పంఘాల్‌ పంచ్‌.. | Amit Panghal Life And Success Story In Boxing | Sakshi
Sakshi News home page

పంఘాల్‌ పంచ్‌..

Published Sun, Jun 16 2024 8:03 AM | Last Updated on Wed, Jun 26 2024 4:20 PM

Amit Panghal Life And Success Story In Boxing

అమిత్‌ పంఘాల్‌ ఎత్తు 5 అడుగుల 2 అంగుళాలు మాత్రమే. బాక్సింగ్‌ ఆటపరంగా చూస్తే ఇది ఒక రకంగా ‘పొట్టి’ కిందనే లెక్క. అతని కెరీర్‌లో పెద్ద సంఖ్యలో తనకంటే ఎంతో ఎత్తయిన బాక్సర్‌లనే ఎదుర్కోవాల్సి వచ్చింది. సాధారణంగా రింగ్‌లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యంతో పంచ్‌లు విసిరేందుకు ఎత్తు కూడా కీలకంగా పని చేస్తుంది. ఇక్కడే అమిత్‌లో లోపం కనిపించింది. ‘చిన్నప్పటి నుంచి నాకు ఇదే సమస్య. కొన్నిసార్లు నేను పూర్తిగా ఆకాశంలోకి చూస్తూ ప్రత్యర్థితో తలపడుతున్నానేమో అనిపించేది’ అని అమిత్‌ చెప్పుకున్నాడు  కానీ తన పట్టుదలతో అతను దానిని అధిగమించాడు.

అసాధారణంగా, మెరుపు వేగంతో పంచ్‌లు విసరడాన్ని సాధన చేసిన అతను అందులో ఆరితేరాడు. ప్రాక్టీస్‌లో కూడా కావాలనే తనకంటే ఎత్తు ఎక్కువ ఉన్న బాక్సర్లతోనే అతను పోటీ పడేవాడు. కెరీర్‌ ఎదుగుతున్న దశలో అదే అతడి బలంగా మారి అమిత్‌ను పెద్ద బాక్సర్‌ను చేసింది.

అన్న అండగా నిలవడంతో...
హరియాణాలోని రోహ్‌టక్‌ పట్టణానికి సమీపంలో ఉన్న ఊరు ‘మేనా’ అమిత్‌ స్వస్థలం. రైతు కుటుంబం నుంచి వచ్చాడు. అతని పెద్దన్న అజయ్‌ పంఘాల్‌ ముందుగా బాక్సింగ్‌లోకి వచ్చాడు. అతని ద్వారానే అమిత్‌కూ ఆటపై ఆసక్తి పెరిగింది. ముందుగా ఫిట్‌నెస్‌ మెరుగుపరచుకోవడం కోసమనే బాక్సింగ్‌లో చేరినా, ఆ తర్వాత పూర్తి స్థాయిలో బాక్సింగ్‌పై దృష్టి పెట్టాడు. అనిల్‌ ధన్‌కర్‌ అనే రాష్ట్ర స్థాయి కోచ్‌ రోహ్‌టక్‌లో శిక్షణ ఇచ్చేవాడు. ఇద్దరూ అక్కడే కోచింగ్‌ తీసుకున్నారు.

అయితే అజయ్‌ ఆశించిన రీతిలో పెద్ద స్థాయికి చేరలేకపోయాడు. కానీ జాతీయ స్థాయిలో కొన్ని చక్కటి ప్రదర్శనలతో ఆర్మీలో హవల్దార్‌గా ఉద్యోగం మాత్రం పొందగలిగాడు. మరో వైపు అమిత్‌ పంచ్‌లు, అతని శైలి మాత్రం కోచ్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టేలా చేశాయి. దాంతో అజయ్‌కు మున్ముందు తాను ఏం చేయాలో అర్థమైంది. తను పూర్తిగా ఆట నుంచి తప్పుకొని తమ్ముడిని తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాడు.

2018 ఆసియన్‌ గేమ్స్‌ స్వర్ణ పతకంతో, తల్లిదండ్రులతో..

తన ఉద్యోగం కారణంగా ఆర్థికపరంగా కూడా చేయూత ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్‌ తప్ప మరో ప్రపంచం లేకుండా కష్టపడాలని హితబోధ చేశాడు. దీనిని చిన్న వయసులోనే అర్థం చేసుకున్న అమిత్‌ 24 గంటలూ బాక్సింగ్‌నే తన భాగస్వామిగా మార్చుకున్నాడు. ఇప్పటికీ, ఏ స్థాయికి చేరినా తన సోదరుడు తన కోసం చేసిన త్యాగాలను అతను గుర్తు చేసుకుంటాడు. ప్రతి మ్యాచ్‌కు ముందు అన్న సూచనలను తీసుకునే అమిత్‌.. అతడిని బెస్ట్‌ కోచ్‌ అంటూ పిలుస్తాడు.

జాతీయ స్థాయిలో మెరిసి...
అమిత్‌కు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతని బరువు 24 కిలోలే! బక్కగా, బలహీనంగా కనిపించేవాడు. కానీ పట్టుదల, పోరాటానికి ఏమాత్రం లోటు లేదు. అందుకే నన్ను చూసి కాదు నా ఆటను చూసి తలపడండి అంటూ బరిలోకి దిగేవాడు. చాలా సందర్భాల్లో తనకంటే ఎక్కువ వయసు ఉన్న ఎంతో బలమైన ఆటగాళ్లను అతను పడగొట్టాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల వయసులోనే జాతీయ సబ్‌ జూనియర్‌ చాంపియన్‌గా అమిత్‌ నిలిచాడు. అన్న అండ, ప్రోత్సాహంతో మరింత దూసుకుపోయిన అమిత్‌ గుర్గావ్‌లోని కాంబాట్‌ బాక్సింగ్‌ క్లబ్‌లో చేరాడు. అక్కడి అతని బాక్సింగ్‌ మరింత పదునెక్కింది.

కాంబాట్‌ క్లబ్‌లో శిక్షణ తర్వాత జూనియర్‌ స్థాయిలో వరుసగా విజయాలు వచ్చాయి. ఈ క్రమంలో 2017లో అతడిని కోచ్‌లు సీనియర్‌ స్థాయికి ప్రమోట్‌ చేశారు. అతను ఆ స్థాయికి తగినవాడా అనే సందేహాలు వచ్చిన నేపథ్యంలో అమిత్‌ పట్టుదలగా ఆడి తానేంటో నిరూపించుకున్నాడు. వారు తీసుకున్న నిర్ణయానికి న్యాయం చేస్తూ సీనియర్‌ జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సొంతం చేసుకున్నాడు.

2019 ఆసియన్‌ చాంపియన్‌ షిప్‌ స్వర్ణ పతకంతో, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు ఎంపికైన అమిత్‌..

ప్రపంచ వేదికలపై...
జాతీయ విజేతగా మారిన తర్వాత అవకాశాలు వరుసగా రావడంతో పాటు మరింత స్థాయికి ఎదిగేందుకు దోహదం చేశాయి. 2017లో ఆసియా చాంపియన్‌షిప్‌ కాంస్యం గెలుచుకోవడంతో అతని సత్తా ఏమిటో అందరికీ తెలిసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే  22 ఏళ్ల వయసులో అమిత్‌ తొలిసారి వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో కూడా పాల్గొన్నాడు. అక్కడ పతకం గెలవకపోయినా ఆ అనుభవం పెద్ద స్థాయిలో రాటుదేలేందుకు ఎంతో పనికొచ్చింది.

క్వార్టర్‌ ఫైనల్లో తలవంచినా, ఆ మ్యాచ్‌లో రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన హసన్‌బయ్‌ దుస్మతోవ్‌ను అతను నిలువరించిన తీరు అందరీ ఆకట్టుకుంది. ఇదే జోరులో 2018 కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగే అవకాశం లభించింది. లైట్‌ ఫ్లయ్‌వెయిట్‌ కేటగిరీలో వరుస విజయాలతో సత్తా చాటిన అతను ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అయితే బ్రిటిష్‌ బాక్సర్‌ గలాల్‌ యాఫైతో జరిగిన ఫైనల్లో హోరాహోరీగా పోరాడి చివరకు తలవంచాడు. దాంతో ఈ క్రీడల్లో రజతపతకం దక్కింది.

అయితే సరిగ్గా నాలుగేళ్ల తర్వాత జరిగిన 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో తన స్థాయిని అమిత్‌ పెంచుకున్నాడు. ఆ పోటీల్లో అదే విభాగంలో అతను స్వర్ణం సాధించడం విశేషం. అంతకు ముందు 2018లోనే జరిగిన ఆసియా క్రీడల్లో కూడా అమిత్‌ స్వర్ణపతకంతో మెరిశాడు. దీంతో పాటు ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడుసార్లు అతను పతకంతో తిరిగి రావడం పంఘాల్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 2017లో కాంస్యం, 2019లో స్వర్ణం గెలిచిన అతను.. 2021లో రజత పతకాన్ని అందుకున్నాడు.

వరల్డ్‌ నంబర్‌వన్‌గా...
2019లో జరిగిన వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ అమిత్‌ను అగ్రశ్రేణి బాక్సర్ల జాబితాలో చేర్చింది. ఈ టోర్నీకి కొద్ది రోజుల ముందే ఆసియా చాంపియన్‌షిప్‌లో పసిడి గెలిచిన ఊపులో అమిత్‌ ఉన్నాడు. అప్పటి వరకు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌ నుంచి ఐదుగురు పతకాలు సాధించగా, వీరంతా కాంస్యానికే పరిమితమయ్యారు. కానీ వీరందరినీ అధిగమించి అమిత్‌ రజతపతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయుడిగా నిలిచాడు. ఆ సమయంలో అద్భుత ఫామ్‌లో ఉన్న అమిత్‌ ప్రపంచ బాక్సింగ్‌ సమాఖ్య ప్రకటించిన వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో 52 కేజీల విభాగంలో నంబర్‌వన్‌గా నిలవడంతో అతని కెరీర్‌ శిఖరానికి చేరింది. ప్రస్తుతం భారత ఆర్మీలో జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌గా అతను పని చేస్తున్నాడు.

2019 ప్రపంచ చాంపియన్‌ షిప్‌ రజత పతకంతో.., కామన్ వెల్త్ స్వర్ణ పతకంతో అమిత్ (2022)

ప్రతికూల పరిస్థితి దాటి...
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాల తర్వాత బాక్సింగ్‌ సమాఖ్య అమిత్‌ పంఘాల్‌ పేరును ప్రతిష్ఠాత్మక ఖేల్‌రత్న పురస్కారం కోసం సిఫారసు చేసింది. అంతకు ముందు వరుసగా మూడేళ్లు అర్జున అవార్డు కోసం సిఫారసు చేసినా, అతడి పేరును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఒకప్పుడు డోపింగ్‌లో పట్టుబడ్డాడనేది దానికి కారణంగా చెప్పింది. అయితే నిజానికి అమిత్‌ 2012లో 17 ఏళ్ల వయసులో యూత్‌ స్థాయిలో ఆడుతున్నప్పుడు ఇది జరిగింది.

తాను ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్‌ తీసుకోలేదని, చికెన్‌ పాక్స్‌ కోసం చికిత్స చేయిస్తుండగా వాడిన మందుల్లో నిషేధక ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలింది. దీనిపై అతను చాలా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. యూత్‌ స్థాయిలో చేసిన తప్పులను ఎవరైనా మన్నిస్తారని, అయినా కూడా దానికి తాను తగిన శిక్ష కూడా అనుభవించానని అతను చెప్పాడు. భారత్‌ తరఫున తన ఘనతలను పరిగణించాలని పంఘాల్‌ కోరాడు. చివరకు 2022లో కేంద్రం అమిత్‌ను ‘అర్జున’ అవార్డుతో గౌరవించింది.

‘ఒలింపిక్‌ పతకం సాధించిన రోజే బాక్సింగ్‌లో నా ప్రయాణం మొదలైనట్లుగా భావిస్తాను’... అమిత్‌ చేసిన ఈ వ్యాఖ్య ఒలింపిక్‌ మెడల్‌ విలువేంటో చెబుతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్నా, అనూహ్య రీతిలో అతను విఫలమైన నిష్క్రమించాడు. కానీ ఇప్పుడు మరో ఒలింపిక్స్‌కు అమిత్‌ సిద్ధమయ్యాడు. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే పట్టుదలతో శ్రమిస్తున్న ఈ బాక్సర్‌ కల నెరవేరాలని ఆశిద్దాం. – మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement