పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించాడు. అయితే శుక్రవారం పురుషుల, మహిళల విభాగాల్లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. అమెరికన్ అమ్మాయి మూడో సీడ్ జెస్సికా పెగులా ఆట మూడో రౌండ్లోనే ముగిసింది. పురుషుల ఈవెంట్‌లో రష్యన్ ప్లేయర్, ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్‌పై అన్‌సీడెడ్ సొనెగో అద్భుత విజయం సాధించాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ జొకోవిచ్ మూడో రౌండ్లో వరు స సెట్లలో గెలుపొందాడు.
కానీ స్పెయిన్ ఆటగాడు డెవిడోవిచ్ ఫొకినా ప్రతీ సెట్‌లోనూ గట్టి పోటీ ఇచ్చాడు. దీంతో తొలి రెండు సెట్లు కైవసం చేసుకునేందుకు జొకోవిచ్ టైబ్రేక్ ఆడక తప్పలేదు. 3 గంటల 36 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో చివరకు జొకోవిచ్ 7–6 (7/4), 7–6 (7/5), 6–2 స్కోరుతో 29వ సీడ్ ఫొకినాపై గెలిచాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా ) 7–5, 6–0, 3–6, 6–7 (5/7), 3–6తో లొరెంజొ సొనెగొ (ఇటలీ) చేతిలో కంగుతిన్నాడు. సొనెగొకు తన కెరీర్‌లో టాప్–10 ప్లేయర్‌ను ఓడించడం ఇది ఆరోసారి! ఇటలీకి చెందిన ప్రపంచ 48వ ర్యాంకర్ సొనెగొ ప్రిక్వార్టర్ ఫైనల్లో 11వ సీడ్ కరెన్ ఖచనొవ్ (రష్యా)తో తలపడతాడు. మూడో రౌండ్లో ఖచనొవ్ 6–4 6–1, 3–6, 7–6 (7/5)తో కొక్కినకిస్
(ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు.
సబలెంక అలవోకగా...
మహిళల సింగిల్స్‌లో బెలారస్ స్టార్ సబలెంక అలవోక విజయంతో ప్రిక్వార్టర్స్ చేరింది. మూడో రౌండ్‌లో రెండో సీడ్ సబలెంక 6–2, 6–2తో కమిల్లా రఖిమొవ (రష్యా)పై విజయం సాధించింది. జెస్సికా పెగులా (అమెరికా) 1–6, 3–6తో 28వ సీడ్ ఎలైస్ మెర్టెన్స్ (బెల్జియం) చేతిలో చిత్తుగా ఓడింది. తొమ్మిదో సీడ్ డారియా కసత్కినా (రష్యా) 6–0, 6–1తో పెటన్ స్టియర్స్ (అమెరికా)పై, ఎలినా స్వితొలినా (ఉక్రెయిన్) 2–6, 6–2, 7–5తో అన్నా బ్లింకొవా (రష్యా)పై గెలుపొందగా... పవ్‌ల్యుచెంకొవా (రష్యా) 4–6, 6–3, 6–0తో 24వ సీడ్ పొటపొవా (రష్యా)కు షాకిచ్చింది. పురుషుల డబుల్స్‌లో భారత్ పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ జోడీ 4–6, 5–7తో తొమ్మిదో సీడ్ గొంజాలెజ్ (మెక్సికో)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్)
జంట చేతిలో పరాజయం చవిచూసింది.
Comments
Please login to add a commentAdd a comment