో పాల్గొన్నది. అలా అని పాతికేళ్లొచ్చాక ఇక చాల్లే అని ఆటకు టాటా చెప్పేయలేదు. 34 ఏళ్ల వయసులోనూ పతకం సాధించింది. 35వ పడిలో జాతీయ రికార్డు సృష్టించింది. అందుకే ఆమె రాణి... పరుగుల రాణి. ఇలా అనగానే ఈపాటికే అర్థమై ఉంటుంది. ఆమె ఇంకెవరో కాదు పీటీ ఉష అని!
నిజమే... భారత అథ్లెటిక్స్‌కే ఆమె ‘ఉష’స్సులాంటిది. అందుకే ‘ఆసియా’లో ఆమె తేజస్సే కొన్నేళ్లపాటు విరాజిల్లింది. పరుగుకు ప్రాణమిచ్చింది. పతకాల పంట పండించింది. భారత అథ్లెటిక్స్‌కు ఆమె నవశకం. నిజానికి ఉష క్రీడాకారిణి కావడం తండ్రికి ఇష్టం లేదు. ఎక్కడ తన తనయ గాయపడుతుందోనని వద్దన్నాడు. చదువులో ముందుండే విద్యార్థి కావడంతో ఉష కూడా ఆమె తల్లిలాగే టీచర్ అవుతుందనుకున్నారంతా. అయితే ఈ కేరళ కుట్టీ టీచర్ కాలేదు. కానీ ‘గోల్డెన్ గాళ్’గా ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత అయింది. ‘పరుగుల రాణిగా’..., ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్’గా అథ్లెటిక్స్‌లో భారత అతివ సత్తా ప్రపంచానికి చాటింది.
హీట్స్‌లో వెనుదిరిగి ‘గ్రేటెస్ట్’గా ఎదిగింది...
మాస్కో ఒలింపిక్స్ (1980)లో ఉష 16 ఏళ్ల ప్రాయంలో తొలిసారి అంతర్జాతీయ ట్రాక్‌లో బరిలోకి దిగింది. హీట్స్‌లోనే వెనుదిరిగింది. రెండేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ పతకం సొంతగడ్డపై సాధించింది. న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో (1982)లో టీనేజ్ స్ప్రింటర్ 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో రజతాలు సాధించడంతో అందరి కంటా పడింది. ఆ మరుసటి ఏడాదే (1983) కువైట్ ఆతిథ్యమిచ్చిన ఆసియా చాంపియన్‌షిప్‌లో పసిడి ఖాతా తెరిచాక అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. అచిరకాలంలోనే ఇవన్నీ సాధించాక కూడా ఆమె పతకాల దాహం తీరలేదు. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండే ఆమె పెళ్లయి... ఓ పిల్లాడికి తల్లి అయ్యాక కూడా పతకాలు సాధిస్తూనే వచ్చింది. అందుకే ‘ఈ శతాబ్దం భారత మేటి క్రీడాకారిణి’గా నిలిచింది. 1999లో ‘స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ద సెంచరీ’ అవార్డును హాకీ మాంత్రికుడు, దివంగత దిగ్గజం ధ్యాన్‌చంద్‌తో పంచుకుంది. ఆ దిగ్గజానికి సరితూగే అథ్లెట్ కచ్చితంగా ఉష అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
రోమ్‌లో మిల్కా... లాస్‌ఏంజెలిస్‌లో ఉష...
