![సైనా సులువుగా...](/styles/webp/s3/article_images/2017/09/1/71382038087_625x300.jpg.webp?itok=_ah4Zrh3)
సైనా సులువుగా...
ఒడెన్స్ (డెన్మార్క్): డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్ డెన్మార్క్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ సైనా 21-12, 21-7తో కిర్‌స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)పై విజయం సాధించింది. కేవలం 30 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి స్మాష్‌లతో 14 పాయింట్లు, నెట్‌వద్ద 13 పాయింట్లు నెగ్గింది. తొలి గేమ్‌లో కాస్త పోటీనిచ్చిన గిల్మౌర్ రెండో గేమ్‌లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి.
ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గురుసాయిదత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... ప్రపంచ 13వ ర్యాంకర్ పారుపల్లి కశ్యప్ మాత్రం రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. గురుసాయిదత్ 21-15, 21-16తో భారత్‌కే చెందిన అజయ్ జయరామ్‌ను ఓడించాడు. కశ్యప్ 11-21, 15-21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. 35 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్ తొలి గేమ్‌లో ఆరంభంలో ఒకసారి మినహాయించి మరెక్కడా స్కోరును సమం చేయలేకపోయాడు. జార్గెన్‌సన్ చేతిలో కశ్యప్‌కిది మూడో పరాజయం కావడం గమనార్హం.