French Open Grand Slam tennis tournament
-
తానొక.. చెక్ క్రేజీ స్టార్!
మూడేళ్ల క్రితం ఆమె గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ బరిలోకి దిగిన సమయంలో ఎలాంటి అంచనాలు లేవు. అప్పటికి డబుల్స్‌లో రెండు, మిక్స్డ్ డబుల్స్‌లో మూడు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచినా.. డబుల్స్ స్పెషలిస్ట్‌గానే ముద్ర పడింది. సింగిల్స్‌లో ముందుకెళ్లడం కష్టం అని అనుకున్నారు. కానీ ఆమె ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ సింగిల్స్‌లో చాంపియన్‌గా నిలిచింది. అయినా సరే మహిళల టెన్నిస్‌లో ఎంతోమంది తరహాలో వన్ గ్రాండ్‌స్లామ్ వండర్‌గా నిలిచిపోతుందనే భావించారు అంతా! తర్వాతి రోజుల్లో ఆమె ప్రదర్శన కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో అంతా ఆమెను మర్చిపోయారు.కానీ ఇప్పుడు మళ్లీ ఉవ్వెత్తున పైకి లేచింది. ఈ సారి వింబుల్డన్ బరిలోకి దిగే సమయానికి సరిగ్గా మూడేళ్ల క్రితం నాటి పరిస్థితే. సీడింగ్ ఇచ్చిన 32 మంది ప్లేయర్లలో ఆమెది 31వ స్థానం. వైఫల్యాల కోర్ట్‌లో ఉన్న ఆమె ఆమె ప్రదర్శనపై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ ఒక్కో రౌండ్ దాటుతున్న కొద్దీ ఆమె ఆట ఏంటో అందరికీ తెలిసింది. చివరకు ఫైనల్లో గెలిచి చాంపియన్‌షిప్‌ను ముద్దాడటంతో మళ్లీ టెన్నిస్ ప్రపంచం ఆమెపై ఫోకస్ పెట్టింది. ఆ స్టార్ పేరే బార్బరా క్రెజికోవా. 2024 వింబుల్డన్ చాంపియన్.2021లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన ఈ చెక్ రిపబ్లిక్ ప్లేయర్.. రెండు పూర్తి భిన్నమైన సర్ఫేస్లు ఎర్ర మట్టి కోర్టు, పచ్చిక కోర్టులపై విజేతగా నిలిచిన అతి తక్కువ మంది మహిళా ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. పైగా సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లలో గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన అరుదైన జాబితాలో కూడా క్రెజికోవా చోటు దక్కించుకుంది.2024లో తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్రెజికోవా ప్రదర్శన పర్వాలేదనిపించింది. క్వార్టర్ ఫైనల్ వరకు చేరిన ఆమె.. ఈ దశలో టోర్నీ విజేత అరైనా సబలెంకా చేతిలో ఓడింది. అయితే ఆ తర్వాతే ఆమె కష్టకాలం మొదలైంది. అనారోగ్యం, గాయాలు ఆమెను వేధించాయి. ఫలితంగా ఏ టోర్నీకి వెళ్లినా పరాజయమే పలకరించింది. ఐదు నెలల కాలంలో మూడు సింగిల్స్ మ్యాచ్‌లలోనే గెలవగలిగింది. ఫ్రెంచ్ ఓపెన్లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో మాజీ చాంపియన్‌గా బరిలోకి దిగి తొలి రౌండ్లోనే ఓటమిపాలవ్వడం ఆమెను తీవ్ర మనోవేదనకు గురి చేసింది.డబుల్స్‌లో కూడా మూడో రౌండ్‌కే పరిమితమైన క్రెజికోవా.. మిక్స్డ్ డబుల్స్‌లో గాయంతో రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. ఇలాంటి స్థితిలో ఆమె ట్రావెలింగ్ కోచ్ పావెల్ మోటెల్ ఆమెలో స్ఫూర్తి నింపాడు. క్రెజికోవాకంటే రెండేళ్లు చిన్నవాడైన అతను ఆమె స్కూల్‌మేట్. ప్రస్తుతం ట్రైనింగ్ పార్ట్నర్గా కూడా ఉన్న పావెల్.. గత ఫలితాలను పక్కనపెట్టి గ్రాస్ కోర్టు సీజన్‌పై క్రెజికోవా దృష్టి పెట్టేలా చేశాడు. ఈసారి అన్ని విధాలుగా సిద్ధమై వింబుల్డన్‌లో అడుగు పెట్టిన తర్వాత ఆమె కొత్త ఉత్సాహంతో కనిపించింది. తొలి మూడు రౌండ్లలో అనామకులపై గెలిచిన తర్వాత ఆమె అసలు ఆట తర్వాతి మూడు మ్యాచ్‌లలో వచ్చింది. తనకంటే ర్యాంకింగ్స్‌లో ఎంతో మెరుగైన స్థితిలో ఉన్న డానిల్ కొలిన్స్, ఒస్టాపెంకో, రిబాకినాలను ఓడించి ఆమె ఫైనల్ చేరింది. తుది పోరులో కూడా ఏడో సీడ్ పావొలినిని చిత్తుచేసి సగర్వంగా నిలిచిన క్రెజికోవా.. అతి తక్కువ ర్యాంక్‌తో మైదానంలోకి దిగి వింబుల్డన్ గెలిచినవారి జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. తాజా ప్రదర్శనతో సహజంగానే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన ఈ చెక్ ప్లేయర్ 10వ స్థానానికి దూసుకుపోయింది.చిన్ననాటినుంచే..క్రెజికోవా అంతర్జాతీయ టెన్నిస్‌లో అనూహ్యంగా, సంచలనంలా దూసుకురాలేదు. ఆరేళ్ల వయసులో మొదటిసారి టెన్నిస్ రాకెట్ పట్టి ఓనమాలు నేర్చుకున్న ఆమె చెక్ రిపబ్లిక్ జాతీయ స్థాయి జూనియర్ టోర్నీల్లో సత్తా చాటి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 2013లో జూనియర్ సర్క్యూట్లో క్రెజికోవా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో యూరోపియన్ చాంపియన్‌గా నిలవడం ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. అన్నింటినీ మించి ఆ ఏడాది గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సాధించిన అద్భుత విజయాలు ఆమె స్థాయిని పెంచాయి. స్నేహితురాలు కేటరినా సినియోకొవాతో కలసి మూడు జూనియర్ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ (ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్)ను క్రెజికోవా గెలుచుకుంది. అంతకు ముందు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఒలెకాండ్రా కొరాష్విలి (ఉక్రెయిన్)తో కలసి ఆడిన క్రెజికోవా రన్నరప్‌గా నిలిచింది. మరొక్క మ్యాచ్ ఫైనల్లో గెలిచి ఉంటే ఒకే ఏడాది జూనియర్ స్థాయిలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లూ గెలిచిన అరుదైన ఘనత ఆమె ఖాతాలో చేరేది. అదే ఏడాది వరల్డ్ జూనియర్ ర్యాంకింగ్స్‌లో క్రెజికోవా మూడో స్థానాన్ని అందుకోవడం విశేషం.2021 ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్స్ ట్రోఫీతో, 2024 వింబుల్డన్ విమెన్స్ టైటిల్ ట్రోఫీతో..క్రెజికోవా అంతర్జాతీయ టెన్నిస్‌లో అనూహ్యంగా, సంచలనంలా దూసుకు రాలేదు. ఆరేళ్ల వయసులో మొదటిసారి టెన్నిస్ రాకెట్ పట్టి ఓనమాలు నేర్చుకున్న ఆమె చెక్ రిపబ్లిక్ జాతీయ స్థాయి జూనియర్ టోర్నీల్లో సత్తా చాటి వెలుగులోకి వచ్చింది.అన్నీ తానే అయి..చెక్ రిపబ్లిక్కు చెందిన అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణిగా యానా నవోత్నాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1998లో ఆమె అద్భుత ఆటతో వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచింది. రిటైర్మెంట్ తర్వాత కోచ్‌గా మారిన ఆమె శిక్షణలోనే క్రెజికోవా ఉన్నతస్థాయికి చేరింది. సరిగ్గా చెప్పాలంటే ఒక కోచ్ కంటే కూడా మార్గదర్శిగా, స్నేహితురాలిగా ఉన్న నవోత్నా పర్యవేక్షణలోనే క్రెజికోవా తన ఆటను తీర్చిదిద్దుకుంది. కెరీర్లో తొలి కోచ్‌గా ఉన్న నవోత్నా వద్దే ఆమె మూడేళ్ల పాటు శిక్షణ పొందింది.అయితే దురదృష్టవశాత్తు 2017లో క్యాన్సర్‌తో నవోత్నా మరణించింది. క్రెజికోవా అగ్రస్థాయికి చేరే విజయాలను అందుకునేసరికే ఆమె లోకం నుంచి నిష్క్రమించింది. అయితే నవోత్నా ఇచ్చిన స్ఫూర్తి, ఆమె మాటలు తన జీవితంలో ఎప్పుడూ అంతర్భాగమేనని క్రెజికోవా చెప్పుకుంది. 2021లో తొలి గ్రాండ్‌స్లామ్ గెలిచినప్పుడు కోచ్‌ను గుర్తు చేసుకొని కన్నీళ్ళపర్యంతమైన ఈ చెక్ ప్లేయర్ ‘నాకు వింబుల్డన్ అంటే చాలా ఇష్టం. అక్కడి పచ్చికపై ఆట ఎంతో ప్రత్యేకం. నువ్వు ఎలాగైనా వింబుల్డన్ గెలవాలి’ అని నవోత్నా చెప్పిన మాటలను మర్చిపోలేదు. ఇప్పుడు వింబుల్డన్ టైటిల్ సాధించిన క్షణాన వేదికపై తన కోచ్‌కు నివాళి అర్పిస్తూ ఆమె చేసిన ప్రసంగం ఈ అనుబంధం ఎలాంటిదో చూపించింది.మిగిలిన రెండూ గెలిస్తే..12 ఏళ్ల వయసులో క్రెజికోవా తాను భవిష్యత్తులో సాధించాల్సిన మూడు లక్ష్యాల గురించి తన నోట్‌బుక్‌లో రాసుకుంది. అప్పటికి ఇంకా పూర్తిస్థాయిలో ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా మారని ఆ టీనేజర్‌కు నిజంగా తాను సాధించగలదో లేదో తెలీదు. ప్రపంచ టెన్నిస్‌లో టాప్–10 ర్యాంక్‌కు చేరడం, ఫ్రెంచ్ ఓపెన్ గెలవడం, ఒలింపిక్స్‌లో చెక్ రిపబ్లిక్కు ప్రాతినిధ్యం వహించి స్వర్ణం అందుకోవడం.. ఇప్పటికే ఇవన్నీ ఆమె సాధించేసింది.సింగిల్స్‌లో అత్యుత్తమంగా వరల్డ్ నంబర్ 2 ర్యాంక్ వరకు వెళ్లిన ఆమె.. డబుల్స్‌లో ఆరేళ్ల క్రితమే వరల్డ్ నంబర్‌వన్ కూడా అయింది. క్రెజికోవా ఖాతాలో ఓవరాల్‌గా ప్రస్తుతం 12 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. సింగిల్స్‌లో 2, మిక్స్డ్ డబుల్స్‌లో 3, మహిళల డబుల్స్‌లో 7 గ్రాండ్‌స్లామ్‌లను ఆమె గెలుచుకుంది. మహిళల డబుల్స్లోనైతే 8 సార్లు ఫైనల్‌కి చేరితే ఒక్కసారి మాత్రమే ఆమె ఓడింది. ఈ 8 సార్లూ తన జూనియర్ సహచరి, చెక్ రిపబ్లిక్‌కే చెందిన కేటరినా సినియాకొవానే ఆమె భాగస్వామిగా ఉంది.మిక్స్డ్ డబుల్స్‌లో రెండుసార్లు రాజీవ్‌రామ్‌తో, మరోసారి నికొలా మెక్టిక్‌తో కలసి క్రెజికోవా విజేతగా నిలిచింది. ఈ మూడూ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లే కాగా.. మహిళల డబుల్స్‌లో మాత్రం నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌లు ఆమె సొంతం చేసుకోవడం విశేషం. వీటికి తోడు మహిళల టెన్నిస్‌లో ప్రపంచ కప్‌లాంటి టీమ్ ఈవెంట్ ఫెడరేషన్ కప్‌లో కూడా అరుదైన ఘనతను అందుకుంది. 2018లో ఫెడ్ కప్ నెగ్గిన చెక్ రిపబ్లిక్ టీమ్‌లో క్రెజికోవా సభ్యురాలు. అంతే కాదు చాలామంది కలలు కనే ఒలింపిక్స్ పతకం కూడా ఆమె సాధించగలిగింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కేటరినా సినియాకొవాతోనే కలసి స్వర్ణపతకం సొంతం చేసుకుంది.వింబుల్డన్ గెలిచిన వెంటనే తన తదుపరి లక్ష్యం ఒలింపిక్స్ సింగిల్స్‌లో స్వర్ణమేనని ఆమె ప్రకటించింది. అదే ఉత్సాహంతో పారిస్‌లో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. అయితే సింగిల్స్‌లో మాత్రం గ్రాండ్‌స్లామ్ మరో రెండు వేర్వేరు ట్రోఫీలు బాకీ ఉన్నాయి. హార్డ్కోర్ట్లపై జరిగే యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్లలో గెలిస్తే క్రెజికోవా కెరీర్ సంపూర్ణం అవుతుంది. తాజా ఫామ్‌ను బట్టి చూస్తే ఈ ఏడాది ఆగస్టు చివర్లో జరిగే యూఎస్ ఓపెన్‌లో కూడా ఆమెకు మంచి విజయావకాశాలు ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ వరకు జోరు కొనసాగిస్తే వరల్డ్ టెన్నిస్‌లో గ్రేట్ ప్లేయర్లలో ఒకరిగా క్రెజికోవా నిలిచిపోవడం ఖాయం. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
French Open 2024: క్వార్టర్ ఫైనల్లో సబలెంకా, రిబాకినా
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్), ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సబలెంకా 6–2, 6–3తో ఎమా నవారో (అమెరికా)పై, రిబాకినా 6–4, 6–3తో స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలుపొందారు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జాస్మిన్ పావోలిని (ఇటలీ) 4–6, 6–0, 6–1తో ఎలీనా అవానెస్యాన్ (రష్యా)పై, మిరా ఆంద్రీవా 7–5, 6–2తో వర్వారా గ్రచెవా (ఫ్రాన్స్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మెద్వెదెవ్కు చుక్కెదురు పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగాడు. అలెక్స్ డి మినార్ (ఆ్రస్టేలియా) 4–6, 6–2, 6–1, 6–3తో మెద్వెదెవ్‌ను ఓడించి ఎనిమిదో ప్రయత్నంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్) –ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 6–7 (2/7), 6–3, 7–6 (10/8)తో శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీని ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
సబలెంకా బోణీ
పారిస్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో గెలుపు బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–1, 6–2తో ఇరీకా ఆంద్రీవా (రష్యా)పై అలవోకగా విజయం సాధించింది. 68 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.27 విన్నర్స్ కొట్టిన సబలెంకా నెట్ వద్ద 11 పాయింట్లు సాధించింది. ఏడోసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న ఈ బెలారస్ స్టార్ గత ఏడాది తొలిసారి సెమీఫైనల్‌కు చేరింది. మరోవైపు ప్రపంచ ఏడో ర్యాంకర్, ఆరో సీడ్ మరియా సాకరి (గ్రీస్) వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీలో తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయింది. సాకరి 6–3, 4–6, 3–6తో వర్వరా గ్రెచెవా (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయింది. 2 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకరి ఆరు డబుల్ ఫాల్ట్‌లతోపాటు 39 అనవసర తప్పిదాలు చేసింది. నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా), పదో సీడ్ దరియా కసత్కినా (రష్యా) రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రిబాకినా 6–2, 6–3తో గ్రీట్ మినెన్ (బెల్జియం)పై, కిన్వెన్ జెంగ్ 6–2, 6–1తో అలీజా కార్నె (ఫ్రాన్స్)పై, కసత్కినా 7–5, 6–1తో మగ్ధలీనా ఫ్రెచ్ (పోలాండ్)పై గెలుపొందారు. రూడ్ శుభారంభం పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఏడో ర్యాంకర్, 2022, 2023 రన్నరప్ కాస్పర్ రూడ్ (నార్వే) శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో రూడ్ 6–3, 6–4, 6–3తో అల్వెస్ మెలెగిని (బ్రెజిల్)పై గెలుపొందాడు. గంటా 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రూడ్ ప్రత్యర్థి సర్విస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 23 విన్నర్స్ కొట్టిన రూడ్ నెట్ వద్ద 10 పాయింట్లు సాధించాడు. వర్షం అంతరాయం కారణంగా మంగళవారం జరగాల్సిన కొన్ని మ్యాచ్‌లను వాయిదా వేశారు. ఇందులో భారత డబుల్స్ ప్లేయర్లు రోహన్ బోపన్న, యూకీ బాంబ్రీ తొలి రౌండ్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. కార్నె వీడ్కోలు... ఈ టోర్నీతో ఫ్రాన్స్ టెన్నిస్ స్టార్ అలీజా కార్నె కెరీర్‌కు వీడ్కోలు పలికింది. కిన్వెన్ జెంగ్ చేతిలో మ్యాచ్ ముగిశాక ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు కార్నెను సన్మానించి చేసి వీడ్కోలు ట్రోఫీని అందజేశారు. 34 ఏళ్ల కార్నె అత్యధిక వరుస గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. కార్నె 2007 ఆ్రస్టేలియన్ ఓపెన్ నుంచి తాజా ఫ్రెంచ్ ఓపెన్ వరకు వరుసగా 69 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడింది. 2014 వింబుల్డన్ టోర్నీ మూడో రౌండ్లో నాటి ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్‌ను ఓడించిన కార్నె 2022 ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 2009లో కెరీర్ బెస్ట్ 11వ ర్యాంక్‌ను అందుకున్న కార్నె తాజా ర్యాంకింగ్స్‌లో 106వ స్థానంలో ఉంది. ర్యాంకింగ్‌పరంగా కార్నెకు నేరుగా ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడే అవకాశం రాకపోవడంతో నిర్వాహకులు వైల్డ్ కార్డు కేటాయించారు. -
French Open 2023: ప్రిక్వార్టర్స్‌లో స్వియాటెక్
పారిస్: డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. వింబుల్డన్ చాంపియన్, నాలుగో సీడ్ ఎలీనా రిబాకినా ఫిట్నెస్ సమస్యలతో వైదొలగగా, ఆరోసీడ్ కోకో గాఫ్, 14వ సీడ్ హదాడ్ మైయాతో పాటు పురుషుల ఈవెంట్లో సీడెడ్లు కాస్పెర్ రూడ్, హోల్గెర్ రూన్ (డెన్మార్క్) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. జపనీస్ స్టార్ నిషిఒకా చెమటోడ్చి ముందంజ వేయగా, 15వ సీడ్ బొర్నా కొరిచ్ మూడో రౌండ్లో నిష్క్రమించాడు. ఏకపక్షంగా... మహిళల సింగిల్స్‌లో రెండుసార్లు (2020, 2022) ఇక్కడ క్లే కోర్ట్ చాంపియన్‌గా నిలిచిన ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్‌కు మూడో రౌండ్లో చైనీస్ ప్రత్యర్థి నుంచి కనీస పోటీనే లేకపోయింది. దీంతో పోలండ్ స్టార్ 6–0, 6–0తో జిన్యూ వాంగ్‌ను అతి సునాయాసంగా ఓడించింది. కేవలం 51 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించింది. వింబుల్డన్ చాంపియన్, నాలుగో సీడ్ ఎలీనా రిబాకినా మ్యాచ్ బరిలోకి దిగకుండా టోర్నీ నుంచి తప్పుకుంది. అనారోగ్య కారణాలతో మూడో రౌండ్ బరిలోకి దిగలేనని 23 ఏళ్ల కజకిస్తాన్ ప్లేయర్ వెల్లడించింది. దీంతో ప్రత్యర్థి సార సొరిబెస్ టొర్మో (స్పెయిన్) వాకోవర్‌తో ప్రిక్వార్టర్స్ చేరింది. మిగతా మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–7 (5/7), 6–1, 6–1తో మిర అండ్రీవా (రష్యా)పై గెలుపొందగా, 14వ సీడ్ హదాడ్ మైయా 5–7, 6–4, 7–5తో అలెగ్జాండ్రొవా (రష్యా)ను ఓడించింది. పోరాడి ఓడిన సెబొత్ బ్రెజిలియన్ క్వాలిఫయర్ తియాగో సెబొత్ వైల్డ్ అంటే ఇకపై ప్రత్యర్థులు హడలెత్తిపోవాల్సిందే. ఎందుకంటే ఇదివరకే అతను తొలి రౌండ్లోనే యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ (2021), రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)పై సంచలన విజయం సాధించాడు. తాజాగా అతని దూకుడుకు జపాన్ నంబర్‌వన్ ఆటగాడు యొషిహితో నిషిఒకా బ్రేకులేసినప్పటికీ సెబొత్ తన పోరాటంతో ఆకట్టుకున్నాడు. 27వ సీడ్ నిషిఒకా 3–6, 7–6 (10/8), 2–6, 6–4, 6–0తో సెబొత్ వైల్డ్‌పై శ్రమించి గెలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ నిరుటి రన్నరప్, నాలుగో సీడ్ కాస్పెర్ రూడ్ (నార్వే) 4–6, 6–4, 6–1, 6–4తో చైనాకు చెందిన జాంగ్ జిజెన్పై గెలుపొందాడు. నార్వే స్టార్‌కు తొలిసెట్లో ప్రతిఘటన ఎదురైనా... తర్వాత సెట్లలో సులువుగానే గెలిచాడు. గతేడాది క్వార్టర్ ఫైనల్ చేరిన ఆరోసీడ్ డెన్మార్క్ స్టార్ రూన్ ఇప్పుడు మెరుగైన ప్రదర్శన కనబరచాలనే పట్టుదలతో ఆడుతున్నాడు. మూడో రౌండ్లో తనకెదురైన ప్రత్యర్థి ఒలీవియెరి (అర్జెంటీనా)ను 6–4, 6–1, 6–3తో ఓడించాడు. కేవలం రెండు గంటల్లోనే (గంటా 58 నిమిషాలు) మ్యాచ్‌ను ముగించాడు. బొర్న కొరిచ్ (క్రొయే షియా) 3–6, 6–7(5/7), 2–6తో మార్టిన్ ఎచెవెరి (అర్జెంటీనా) చేతిలో పరాజయం చవిచూశాడు. -
ప్రిక్వార్టర్స్‌లో సబలెంక, జొకోవిచ్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించాడు. అయితే శుక్రవారం పురుషుల, మహిళల విభాగాల్లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. అమెరికన్ అమ్మాయి మూడో సీడ్ జెస్సికా పెగులా ఆట మూడో రౌండ్లోనే ముగిసింది. పురుషుల ఈవెంట్లో రష్యన్ ప్లేయర్, ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్‌పై అన్‌సీడెడ్ సొనెగో అద్భుత విజయం సాధించాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ జొకోవిచ్ మూడో రౌండ్లో వరు స సెట్లలో గెలుపొందాడు. కానీ స్పెయిన్ ఆటగాడు డెవిడోవిచ్ ఫొకినా ప్రతీ సెట్లోనూ గట్టి పోటీ ఇచ్చాడు. దీంతో తొలి రెండు సెట్లు కైవసం చేసుకునేందుకు జొకోవిచ్ టైబ్రేక్ ఆడక తప్పలేదు. 3 గంటల 36 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో చివరకు జొకోవిచ్ 7–6 (7/4), 7–6 (7/5), 6–2 స్కోరుతో 29వ సీడ్ ఫొకినాపై గెలిచాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా ) 7–5, 6–0, 3–6, 6–7 (5/7), 3–6తో లొరెంజొ సొనెగొ (ఇటలీ) చేతిలో కంగుతిన్నాడు. సొనెగొకు తన కెరీర్లో టాప్–10 ప్లేయర్‌ను ఓడించడం ఇది ఆరోసారి! ఇటలీకి చెందిన ప్రపంచ 48వ ర్యాంకర్ సొనెగొ ప్రిక్వార్టర్ ఫైనల్లో 11వ సీడ్ కరెన్ ఖచనొవ్ (రష్యా)తో తలపడతాడు. మూడో రౌండ్లో ఖచనొవ్ 6–4 6–1, 3–6, 7–6 (7/5)తో కొక్కినకిస్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు. సబలెంక అలవోకగా... మహిళల సింగిల్స్‌లో బెలారస్ స్టార్ సబలెంక అలవోక విజయంతో ప్రిక్వార్టర్స్ చేరింది. మూడో రౌండ్లో రెండో సీడ్ సబలెంక 6–2, 6–2తో కమిల్లా రఖిమొవ (రష్యా)పై విజయం సాధించింది. జెస్సికా పెగులా (అమెరికా) 1–6, 3–6తో 28వ సీడ్ ఎలైస్ మెర్టెన్స్ (బెల్జియం) చేతిలో చిత్తుగా ఓడింది. తొమ్మిదో సీడ్ డారియా కసత్కినా (రష్యా) 6–0, 6–1తో పెటన్ స్టియర్స్ (అమెరికా)పై, ఎలినా స్వితొలినా (ఉక్రెయిన్) 2–6, 6–2, 7–5తో అన్నా బ్లింకొవా (రష్యా)పై గెలుపొందగా... పవ్ల్యుచెంకొవా (రష్యా) 4–6, 6–3, 6–0తో 24వ సీడ్ పొటపొవా (రష్యా)కు షాకిచ్చింది. పురుషుల డబుల్స్‌లో భారత్ పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ జోడీ 4–6, 5–7తో తొమ్మిదో సీడ్ గొంజాలెజ్ (మెక్సికో)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంట చేతిలో పరాజయం చవిచూసింది. -
French Open: 5 గంటల 26 నిమిషాలు.. సంచలన ఫలితం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో గురువారం సంచలన ఫలితం నమోదైంది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, ఎనిమిదో సీడ్ యానిక్ సినర్ (ఇటలీ) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. 5 గంటల 26 నిమిషాలపాటు పోరాడిన ప్రపంచ 79వ ర్యాంకర్ డానియల్ అల్ట్‌మైర్ (జర్మనీ) రెండు మ్యాచ్ పాయింట్లను కూడా కాపాడుకొని సినర్‌ను బోల్తా కొట్టించి మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన ఈ మారథాన్ సమరంలో అల్ట్‌మైర్ 6–7 (0/7), 7–6 (9/7), 1–6, 7–6 (7/4), 7–5తో సినర్‌ను ఓడించాడు. ఈ గెలుపుతో గత ఏడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ తొలి రౌండ్లో సినర్ చేతిలో ఎదురైన ఓటమికి అల్ట్‌మైర్ బదులు తీర్చుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో నాలుగో సెట్లోనే సినర్ విజయం అంచుల్లో నిలిచాడు. నాలుగో సెట్లో 5–4తో ఆధిక్యంలో నిలిచి తన సర్వీస్‌లో రెండుసార్లు మ్యాచ్ పాయింట్లు కూడా సంపాదించాడు. అయితే అల్ట్‌మైర్ పట్టుదలతో పోరాడి రెండుసార్లూ మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్నాడు. అదే జోరులో సినర్ సర్వీస్‌ను కూడా బ్రేక్ చేసి స్కోరును 5–5తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో అల్ట్‌మైర్ పైచేయి సాధించి సెట్‌ను దక్కించుకున్నాడు. నాలుగో సెట్ ఏకంగా 93 నిమిషాలు జరగడం విశేషం. నిర్ణాయక ఐదో సెట్లోని 11వ గేమ్‌లో సినర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అల్ట్‌మైర్ 12వ గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని విజయం ఖరారు చేసుకున్నాడు. ఈ గేమ్‌లో సినర్‌కు నాలుగుసార్లు అల్ట్‌మైర్ సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశం వచ్చినా వృథా చేసుకున్నాడు. రూడ్ ముందంజ పురుషుల సింగిల్స్ ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. జొకోవిచ్ 7–6 (7/2), 6–0, 6–3తో ఫచ్సోవిచ్ (హంగేరి)పై, రూడ్ 6–3, 6–2, 4–6, 7–5తో జెపెరి (ఇటలీ)పై నెగ్గారు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 6–4, 6–0తో క్లెయిరి లియు (అమెరికా)ను ఓడించి మూడో రౌండ్‌కు చేరింది. నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), ఏడో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీషియా) కూడా మూడో రౌండ్‌కు చేరారు. -
French Open 2023: గార్సియాకు షాక్
పారిస్: మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరైన కరోలిన్ గార్సియాకు అనూహ్య ఓటమి ఎదురైంది. సొంతగడ్డపై జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఈ ఫ్రాన్స్ స్టార్ రెండో రౌండ్‌ను దాటి ముందుకెళ్లలేకపోయింది. బుధవారం జరిగిన రెండో రౌండ్లో ప్రపంచ ఐదో ర్యాంకర్, ఐదో సీడ్ గార్సియా 6–4, 3–6, 5–7తో ప్రపంచ 56వ ర్యాంకర్ అనా బ్లింకోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. 2 గంటల 51 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో గార్సియా ఏడు డబుల్ ఫాల్ట్‌లు, 50 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. వరుసగా నాలుగో ఏడాది ఈ టోర్నీలో ఆడుతున్న బ్లింకోవా ఐదుసార్లు గార్సియా సర్వీస్‌ను బ్రేక్ చేసి రెండోసారి మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. 2017 చాంపియన్, 17వ ర్యాంకర్ ఎలెనా ఒస్టాపెంకో (లాత్వియా) కూడా రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. ఒస్టాపెంకో 3–6, 6–1, 2–6తో పేటన్ స్టెర్న్స్ (అమెరికా) చేతిలో పరాజయం పాలైంది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 7–5, 6–2తో ఇరీనా షిమనోవిచ్ (బెలారస్)పై, తొమ్మిదో సీడ్ కసత్కినా (రష్యా) 6–3, 6–4తో వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)పై, స్వితోలినా (ఉక్రెయిన్) 2–6, 6–3, 6–1తో స్టార్మ్ హంటర్ (ఆస్ట్రేలియా)పై గెలుపొంది మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) తొలి సెట్‌ను 6–2తో గెల్చుకున్నాక ఆమె ప్రత్యర్థి కామిల్లా జియార్జి (ఇటలీ) గాయం కారణంగా వైదొలిగింది. అల్కరాజ్ ముందుకు... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), 11వ సీడ్ ఖచనోవ్ (రష్యా) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. అల్కరాజ్ 6–1, 3–6, 6–1, 6–2తో టారో డానియల్ (జపాన్)పై, సిట్సిపాస్ 6–3, 7–6 (7/4), 6–2తో కార్బెలాస్ బేనా (స్పెయిన్)పై, ఖచనోవ్ 6–3, 6–4, 6–2తో రాడూ అల్బోట్ (మాల్డొవా)పై గెలిచారు. 2015 చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 4 గంటల 38 నిమిషాల పోరులో 6–3, 5–7, 3–6, 7–6 (7/4), 3–6తో కొకినాకిస్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. -
French Open 2022: ఫ్రెంచ్ కోటలో నాదల్ పాట.. ప్రైజ్‌మనీ 18 కోట్లు!
వేదిక అదే. ప్రత్యర్థి మారాడంతే. తుది ఫలితం మాత్రం యథాతథం. ఎర్రమట్టి కోర్టులపై మకుటంలేని మహారాజు తానేనని స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ మరోసారి నిరూపించుకున్నాడు. 36 ఏళ్ల వయస్సులో ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 14వ సారి విజేతగా నిలిచి ఔరా అనిపించాడు. 2005లో తన 19 ఏళ్ల ప్రాయంలో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించిన నాదల్ 17 ఏళ్ల తర్వాత కూడా అదే ఉత్సాహంతో, అదే పట్టుదలతో, అదే విజయకాంక్షతో బరిలోకి దిగి తన గెలుపు పాట వినిపించాడు. ఫైనల్ చేరేలోపు తనను ఓడించగలిగే సత్తా ఉన్న ఆటగాళ్లను హోరాహోరీ పోరాటాల్లో ఇంటిదారి పట్టించిన ఈ స్పెయిన్ సూపర్‌స్టార్ తుది సమరంలో మాత్రం చెలరేగిపోయాడు. కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న నార్వే ప్లేయర్, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ కాస్పర్ రూడ్‌ను నాదల్ హడలెత్తించాడు. రూడ్‌కు కేవలం ఆరు గేమ్‌లు కోల్పోయిన నాదల్ 2 గంటల 18 నిమిషాల్లో ఫైనల్‌ను ముగించేసి తనకెంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడాడు. పారిస్: మట్టికోటలో మహరాజు... నభూతో నభవిష్యత్... సరిలేరు నీకెవ్వరు... నమో నమః... ‘గ్రాండ్ సలాం’.. ఇంకా ఏమైనా విశేషణాలు ఉన్నాయంటే వాటిని కూడా స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్కు జత చేయాల్సిందే. ఒకవైపు తమ కెరీర్ మొత్తంలో ఒక్క గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడకుండానే.. గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గకుండానే కెరీర్‌ను ముగించేసిన టెన్నిస్ ఆటగాళ్లెందరో ఉంటే... మరోవైపు నాదల్ మాత్రం ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిల్‌ను ఒకసారి కాదు... రెండుసార్లు కాదు... మూడుసార్లు కాదు... ఏకంగా 14సార్లు గెలిచి అందరిచేతా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గి అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన రాఫెల్ నాదల్ ఆదివారం ఈ జాబితాలో మరింత ఎత్తుకు ఎదిగిపోయాడు. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే)తో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ నాదల్ 2 గంటల 18 నిమిషాల్లో 6–3, 6–3, 6–0తో గెలిచాడు. తద్వారా ఫ్రెంచ్ ఓపెన్‌ను 14వసారి సొంతం చేసుకోవడంతోపాటు తన ఖాతాలో 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన 14 సార్లూ నాదలే గెలిచాడు. విజేతగా నిలిచిన నాదల్కు 22 లక్షల యూరోలు (రూ. 18 కోట్ల 30 లక్షలు)... రన్నరప్ రూడ్‌కు 11 లక్షల యూరోలు (రూ. 9 కోట్ల 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఏకపక్షంగా... ఫైనల్ చేరే క్రమంలో ప్రిక్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ అలియాసిమ్ (కెనడా)పై, క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)పై, సెమీఫైనల్లో మూడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచిన నాదల్కు ఫైనల్లో ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. ఆరంభం నుంచే అద్భుతంగా ఆడిన నాదల్ తన ప్రత్యర్థికి ఏదశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఎనిమిదిసార్లు రూడ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. 37 విన్నర్స్ కొట్టిన నాదల్ కేవలం 18 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు రూడ్ 16 విన్నర్స్ కొట్టి, 26 అనవసర తప్పిదాలు చేశాడు. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. వెంకటేష్ అయ్యర్, దినేష్ కార్తీక్‌కు నో ఛాన్స్..! Find someone who looks at you the way Rafa looks at the Coupe des Mousquetaires 🥰#RolandGarros pic.twitter.com/2ajSJ4aPyb — Roland-Garros (@rolandgarros) June 5, 2022 -
French Open: హోరాహోరీ సమరం... గాయంతో సమాప్తం
పాయింట్ పాయింట్‌కూ పోరాటం... సుదీర్ఘ ర్యాలీలు... 3 గంటల 13 నిమిషాలు ముగిసినా పూర్తి కాని రెండు సెట్లు... ఫ్రెంచ్ ఓపెన్‌లో 13 సార్లు చాంపియన్ రాఫెల్ నాదల్, జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ తీరిది. తొలి సెట్‌ను అతికష్టమ్మీద నెగ్గిన నాదల్కు రెండో సెట్లోనూ ఒక్కో పాయింట్‌కు తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాల్సిన స్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ తుది ఫలితం ఎలా ఉంటుందోనని అభిమానులు ఆలోచిస్తున్న తరుణంలో కోర్టులో ఊహించని సంఘటన జరిగింది. రెండో సెట్ 12వ గేమ్‌లో నాదల్ రిటర్న్ షాట్‌ను అందుకోనే క్రమంలో బేస్‌లైన్ వద్ద జ్వెరెవ్ జారి పడటంతో చీలమండకు తీవ్ర గాయమైంది. పడిన వెంటనే జ్వెరెవ్ నొప్పితో విలవిలలాడాడు. మైదానంలో ప్రథమ చికిత్స తర్వాత జ్వెరెవ్‌ను చక్రాల కుర్చీపై బయటకు తీసుకెళ్లారు. ఐదు నిమిషాల తర్వాత జ్వెరెవ్ ‘క్రచెస్’ సహాయంతో కోర్టులోకి వచ్చి అభిమానులకు అభివాదం చేసి వెళ్లిపోయాడు. దాంతో రాఫెల్ నాదల్ తనకెంతో కలిసొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్‌లో 14వ సారి ఫైనల్లోకి ప్రవేశించాడు. గతంలో ఫైనల్ చేరిన 13 సార్లూ నాదలే విజేతగా నిలిచాడు. కాస్పర్ రూడ్ (నార్వే), సిలిచ్ (క్రొయేషియా) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో నాదల్ తలపడతాడు. పారిస్: తన 36వ పుట్టిన రోజు విజయం రుచి చూసిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో నాదల్ తొలి సెట్‌ను 7–6 (10/8)తో టైబ్రేక్‌లో గెలిచాడు. రెండో సెట్లోని 12వ గేమ్ చివర్లో నాదల్ రిటర్న్ షాట్‌ను అందుకునే క్రమంలో జ్వెరెవ్ కోర్టులో జారి పడ్డాడు. దాంతో పాయింట్ నాదల్కు లభించింది. స్కోరు 6–6తో సమమైంది. కోర్టులో జారిపడ్డ జ్వెరెవ్‌కు గాయం త్రీవంగా ఉండటంతో అతను మళ్లీ బరిలోకి దిగలేకపోయాడు. దాంతో నాదల్‌ను విజేతగా ప్రకటించారు. 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన పోరులో జ్వెరెవ్ రెండు సెట్లలో నాదల్కు చెమటలు పట్టించాడు. తొలి సెట్ టైబ్రేక్‌లో జ్వెరెవ్ 6–2తో ఆధిక్యంలో నిలిచి నాలుగు సెట్ పాయిం ట్లు సంపాదించాడు. కానీ పట్టువదలకుండా పోరాడినా నాదల్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 7–6తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత స్కోరు 7–7తో, 8–8తో సమమైంది. ఈ దశలో నాదల్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి తొలి సెట్‌ను గంటా 38 నిమిషాల్లో గెల్చుకున్నాడు. రెండో సెట్లోనూ జ్వెరెవ్ అద్భుతంగా ఆడుతూ 5–3తో ఆధిక్యంలోకి వచ్చి సెట్ కోసం సర్వీస్ చేశా డు. కానీ తొమ్మిదో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 5–5తో సమం చేశాడు. 11వ గేమ్‌లో జ్వెరెవ్ తన సర్వీస్‌ను కాపాడుకోగా... 12వ గేమ్‌లో నాదల్ సర్వీస్‌లో చివరి పాయింట్ సమయంలో జ్వెరెవ్ జారి పడటంతో మ్యాచ్ ముగిసింది. నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ స్వియాటెక్ (పోలాండ్) X కోకో గాఫ్ (అమెరికా) సా. గం. 6:30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం అమెరికా టీనేజర్ కోకో గాఫ్... రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గాలనే లక్ష్యంతో స్వియాటెక్ నేడు మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో తలపడనున్నారు. ⚔️ A thrilling battle came to a tough end with an injury to @AlexZverev but he and @RafaelNadal played some amazing points! Check out the Highlights by @emirates 🎥#RolandGarros | #EmiratesFlyBetterMoment pic.twitter.com/E9vn2iRF1v — Roland-Garros (@rolandgarros) June 3, 2022 -
French Open 2022: తిరుగు లేని స్వియాటెక్
పారిస్: జోరుమీదున్న పోలాండ్ ‘టాప్’స్టార్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరింది. మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లోనూ ఆమె రాకెట్‌కు ఎదురే లేకుండా పోయింది. దీంతో ఆమె జైత్రయాత్రలో వరుసగా 34వ విజయం చేరింది. గురువారం జరిగిన పోరులో స్వియాటెక్ వరుస సెట్లలో 6–2, 6–1తో 20వ సీడ్ దరియా కసత్కినా (రష్యా)పై అలవోక విజయం సాధించింది. రోలాండ్ గారోస్‌లో 2020లో టైటిల్ సాధించిన స్వియాటెక్ తాజాగా మరో ట్రోఫీపై కన్నేసింది. రెండో సెమీస్‌లో అమెరికాకు చెందిన 18వ సీడ్ కోకో గౌఫ్ 6–3, 6–1తో ఇటలీకి చెందిన మార్టినా ట్రెవిసాన్ను ఓడించింది. శనివారం జరిగే టైటిల్ పోరులో గౌఫ్‌తో స్వియాటెక్ తలపడనుంది. ప్రపంచ నంబర్‌వన్ దెబ్బకు... టాప్ సీడ్ స్వియాటెక్ ధాటికి రష్యన్ ప్రత్యర్థి నిలువలేకపోయింది. తొలిసెట్ ఆరంభంలో 18 నిమిషాలు మాత్రమే 2–2తో దీటు సాగిన మ్యాచ్ క్షణాల వ్యవధిలోనే ఏకపక్షంగా మారింది. వరుసగా రెండు గేముల్ని గెలిచిన స్వియాటెక్‌కు మూడో గేమ్‌లో ఆమె సర్వీస్‌ను బ్రేక్ చేసి కసత్కినా షాకిచ్చింది. నాలుగో గేమ్‌ను నిలబెట్టుకుంది. తర్వాత ప్రపంచ నంబర్‌వన్ దూకుడు పెంచింది. ఫోర్‌హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థిపై ఎదురులేని ఆధిక్యాన్ని సాధించింది. వరుసగా నాలుగు గేముల్ని నిమిషాల వ్యవధిలోనే ముగించింది. తొలిసెట్ గెలిచేందుకు 38 నిమిషాలు పట్టగా... రెండో సెట్లో స్వియాటెక్ జోరుకు 26 నిమిషాలే సరిపోయాయి. ఇందులో రష్యన్ ప్లేయర్ రెండో గేమ్‌లో మాత్రమే తన సర్వీస్‌ను నిలబెట్టుకుంటే... వరుసగా ఐదు గేముల్ని స్వియాటెక్ చకాచకా ముగించింది. 22 విన్నర్లు కొట్టిన ఆమె 13 అనవసర తప్పిదాలు చేసింది. 10 విన్నర్స్కే పరిమితమైన కసత్కినా 24 అనవసర తప్పిదాలు చేసింది. తొలిసారి సెమీస్‌లో సిలిచ్ మారిన్ సిలిచ్ తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. 33 ఏళ్ల వయసులో ఎర్రమట్టి నేలలో అతని రాకెట్ గర్జించింది. పురుషుల క్వార్టర్ ఫైనల్లో 20వ సీడ్ క్రొయేషియా ఆటగాడు ఏకంగా 33 ఏస్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. 4 గంటలకు పైగా జరిగిన ఈ సమరంలో సిలిచ్ 5–7, 6–3, 6–4, 3–6, 7–6 (10/2)తో ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)ను కంగుతినిపించాడు. 16 ఏళ్లుగా రోలండ్ గారోస్ బరిలోకి దిగుతున్నప్పటికీ అతను ఒక్కసారి కూడా క్వార్టర్స్ (2017, 2018) దశనే దాటలేకపోయాడు. ఎనిమిదేళ్ల క్రితం 2014లో యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించిన సిలిచ్ మధ్యలో 2017లో వింబుల్డన్, 2018లో ఆస్ట్రేలియన్ ఓపెన్లలో రన్నరప్‌గా నిలిచాడు. ఈ రెండు మినహా గ్రాండ్‌స్లామ్ సహా పలు మేజర్ టోర్నీల్లో సీడెడ్ ప్లేయర్‌గా దిగి పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. పోరాడి ఓడిన బోపన్న జోడీ పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న అద్భుత పోరాటం సెమీస్‌లో ముగిసింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో 16వ సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ 6–4, 3–6, 6–7 (8/10) స్కోరుతో 12వ సీడ్ మార్సెలో అరివలో (సాల్వేడార్)–జీన్ జులియెన్ రోజర్ (నెదర్లాండ్స్) జంట చేతిలో పరాజయం చవిచూసింది. ఈ టోర్నీలో గత మ్యాచ్‌ల్లో సూపర్ టైబ్రేకర్‌లో ప్రత్యర్థి ద్వయంపై ఆధిపత్యం కనబరిచి నెగ్గుకొచ్చిన భారత్–డచ్ జంటకు ఇక్కడ మాత్రం కలిసిరాలేదు. 2 గంటల 7 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో బోపన్న జోడీ తొలి సెట్ చేజిక్కించుకుంది కానీ రెండో సెట్‌ను కోల్పోయింది. ఆఖరి సెట్ మాత్రం హోరాహోరీగా జరగడంతో టైబ్రేక్‌దాకా వచ్చింది. అయితే ఇందులో బోపన్న–మిడిల్‌కూప్ ఆటలు సాగలేదు. దీంతో 12 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ పురుషుల డబుల్స్‌లో టైటిల్‌పోరుకు చేరాలనుకున్న బోపన్న ఆశలు సెమీస్‌లోనే గల్లంతయ్యాయి. చివరిసారిగా బోపన్న... ఐజముల్ హక్ ఖురేషీ (పాకిస్తాన్)తో కలిసి 2010 యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. నేడు పురుషుల సెమీ ఫైనల్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) X అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) కాస్పర్ రూడ్ (నార్వే) Xమారిన్ సిలిచ్ (క్రొయేషియా) సా. గం. 6.15నుంచి సోనీలో ప్రత్యక్ష ప్రసారం -
ప్రిక్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో 2020 చాంపియన్ స్వియాటెక్ 6–3, 7–5తో డాంకా కొవినిచ్ (మోంటెనిగ్రో)పై గెలిచి ఈ ఏడాది వరుసగా 31వ విజయాన్ని నమోదు చేసింది. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ఏడో సీడ్ సబలెంకా (బెలారస్), మూడో సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) మూడో రౌండ్లోనే నిష్క్రమించారు. 28వ సీడ్ కమిలా జార్జి (ఇటలీ) 4–6, 6–1, 6–0తో సబలెంకాను ఓడించగా... వెరోనికా కుదెర్మెతోవా (రష్యా)తో జరిగిన మ్యాచ్‌లో బదోసా తొలి సెట్‌ను 3–6తో కోల్పోయి, రెండో సెట్లో 1–2తో వెనుబడిన దశలో గాయం కారణంగా వైదొలిగింది. బదోసా, సబలెంకా ఓటమితో ఈ టోర్నీలో టాప్–10 క్రీడాకారిణుల్లో కేవలం స్వియాటెక్ మాత్రమే బరిలో మిగిలింది. బోపన్న జోడీ సంచలనం పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట 6–7 (5/7), 7–6 (7/3), 7–6 (12/10)తో రెండో సీడ్ మాట్ పావిచ్–నికోల్ మెక్టిక్ (క్రొయేషియా) జోడీపై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. -
French Open 2022: నాదల్, జొకోవిచ్ జోరు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), 13 సార్లు విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్) తమ జోరు కొనసాగిస్తూ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6–3, 6–3, 6–2తో అల్జాజ్ బెడెన్ (స్లొవేనియా)పై నెగ్గగా... ఐదో సీడ్ నాదల్ 6–3, 6–2, 6–4తో వాన్ డె జాండ్‌షుల్ప్ (నెదర్లాండ్స్)పై గెలుపొందాడు. బెడెన్‌తో గంటా 44 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. జాండ్షుల్ప్తో జరిగిన పోరులో నాదల్ ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో 15వ సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 6–3, 6–1, 6–2తో 18వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో 14వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్), ప్రపంచ మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణులు ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), అజరెంకా (బెలారస్) పోరాటం ముగిసింది. మూడో రౌండ్లో బెన్‌చిచ్ 5–7, 6–3, 5–7తో 17వ సీడ్ లేలా ఫెర్నాండెజ్ (కెనడా) చేతిలో, కెర్బర్ 4–6, సాస్నోవిచ్ (బెలారస్) చేతిలో, అజరెంకా 6–4, 5–7, 6–7 (5/10)తో జిల్ టెక్మన్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడిపోయారు. -
క్రిచికోవా ‘డబుల్’ ధమాకా
పారిస్: ఐదో ప్రయత్నంలోనే తొలిసారి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ చాంపియన్‌గా అవతరించిన చెక్ రిపబ్లిక్ అమ్మాయి బర్బోర క్రిచికోవా 24 గంటలు గడవకముందే తన ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జమ చేసుకుంది. శనివారం ఫ్రెంచ్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన 25 ఏళ్ల క్రిచికోవా ఆదివారం మహిళల డబుల్స్ టైటిల్‌ను కూడా దక్కించుకుంది. ఫైనల్లో క్రిచికోవా –కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్) ద్వయం 6–4, 6–2తో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా) –ఇగా స్వియాటెక్ (పోలాండ్) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన క్రిచికోవా జంటకు 2,44,925 యూరోలు (రూ. 2 కోట్ల 17 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సోమవారం విడుదలయ్యే ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో క్రిచికోవా ఏడో ర్యాంక్ నుంచి నంబర్‌వన్ ర్యాంక్‌కు ఎగబాకనుంది. ‘డబుల్’ విజయంతో క్రిచికోవా దిగ్గజ క్రీడాకారిణిల సరసన నిలిచింది. సెరెనా (2016 వింబుల్డన్‌లో) తర్వాత ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో మహిళల సింగిల్స్, డబుల్స్ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణగా క్రిచికోవా గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ తరహా ఘనత సాధించిన ఏడో క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. గతంలో బిల్లీ జీన్ కింగ్ (1972), మార్గరెట్ కోర్ట్ (1973), క్రిస్ ఎవర్ట్ (1974, 1975), వర్జీనియా(1978), మార్టినా నవ్రతిలోవా (1982, 1984), మేరీ పియర్స్ (2000) ఈ ఘనత సాధించారు. -
వీరోచితం... ‘జొకో’ విజయం
‘క్లే కోర్టు కింగ్’ రాఫెల్ నాదల్‌నే ఓడించినోడికి సిట్సిపాస్ ఓ లెక్కా! వన్డే మ్యాచ్ కాస్తా టి20లా ఆడేయడా ఏంటి! అని జొకోవిచ్ విజయం గురించే మాట్లాడుకున్నారు. కానీ ఫైనల్ మొదలయ్యాకే తెలిసింది... ఇది ఫైనల్ అని! టైటిల్ అంత ఈజీ కాదని!! కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న సిట్సిపాస్ వరల్డ్ నంబర్‌వన్‌కు ఏమాత్రం తీసిపోని ఆట ఆడాడు. అయితే తొలి రెండు సెట్లు ఓడిపోయినా జొకోవిచ్ ఏదశలోనూ పట్టుదల కోల్పోకుండా ఆడాడు. చిరస్మరణీయ ప్రదర్శనతో తన కెరీర్లో రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా నిలువడంతోపాటు 19వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఓపెన్ శకంలో (1968 తర్వాత) నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను కనీసం రెండుసార్లు చొప్పున గెలిచిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. పారిస్: ‘గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్’ గత అనుభవం అక్కరకొచ్చింది. సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ ఖాతాలో 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరింది. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ 4 గంటల 11 నిమిషాల్లో 6–7 (6/8), 2–6, 6–3, 6–2, 6–4తో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై గెలిచాడు. రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించాడు. 2016లో తొలిసారి అతను ఈ టైటిల్ నెగ్గాడు. విజేత జొకోవిచ్‌కు 14 లక్షల యూరోలు (రూ. 12 కోట్ల 41 లక్షలు)... రన్నరప్ సిట్సిపాస్‌కు 7 లక్షల 50 వేల యూరోలు (రూ. 6 కోట్ల 65 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. రెండు సెట్లు ‘పాస్’అయ్యాడు కానీ... ఆట మొదలైనప్పటి నుంచే దిగ్గజ ప్రత్యర్థికి దీటుగా సిట్సిపాస్ పోరాటం మొదలుపెట్టాడు. దీంతో సెర్బియన్‌కు ఫైనల్ అంత ఈజీ కాదని తెలిసిపోయింది. టైబ్రేక్‌కు దారితీసిన తొలి సెట్లో సిట్సిపాస్ పైచేయి సాధించి 72 నిమిషాల్లో తొలి సెట్‌ను గెల్చుకున్నాడు. తొలి సెట్ నెగ్గిన ఆనందంలో సిట్సిపాస్ రెట్టించిన ఉత్సాహంతో రెండో సెట్ తొలి గేమ్‌లో సెర్బియన్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. తర్వాత టాప్ సీడ్ ఆటగాడు వరుసగా అనవసర తప్పిదాలు చేయడంతో సిట్సిపాస్ తన సర్వీస్‌ను నిలబెట్టుకునేందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేకపోయింది. రెండో సెట్ కూడా సిట్సిపాస్ వశమైంది. ఇక సమరమే... దెబ్బకు స్కోరు సమమే! టైటిల్ సాధించాలంటే వరుసగా మూడు సెట్లు గెలవాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో జొకోవిచ్ తన గేరు మార్చాడు. జోరు పెంచాడు. ఒత్తిడిని పక్కన బెట్టాడు. అలసత్వాన్ని, అనవసర తప్పిదాలకు అక్కడితో చెక్ పెట్టాడు. మూడు, నాలుగు సెట్లలో తన సిసలైన పోటీ ఏంటో గ్రీస్ ప్రత్యర్థికి ప్రతీ గేమ్‌లోనూ రుచిచూపించాడు. ఇక ఆఖరి సెట్ మూడో గేమ్‌లో బ్రేక్ పాయింట్ సాధించిన జొకోవిచ్ తన సర్వీస్‌లను కాపాడుకొని టైటిల్ దిశగా సాగిపోయాడు. సిట్సిపాస్ పోరాడినప్పటికీ జొకోను ఓడించేందుకు ఇదేమాత్రం సరిపోలేదు. పురుషుల టెన్నిస్‌లో ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ (నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవడం) ఘనతను రెండుసార్లు చొప్పున నమో దు చేసిన మూడో ప్లేయర్ జొకోవిచ్. గతంలో రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా–1969), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా–1967) మాత్రమే ఈ ఘనత సాధించారు. జొకోవిచ్ నెగ్గిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (ఆస్ట్రేలియన్ ఓపెన్–9; ఫ్రెంచ్ ఓపెన్–2; వింబుల్డన్–5; యూఎస్ ఓపెన్–3). ఫెడరర్, రాఫెల్ నాదల్ (20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తొలి రెండు సెట్లు ఓడిపోయి, ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచిన ఏడో ప్లేయర్ జొకోవిచ్. గతంలో బెర్నార్డ్ (1946), రాడ్ లేవర్ (1962), బోర్గ్ (1974), లెండిల్ (1984), అగస్సీ (1999), గాడియో (2004) ఈ ఘనత సాధించారు. ఫైనల్ గణాంకాలు జొకోవిచ్ సిట్సిపాస్ 5 ఏస్‌లు 14 3 డబుల్ ఫాల్ట్‌లు 4 19/30 నెట్ పాయింట్లు 19/31 5/16 బ్రేక్ పాయింట్లు 3/8 56 విన్నర్స్ 61 41 అనవసర తప్పిదాలు 44 164 మొత్తం పాయింట్లు 147 -
French Open: ‘కింగ్’కు చెక్
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 టైటిల్స్... 105 విజయాలు... కేవలం 2 మ్యాచ్‌లలో ఓటమి... ఆ గడ్డపై అతడిని ఓడించడం సంగతి దేవుడెరుగు... అలాంటి ఆలోచన రావడం కూడా ఒక సాహసమే. కానీ ఎర్రమట్టిపై ఎదురులేని రారాజు ఎట్టకేలకు ‘జోకర్’ జోరుకు తలవంచాడు. అద్భుతమైన ఆట, పక్కా ప్రణాళికతో చెలరేగిన నొవాక్ జొకోవిచ్ ... ‘క్లే కింగ్’ రాఫెల్ నాదల్‌పై రొలాండ్ గారోస్‌లో రెండోసారి విజయం సాధించి సత్తా చాటాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో 14వ ట్రోఫీతో పాటు అత్యధిక గ్రాండ్‌స్లామ్ (21)ల విజయాన్ని అందుకోవాలని భావించిన నాదల్ ప్రయాణం సెమీస్‌లో ఆగిపోగా... 19వ గ్రాండ్‌స్లామ్ వేటకు వరల్డ్ నంబర్‌వన్ సన్నద్ధమయ్యాడు. తుది ఫలితం ఎలా ఉన్నా టెన్నిస్ చరిత్రలో అద్భుత మ్యాచ్‌లలో ఒకటిగా ఈ పోరు నిలిచిపోయింది. పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో అత్యంత అరుదుగా కనిపించే ఘట్టం శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఆవిష్కృతమైంది. ప్రత్యర్థి ఎవరైనా ఎర్ర మట్టి కోర్టులో విరుచుకుపడే రాఫెల్ నాదల్కు టోర్నీ సెమీఫైనల్లో ఓటమి ఎదురైంది. 4 గంటల 11 నిమిషాల పాటు సాగిన పోరులో జొకోవిచ్ (సెర్బియా) 3–6, 6–3, 7–6 (7/4), 6–2తో మూడో సీడ్ నాదల్‌ను బోల్తా కొట్టించాడు. గత ఏడాది ఇదే టోర్నీ ఫైనల్లో నాదల్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్‌ను రెండుసార్లు ఓడించిన (2015 క్వార్టర్ ఫైన ల్లో) ఏకైక ఆటగాడిగా జొకోవిచ్ నిలవగా... ‘స్పెయిన్ బుల్’కు మరో ఓటమి సోడెర్లింగ్ (స్వీడన్–2009 ప్రిక్వార్టర్స్) చేతిలో ఎదురైంది. హోరాహోరీ... తొలి సెట్‌ను నాదల్... రెండో సెట్‌ను జొకోవిచ్ నెగ్గగా... మూడో సెట్లో ఇద్దరూ ఒక్కో పాయింట్, గేమ్ కోసం తీవ్రంగా శ్రమించారు. టెన్నిస్ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేని గొప్ప ఆటను ఇద్దరూ చూపించారు. సర్వీస్‌లు నిలబెట్టుకుంటూ వెళ్లిన అనంతరం బ్రేక్ సాధిం చిన జొకోవిచ్ ఒక దశలో 5–3తో ఆధిక్యంలో నిలిచాడు. అయితే నాదల్ తగ్గలేదు. పోరాటపటిమ ప్రదర్శిస్తూ వరుసగా మూడు గేమ్‌లు గెలిచి 6–5తో ముందంజ వేశాడు. దురదృష్టవశాత్తూ ఇక్కడ నాదల్ మంచి అవకాశాన్ని కోల్పోయాడు. సెట్ పాయింట్ కోసం సర్వ్ చేసిన అతను డబుల్ ఫాల్ట్ చేశాడు. టైబ్రేక్‌లో జొకోవిచ్‌కు ఇబ్బంది ఎదురు కాలేదు. 93 నిమిషాల్లో జొకోవిచ్ మూడో సెట్ గెలుచుకున్నాడు. నాలుగో సెట్ ఆరంభంలోనే బ్రేక్ సాధించిన నాదల్ 2–0తో ఆధిక్యంలో నిలిచినా... ఆ తర్వాత జొకోవిచ్ చెలరేగిపోయాడు. వరుసగా ఆరు గేమ్‌లు నెగ్గి నాదల్ 14వ టైటిల్ ఆశలను సెమీస్‌లోనే ముగించాడు. పారిస్ ఆగిపోయింది... నాదల్, జొకోవిచ్ మ్యాచ్ కోసం ప్రభుత్వ అధికారులు కూడా కరోనా నిబంధనల నుంచి సడలిం పునిచ్చారు. పారిస్‌లో రాత్రి 11 గంటల నుంచి కర్ఫ్యూ ఉండటంతో 10:30కే అభిమానులు స్టేడి యం నుంచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు ఉన్నా యి. అయితే ఆ సమయంలో మ్యాచ్ ఉత్కంఠభరిత స్థితిలో ఉంది. ప్రేక్షకులు కాస్త నిరాశగా కనిపిస్తున్న దశలో మ్యాచ్ ముగిసే వరకు ఉండవచ్చంటూ అధికారులు ప్రకటించడం విశేషం. నేడు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)తో జొకోవిచ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 5–2తో సిట్సి పాస్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. గత ఏడాది ఈ టోర్నీ సెమీఫైనల్లో ఐదు సెట్ల పోరాటంలో సిట్సిపాస్‌పై జొకోవిచ్ గెలిచాడు. మూడో సెట్లో నేను సెట్ పాయింట్ కోల్పోవడం మ్యాచ్‌లో కీలక మలుపు. డబుల్ ఫాల్ట్ చేయడంతో పాటు టైబ్రేక్‌లో సులువైన వాలీలు ఆడలేకపోయాను. అయితే ఆ సమయంలో ఏదైనా జరగవచ్చు. ఇలాంటి తప్పలు సహజం. కానీ మ్యాచ్‌లు గెలవాలంటే ఇలాంటి తప్పులే చేయరాదు. నేను నా అత్యుత్తమ ఆటతీరు కనబర్చి పోరాడాను. కానీ ఈ రోజు నాది కాదు. –రాఫెల్ నాదల్ నాదల్కు ప్రత్యర్థిగా మైదానంలోకి దిగుతున్నప్పుడే అతడిని ఇక్కడ ఓడించాలంటే ఎవరెస్ట్ ఎక్కినంత శ్రమించాలనే విషయం నాకు తెలుసు. రొలాండ్ గారోస్‌లో ఇది నా అత్యుత్తమ మ్యాచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. నా కెరీర్లో బెస్ట్–3లో ఇదొకటి. గత 15 ఏళ్లుగా ఈ కోర్టును శాసిస్తున్న వ్యక్తిని ఓడించడం ఎప్పటికీ ప్రత్యేకం. నేను శారీరకంగా, మానసికంగా చాలా అద్భుతంగా ఉండటంతో పాటు గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగా. గత ఏడాది ఫైనల్‌కంటే మెరుగ్గా ఆడాలంటే ఏం చేయాలనేదానిపై స్పష్టమైన వ్యూహాలతో ఉన్నా. అందుకే తొలి సెట్ ఓడినా ఆందోళన చెందలేదు. –జొకోవిచ్ -
French Open: క్వీన్ క్రిచికోవా
సింగిల్స్ విభాగంలో ఆడుతున్న ఐదో గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బర్బోర క్రిచికోవా అద్భుతం చేసింది. ఎంతోమందికి తమ కెరీర్లో కలగానే మిగిలిపోయే ‘గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్’ను క్రిచికోవా సాకారం చేసుకుంది. డబుల్స్ స్పెషలిస్ట్ అయిన క్రిచికోవా గతంలో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సింగిల్స్ విభాగంలో ఆడినా నాలుగో రౌండ్‌ను దాటలేకపోయింది. పారిస్: వరుసగా ఆరో ఏడాది ఫ్రెంచ్ కోటలో కొత్త రాణికి కిరీటం లభించింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగిన చెక్ రిపబ్లిక్ టెన్నిస్ క్రీడాకారిణి బర్బోర క్రిచికోవా సూపర్ ఫినిషింగ్ ఇచ్చింది. మహిళల సింగిల్స్ విభాగంలో ఆమె తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ 33వ ర్యాంకర్, అన్‌సీడెడ్ క్రిచికోవా 6–1, 2–6, 6–4తో ప్రపంచ 32వ ర్యాంకర్, 31వ సీడ్ అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా)పై గెలిచింది. గంటా 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో క్రిచికోవా కీలకదశల్లో పైచేయి సాధించి విజయాన్ని దక్కించుకుంది. విజేత క్రిచికోవాకు 14 లక్షల యూరోలు (రూ. 12 కోట్ల 41 లక్షలు)... రన్నరప్ పావ్లుచెంకోవాకు 7 లక్షల 50 వేల యూరోలు (రూ. 6 కోట్ల 65 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. నేడు జరిగే మహిళల డబుల్స్ ఫైనల్లో సినియకోవాతో కలిసి విజేతగా నిలిస్తే 2000లో మేరీ పియర్స్ (ఫ్రాన్స్) తర్వాత ఒకే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో సింగిల్స్, డబుల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణిగా క్రిచికోవా గుర్తింపు పొందుతుంది. పావ్లుచెంకోవాతో జరిగిన ఫైనల్లో క్రిచికోవా కచ్చితమైన సర్వీస్‌లు, డ్రాప్ షాట్లు, డబుల్ బ్యాక్‌హ్యాండ్ షాట్లు, ఫోర్‌హ్యాండ్ షాట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచింది. హానా మాండ్లికోవా, నొవోత్నా, క్విటోవా తర్వాత చెక్ రిపబ్లిక్ తరఫున గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన నాలుగో ప్లేయర్ క్రిచికోవా. ఒస్టాపెంకో (లాత్వియా–2017), స్వియాటెక్ (పోలాండ్–2020) తర్వాత అన్‌సీడెడ్ హోదాలో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన మూడో క్రీడాకారిణి క్రిచికోవా. ఓవరాల్‌గా క్రిచికోవా కెరీర్లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. తన దేశానికే చెందిన సినియకోవాతో కలిసి క్రిచికోవా 2018లో ఫ్రెంచ్ ఓపెన్‌లో, 2018 వింబుల్డన్ ఓపెన్‌లో మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించింది. -
‘ఫ్రెంచ్’ రాణి ఎవరో?
అంచనాలకు అందనిరీతిలో సాగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగం పోటీలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా అన్‌సీడెడ్ బర్బోర క్రిచికోవా (చెక్ రిపబ్లిక్), 31వ సీడ్ అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా) తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టైటిల్ పోరుకు చేరుకున్నారు. నేడు జరిగే ఫైనల్లో గెలిచిన వారు తమ కెరీర్లో తొలిసారి సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరిస్తారు. 29 ఏళ్ల పావ్లుచెంకోవా 51 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడాక తొలిసారి ‘గ్రాండ్’ ఫైనల్లోకి అడుగుపెట్టగా... ‘డబుల్స్ స్పెషలిస్ట్’ అయిన 25 ఏళ్ల క్రిచికోవా తన ఐదో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలిసారి సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరింది. క్రిచికోవాకు అరుదైన ‘డబుల్’ సాధించే అవకాశం కూడా ఉంది. ఆమె మహిళల డబుల్స్ విభాగంలోనూ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో క్రిచికోవా–కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్) ద్వయం 6–1, 6–2తో మాగ్దా లినెట్టి (పోలాండ్)–బెర్నార్డా పెరా (అమెరికా) జోడీపై గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో బెథానీ మాటెక్ (అమెరికా)– స్వియాటెక్ (పోలాండ్) జోడీతో క్రిచికోవా–సినియకోవా ద్వయం ఆడతుంది. 2000లో మేరీ పియర్స్ మాత్రమే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒకే ఏడాది మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో టైటిల్స్ సాధించింది. -
French Open: సూపర్ సిట్సిపాస్
పారిస్: గతంలో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయిన గ్రీస్ యువ టెన్నిస్ ప్లేయర్ స్టెఫనోస్ సిట్సిపాస్ నాలుగో ప్రయత్నంలో సఫలమయ్యాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో 22 ఏళ్ల సిట్సిసాస్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ఐదో సీడ్ సిట్సిపాస్ 3 గంటల 37 నిమిషాల్లో 6–3, 6–3, 4–6, 4–6, 6–3తో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించాడు. తద్వారా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి గ్రీస్ ప్లేయర్‌గా సిట్సిపాస్ గుర్తింపు పొందాడు. గతంలో గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సిట్సిపాస్ అత్యుత్తమ ప్రదర్శన సెమీఫైనల్స్ (2019, 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్; 2020 ఫ్రెంచ్ ఓపెన్) కావడం విశేషం. ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి సెమీఫైనల్ చేరిన 24 ఏళ్ల జ్వెరెవ్ ఆరంభంలోనే తడబడ్డాడు. సిట్సిపాస్ ఆటతీరు ముందు ఎదురునిలువలేక వరుసగా రెండు సెట్లను కోల్పోయాడు. అయితే మూడో సెట్ నుంచి జ్వెరెవ్ ఆటతీరు గాడిలో పడింది. అనూహ్యంగా సిట్సిపాస్ ఒత్తిడికి లోనయ్యాడు. వరుసగా రెండు సెట్లను ఈ గ్రీస్ ప్లేయర్ సమర్పించుకున్నాడు. దాంతో మ్యాచ్ నిర్ణాయక ఐదో సెట్‌కు దారి తీసింది. నాలుగో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకున్న సిట్సిపాస్ 4–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత సిట్సిపాస్ తన రెండు సర్వీస్‌లను నిలబెట్టుకున్నాడు. తొమ్మిదో గేమ్‌లోని తన సర్వీస్‌లో ఏస్ సంధించి సిట్సిపాస్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో సిట్సిపాస్ ఎనిమిది ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్‌వద్దకు 33 సార్లు దూసుకొచ్చి 24 సార్లు పాయింట్లు సాధించాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి జ్వెరెవ్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు జ్వెరెవ్ 11 ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్‌వద్దకు 35 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచాడు. సిట్సిపాస్ 43 అనవసర తప్పిదాలు... జ్వెరెవ్ 47 అనవసర తప్పిదాలు చేశారు. నాదల్, జొకోవిచ్ హోరాహోరీ డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) మధ్య రెండో సెమీఫైనల్ హోరాహోరీగా సాగుతోంది. తొలి సెట్‌ను నాదల్ 6–3తో సొంతం చేసుకున్నాడు. అతను రెండుసార్లు జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. అనంతరం జొకోవిచ్ తేరుకొని రెండో సెట్‌ను 6–3తో గెల్చుకున్నాడు. ఈ సెట్లో నాదల్ సర్వీస్‌ను అతను రెండుసార్లు బ్రేక్ చేశాడు. -
గ్రాండ్‌స్లామ్ కలకు... అడుగు దూరంలో
అసమాన ఆటతీరుతో ప్రత్యర్థులపై విజయాలు సాధిస్తూ వచ్చిన పావ్లుచెంకోవా, మరియా సాకరి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కలను సాకారం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచారు. గురువారం జరిగిన సెమీ ఫైనల్ సమరాల్లో తామర జిదాన్సెక్పై పావ్లుచెంకోవా....సాకరిపై క్రిచికోవాగెలిచి తమ కెరీర్ల్లో తొలి సారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరుకున్నారు. శనివారం జరిగే టైటిల్ పోరులో వీరిద్దరిలో ఎవరు గెలిచినా సరికొత్త గ్రాండ్ స్లామ్ విన్నర్‌గా నిలుస్తారు. పారిస్: దశాబ్ద కాలంగా గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లలో పాల్గొంటున్నా... ప్రస్తుతం జరుగుతోన్న ఫ్రెంచ్ ఓపెన్ ముందు వరకు ఎన్నడూ క్వార్టర్ ఫైనల్స్ దాటని రష్యా ప్లేయర్ అనస్తాసియా పావ్లుచెంకోవా అద్భుతం చేసింది. బుధవారం జరిగిన క్వార్టర్స్‌లో రిబాకినా (కజకిస్తాన్)పై గెలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆమె... సెమీస్‌లో కూడా అదే దూకుడును కొనసాగించి కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో గురువారం గంటా 34 నిమిషాల పాటు జరిగిన తొలి సెమీ ఫైనల్లో పావ్లుచెంకోవా 7–5, 6–3తో 85వ ర్యాంకర్ తామర జిదాన్సెక్ (స్లొవేనియా)పై గెలుపొందింది. వయసులో తనకన్నా ఆరేళ్లు చిన్నదైన జిదాన్సెక్తో ఆడిన మ్యాచ్‌లో 31వ సీడ్ పావ్లుచెంకోవా మ్యాచ్ ఆరంభంలో తడబడింది. తొలి సెట్లో 0–2తో వెనుకబడిన ఆమె... ఆ తర్వాత తేరుకొని స్కోర్‌ను 2–2తో సమం చేసింది. అనంతరం ఎనిమిదో గేమ్‌ను జిదాన్సెక్ సర్వ్ చేయగా... పావ్లుచెంకోవా ఒక దశలో 0–40తో వెనుకబడినా వరుసగా పాయింట్లు సాధించి 40–40తో ‘డ్యూస్’ చేసింది. అక్కడ తడబడిన జిదాన్సెక్ ఒక డబుల్ఫాల్ట్తో పాటు మరో అనవసర తప్పిదం చేసి సర్వీస్‌ను కోల్పోయింది. 11వ గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన పావ్లుచెంకోవా... 12వ గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌ను సొం తం చేసుకుంది. రెండో సెట్లో జిదాన్సెక్ తేలిపోవడంతో మ్యాచ్ పావ్లుచెంకోవావశమైంది. హోరాహోరీ పోరు... అనంతరం హోరాహోరీగా జరిగిన మహిళల రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో బార్బొరా క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 4–6, 9–7తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచింది. తద్వారా తొలి సారి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్‌కు షాకిచ్చి న సాకరి మరోసారి తన జోరు ప్రదర్శించినా... క్రిచికోవా కూడా చెలరేగడంతో హోరాహోరీ పోరు సాగింది. ముఖ్యంగా చివరి సెట్‌లోనైతే ఇద్దరూ ఒక్కో పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు 3 గంటల 18 నిమిషాల సమరం తర్వాత మ్యాచ్ ఫలితం రావడం విశేషం. ఫైనల్ కాని ఫైనల్... ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన క్వార్టర్ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–2, 6–7(5/7), 7–5తో తొమ్మిదో సీడ్ మాటియో బెరెటిని (ఇటలీ)పై గెలుపొందాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరడం జొకోవిచ్‌కు ఇది 11వసారి కాగా... ఓవరాల్‌గా అతనికిది 40వ గ్రాండ్‌స్లామ్ సెమీ ఫైనల్. అతను నేడు జరిగే పురుషుల సెమీఫైనల్లో నాదల్‌తో తాడో పేడో తేల్చుకోనున్నాడు. గత ఏడాది వీరిద్దరు ఫైనల్లో తలపడగా నాదల్ వరుస సెట్లలో విజయం సాధించాడు. ఈ సారి ఇద్దరు దిగ్గజాల మధ్య సెమీ ఫైనల్లోనే పోరు జరగనుంది. నేడు పురుషుల సెమీ ఫైనల్ అలెగ్జాండర్ జ్వెరెవ్ VxS స్టెఫనోస్ సిట్సిపాస్ నొవాక్ జొకోవిచ్ VxS రాఫెల్ నాదల్ సా.6.20నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
French Open: ఔరా నాదల్
పారిస్: ‘మట్టి కోర్టు మహారాజుకు ఓటమి తప్పదా..!’ డియాగో ష్వార్ట్‌జ్‌మన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ రెండో సెట్లో రాఫెల్ నాదల్ (స్పెయిన్) ఆటతీరు చూసిన ప్రతి ఒక్కరి మదిలో మెదిలిన ఆలోచన ఇది. టోర్నీలో తన వరుస 36 సెట్ల విజయాలకు బ్రేక్ వేసిన ష్వార్జ్జ్మన్ దూకుడును తన సమయోచిత ఆటతో అడ్డుకున్న నాదల్ ఔరా అనిపించాడు. సుదీర్ఘ ర్యాలీల్లో పాయింట్లను కోల్పోతున్న వేళ... తన ఆటతీరును మార్చుకున్న నాదల్ వరుస పాయింట్లతో చెలరేగి ఫ్రెంచ్ ఓపెన్‌లో 14వసారి సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో నాదల్ 6–3, 4–6, 6–4, 6–0తో ష్వార్ట్జ్మన్పై అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. 2 గంటలా 45 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో నాదల్, ష్వార్ట్‌జ్‌మన్ ప్రతి పాయింట్ కోసం కూడా తీవ్రంగా శ్రమించారు. తొలి సెట్లో ఇద్దరు కూడా హోరాహోరీగా ఆడారు. అయితే ఎనిమిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్... ఆ తర్వాతి గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్లో ష్వార్ట్‌జ్‌మన్ అద్భుతంగా ఆడాడు. తొలి మూడు గేమ్‌లను సొంతం చేసుకుని 3–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం నాదల్ పుంజుకుని వరుసగా మూడు గేమ్‌ల్లో గెలవడంతో స్కోరు 3–3తో సమమైంది. 5–4తో ష్వార్ట్‌జ్‌మన్ ఆధిక్యంలో ఉండగా సర్వీస్‌కు వచ్చిన నాదల్... ఒక దశలో 30–0తో ముందంజ వేశాడు. అయితే ఒక డబుల్ ఫాల్ట్, మూడు అనవసర తప్పిదాలు చేసి గేమ్‌తో పాటు సెట్‌ను కోల్పోయాడు. మూడో సెట్లో కూడా ఇరువురు ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. రెండో సెట్లో తన సర్వీస్‌తో ఇబ్బంది పడ్డ నాదల్... మూడో సెట్లో దానిని సరి చేసుకున్నాడు. అంతే కాకుండా సుదీర్ఘ ర్యాలీలకు పోకుండా... మూడు, నాలుగు షాట్లలోనే పాయింట్లను సాధించేలా తన గేమ్‌ను చేంజ్ చేసుకున్నాడు. 9వ గేమ్‌లో ష్వార్ట్‌జ్‌మన్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ ఆ తర్వాతి గేమ్‌ను గెలిచి సెట్‌ను 6–4తో సొంతం చేసుకున్నాడు. ఇక ఏకపక్షంగా సాగిన నాలుగో సెట్లో నాదల్ కసితీరా విరుచుకు పడ్డాడు. ప్రత్యర్థి పుంజుకునేందుకు ఎటుంటి అవకాశం ఇవ్వకుండా ఆరు గేమ్‌లు కూడా గెలుచుకున్నాడు. మ్యాచ్‌లో నాదల్ ఆరు ఏస్‌లు సంధించి మూడు డబుల్ ఫాల్ట్‌లు చేయగా... ష్వార్ట్‌జ్‌మన్ మూడు ఏస్‌లు కొట్టి మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. స్వియాటెక్‌కు చుక్కెదురు... మహిళల సింగిల్స్‌లో బుధవారం సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో గ్రీస్ క్రీడాకారిణి మరియా సాకరి చేతిలో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) అనూహ్యంగా ఓటమిపాలైంది. క్వార్టర్‌ఫైనల్ పోరులో సాకరి 6–4, 6–4తో ఎనిమిదో సీడ్ స్వియాటెక్‌పై అలవోక విజయం సాధించింది. మరో క్వార్టర్స్‌లో చెక్ రిపబ్లిక్ భామ బార్బొరా క్రిచికోవా 7–6 (8/6), 6–3తో అమెరికా టీనేజర్ కోకో గాఫ్‌పై నెగ్గింది. దాంతో గతంలో ఎన్నడూ గ్రాండ్‌స్లామ్‌లో టోర్నీలో ఒక్కసారి కూడా సెమీస్ చేరని నలుగురు ఇప్పుడు తొలిసారి సెమీ ఫైనల్లో అడుగు పెట్టినట్లయింది. ఇప్పటికే పావ్లుచెంకోవా (రష్యా), జిదాన్సెక్ (స్లొవేనియా)లు సెమీస్‌కు అర్హత సాధించారు. సెమీస్‌లో సిట్సిపాస్... వరుసగా రెండో ఏడాది గ్రీస్ ఆటగాడు స్టెఫానోస్ సిట్సిపాస్ ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సిట్సిపాస్ 6–3, 7–6 (7/3), 7–5తో రెండో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)ను ఓడించి సెమీస్ చేరుకున్నాడు. -
French Open: వీరోచిత పోరాటంతో...
ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్ మెట్టుపై బోల్తా పడిన రష్యా సీనియర్ ప్లేయర్ పావ్లుచెంకోవా... గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఏనాడూ రెండో రౌండ్ దాటి ఎరుగని స్లొవేనియా అమ్మాయి తామర జిదాన్సెక్... అసమాన ఆటతీరును ప్రదర్శంచి తమ కలను నిజం చేసుకున్నారు. తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో జిదాన్సెక్ 2 గంటల 26 నిమిషాల్లో పౌలా బదోసపై... పావ్లుచెంకోవా 2 గంటల 33 నిమిషాల్లో ఇలెనా రిబాకినాపై పైచేయి సాధించి గురువారం జరిగే సెమీఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యారు. పారిస్: ఒకవైపు అపార అనుభవజ్ఞురాలు... మరోవైపు అంతగా అనుభవంలేని అమ్మాయి... ఒకేరోజు తమ కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. తుదికంటా పోరాడితే అనుకున్న ఫలితం తప్పకుండా వస్తుందని నిరూపించారు. ఆ ఇద్దరే అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా), తామర జిదాన్సెక్ (స్లొవేనియా). ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ విభాగంలో మంగళవారం ఈ ఇద్దరూ కళ్లు చెదిరే ఆటతో అందరి మనసులు గెల్చుకున్నారు. 31వ సీడ్, పావ్లుచెంకోవా 6–7 (2/7), 6–2, 9–7తో 21వ సీడ్ ఇలెనా రిబాకినా (కజకిస్తాన్)పై... అన్‌సీడెడ్ జిదాన్సెక్ 7–5, 4–6, 8–6తో 33వ సీడ్ పౌలా బదోస (స్పెయిన్)పై విజయం సాధించి సెమీఫైనల్ చేరుకున్నారు. వీరిద్దరి కెరీర్లో ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ కావడం విశేషం. పావ్లుచెంకోవా గతంలో ఆరుసార్లు క్వార్టర్ ఫైనల్ మెట్టుపై బోల్తా పడి ఏడో ప్రయత్నంలో ఈ అడ్డంకిని అధిగమించింది. నేడు జరిగే మరో రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో అమెరికా టీనేజర్ కోకో గాఫ్‌తో క్రిచికోవా (చెక్ రిపబ్లిక్); డిఫెండింగ్ చాంపియన్ స్వియాటెక్ (పోలాండ్)తో మరియా సాకరి (గ్రీస్) తలపడతారు. సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 6–3, 6–4తో మార్టా కోస్టుక్ (ఉక్రెయిన్)పై గెలిచింది. బ్రేక్ పాయింట్లు కాపాడుకొని... బదోసతో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 85వ ర్యాంకర్ జిదాన్సెక్ కీలకదశలో అద్భుతంగా ఆడి ఫలితాన్ని తనవైపునకు తిప్పుకుంది. తొలి సెట్లో ఒకదశలో 0–3తో వెనుకబడి ఆ తర్వాత పుంజుకొని సెట్‌ను నెగ్గిన జిదాన్సెక్ రెండో సెట్లో 4–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో ఆమె అనూహ్యంగా తడబడి బదోసాకు వరుసగా నాలుగు గేమ్‌లు కోల్పోయి సెట్‌ను సమర్పించుకుంది. నిర్ణాయక మూడో సెట్లో స్కోరు 6–6 వద్ద తన సర్వీస్‌లో 15–40తో రెండు బ్రేక్ పాయింట్లు కాచుకున్న జిదాన్సెక్ వరుసగా రెండు కళ్లు చెదిరే ఫోర్‌హ్యాండ్ షాట్లతో 40–40తో ‘డ్యూస్’ చేసింది. ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 7–6తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం బదోస సర్వీస్‌ను కూడా బ్రేక్ చేసి జిదాన్సెక్ సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ లో సెమీఫైనల్ చేరిన తొలి స్లొవేనియా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. మ్యాచ్ మొత్తంలో నెట్ వద్దకు తొమ్మిదిసార్లు దూసుకొచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు నెగ్గిన జిదాన్సెక్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసింది. అనుభవం కలిసొచ్చింది... రిబాకినాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో పావ్లుచెంకోవా నెమ్మదిగా మ్యాచ్‌పై పట్టు సంపాదించింది. తొలి సెట్లో 1–4తో వెనుకబడినా... ఆ తర్వాత తేరుకొని స్కోరును 6–6తో సమం చేసింది. అయితే టైబ్రేక్‌లో రిబాకినా పైచేయి సాధించింది. రెండో సెట్లో పావ్లుచెంకోవా ఆరో గేమ్‌లో, ఎనిమిదో గేమ్‌లో రిబాకినా సర్వీస్‌ను బ్రేక్ చేసి 6–2తో సెట్‌ను దక్కించుకుంది. కెరీర్లో ఆడిన ఏడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో మూడో రౌండ్ దాటి ఎరుగని రిబాకినా... 51 గ్రాండ్‌స్లామ్ టోర్నీ లు ఆడిన అనుభవమున్న పావ్లుచెంకోవా ప్రతి పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. చివరకు అనుభవజ్ఞురాలైన పావ్లుచెంకోవా తన ఆధిపత్యాన్ని చాటుకొని విజయాన్ని దక్కించుకుంది. జ్వెరెవ్ తొలిసారి సెమీస్‌లో... పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–1, 6–1తో ఫోకినా (స్పెయిన్)పై నెగ్గి తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరాడు. -
French Open: సోఫియాకు షాక్...
పారిస్: ఈసారి సీడెడ్ క్రీడాకారిణులకు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ కలసి రావడంలేదు. తాజాగా మహిళల సింగిల్స్‌లో గత ఏడాది రన్నరప్, నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) కూడా ఇంటిముఖం పట్టింది. దాంతో క్వార్టర్ ఫైనల్ బరిలో టాప్–20లో కేవలం ఇద్దరు మాత్రమే బరిలో మిగిలారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ మరియా సాకరి (గ్రీస్) 6–1, 6–3తో ప్రపంచ ఐదో ర్యాంకర్ సోఫియా కెనిన్‌పై సంచలన విజయం సాధించింది. ఈ గెలుపుతో సాకరి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. అంతేకాకుండా ఈ ఘనత సాధించిన తొలి గ్రీస్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 68 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకరి నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు కెనిన్ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన సోఫియా కెనిన్ ఏకంగా తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు, 32 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. 53 నిమిషాల్లోనే... మరోవైపు అమెరికా టీనేజ్ స్టార్ కోకో గాఫ్ కూడా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. 17 ఏళ్ల గాఫ్ కేవలం 53 నిమిషాల్లో 6–3, 6–1తో 25వ సీడ్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా)ను చిత్తుగా ఓడించింది. తద్వారా 2006 తర్వాత (నికోల్ వైదిసోవా; చెక్ రిపబ్లిక్–ఫ్రెంచ్ ఓపెన్) ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్స్ చేరిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. జబర్‌తో మ్యాచ్‌లో గాఫ్ నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. తన సర్వీస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–0తో 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్, 2018 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచి తన కెరీర్లో తొలి సారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో గాఫ్‌తో క్రిచికోవా ఆడుతుంది. నాదల్ 15వసారి... మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 15వ సారి ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో నాదల్ 7–5, 6–3, 6–0తో జానిక్ సినెర్ (ఇటలీ)పై గెలుపొందాడు. రెండు గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ నాలుగు ఏస్‌లు సంధించాడు. తన ప్రత్యర్థి సర్వీస్‌ను తొమ్మిదిసార్లు బ్రేక్ చేశాడు. 13 సార్లు నెట్‌వద్దకు వచ్చి 12 సార్లు పాయింట్లు గెలిచాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో బెరెటిని (ఇటలీ)తో జొకోవిచ్; ష్వార్ట్‌జ్‌మన్‌తో నాదల్; జ్వెరెవ్‌తో ఫొకినా; ఐదో సీడ్ సిట్సిపాస్‌తో రెండో సీడ్ మెద్వెదెవ్ తలపడతారు. గట్టెక్కిన జొకోవిచ్... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) 15వసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న 19 ఏళ్ల ఇటలీ టీనేజర్ లొరెంజో ముజెత్తితో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–7 (7/9), 6–7 (2/7), 6–1, 6–0, 4–0తో విజయం సాధించాడు. 3 గంటల 27 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ తొలి రెండు సెట్లను కోల్పోయాడు. ఆ తర్వాత అతను అనూహ్యంగా తేరుకొని వరుసగా రెండు సెట్లు గెలిచాడు. నిర్ణాయక చివరి సెట్లో సెర్బియా స్టార్ 4–0తో ఆధిక్యంలో ఉన్న దశలో లొరెంజో వెన్నునొప్పితో మ్యాచ్ నుంచి వైదొలి గాడు. దాంతో జొకోవిచ్ విజయం ఖాయైమంది. తొలి రెండు సెట్లు కోల్పోయాక గ్రాండ్‌స్లామ్ టోర్నీ మ్యాచ్‌లో జొకోవిచ్ గెలుపొందడం ఇది ఐదో సారి మాత్రమే. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–1, 6–1 తో నిషికోరి (జపాన్)పై... ఫొకినా (స్పెయిన్) 6–4, 6–4, 4–6, 6–4తో డెల్బోనిస్ (అర్జెంటీనా)పై... పదో సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 7–6 (11/9), 6–4, 7–5తో లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. -
French Open: వైదొలిగిన ఫెడరర్
వింబుల్డన్ టోర్నమెంట్‌కు ముందు పూర్తి ఫిట్నెస్తో ఉండాలనే ఉద్దేశంతో... స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి మధ్యలోనే వైదొలిగాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో ఫెడరర్ 3 గంటల 35 నిమిషాల్లో 7–6 (7/5), 6–7 (3/7), 7–6 (7/4), 7–5తో ప్రపంచ 59వ ర్యాంకర్ డొమినిక్ కోప్ఫెర్ (జర్మనీ)పై కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.‘నా సహాయక సిబ్బందితో చర్చించాక ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాను. గతేడాది మోకాలికి రెండు శస్త్ర చికిత్సలు జరిగాయి. పూర్తి ఫిట్నెస్ సంతరించుకునే క్రమం లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడు మ్యాచ్‌లు గెలిచి ఫిట్నెస్ పరంగా నేను సరైన దారిలో వెళ్తున్నట్లునిపిస్తోంది’ అని 39 ఏళ్ల ఫెడరర్ అన్నాడు. గ్రాస్‌కోర్టు సీజన్లో భాగంగా ఈనెల 14న మొదలయ్యే హాలే ఓపెన్‌లో ఫెడరర్ ఆడతాడు. అనంతరం ఈనెల 28న ప్రారంభమయ్యే వింబుల్డన్ టోర్నీలో తొమ్మిదో టైటిలే లక్ష్యంగా ఫెడరర్ బరిలోకి దిగుతాడు. -
French Open 2021: టోర్నీ క్వార్టర్ ఫైనల్లో జిదాన్సెక్, బదోస, రిబాకినా
అందరి అంచనాలను తారుమారు చేస్తూ... తమ అద్భుత ఆటతీరుతో అదరగొడుతూ... తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ప్రత్యర్థులను చిత్తు చేస్తూ... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అంతర్జాతీయ టెన్నిస్‌లో అంతగా పేరొందని ముగ్గురు క్రీడాకారిణులు తామర జిదాన్సెక్, పౌలా బదోస, ఇలెనా రిబాకినా ఫ్రెంచ్ ఓపెన్‌లో ఘన విజయాలతో తమ కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకోగా... 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురిపెట్టిన అమెరికా దిగ్గజం సెరెనా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనాల పర్వం కొనసాగుతోంది. టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్న అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్), 2019 రన్నరప్ మర్కెత వొంద్రుసొవా (చెక్ రిపబ్లిక్) ప్రిక్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయారు. మరోవైపు ప్రపంచ 85వ ర్యాంకర్ తామర జిదాన్సెక్ (స్లొవేనియా)... ప్రపంచ 35వ ర్యాంకర్ పౌలా బదోస (స్పెయిన్)... ప్రపంచ 22వ ర్యాంకర్ ఇలెనా రిబాకినా (కజకిస్తాన్) తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... పదేళ్ల తర్వాత ప్రపంచ 32వ ర్యాంకర్ అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా) ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఆదివారం జరిగిన నాలుగు ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఊహించని ఫలితాలు వచ్చాయి. ఇలెనా రిబాకినా 6–3, 7–5తో అమెరికా స్టార్, ఏడో సీడ్ సెరెనా విలియమ్స్‌ను బోల్తా కొట్టించగా... పౌలా బదోస 6–4, 3–6, 6–2తో 20వ సీడ్, 2019 రన్నరప్ వొంద్రుసొవను ఇంటిముఖం పట్టించింది. తామర జిదాన్సెక్ 7–6 (7/4), 6–1తో 54వ ర్యాంకర్ సొరానా కిర్‌స్టియా (రొమేనియా)పై గెలుపొంది ఏదైనా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన తొలి స్లొవేనియా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. మరో మ్యాచ్‌లో 31వ సీడ్ పావ్లుచెంకోవా 5–7, 6–3, 6–2తో 15వ సీడ్, రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన అజరెంకాను ఓడించింది. సెరెనాతో 77 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రిబాకినా తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్‌వద్దకు ఏడుసార్లు దూసుకొచ్చి ఆరుసార్లు పాయింట్లు సాధించింది. మెద్వెదేవ్ మొదటిసారి... పురుషుల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో మెద్వెదేవ్ (రష్యా) 6–2, 6–1, 7–5తో 22వ సీడ్ గారిన్ (చిలీ)పై గెలిచి తొలిసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6–3, 6–2, 7–5తో 12వ సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్)పై నెగ్గాడు. క్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో మార్సెలో అరెవాలో (ఎల్‌సాల్వడార్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ నుంచి రోహన్ బోపన్న (భారత్)–స్కుగోర్ (క్రొయేషియా) జంటకు వాకోవర్ లభించింది. దాంతో బోపన్న జంట క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. -
French Open 2021: స్వితోలినా ఇంటిముఖం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్–10 సీడెడ్ క్రీడాకారిణుల పరాజయపర్వం కొనసాగుతోంది. ఇప్పటికే టాప్–10లోని ఆరుగురు క్రీడాకారిణులు ఇంటిదారి పట్టగా... వారి సరసన తాజాగా ఐదో సీడ్ ప్లేయర్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) చేరింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 33వ ర్యాంకర్ బర్బొరా క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–2తో స్వితోలినాను ఓడించి వరుసగా రెండో ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో క్రిచికోవా నెట్‌వద్దకు 18 సార్లు దూసుకొచ్చి 14 సార్లు పాయింట్లు సాధించగా... స్వితోలినా సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 7–6 (7/4), 6–0తో కొంటావీట్ (ఎస్తోనియా)పై, నాలుగో సీడ్ సోఫియా (అమెరికా) 4–6, 6–4, 6–1తో పెగూలా (అమెరికా)పై, స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6–3, 7–5తో 18వ సీడ్ ముకోవా (చెక్ రిపబ్లిక్)పై, 17వ సీడ్ సాకరి (గ్రీస్) 7–5, 6–7 (2/7), 6–2తో 14వ సీడ్ మెర్టెన్స్ (బెల్జియం) నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరారు. వరుసగా 12వ ఏడాది... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) వరుసగా 12వ ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన మూడో రౌండ్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6–1, 6–4, 6–1తో బెరాన్కిస్ (లిథువేనియా)పై గెలిచాడు. డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), పదో సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో నాదల్ 6–3, 6–3, 6–3తో కామరూన్ నోరి (బ్రిటన్)పై, సిట్సిపాస్ 5–7, 6–3, 7–6 (7/3), 6–1తో ఇస్నెర్ (అమెరికా)పై, ష్వార్ట్‌జ్‌మన్ 6–4, 6–2, 6–1తో ఫిలిప్ కోల్‌ష్రైబర్ (జర్మనీ)పై విజయం సాధించారు.