మెల్‌బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాలుగో రోజు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్స్‌గా భావించిన మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్), యూఎస్ ఓపెన్ చాంపియన్, బ్రిటన్ టీనేజర్ ఎమ్మా రాడుకాను, ఆరో సీడ్ అనెట్ కొంటావీట్ (ఎస్తోనియా) రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, మూడో ర్యాంకర్ ముగురుజా 3–6, 3–6తో 61వ ర్యాంకర్ అలిజె కార్నె (ఫ్రాన్స్) చేతిలో... 17వ సీడ్ రాడుకాను 4–6, 6–4, 3–6తో 98వ ర్యాంకర్ డాంకా కొవినిచ్ (మోంటెనిగ్రో) చేతిలో... కొంటావీట్ 2–6, 4–6తో 39వ ర్యాంకర్ క్లారా టౌసన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయారు.
అలిజె కార్నెతో జరిగిన మ్యాచ్‌లో 2016 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, 2017 వింబుల్డన్ టోర్నీ విజేత అయిన ముగురుజా 33 అనవసర తప్పిదాలు చేయడంతోపాటు తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. గత ఏడాది యూఎస్ ఓపెన్‌లో క్వాలిఫయర్ హోదాలో బరిలోకి దిగి ఏకంగా టైటిల్‌ను సాధించి పెను సంచలనం సృష్టించిన బ్రిటన్ టీనేజర్ రాడుకాను ఇక్కడ మాత్రం అద్భుతం చేయలేకపోయింది. కొవినిచ్‌తో 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రాడుకాను నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 39 అనవసర తప్పిదాలు చేసింది. కొవినిచ్ సర్వీస్‌లో 15 సార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలు వస్తే రాడుకాను ఆరుసార్లు సద్వినియోగం చేసుకుంది. తన సర్వీస్‌ను ఏడుసార్లు చేజార్చుకుంది. ఈ గెలుపుతో కొవినిచ్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో మూడో రౌండ్‌కు చేరిన తొలి మోంటెనిగ్రో ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.
మరోవైపు రెండో సీడ్ సబలెంకా (బెలారస్), 14వ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), ఏడో సీడ్ స్వియాటెక్ (పోలాండ్) మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. సబలెంకా 1–6, 6–4, 6–2తో జిన్‌యు వాంగ్ (చైనా)పై, హలెప్ 6–2, 6–0తో బీట్రిజ్ (బ్రెజిల్)పై, స్వియాటెక్ 6–2, 6–2తో రెబెకా పీటర్సన్ (స్వీడన్)పై గెలిచారు.
మెద్వెదెవ్ కష్టపడి...
పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) కష్టపడి మూడో రౌండ్‌లోకి చేరుకున్నారు. మెద్వెదెవ్ 2 గంటల 58 నిమిషాల్లో 7–6 (7/1), 4–6, 6–4, 6–2తో నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)పై నెగ్గగా... సిట్సిపాస్ 3 గంటల 22 నిమిషాల్లో 7–6 (7/1), 6–7 (5/7), 6–3, 6–4తో సెబాస్టియన్ బేజ్ (అర్జెంటీనా)ను ఓడించాడు. ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–4, 6–2, 6–0తో బెరాన్‌కిస్ (లిథువేనియా)పై, తొమ్మిదో సీడ్ ఫిలిక్స్ అలియాసిమ్ (కెనడా) 4 గంటల 19 నిమిషాల్లో 7–6 (7/4), 6–7 (4/7), 7–6 (7/5), 7–6 (7/4)తో ఫోకినా (స్పెయిన్)పై గెలిచి మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. మరోవైపు ఐదుసార్లు రన్నరప్ ఆండీ ముర్రే (బ్రిటన్) 4–6, 4–6, 4–6తో టారో డానియల్ (జపాన్) చేతిలో... 13వ సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 6–7 (6/8), 4–6, 4–6తో క్రిస్టోఫర్ ఒకానెల్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment