తానొక.. చెక్‌ క్రేజీ స్టార్‌! | Barbara Krejcikova First Grand Slam Australian Open In 2024 | Sakshi
Sakshi News home page

తానొక.. చెక్‌ క్రేజీ స్టార్‌!

Published Sun, Jul 28 2024 8:58 AM | Last Updated on Sun, Jul 28 2024 8:58 AM

Barbara Krejcikova First Grand Slam Australian Open In 2024

మూడేళ్ల క్రితం ఆమె గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫ్రెంచ్‌ ఓపెన్‌ సింగిల్స్‌ బరిలోకి దిగిన సమయంలో ఎలాంటి అంచనాలు లేవు. అప్పటికి డబుల్స్‌లో రెండు, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మూడు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచినా.. డబుల్స్‌ స్పెషలిస్ట్‌గానే ముద్ర పడింది. సింగిల్స్‌లో ముందుకెళ్లడం కష్టం అని అనుకున్నారు. కానీ ఆమె ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ సింగిల్స్‌లో చాంపియన్‌గా నిలిచింది. అయినా సరే మహిళల టెన్నిస్‌లో ఎంతోమంది తరహాలో వన్‌ గ్రాండ్‌స్లామ్‌ వండర్‌గా నిలిచిపోతుందనే భావించారు అంతా! తర్వాతి రోజుల్లో ఆమె ప్రదర్శన కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో అంతా ఆమెను మర్చిపోయారు.

కానీ ఇప్పుడు మళ్లీ ఉవ్వెత్తున పైకి లేచింది. ఈ సారి వింబుల్డన్‌ బరిలోకి దిగే సమయానికి సరిగ్గా మూడేళ్ల క్రితం నాటి పరిస్థితే. సీడింగ్‌ ఇచ్చిన 32 మంది ప్లేయర్లలో ఆమెది 31వ స్థానం. వైఫల్యాల కోర్ట్‌లో ఉన్న ఆమె ఆమె ప్రదర్శనపై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ ఒక్కో రౌండ్‌ దాటుతున్న కొద్దీ ఆమె ఆట ఏంటో అందరికీ తెలిసింది. చివరకు ఫైనల్లో గెలిచి చాంపియన్‌షిప్‌ను ముద్దాడటంతో మళ్లీ టెన్నిస్‌ ప్రపంచం ఆమెపై ఫోకస్‌ పెట్టింది. ఆ స్టార్‌ పేరే బార్బరా క్రెజికోవా. 2024 వింబుల్డన్‌ చాంపియన్‌.

2021లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచిన ఈ చెక్‌ రిపబ్లిక్‌ ప్లేయర్‌.. రెండు పూర్తి భిన్నమైన సర్ఫేస్‌లు ఎర్ర మట్టి కోర్టు, పచ్చిక కోర్టులపై విజేతగా నిలిచిన అతి తక్కువ మంది మహిళా ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. పైగా సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లలో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించిన అరుదైన జాబితాలో కూడా క్రెజికోవా చోటు దక్కించుకుంది.

2024లో తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో క్రెజికోవా ప్రదర్శన పర్వాలేదనిపించింది. క్వార్టర్‌ ఫైనల్‌ వరకు చేరిన ఆమె.. ఈ దశలో టోర్నీ విజేత అరైనా సబలెంకా చేతిలో ఓడింది. అయితే ఆ తర్వాతే ఆమె కష్టకాలం మొదలైంది. అనారోగ్యం, గాయాలు ఆమెను వేధించాయి. ఫలితంగా ఏ టోర్నీకి వెళ్లినా పరాజయమే పలకరించింది. ఐదు నెలల కాలంలో మూడు సింగిల్స్‌ మ్యాచ్‌లలోనే గెలవగలిగింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో మాజీ చాంపియన్‌గా బరిలోకి దిగి తొలి రౌండ్‌లోనే ఓటమిపాలవ్వడం ఆమెను తీవ్ర మనోవేదనకు గురి చేసింది.

డబుల్స్‌లో కూడా మూడో రౌండ్‌కే పరిమితమైన క్రెజికోవా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో గాయంతో రెండో రౌండ్‌లోనే నిష్క్రమించింది. ఇలాంటి స్థితిలో ఆమె ట్రావెలింగ్‌ కోచ్‌ పావెల్‌ మోటెల్‌ ఆమెలో స్ఫూర్తి నింపాడు. క్రెజికోవాకంటే రెండేళ్లు చిన్నవాడైన అతను ఆమె స్కూల్‌మేట్‌. ప్రస్తుతం ట్రైనింగ్‌ పార్ట్‌నర్‌గా కూడా ఉన్న పావెల్‌.. గత ఫలితాలను పక్కనపెట్టి గ్రాస్‌ కోర్టు సీజన్‌పై క్రెజికోవా దృష్టి పెట్టేలా చేశాడు. ఈసారి అన్ని విధాలుగా సిద్ధమై వింబుల్డన్‌లో అడుగు పెట్టిన తర్వాత ఆమె కొత్త ఉత్సాహంతో కనిపించింది. తొలి మూడు రౌండ్లలో అనామకులపై గెలిచిన తర్వాత ఆమె అసలు ఆట తర్వాతి 

మూడు మ్యాచ్‌లలో వచ్చింది. తనకంటే ర్యాంకింగ్స్‌లో ఎంతో మెరుగైన స్థితిలో ఉన్న డానిల్‌ కొలిన్స్, ఒస్టాపెంకో, రిబాకినాలను ఓడించి ఆమె ఫైనల్‌ చేరింది. తుది పోరులో కూడా ఏడో సీడ్‌ పావొలినిని చిత్తుచేసి సగర్వంగా నిలిచిన క్రెజికోవా.. అతి తక్కువ ర్యాంక్‌తో మైదానంలోకి దిగి వింబుల్డన్‌ గెలిచినవారి జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. తాజా ప్రదర్శనతో సహజంగానే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన ఈ చెక్‌ ప్లేయర్‌ 10వ స్థానానికి దూసుకుపోయింది.

చిన్ననాటినుంచే..
క్రెజికోవా అంతర్జాతీయ టెన్నిస్‌లో అనూహ్యంగా, సంచలనంలా దూసుకురాలేదు. ఆరేళ్ల వయసులో మొదటిసారి టెన్నిస్‌ రాకెట్‌ పట్టి ఓనమాలు నేర్చుకున్న ఆమె చెక్‌ రిపబ్లిక్‌ జాతీయ స్థాయి జూనియర్‌ టోర్నీల్లో సత్తా చాటి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 2013లో జూనియర్‌ సర్క్యూట్‌లో క్రెజికోవా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో యూరోపియన్‌ చాంపియన్‌గా నిలవడం ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. అన్నింటినీ మించి ఆ ఏడాది గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో సాధించిన అద్భుత విజయాలు ఆమె స్థాయిని పెంచాయి. స్నేహితురాలు కేటరినా సినియోకొవాతో కలసి మూడు జూనియర్‌ గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ టైటిల్స్‌ (ఫ్రెంచ్‌ ఓపెన్, వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌)ను క్రెజికోవా గెలుచుకుంది. అంతకు ముందు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఒలెకాండ్రా కొరాష్‌విలి (ఉక్రెయిన్‌)తో కలసి ఆడిన క్రెజికోవా రన్నరప్‌గా నిలిచింది. మరొక్క మ్యాచ్‌ ఫైనల్లో గెలిచి ఉంటే ఒకే ఏడాది జూనియర్‌ స్థాయిలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లూ గెలిచిన అరుదైన ఘనత ఆమె ఖాతాలో చేరేది. అదే ఏడాది వరల్డ్‌ జూనియర్‌ ర్యాంకింగ్స్‌లో క్రెజికోవా మూడో స్థానాన్ని అందుకోవడం విశేషం.

2021 ఫ్రెంచ్‌ ఓపెన్‌ విన్నర్స్‌ ట్రోఫీతో, 2024 వింబుల్డన్‌ విమెన్స్‌ టైటిల్‌ ట్రోఫీతో..

క్రెజికోవా అంతర్జాతీయ టెన్నిస్‌లో అనూహ్యంగా, సంచలనంలా దూసుకు రాలేదు. ఆరేళ్ల వయసులో మొదటిసారి టెన్నిస్‌ రాకెట్‌ పట్టి ఓనమాలు నేర్చుకున్న ఆమె చెక్‌ రిపబ్లిక్‌ జాతీయ స్థాయి జూనియర్‌ టోర్నీల్లో సత్తా చాటి వెలుగులోకి వచ్చింది.

అన్నీ తానే అయి..
చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారిణిగా యానా నవోత్నాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1998లో ఆమె అద్భుత ఆటతో వింబుల్డన్‌ చాంపియన్‌గా నిలిచింది. రిటైర్మెంట్‌ తర్వాత కోచ్‌గా మారిన ఆమె శిక్షణలోనే క్రెజికోవా ఉన్నతస్థాయికి చేరింది. సరిగ్గా చెప్పాలంటే ఒక కోచ్‌ కంటే కూడా మార్గదర్శిగా, స్నేహితురాలిగా ఉన్న నవోత్నా పర్యవేక్షణలోనే క్రెజికోవా తన ఆటను తీర్చిదిద్దుకుంది. కెరీర్‌లో తొలి కోచ్‌గా ఉన్న నవోత్నా వద్దే ఆమె మూడేళ్ల పాటు శిక్షణ పొందింది.

అయితే దురదృష్టవశాత్తు 2017లో క్యాన్సర్‌తో నవోత్నా మరణించింది. క్రెజికోవా అగ్రస్థాయికి చేరే విజయాలను అందుకునేసరికే ఆమె లోకం నుంచి నిష్క్రమించింది. అయితే నవోత్నా ఇచ్చిన స్ఫూర్తి, ఆమె మాటలు తన జీవితంలో ఎప్పుడూ అంతర్భాగమేనని క్రెజికోవా చెప్పుకుంది. 2021లో తొలి గ్రాండ్‌స్లామ్‌ గెలిచినప్పుడు కోచ్‌ను గుర్తు చేసుకొని కన్నీళ్ళపర్యంతమైన ఈ చెక్‌ ప్లేయర్‌ ‘నాకు వింబుల్డన్‌ అంటే చాలా ఇష్టం. అక్కడి పచ్చికపై ఆట ఎంతో ప్రత్యేకం. నువ్వు ఎలాగైనా వింబుల్డన్‌ గెలవాలి’ అని నవోత్నా చెప్పిన మాటలను మర్చిపోలేదు. ఇప్పుడు వింబుల్డన్‌ టైటిల్‌ సాధించిన క్షణాన వేదికపై తన కోచ్‌కు నివాళి అర్పిస్తూ ఆమె చేసిన ప్రసంగం ఈ అనుబంధం ఎలాంటిదో చూపించింది.

మిగిలిన రెండూ గెలిస్తే..
12 ఏళ్ల వయసులో క్రెజికోవా తాను భవిష్యత్తులో సాధించాల్సిన మూడు లక్ష్యాల గురించి తన నోట్‌బుక్‌లో రాసుకుంది. అప్పటికి ఇంకా పూర్తిస్థాయిలో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌గా మారని ఆ టీనేజర్‌కు నిజంగా తాను సాధించగలదో లేదో తెలీదు. ప్రపంచ టెన్నిస్‌లో టాప్‌–10 ర్యాంక్‌కు చేరడం, ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలవడం, ఒలింపిక్స్‌లో చెక్‌ రిపబ్లిక్‌కు ప్రాతినిధ్యం వహించి స్వర్ణం అందుకోవడం.. ఇప్పటికే ఇవన్నీ ఆమె సాధించేసింది.

సింగిల్స్‌లో అత్యుత్తమంగా వరల్డ్‌ నంబర్‌ 2 ర్యాంక్‌ వరకు వెళ్లిన ఆమె.. డబుల్స్‌లో ఆరేళ్ల క్రితమే వరల్డ్‌ నంబర్‌వన్‌ కూడా అయింది. క్రెజికోవా ఖాతాలో ఓవరాల్‌గా ప్రస్తుతం 12 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ ఉన్నాయి. సింగిల్స్‌లో 2, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో 3, మహిళల డబుల్స్‌లో 7 గ్రాండ్‌స్లామ్‌లను ఆమె గెలుచుకుంది. మహిళల డబుల్స్‌లోనైతే 8 సార్లు ఫైనల్‌కి చేరితే ఒక్కసారి మాత్రమే ఆమె ఓడింది. ఈ 8 సార్లూ తన జూనియర్‌ సహచరి, చెక్‌ రిపబ్లిక్‌కే చెందిన కేటరినా సినియాకొవానే ఆమె భాగస్వామిగా ఉంది.

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రెండుసార్లు రాజీవ్‌రామ్‌తో, మరోసారి నికొలా మెక్టిక్‌తో కలసి క్రెజికోవా విజేతగా నిలిచింది. ఈ మూడూ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లే కాగా.. మహిళల డబుల్స్‌లో మాత్రం నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌లు ఆమె సొంతం చేసుకోవడం విశేషం. వీటికి తోడు మహిళల టెన్నిస్‌లో ప్రపంచ కప్‌లాంటి టీమ్‌ ఈవెంట్‌ ఫెడరేషన్‌ కప్‌లో కూడా అరుదైన ఘనతను అందుకుంది. 2018లో ఫెడ్‌ కప్‌ నెగ్గిన చెక్‌ రిపబ్లిక్‌ టీమ్‌లో క్రెజికోవా సభ్యురాలు. అంతే కాదు చాలామంది కలలు కనే ఒలింపిక్స్‌ పతకం కూడా ఆమె సాధించగలిగింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కేటరినా సినియాకొవాతోనే కలసి స్వర్ణపతకం సొంతం చేసుకుంది.

వింబుల్డన్‌ గెలిచిన వెంటనే తన తదుపరి లక్ష్యం ఒలింపిక్స్‌ సింగిల్స్‌లో స్వర్ణమేనని ఆమె ప్రకటించింది. అదే ఉత్సాహంతో పారిస్‌లో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. అయితే సింగిల్స్‌లో మాత్రం గ్రాండ్‌స్లామ్‌ మరో రెండు వేర్వేరు ట్రోఫీలు బాకీ ఉన్నాయి. హార్డ్‌కోర్ట్‌లపై జరిగే యూఎస్‌ ఓపెన్, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లలో గెలిస్తే క్రెజికోవా కెరీర్‌ సంపూర్ణం అవుతుంది. తాజా ఫామ్‌ను బట్టి చూస్తే ఈ ఏడాది ఆగస్టు చివర్లో జరిగే యూఎస్‌ ఓపెన్‌లో కూడా ఆమెకు మంచి విజయావకాశాలు ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ వరకు జోరు కొనసాగిస్తే వరల్డ్‌ టెన్నిస్‌లో గ్రేట్‌ ప్లేయర్లలో ఒకరిగా క్రెజికోవా నిలిచిపోవడం ఖాయం. – మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement