women singles
-
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత స్వియాటెక్
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా వరల్డ్ నెంబర్ వన్.. పోలాండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి కరోలినా ముకోవాపై 6-2,5-7,6-4తో గెలుపొందింది. 2 గంటల 46 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను ఇగా స్వియాటెక్ 6-2తో పెద్దగా కష్టపడకుండానే సొంతం చేసుకుంది. అయితే రెండోసెట్లో ఫుంజుకున్న కరోలినా ముకోవా స్వియాటెక్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 7-5తో సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక కీలకమైన మూడో సెట్లో తన అనుభవాన్నంతా రంగరించిన స్వియాటెక్ కరోలినాకు అవకాశం ఇవ్వకుండా 6-4తో సెట్ గెలవడంతో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గడం ఇది మూడోసారి. 2020, 2022లో విజేతగా అవతరించిన స్వియాటెక్.. 2023లోనే విజేతగా నిలిచి హ్యాట్రిక్ ఫ్రెంచ్ఓపెన్ను కైవసం చేసుకుంది. గత నాలుగేళ్లలో రోలాండ్ గారోస్ టైటిల్‌ను మూడుసార్లు నెగ్గిన క్రీడాకారిణిగా స్వియాటెక్ చరిత్ర సృష్ఠించింది. THAT MOMENT 🥹🇵🇱#RolandGarros #Paris @iga_swiatek @WTA pic.twitter.com/Dy0NnNLOZD — Roland-Garros (@rolandgarros) June 10, 2023 Hat's off, champ 🤭#RolandGarros | @iga_swiatek pic.twitter.com/Iw49NVgC9K — Roland-Garros (@rolandgarros) June 10, 2023 చదవండి: 'చీటింగ్ అనే పదం వాళ్ల బ్లడ్‌లోనే ఉంది!' -
French Open 2023: 55 ఏళ్ల తర్వాత...
పారిస్: బ్రెజిల్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 55 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ఆ దేశ క్రీడాకారిణికి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో బ్రెజిల్‌కు చెందిన బీత్రిజ్ హదాద్ మాయ క్వార్టర్ ఫైనల్ చేరింది. టెన్నిస్‌లో ఓపెన్ శకం (1968లో) మొదలయ్యాక దివంగత మరియా బ్యూనో చివరిసారి బ్రెజిల్ తరఫున గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్ చేరింది. 1968లో మరియా బ్యూనో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్‌కు... యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరింది. మరియా బ్యూనో ఐదు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గినా ఆ విజయాలన్నీ ఓపెన్ శకంకంటే ముందు వచ్చాయి. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ బీత్రిజ్ 3 గంటల 51 నిమిషాల్లో 6–7 (3/7), 6–3, 7–5తో సారా సొరిబెస్ టోర్మో (స్పెయిన్)పై విజయం సాధించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యునీషియా) 6–3, 6–1తో బెర్నార్డా పెరా (అమెరికా)పై, అమెరికా టీనేజర్ కోకో గాఫ్ 7–5, 6–2తో షిమెద్లోవా (స్లొవేకియా)పై, రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 7–6 (7/5), 6–4తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరారు. పురుషుల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఆరో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) క్వార్టర్ ఫైనల్లోకి చేరారు. -
ప్రిక్వార్టర్స్‌లో సబలెంక, జొకోవిచ్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించాడు. అయితే శుక్రవారం పురుషుల, మహిళల విభాగాల్లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. అమెరికన్ అమ్మాయి మూడో సీడ్ జెస్సికా పెగులా ఆట మూడో రౌండ్లోనే ముగిసింది. పురుషుల ఈవెంట్లో రష్యన్ ప్లేయర్, ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్‌పై అన్‌సీడెడ్ సొనెగో అద్భుత విజయం సాధించాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ జొకోవిచ్ మూడో రౌండ్లో వరు స సెట్లలో గెలుపొందాడు. కానీ స్పెయిన్ ఆటగాడు డెవిడోవిచ్ ఫొకినా ప్రతీ సెట్లోనూ గట్టి పోటీ ఇచ్చాడు. దీంతో తొలి రెండు సెట్లు కైవసం చేసుకునేందుకు జొకోవిచ్ టైబ్రేక్ ఆడక తప్పలేదు. 3 గంటల 36 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో చివరకు జొకోవిచ్ 7–6 (7/4), 7–6 (7/5), 6–2 స్కోరుతో 29వ సీడ్ ఫొకినాపై గెలిచాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా ) 7–5, 6–0, 3–6, 6–7 (5/7), 3–6తో లొరెంజొ సొనెగొ (ఇటలీ) చేతిలో కంగుతిన్నాడు. సొనెగొకు తన కెరీర్లో టాప్–10 ప్లేయర్‌ను ఓడించడం ఇది ఆరోసారి! ఇటలీకి చెందిన ప్రపంచ 48వ ర్యాంకర్ సొనెగొ ప్రిక్వార్టర్ ఫైనల్లో 11వ సీడ్ కరెన్ ఖచనొవ్ (రష్యా)తో తలపడతాడు. మూడో రౌండ్లో ఖచనొవ్ 6–4 6–1, 3–6, 7–6 (7/5)తో కొక్కినకిస్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు. సబలెంక అలవోకగా... మహిళల సింగిల్స్‌లో బెలారస్ స్టార్ సబలెంక అలవోక విజయంతో ప్రిక్వార్టర్స్ చేరింది. మూడో రౌండ్లో రెండో సీడ్ సబలెంక 6–2, 6–2తో కమిల్లా రఖిమొవ (రష్యా)పై విజయం సాధించింది. జెస్సికా పెగులా (అమెరికా) 1–6, 3–6తో 28వ సీడ్ ఎలైస్ మెర్టెన్స్ (బెల్జియం) చేతిలో చిత్తుగా ఓడింది. తొమ్మిదో సీడ్ డారియా కసత్కినా (రష్యా) 6–0, 6–1తో పెటన్ స్టియర్స్ (అమెరికా)పై, ఎలినా స్వితొలినా (ఉక్రెయిన్) 2–6, 6–2, 7–5తో అన్నా బ్లింకొవా (రష్యా)పై గెలుపొందగా... పవ్ల్యుచెంకొవా (రష్యా) 4–6, 6–3, 6–0తో 24వ సీడ్ పొటపొవా (రష్యా)కు షాకిచ్చింది. పురుషుల డబుల్స్‌లో భారత్ పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ జోడీ 4–6, 5–7తో తొమ్మిదో సీడ్ గొంజాలెజ్ (మెక్సికో)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంట చేతిలో పరాజయం చవిచూసింది. -
Malaysia Open 2022: సింధుకు మళ్లీ నిరాశ
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ సూపర్–750 టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 21–13, 15–21, 15–21తో రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. తై జు చేతిలో సింధుకిది 16వ ఓటమి. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 18–21, 16–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశాడు. సింధు, ప్రణయ్‌లకు 3,712 డాలర్ల (రూ. 2 లక్షల 93 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనాల మోత
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాలుగో రోజు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్స్‌గా భావించిన మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్), యూఎస్ ఓపెన్ చాంపియన్, బ్రిటన్ టీనేజర్ ఎమ్మా రాడుకాను, ఆరో సీడ్ అనెట్ కొంటావీట్ (ఎస్తోనియా) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, మూడో ర్యాంకర్ ముగురుజా 3–6, 3–6తో 61వ ర్యాంకర్ అలిజె కార్నె (ఫ్రాన్స్) చేతిలో... 17వ సీడ్ రాడుకాను 4–6, 6–4, 3–6తో 98వ ర్యాంకర్ డాంకా కొవినిచ్ (మోంటెనిగ్రో) చేతిలో... కొంటావీట్ 2–6, 4–6తో 39వ ర్యాంకర్ క్లారా టౌసన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయారు. అలిజె కార్నెతో జరిగిన మ్యాచ్‌లో 2016 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, 2017 వింబుల్డన్ టోర్నీ విజేత అయిన ముగురుజా 33 అనవసర తప్పిదాలు చేయడంతోపాటు తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. గత ఏడాది యూఎస్ ఓపెన్‌లో క్వాలిఫయర్ హోదాలో బరిలోకి దిగి ఏకంగా టైటిల్‌ను సాధించి పెను సంచలనం సృష్టించిన బ్రిటన్ టీనేజర్ రాడుకాను ఇక్కడ మాత్రం అద్భుతం చేయలేకపోయింది. కొవినిచ్తో 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రాడుకాను నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 39 అనవసర తప్పిదాలు చేసింది. కొవినిచ్ సర్వీస్‌లో 15 సార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలు వస్తే రాడుకాను ఆరుసార్లు సద్వినియోగం చేసుకుంది. తన సర్వీస్‌ను ఏడుసార్లు చేజార్చుకుంది. ఈ గెలుపుతో కొవినిచ్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో మూడో రౌండ్‌కు చేరిన తొలి మోంటెనిగ్రో ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. మరోవైపు రెండో సీడ్ సబలెంకా (బెలారస్), 14వ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), ఏడో సీడ్ స్వియాటెక్ (పోలాండ్) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. సబలెంకా 1–6, 6–4, 6–2తో జిన్యు వాంగ్ (చైనా)పై, హలెప్ 6–2, 6–0తో బీట్రిజ్ (బ్రెజిల్)పై, స్వియాటెక్ 6–2, 6–2తో రెబెకా పీటర్సన్ (స్వీడన్)పై గెలిచారు. మెద్వెదెవ్ కష్టపడి... పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) కష్టపడి మూడో రౌండ్లోకి చేరుకున్నారు. మెద్వెదెవ్ 2 గంటల 58 నిమిషాల్లో 7–6 (7/1), 4–6, 6–4, 6–2తో నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)పై నెగ్గగా... సిట్సిపాస్ 3 గంటల 22 నిమిషాల్లో 7–6 (7/1), 6–7 (5/7), 6–3, 6–4తో సెబాస్టియన్ బేజ్ (అర్జెంటీనా)ను ఓడించాడు. ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–4, 6–2, 6–0తో బెరాన్కిస్ (లిథువేనియా)పై, తొమ్మిదో సీడ్ ఫిలిక్స్ అలియాసిమ్ (కెనడా) 4 గంటల 19 నిమిషాల్లో 7–6 (7/4), 6–7 (4/7), 7–6 (7/5), 7–6 (7/4)తో ఫోకినా (స్పెయిన్)పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. మరోవైపు ఐదుసార్లు రన్నరప్ ఆండీ ముర్రే (బ్రిటన్) 4–6, 4–6, 4–6తో టారో డానియల్ (జపాన్) చేతిలో... 13వ సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 6–7 (6/8), 4–6, 4–6తో క్రిస్టోఫర్ ఒకానెల్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయారు. -
సింధు, శ్రీకాంత్ ముందుకు...
హుఎల్వా (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్ వేటను భారత స్టార్ పీవీ సింధు విజయంతో ప్రారంభించింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన ఈ తెలుగు తేజం మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 21–7, 21–9తో మార్టినా రెపిస్కా (స్లొవేకియా)పై అలవోకగా గెలిచింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సింధు కేవలం 24 నిమిషాల్లోనే తన ప్రత్యర్థి కథను ముగించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 72వ ర్యాంక్‌లో ఉన్న రెపిస్కా కేవలం 16 పాయింట్లు మాత్రమే సాధించింది. తొలి గేమ్‌లో స్కోరు 5–4 వద్ద సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా 12 పాయింట్లు గెలిచి 17–4తో ఆధిక్యంలోకి దూసుకుపోయింది. రెండో గేమ్‌లోనూ ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు తన జోరు కొనసాగించింది. వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 6–0తో ముందంజ వేసిన సింధు అటునుంచి వెనుదిరిగి చూడలేదు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ చోచువోంగ్ (థాయ్ లాండ్)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 4–3తో ఆధిక్యంలో ఉంది. చెమటోడ్చి... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, భారత యువతార లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో చోటు సంపాదించారు. రెండో రౌండ్ అడ్డంకిని దాటడానికి వీరిద్దరూ తీవ్రంగా శ్రమించారు. ప్రపంచ 63వ ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో 14వ ర్యాంకర్ శ్రీకాంత్ 15–21, 21–18, 21–17తో గెలుపొందాడు. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ తొలి గేమ్‌ను కోల్పోయి రెండో గేమ్‌లో ఒకదశలో 6–9తో వెనుకంజలో ఉన్నాడు. ఈ దశలో శ్రీకాంత్ చెలరేగి వరుసగా 10 పాయింట్లు గెలిచి 16–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. అదే ఉత్సాహంలో శ్రీకాంత్ రెండో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ 10–13తో వెనుకబడిన దశలో మళ్లీ విజృంభించాడు. వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 16–13తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని గట్టెక్కాడు. 82 నిమిషాల్లో... ప్రపంచ 17వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ 22–20, 15–21, 21–18తో విజయం సాధించాడు. 82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా పోరాడారు. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 10–10 వద్ద లక్ష్య సేన్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 13–10తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత చివరి వరకు ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని లక్ష్య సేన్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో లూ గ్వాంగ్ జు (ౖచైనా)తో శ్రీకాంత్; కెవిన్ కార్డన్ (గ్వాటెమాలా)తో లక్ష్య సేన్ తలపడతారు. ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ జంట సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన సాత్విక్–చిరాగ్ ద్వయం 43 నిమిషాల్లో 27–25, 21–17తో లీ జె హుయ్–యాంగ్ పో సువాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో అనుష్క పారిఖ్–సౌరభ్ శర్మ (భారత్) ద్వయం 8–21, 18–21తో తాన్ కియాన్ మెంగ్–లాయ్ పె జింగ్ (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలైంది. -
బ్యాడ్మింటన్ సింగిల్స్ విజేత చెన్ యూ ఫెయ్
టోక్యో: ఒలింపిక్స్‌లో చైనా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి చెన్ యూ ఫెయ్ పసిడితో మెరిసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్లో చెన్ యూ ఫెయ్ 21-18, 19-21, 21-18 తేడాతో చైనీస్ తైపీ ప్లేయర్ తై జూ-యింగ్‌పై గెలిచి స్వర్ణాన్ని ముద్దాడింది. హోరాహోరీగా సాగిన పోరులో చెన్ యూ ఫెయ్ విజేతగా నిలిచింది. ఫలితంగా తొలిసారి స్వర్ణాన్ని గెలవాలనుకున్న తై జూ యింగ్ రజతంతో సరిపెట్టుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో భాగంగా తొలి గేమ్‌ను గెలిచిన చెన్ యూ ఫెయ్.. ఆపై రెండో గేమ్‌లో ఓటమి పాలైంది. ఇరువురి మధ్య తొలి రెండు గేమ్‌లు నువ్వా-నేనా అన్నట్లు సాగగా, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో చెన్ యూ ఫెయ్ ఆధిపత్యం కనబరిచి బంగారు పతకాన్ని గెలుచుకుంది. కాగా, పీవీ సింధు కాంస్యం దక్కించుకున్న సంగతి తెలిసిందే. -
శ్రీజ తీన్మార్
కటక్: సొంతగడ్డపై జరిగిన కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగంలోనూ భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఇంతకుముందు టీమ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణాలు నెగ్గగా... సోమవారం ముగిసిన వ్యక్తిగత విభాగంలో అందుబాటులో ఉన్న ఐదు పసిడి పతకాలను భారత క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. ఈ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మూడు పతకాలు సాధించింది. మహిళల డబుల్స్‌లో మౌసుమి పాల్‌తో జతకట్టి బరిలోకి దిగిన శ్రీజ రజతం సాధించగా... మహిళల సింగిల్స్‌లో సెమీస్‌లో ఓడి ఆమె కాంస్యం సంపాదించింది. ఆదివారం మిక్స్డ్ డబుల్స్ విభాగంలో శ్రీజ–ఆచంట శరత్ కమల్ జోడీ సెమీస్‌లో ఓడి కాంస్యం దక్కించుకుంది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో శ్రీజ 8–11, 9–11, 11–9, 8–11, 12–14తో మధురిక పాట్కర్ (భారత్) చేతిలో ఓడింది. డబుల్స్ ఫైనల్లో శ్రీజ–మౌసుమి పాల్ ద్వయం 9–11, 8–11, 11–9, 10–12తో పూజా సహస్రబుద్దె–కృత్విక సిన్హా రాయ్ (భారత్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల, మహిళల సింగిల్స్ విభాగంలో వరుసగా హర్మీత్ దేశాయ్, అహిక ముఖర్జీ కామన్వెల్త్ చాంపియన్స్‌గా అవతరించారు. ఫైనల్స్‌లో హర్మీత్ 9–11, 6–11, 11–5, 11–8, 17–15, 7–11, 11–9తో సత్యన్ జ్ఞానేశేఖరన్ (భారత్)పై, అహిక 11–6, 11–4, 11–9, 11–7తో మధురిక (భారత్)పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ ఫైనల్లో ఆంథోనీ అమల్‌రాజ్–మానవ్ ఠక్కర్ (భారత్) జంట 8–11, 11–6, 13–11, 12–10తో సత్యన్–శరత్ కమల్ (భారత్) ద్వయంపై గెలిచి టైటిల్ గెలిచింది. ఆదివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సత్యన్–అర్చన కామత్ జంట స్వర్ణం నెగ్గిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా ఈ పోటీల్లో భారత్ అందుబాటులో ఉన్న 7 స్వర్ణాలను సొంతం చేసుకుంది. స్వర్ణాలే కాకుండా భారత క్రీడాకారులు ఐదు రజతాలు, మూడు కాంస్యాలనూ సాధించి 15 పతకాలతో అదరగొట్టారు. 1975లో ఇంగ్లండ్ తర్వాత కామన్వెల్త్ టీటీ చాంపియన్‌షిప్‌లో అన్ని విభాగాల్లో పసిడి పతకాలు నెగ్గిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. -
శ్రీజ తడాఖా
కటక్: స్వదేశంలో జరుగుతున్న కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ అదరగొట్టే ప్రదర్శన చేసింది. మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో సెమీఫైనల్ చేరి కనీసం రెండు కాంస్య పతకాలను ఖాయం చేసుకున్న శ్రీజ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మాత్రం సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. క్వాలిఫయర్ హోదాలో మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన శ్రీజ క్వార్టర్ ఫైనల్లో 11–5, 11–6, 11–9, 17–19, 6–11, 17–15తో సుతీర్థ ముఖర్జీ (భారత్)పై అద్భుత విజయం సాధించింది. అంతకుముందు శ్రీజ తొలి రౌండ్లో 11–6, 11–5, 6–11, 12–10, 11–7తో సాగరిక ముఖర్జీ (భారత్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–11, 15–13, 13–11, 11–3, 11–8తో చార్లోటి క్యారీ (వేల్స్)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో మధురిక పాట్కర్ (భారత్)తో శ్రీజ ఆడుతుంది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీజ–మౌసుమి పాల్ (భారత్) జంట 11–4, 11–8, 7–11, 11–8తో జాంగ్ వాన్ లింగ్–తాన్ లిలిన్ జాసీ (సింగపూర్) జోడీపై విజయం సాధించి సెమీస్‌కు చేరింది. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో శ్రీజ–ఆచంట శరత్ కమల్ (భారత్) జంట 11–13, 11–8, 11–6, 8–11, 4–11తో పాంగ్ యు ఎన్ కొయెన్–గోయ్ రుయ్ జువాన్ (సింగపూర్) జోడీ చేతిలో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది మరోవైపు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత్‌కే చెందిన సత్యన్ జ్ఞానశేఖరన్–అర్చన కామత్ (భారత్) జంట స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో సత్యన్–అర్చన జంట 11–1, 11–7, 11–4తో పాంగ్ యు ఎన్ కొయెన్–గోయ్ రుయ్ జువాన్ (సింగపూర్) జోడీపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో సత్యన్, హర్మీత్ దేశాయ్ (భారత్) సెమీఫైనల్‌కు చేరుకున్నారు. -
తుది పోరుకు ‘సై’రెనా
లండన్ : టెన్నిస్ దిగ్గజ మహిళా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్(ఆస్ట్రేలియా) అత్యధిక గ్రాండ్ స్లామ్ రికార్డుకు అడుగు దూరంలో సెరెనా విలియమ్స్ నిలిచింది. ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ మహిళల విభాగంలో సెరెనా విలియమ్స్ 11వ సారి ఫైనల్ చేరింది. గురువారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో 11వ సీడ్ సెరెనా 6–1, 6–2తో అన్‌సీడెడ్ బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించి హలెప్‌తో జరిగే టైటిల్ పోరుకు సిద్ధమైంది. మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో రుమేనియా తార 7వ సీడ్ హలెప్ 6–1, 6–3తో 8వ సీడ్ స్వితోలినా(ఉక్రెయిన్)పై వరుస సెట్లల్లో గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. ఫోర్ హ్యాండ్ షాట్లతో హోరెత్తించి.. హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగిన సెరెనా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆడింది. తనదైన ఫోర్ హ్యాం డ్ షాట్లతో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించింది. సెరెనా ఫోర్ హ్యాండ్ షాట్లకు స్ట్రికోవా దగ్గర ఎటువంటి సమాధానం లేకపోవడంతో మొదటి సెట్‌ను 27 నిమిషాల్లో, రెండో సెట్‌ను 22 నిమిషాల్లో గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్‌లో సెరెనా 28 విన్నర్లను, 4 ఏస్‌లను కొట్టగా.. స్ట్రికోవా కేవలం 8 విన్నర్లను, ఒక ఏస్‌ను మాత్రమే కొట్టింది. తొలిసారి.. 2018 ఫ్రెంచ్ ఓపెన్ విజేత హలెప్ తన కెరీర్లోనే తొలిసారిగా వింబుల్డన్ మహిళల విభాగంలో ఫైనల్ చేరింది. టోర్నీ మొత్తం అంచనాలకు మించి రాణించిన ఉక్రెయిన్ భామ స్వితోలినా మాత్రం తన కెరీర్లో ఆడుతున్న తొలి సెమీస్‌లో తడబడింది. మ్యాచ్ ఆసాంతం క్రాస్ కోర్టు, డౌన్ ద లైన్ షాట్లతో ప్రత్యర్థిని కోర్టు నలువైపులా పరుగెత్తించిన హలెప్ 73 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదు సార్లు బ్రేక్ చేసిన హలెప్ 26 విన్నర్లను కొట్టగా.. స్వితోలినా ఒక సారి మాత్రమే బ్రేక్ చేసి కేవలం 10 విన్నర్లను కొట్టింది. ఫైనల్‌కు చేరే క్రమంలో హలెప్ కేవలం ఒకే ఒక్క సెట్‌ను ప్రత్యర్థికి కోల్పోవడం విశేషం. నేటి పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ జొకోవిచ్ X బాటిస్టా ఫెడరర్ఠ్ X నాదల్ సాయంత్రం 5.30 నుంచి స్టార్ స్పోర్ట్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
సెరెనా శుభారంభం
పారిస్: తల్లి అయ్యాక ఆడుతున్న తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ శుభారంభం చేసింది. క్రిస్టినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 36 ఏళ్ల సెరెనా 7–6 (7/4), 6–4తో గెలుపొందింది. గర్భవతిగానే 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన సెరెనా ఆ తర్వాత ఆటకు విరామం ఇచ్చింది. గతేడాది సెప్టెంబరులో పాపకు జన్మనిచ్చాక ఇటీవలే మళ్లీ రాకెట్ పట్టింది. ప్లిస్కోవాతో జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్ 12వ గేమ్‌లో తన సర్వీస్‌లో బ్రేక్ పాయింట్ కాపాడుకున్న సెరెనా టైబ్రేక్‌లో పైచేయి సాధించింది. రెండో సెట్లో ఒకదశలో 0–3తో వెనుకబడిన ఈ మాజీ చాంపియన్ వెంటనే తేరుకొని స్కోరును సమం చేసింది. ఆ తర్వాత పదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్ షరపోవా (రష్యా) 6–1, 4–6, 6–3తో హోగెన్కాంప్ (నెదర్లాండ్స్)పై, మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్) 7–6 (7/0), 6–2తో స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా) పై, ఏడో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–1, 6–0తో దువాన్ (చైనా)పై గెలిచారు. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ తొలి రౌండ్లో 6–4, 6–3, 7–6 (11/9)తో బొలెలీ (ఇటలీ)పై, మూడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6–3, 7–5, 7–6 (7/4)తో డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై నెగ్గి రెండో రౌండ్‌కు చేరారు. 14వ సీడ్ జాక్ సాక్ (అమెరికా) 7–6 (7/4), 6–2, 6–4, 6–7 (5/7), 3–6తో జర్గెన్ జాప్ (ఎస్తోనియా) చేతిలో ఓడిపోయాడు. భారత్‌కు చెందిన యూకీ బాంబ్రీ 4–6, 4–6, 1–6తో రూబెన్ బెమెల్మాన్స్ (బెల్జియం) చేతిలో ఓటమి పాలయ్యాడు. అందుకే ‘క్యాట్ సూట్’... అమ్మగా మారిన తర్వాతి తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ బరిలో నిలిచిన సెరెనా విలియమ్స్ వస్త్రధారణ ప్రత్యేకంగా నిలిచింది. నైకీ ప్రత్యేకంగా తయారు చేయించిన నలుపు రంగు ‘క్యాట్‌సూట్’లో ఆమె మైదానంలో అడుగు పెట్టి విజయాన్ని అందుకుంది. గతంలోనూ సెరెనా ఇలాంటి డ్రెస్ ధరించినా... కూతురు పుట్టిన తర్వాత తొలి మెగా టోర్నీ కావడంతో అది చర్చనీయాంశమైంది. దీనిపై మాట్లాడుతూ...‘అక్కడ ఉన్న అమ్మలందరి కోసమే ఇది. అందరూ గర్భవతిగా కఠిన పరీక్షను ఎదుర్కొని నిలిచినవారే. ఆ తర్వాత మళ్లీ తిరిగొచ్చి అంతే పదునుగా ఉండేందుకు ప్రయత్నించేవారే. నా వస్త్రధారణ అలాంటివారి ఆలోచనలను ప్రతిబింబిస్తుందని భావిస్తున్నా...కాదంటారా? ఈ డ్రెస్‌లో యోధురాలైన మహరాణిలా నన్ను నేను ఊహించుకుంటున్నా. నా కలల ప్రపంచంలో సూపర్ హీరోను కావాలనుకున్నా. ఇది వేసుకుంటే సూపర్ హీరోలా అనిపిస్తోంది’ అని సెరెనా విలియమ్స్ వ్యాఖ్యానించింది. -
సైనా సులువుగా...
ఒడెన్స్ (డెన్మార్క్): డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్ డెన్మార్క్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ సైనా 21-12, 21-7తో కిర్స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)పై విజయం సాధించింది. కేవలం 30 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి స్మాష్‌లతో 14 పాయింట్లు, నెట్‌వద్ద 13 పాయింట్లు నెగ్గింది. తొలి గేమ్‌లో కాస్త పోటీనిచ్చిన గిల్మౌర్ రెండో గేమ్‌లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గురుసాయిదత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... ప్రపంచ 13వ ర్యాంకర్ పారుపల్లి కశ్యప్ మాత్రం రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. గురుసాయిదత్ 21-15, 21-16తో భారత్‌కే చెందిన అజయ్ జయరామ్‌ను ఓడించాడు. కశ్యప్ 11-21, 15-21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. 35 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్ తొలి గేమ్‌లో ఆరంభంలో ఒకసారి మినహాయించి మరెక్కడా స్కోరును సమం చేయలేకపోయాడు. జార్గెన్‌సన్ చేతిలో కశ్యప్‌కిది మూడో పరాజయం కావడం గమనార్హం. -
గురుసాయిదత్ సంచలనం
ఒడెన్స్ (డెన్మార్క్): అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత క్రీడాకారులు డెన్మార్క్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్స్ గురుసాయిదత్, పారుపల్లి కశ్యప్‌తోపాటు అజయ్ జయరామ్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో మాత్రం మిశ్రమ ఫలితాలు లభించాయి. డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్ అలవోక విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టగా... రైజింగ్ స్టార్ పి.వి.సింధు, అరుంధతి తొలి రౌండ్లోనే ఓటమి చవిచూశారు. ఈ ఏడాది నిలకడగా రాణిస్తోన్న 23 ఏళ్ల గురుసాయిదత్ సంచలన విజయంతో ముందంజ వేశాడు. ప్రపంచ 11వ ర్యాంకర్ హూ యున్ (హాంకాంగ్)తో జరిగిన తొలి రౌండ్లో గురుసాయిదత్ 21-17, 21-14తో గెలిచాడు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఇండియన్ ఓపెన్‌లో హూ యున్ చేతిలో ఎదురైన ఓటమికి ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకున్నాడు. 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఆంధ్రప్రదేశ్ ఆటగాడు రెండు గేముల్లోనూ తొలుత వెనుకబడి ఆ తర్వాత పుంజుకొని గెలవడం విశేషం. రెండో గేమ్‌లోనైతే గురుసాయిదత్ 9-10తో వెనుకబడి దశలో ఒక్కసారిగా చెలరేగి వరుసగా 11 పాయింట్లు గెలిచాడు. మరోవైపు ప్రపంచ 25వ ర్యాంకర్ అజయ్ జయరామ్ కూడా సంచలన ప్రదర్శన కనబరిచి 21-11, 21-14తో ప్రపంచ 8వ ర్యాంకర్ బూన్సక్ పొన్సానా (థాయ్‌లాండ్)ను బోల్తా కొట్టించాడు. 32 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో జయరామ్ స్మాష్‌లతో 19 పాయింట్లు, నెట్‌వద్ద 11 పాయింట్లు గెలుపొందాడు. ప్రపంచ 16వ ర్యాంకర్ డారెన్ లూ (మలేసియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ కశ్యప్ తొలి గేమ్‌లో 11-4తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా డారెన్ లూ వైదొలిగాడు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్‌కు తొలి రౌండ్లో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. ప్రపంచ 64వ ర్యాంకర్ స్టెఫానీ (బల్గేరియా)తో జరిగిన మ్యాచ్‌లో సైనా కేవలం 27 నిమిషాల్లో 21-16, 21-12తో విజయం సాధించింది. మరోవైపు ప్రపంచ 10వ ర్యాంకర్ పి.వి.సింధు తొలి రౌండ్లోనే చేతులెత్తేసింది. ప్రపంచ 18వ ర్యాంకర్ ఎరికో హిరోస్ (జపాన్)తో జరిగిన పోరులో సింధు 19-21, 20-22తో ఓటమి చవిచూసింది. హిరోస్ చేతిలో సింధుకిది వరుసగా మూడో పరాజయం కావడం గమనార్హం. మరో మ్యాచ్‌లో మహారాష్ట్ర అమ్మాయి అరుంధతి 17-21, 15-21తో టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) ద్వయం 14-21, 14-21తో మైకేల్ ఫుక్స్-ష్కోట్లెర్ (జర్మనీ) జోడి చేతిలో ఓటమి పాలైంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప-కోనా తరుణ్ జంట 14-21, 13-21తో యోంగ్ డే లీ-చాన్ షిన్ (దక్షిణ కొరియా) జోడి చేతిలో ఓడింది.