అచ్చు ‘ఫ్లయింగ్ సిఖ్’ మిల్కా సింగ్‌లాగే పరుగుల రాణి ఉషకూ ఒలింపిక్స్‌లో చేరువైనా చేతికందని పతకం తాలూకూ నిరాశ జీవితానికి సరిపడా ఉంది. 1984లో అమెరికాలోని లాస్‌ఏంజెలిస్ ఆతిథ్యమిచ్చిన ఒలింపిక్స్ క్రీడల్లో ఆమె సెకనులో వందోవంతు తేడాతో కాంస్యాన్ని కోల్పోయింది. 400 మీటర్ల హర్డిల్స్‌లో విదేశీ అథ్లెట్లకు దీటుగా పరుగెత్తిన మన ‘ఉష’స్సు పోడియం దాకా వెళ్లినట్లు కనిపించినా... చివరకు పోడియం మెట్లపై చూడలేకపోయాం. నవాల్ ఉల్ ముతవకీల్ (మొరాకో–54.61 సెకన్లు), జూడీ బ్రౌన్ (అమెరికా–55.20 సెకన్లు), క్రిస్టినా కొజొకారు (రొమేనియా–55.41 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు నెగ్గగా... 55.42 సెకన్లతో ఉష నాలుగో స్థానంతో తృప్తిపడింది. 1960లో మిల్కా సింగ్‌కు... 24 ఏళ్ల తర్వాత ఉషకు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పతకాలు గెలిచే భాగ్యం, పుటల్లోకెక్కే అదృష్టం సెకనులో దూరమయ్యాయి.
క్షణభంగురంతో ఒలింపిక్స్ పతకమైతే చేజారింది కానీ... చేజిక్కాల్సినవి మాత్రం చేతికందకుండా పోలేదు. గెలిచేందుకు ఒక్క ఒలింపిక్సే లేవని... ఎన్నో చోట్లా ఎంతో మందిని ఓడించే స్థయిర్యం, సంకల్పం తనలో ఉన్నాయని ఏడాది తిరిగేసరికే ‘ఆసియా’ ఖండానికి చూపించింది ఉష. జకార్తాలో 1985లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో çపసిడి భరతం పట్టింది. పరుగు పెట్టిన ప్రతీ పోటీలో పతకం అంతు చూడకుండా విడిచిపెట్టలేదు. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పోటీలతో పాటు 400 మీ టర్ల హర్డిల్స్, 400 మీటర్ల రిలేలో ఉష బంగారమైంది. 100 మీ. రిలేలో సహచరుల బలం సరిపోలక కాంస్యం వచ్చింది లేదంటే ఆరో స్వర్ణం ఖాయమయ్యేది. ఈ క్రమంలో ఒకే ఆసియా చాంపియన్‌షిప్‌లో అత్యధికంగా ఆరు పతకాలు గెలిచిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఇక ఇక్కడి నుంచి ఈ పరుగుల రాణి ఆసియానేలింది. వరుసగా జరిగిన 1986 ఆసియా క్రీడలు (సియోల్, దక్షిణ కొరియా), 1987 ఆసియా చాంపియన్‌షిప్ (సింగపూర్)లలో పీటీ ఉష పరుగు పెడితే పతకం పని పట్టింది.
సియోల్ గేమ్స్‌లో 100 మీటర్ల స్ప్రింట్‌లో రజతం గెలిచిన ఆమె 200 మీటర్లు, 400 మీటర్లు, 400 మీ. హర్డిల్స్, 4్ఠ400 మీటర్ల రిలే ఈవెంట్స్‌లో స్వర్ణాలు సాధించింది. సింగపూర్ చాంపియన్‌షిప్‌లో స్ప్రింట్‌లో బంగారం చేజారి రజతం వచ్చినా... మిగతా 400 మీటర్లు, 400 మీటర్ల హర్డిల్స్, 4్ఠ400 మీటర్ల రిలే ఈవెంట్లలో పసిడి పంతం మాత్రం వీడలేదు. వరుసగా మూడేళ్ల పాటు తన పరుగుకు అలుపు, పతకాలకు విరామం లేదని చాటింది. 1989 న్యూఢిల్లీలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో 4 స్వర్ణాలు, 2 రజతాలు, బీజింగ్ ఆసియా క్రీడల్లో (1990) మూడు రజతాలు... ‘అమ్మ’గా జపాన్ ఆసియా చాంపియన్‌షిప్ (1998)లో బంగారం గెలిచి ఎప్పటికీ తాను ‘గోల్డెన్ గాళ్’నేనంటూ సత్తా చాటిన ఉష 2000లో తన 20 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. ఓవరాల్‌గా ఎనిమిది ఆసియా చాంపియన్‌షిప్ పోటీల్లో ఉష 23 పతకాలు నెగ్గగా అందులో 14 స్వర్ణాలు ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment