serbian star novak djokovic
-
క్వాలిఫయర్‌తో జొకోవిచ్ తొలి పోరు
న్యూయార్క్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌పై గురి పెట్టిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు యూఎస్ ఓపెన్‌లో అనుకూలమైన ‘డ్రా’ ఎదురైంది. ఈనెల 26 నుంచి మొదలయ్యే సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో జొకోవిచ్ తలపడతాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ టోరీ్నలో ఆడుతున్న జొకోవిచ్ తొలి రౌండ్‌ను దాటితే రెండో రౌండ్లో అతనికి జర్మనీ ప్లేయర్ జాన్ లెనార్డ్ స్ట్రఫ్ లేదా లాస్లో జెరె (సెర్బియా) ఎదురవుతారు. జొకోవిచ్ జోరు కొనసాగించి క్వార్టర్ ఫైనల్ చేరితే అతనికి ప్రత్యర్థికి ఆరో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) ఉండే అవకాశముంది.సెమీఫైనల్లో నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), ఫైనల్లో టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ)లతో జొకోవిచ్ ఆడే చాన్స్ ఉంది. మరో పార్శ్వంలో ఉన్న వరల్డ్ నంబర్‌వన్ యానిక్ సినెర్ తొలి రౌండ్లో అమెరికా ఆటగాడు మెకంజీ మెక్‌డొనాల్డ్‌తో ఆడతాడు. -
ప్రిక్వార్టర్స్‌లో సబలెంక, జొకోవిచ్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించాడు. అయితే శుక్రవారం పురుషుల, మహిళల విభాగాల్లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. అమెరికన్ అమ్మాయి మూడో సీడ్ జెస్సికా పెగులా ఆట మూడో రౌండ్లోనే ముగిసింది. పురుషుల ఈవెంట్లో రష్యన్ ప్లేయర్, ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్‌పై అన్‌సీడెడ్ సొనెగో అద్భుత విజయం సాధించాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ జొకోవిచ్ మూడో రౌండ్లో వరు స సెట్లలో గెలుపొందాడు. కానీ స్పెయిన్ ఆటగాడు డెవిడోవిచ్ ఫొకినా ప్రతీ సెట్లోనూ గట్టి పోటీ ఇచ్చాడు. దీంతో తొలి రెండు సెట్లు కైవసం చేసుకునేందుకు జొకోవిచ్ టైబ్రేక్ ఆడక తప్పలేదు. 3 గంటల 36 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో చివరకు జొకోవిచ్ 7–6 (7/4), 7–6 (7/5), 6–2 స్కోరుతో 29వ సీడ్ ఫొకినాపై గెలిచాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా ) 7–5, 6–0, 3–6, 6–7 (5/7), 3–6తో లొరెంజొ సొనెగొ (ఇటలీ) చేతిలో కంగుతిన్నాడు. సొనెగొకు తన కెరీర్లో టాప్–10 ప్లేయర్‌ను ఓడించడం ఇది ఆరోసారి! ఇటలీకి చెందిన ప్రపంచ 48వ ర్యాంకర్ సొనెగొ ప్రిక్వార్టర్ ఫైనల్లో 11వ సీడ్ కరెన్ ఖచనొవ్ (రష్యా)తో తలపడతాడు. మూడో రౌండ్లో ఖచనొవ్ 6–4 6–1, 3–6, 7–6 (7/5)తో కొక్కినకిస్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు. సబలెంక అలవోకగా... మహిళల సింగిల్స్‌లో బెలారస్ స్టార్ సబలెంక అలవోక విజయంతో ప్రిక్వార్టర్స్ చేరింది. మూడో రౌండ్లో రెండో సీడ్ సబలెంక 6–2, 6–2తో కమిల్లా రఖిమొవ (రష్యా)పై విజయం సాధించింది. జెస్సికా పెగులా (అమెరికా) 1–6, 3–6తో 28వ సీడ్ ఎలైస్ మెర్టెన్స్ (బెల్జియం) చేతిలో చిత్తుగా ఓడింది. తొమ్మిదో సీడ్ డారియా కసత్కినా (రష్యా) 6–0, 6–1తో పెటన్ స్టియర్స్ (అమెరికా)పై, ఎలినా స్వితొలినా (ఉక్రెయిన్) 2–6, 6–2, 7–5తో అన్నా బ్లింకొవా (రష్యా)పై గెలుపొందగా... పవ్ల్యుచెంకొవా (రష్యా) 4–6, 6–3, 6–0తో 24వ సీడ్ పొటపొవా (రష్యా)కు షాకిచ్చింది. పురుషుల డబుల్స్‌లో భారత్ పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ జోడీ 4–6, 5–7తో తొమ్మిదో సీడ్ గొంజాలెజ్ (మెక్సికో)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంట చేతిలో పరాజయం చవిచూసింది. -
మళ్లీ నంబర్‌వన్‌గా జొకోవిచ్
ఏటీపీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ మళ్లీ తన అగ్ర స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. రెండు వారాల క్రితం అతను తన టాప్ ర్యాంక్‌ను స్పెయిన్‌కు చెందిన అల్కరాజ్కు కోల్పోయాడు.అయితే మయామీ ఓపెన్‌లో అల్కరాజ్ సెమీస్‌లోనే ఓడటంతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. జొకోవిచ్ కెరీర్ నంబర్‌వన్‌గా ఇది 381వ వారం కావడం విశేషం. -
Australian Open 2023: జొకోవిచ్ అలవోకగా...
మెల్బోర్న్: కోవిడ్ టీకా వేసుకోనందున... గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడే అవకాశం కోల్పోయిన తొమ్మిదిసార్లు చాంపియన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఈసారి అలవోక విజయంతో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–0తో కార్బెలాస్ బేనా (స్పెయిన్)పై గెలుపొందాడు. 2 గంటల 2 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ తొమ్మిది ఏస్‌లు సంధించి, కేవలం ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. కార్బెలాస్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సర్వీస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. నెట్ వద్దకు 26 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచిన ఈ మాజీ నంబర్‌వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరుసగా 22వ విజయాన్ని నమోదు చేశాడు. ఈ టోర్నీలో 2019, 2020, 2021లలో విజేతగా నిలిచిన జొకోవిచ్ గతేడాది బరిలోకి దిగలేదు. ముర్రే మారథాన్ పోరులో... మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అత్యధికంగా ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచిన ప్రపంచ మాజీ నంబర్‌వన్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే తొలి రౌండ్లో అతికష్టమ్మీద విజయం అందుకున్నాడు. ప్రపంచ 14వ ర్యాంకర్ మాటియో బెరెటిని (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 49వ ర్యాంకర్ ఆండీ ముర్రే 6–3, 6–3, 4–6, 6–7 (7/9), 7–6 (10/6)తో గెలుపొందాడు. 4 గంటల 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే 10 ఏస్‌లు సంధించి, 34 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు బెరెటిని 31 ఏస్‌లు సంధించినా, ఏకంగా 59 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. నెట్ వద్దకు 39 సార్లు దూసుకొచ్చిన ముర్రే 23 సార్లు పాయింట్లు గెలుపొందగా... బెరెటిని 49 సార్లు నెట్ వద్దకు వచ్చి 32 సార్లు పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో 12వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) కూడా శ్రమించి గెలుపొందాడు. ‘లక్కీ లూజర్’ యువాన్ పాబ్లో వారిలాస్ (పెరూ)తో జరిగిన తొలి రౌండ్లో జ్వెరెవ్ 4–6, 6–1, 5–7, 7–6 (7/3), 6–4తో గెలిచాడు. 4 గంటల 9 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ 21 ఏస్‌లు కొట్టాడు. 46 అనవసర తప్పిదాలు చేసిన ఈ జర్మనీ స్టార్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–3, 7–6 (8/6), 6–7 (5/7), 6–3తో టొమాస్ మచాచ్ (చెక్ రిపబ్లిక్)పై, ఐదో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) 6–3, 6–4, 6–2తో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై, ఎనిమిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–4, 6–2, 4–6, 7–5తో బాసిలాష్విలి (జార్జియా)పై విజయం సాధించారు. ముగురుజాకు షాక్ మహిళల సింగిల్స్ విభాగంలో 2020 రన్నరప్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం) 3–6, 7–6 (7/3), 6–1తో ముగురుజాను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ ఆన్స్ జెబర్ (ట్యునీషియా) 7–6 (10/8), 4–6, 6–1తో తామర జిదాన్సెక్ (స్లొవేనియా)పై, నాలుగో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–3, 6–0తో కేథరీన్ సెబోవ్ (కెనడా)పై, ఐదో సీడ్ సబలెంకా (బెలారస్) 6–1, 6–4తో తెరెజా మార్టిన్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందారు. -
Adelaide International 1: జొకోవిచ్... టైటిల్ నంబర్ 92
అడిలైడ్: కొత్త ఏడాదిని సెర్బియా టెన్నిస్ యోధుడు నొవాక్ జొకోవిచ్ టైటిల్‌తో మొదలుపెట్టాడు. ఆదివారం ముగిసిన అడిలైడ్ ఇంటర్నేషనల్–1 ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో 35 ఏళ్ల జొకోవిచ్ చాంపియన్‌గా నిలిచాడు. 3 గంటల 9 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొకోవిచ్ 6–7 (8/10), 7–6 (7/3), 6–4తో ప్రపంచ 33వ ర్యాంకర్ సెబాస్టియన్ కోర్డా (అమెరికా)పై శ్రమించి గెలిచాడు. జొకోవిచ్ కెరీర్లో ఇది 92వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. అంతేకాకుండా 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అడిలైడ్ ఓపెన్‌లో ఈ మాజీ నంబర్‌వన్ విజేతగా నిలిచాడు. 2007లో 19 ఏళ్ల ప్రాయంలో జొకోవిచ్ తొలిసారి ఈ టోర్నీలో టైటిల్ సాధించాడు. 1998 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ పీటర్ కోర్డా తనయుడైన సెబాస్టియన్ కోర్డాతో తొలిసారి తలపడ్డ జొకోవిచ్ ఒకదశలో ఓటమి అంచుల్లో నిలిచాడు. తొలి సెట్ కోల్పోయిన జొకోవిచ్ రెండో సెట్లో 5–6తో వెనుకబడి తన సర్వీస్‌లోని 12వ గేమ్‌లో 30–40తో మ్యాచ్ పాయింట్‌ను కాచుకున్నాడు. ఓవర్‌హెడ్ షాట్‌తో పాయింట్ గెలిచి 40–40తో సమం చేసిన జొకోవిచ్ అదే జోరులో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 6–6తో సమం చేశాడు. ఆ తర్వాత టైట్రేక్లో జొకోవిచ్ పైచేయి సాధించాడు. నిర్ణాయక మూడో సెట్ కూడా హోరాహోరీగా సాగింది. జొకోవిచ్ 5–4తో ఆధిక్యంలోకి వెళ్లాక 12వ గేమ్‌లో కోర్డా సర్వీస్‌ను బ్రేక్ చేసి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 94,560 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 77 లక్షల 85 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో జొకోవిచ్ సంయుక్తంగా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం జొకోవిచ్, రాఫెల్ నాదల్ (స్పెయిన్) 92 టైటిల్స్‌తో సమఉజ్జీగా నిలిచారు. ఈ జాబితాలో జిమ్మీ కానర్స్ (అమెరికా; 109 టైటిల్స్), ఫెడరర్ (స్విట్జర్లాండ్; 103 టైటిల్స్), ఇవాన్ లెండిల్ (అమెరికా/చెకోస్లొవేకియా; 94 టైటిల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి జొకోవిచ్ దూరం
న్యూయార్క్: కోవిడ్ టీకా తీసుకోని కారణంతో... సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌కూ దూరమయ్యాడు. కరోనా టీకా వేసుకోకపోవడంతో ఈ ఏడాది ఆరంభ గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్‌ను ఆడనివ్వలేదు. అయితే యూఎస్ ఓపెన్ టోర్నీ నుంచి మాత్రం ఈ సెర్బియా స్టార్ స్వయంగా తప్పుకున్నాడు. ‘డ్రా’ విడుదలకు కొన్ని గంటల ముందు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అతను వెల్లడించాడు. ‘యూఎస్ ఓపెన్ ఆడేందుకు నేను న్యూయార్క్‌కు వెళ్లట్లేదు. ఇది బాధాకరమే కాని తప్పలేదు. ఫిట్నెస్ను కాపాడుకుంటూ ఆశావహ దృక్పథంతో వచ్చే సీజన్లో ఆడేందుకు కృషి చేస్తా’ అని ట్వీట్ చేశాడు. 35 ఏళ్ల సెర్బియన్ ఖాతాలో 21 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లున్నాయి. స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ (22 టైటిల్స్) కంటే ఒకటి తక్కువ. దీన్ని తాజా గ్రాండ్‌స్లామ్‌లో జొకో సాధిస్తాడని అభిమానులు ఆశించారు. అతను 2011, 2015, 2018లో మూడుసార్లు విజేతగా నిలిచాడు. మరో ఆరుసార్లు రన్నరప్‌గా తృప్తి పడ్డాడు. ఇంతటి ఘన రికార్డు ఉన్న అతనికి న్యూయార్క్‌లో మరో టైటిల్ గెలవడం, నాదల్ రికార్డును సమం చేయడం కష్టం కాదు. అయితే అమెరికా, కెనడా దేశాల్లో స్వదేశీయులు తప్ప టీకా తీసుకోని విదేశీయులను అనుమతించడం లేదు. అందువల్లే జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌కు దూరంగా ఉంటున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడిన ఈ సెర్బియన్ క్వార్టర్స్‌లో నాదల్ చేతిలో ఓడాడు. కానీ వింబుల్డన్‌లో విజేతగా నిలిచాడు. -
Novak Djokovic: జొకోవిచ్‌కు ఆస్ట్రేలియా భారీ షాక్.. ఓడిపోతే ఇక అంతే!
ఆస్ట్రేలియా ఓపెన్ డ్రా చూస్తే సెర్బియన్ స్టార్ జొకోవిచ్ తప్పక బరిలోకి దిగుతాడనిపించింది. కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీరు చూస్తుంటే ప్రపంచ నంబర్‌వన్‌కు బహిష్కరణ తప్పేలా లేదు. మామూలుగా టెన్నిస్ కోర్టులో ఆటగాడు ‘డబుల్‌ఫాల్ట్’ చేస్తాడు. కానీ ప్రభుత్వం దెబ్బకు ఈ టాప్‌సీడ్ ‘డబుల్‌ఫాల్ట్’ అయ్యాడు. రెండో సారీ అతని వీసా రద్దయింది. ఆసీస్ విదేశీ మంత్రిత్వశాఖ తన విచక్షణాధికారం మేరకు అతని వీసాను రెండోసారి రద్దు చేసింది. దేశ ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ‘టెన్నిస్ లెజెండ్’ను అమర్యాదగా సాగనంపబోమని, కొన్ని రోజులు ఇక్కడ ఉండే వెసులుబాటు ఇస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు జొకో మాత్రం ‘తగ్గేదేలే’... వెనక్కి వెళ్లేదేలే అంటున్నాడు. ప్రభుత్వ నిర్ణయంపై తన న్యాయపోరాటం కొనసాగిస్తానని తెలిపాడు. తన గ్రాండ్‌స్లామ్ కెరీర్‌లోని 20 టైటిళ్లలో 9 సార్లు విజేతగా నిలిపిన ఆస్ట్రేలియా ఓపెన్‌ను అంత తేలిగ్గా వదిలేలా లేడు. ప్రాక్టీస్‌లో అతను శ్రమిస్తుంటే... అతని లీగల్ టీమ్ కోర్టులో తేల్చుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఫెడరల్ సర్క్యూట్‌లోని ఫ్యామిలీ కోర్టులో అత్యవసర విచారణ కోసం అప్పీల్ చేసింది. సోమవారం ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం కానుండటంతో ఫెడరల్ కోర్టు నేడు (శనివారం) అత్యవసర విచారణ చేపడుతుందా లేదంటే విచారణను తిరస్కరిస్తుందో తెలియాలంటే వేచిచూడక తప్పదు. ఈ ఫెడరల్ కోర్టులోనే మొదటిసారి రద్దయిన వీసాను పునరుద్దరించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోర్టు నుంచి వీసా పునరుద్ధరణ లభించినప్పటికీ మళ్లీ రద్దు చేసే అధికారం విదేశీ మంత్రిత్వ శాఖకు ఉంటుంది. ఇప్పుడు ఆ శాఖ రద్దు చేసింది. ఇలా ఒక వ్యక్తికి వరుసగా రెండోసారి వీసా రద్దు చేస్తే... అతను మళ్లీ మూడేళ్ల పాటు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడానికి వీలుండదు. జొకో న్యాయ పోరాటం చేసి విఫలమైతే మూడేళ్లు అంటే 2025 వరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడే అవకాశం రాదు. చదవండి: Virat Kohli Vs Dean Elgar: సైలెంట్‌గా ఉంటానా డీన్.. 3 ఏళ్ల క్రితం ఏం చేశావో తెలుసు.. కోహ్లి మాటలు వైరల్ View this post on Instagram A post shared by Novak Djokovic (@djokernole) -
ఒలింపిక్స్‌లో ఆడడంపై క్లారిటీ ఇచ్చిన నెంబర్ వన్
ఓవైపు కరోనా, మరోవైపు అభిమానులు లేకుండా ఆడడం లాంటి కారణాలతో టోక్యో ఒలింపిక్స్ ఆడేది అనుమానమే అని ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ ఇంతకు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ అనుమానాల్ని పక్కనపెడుతూ.. తాను ఒలింపిక్స్‌కు బయలుదేరుతున్నానని ఈ సెర్బియన్ దిగ్గజం అనౌన్స్ చేశాడు. ఈ మేరకు తన ట్విటర్లో ఒక ట్వీట్ చేసిన 34 ఏళ్ల జొకోవిచ్.. టోక్యోకు వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నానని, ఒలింపిక్స్‌కు వెళ్తున్న సెర్బియన్ టీంలో తాను ఉన్నందుకు గర్వంగా ఉందని ట్వీట్లో తెలిపాడు. అంతేకాదు తన చిన్నారి స్నేహం కౌజిరౌను నిరుత్సాహపర్చడం తనకు ఇష్టం లేదంటూ పేర్కొంటూ ఆ చిన్నారి 6వ పుట్టినరోజు శుభాకాంక్షలు వీడియో సందేశం ద్వారా తెలియజేశాడు. Cannot disappoint my little friend Koujirou. I booked my flight for Tokyo and will proudly be joining #TeamSerbia for the Olympics. 🇷🇸 pic.twitter.com/23TmSdvc4x — Novak Djokovic (@DjokerNole) July 15, 2021 ఇదిలా ఉంటే ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గి జోరు మీదున్న జొకోవిచ్.. ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శనతో రాణించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక తన కెరీర్లో 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో తొలిసారి పాల్గొన్న జొకోవిచ్.. ఆ దఫా కాంస్యం గెలిచాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పోరులో ఓడిపోగా... 2016 రియో ఒలింపిక్స్‌లో తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. -
కరోనా అంటించిన జొకోవిచ్ చావాల్సిందే
స్లి్పట్ (క్రొయేషియా): ఇప్పటికే కరోనా బారిన పడిన ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు మరో చిక్కు వచ్చి పడింది. వైరస్ ఉధృతి కొనసాగుతున్న వేళ బాధ్యతారాహిత్యంగా టోర్నీ నిర్వహించిన జొకో చావాల్సిందేనంటూ పలువురు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అడ్రియా టూర్ ఎగ్జిబిషన్ టోర్నీల నిర్వహణతో జొకోవిచ్ దంపతులతోపాటు అతని కోచ్ ఇవానిసెవిచ్, మరో ముగ్గురు కోవిడ్ బారిన పడ్డారు. దీనిపై కొందరు క్రీడా ప్రముఖులు సెర్బియన్ స్టార్‌పై మండిపడ్డారు. తాజాగా క్రొయేషియాలోని స్లి్పట్ నగరంలో కరోనా అంటించిన జొకోవిచ్ చావాలని కోరుకుంటున్నట్లు గోడలపై రాతలు రాశారు. ‘జొకో నువ్వు చావాలని స్లి్పట్ నగరం మనస్ఫూర్తిగా కోరుకుంటోంది’ అని నిరసనకారులు రాశారు. మరోవైపు సెర్బియా మహిళా ప్రధానమంత్రి తమ స్టార్ ప్లేయర్‌కు మద్దతుగా నిలిచారు. టోర్నీ నిర్వహణకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని... ఈ విషయంలో నొవాక్‌ను నిందించకూడదని ఆమె కోరారు. జొకోవిచ్, ప్రధాని అనా బోర్నబిచ్ -
ఒక్కడే ‘ఐదు’
అంచనాలను నిజం చేస్తూ... పురుషుల టెన్నిస్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ... సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అదుర్స్ అనిపించాడు. టెన్నిస్‌లో ఓపెన్ శకం (1968 నుంచి) మొదలయ్యాక ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఐదోసారి నెగ్గిన తొలి క్రీడాకారుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. మెల్బోర్న్ పార్క్‌లో తన విజయపరంపరను కొనసాగిస్తూ ఫైనల్‌కు చేరిన ఐదోసారీ విజేతగా నిలిచి ఔరా అనిపించాడు. జొకోవిచ్ కొత్త చరిత్ర ⇒ ఐదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ వశం ⇒ ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు ⇒ రూ. 14 కోట్ల 96 లక్షల ప్రైజ్‌మనీ సొంతం ⇒ ముర్రేకు నాలుగోసారీ నిరాశే మెల్బోర్న్: ఫెడరర్, రాఫెల్ నాదల్ లాంటి మాజీ చాంపియన్స్ క్వార్టర్ ఫైనల్లోపే నిష్ర్కమించిన చోట... ఆద్యంతం నిలకడగా ఆడిన ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) తన హోదాకు, ర్యాంక్‌కు న్యాయం చేస్తూ ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం 3 గంటల 39 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జొకోవిచ్ 7-6 (7/5), 6-7 (4/7), 6-3, 6-0తో ఆరో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై విజయం సాధించాడు. తద్వారా ఓపెన్ శకంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను అత్యధికంగా ఐదుసార్లు నెగ్గిన తొలి క్రీడాకారుడిగా జొకోవిచ్ కొత్త చరిత్రను లిఖించాడు. గతంలో అతను 2008, 2011, 2012, 2013లో కూడా విజేతగా నిలిచాడు. మరోసారి నెగ్గితే... ఈ టోర్నీని అత్యధికంగా ఆరుసార్లు సాధించిన ఆస్ట్రేలియా దిగ్గజం రాయ్ ఎమర్సన్ సరసన జొకోవిచ్ నిలుస్తాడు. ఓపెన్ శకం ప్రారంభం కాకముందు రాయ్ ఎమర్సన్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా జొకోవిచ్ కెరీర్లో ఇది ఎనిమిదో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. అతను రెండుసార్లు వింబుల్డన్, ఒకసారి యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌నూ నెగ్గితే జొకోవిచ్ ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతను పూర్తి చేసుకుంటాడు. చాంపియన్ జొకోవిచ్‌కు 31 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 14 కోట్ల 96 లక్షలు); రన్నరప్ ఆండీ ముర్రేకు 15 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 7 కోట్ల 48 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో మూడోసారి తలపడిన జొకోవిచ్, ముర్రే ప్రతి పాయింట్‌కూ పోరాడారు. పలుమార్లు సుదీర్ఘ ర్యాలీలతో ఈ ఇద్దరూ అలరించారు. తొలి రెండు సెట్లలో ఇద్దరూ తమ సర్వీస్‌లను రెండేసిసార్లు కోల్పోయారు. 72 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్‌ను టైబ్రేక్‌లో జొకోవిచ్ దక్కించుకోగా... 80 నిమిషాలపాటు జరిగిన రెండో సెట్‌ను టైబ్రేక్‌లో ముర్రే గెల్చుకున్నాడు. మూడో సెట్లోనూ తొలి ఆరు గేమ్‌ల వరకు ఇద్దరూ సమంగా నిలిచారు. అయితే ఏడో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్న ముర్రే ఊహించని విధంగా ఎనిమిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కోల్పోయాడు. తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 39 నిమిషాల్లో మూడో సెట్‌ను నెగ్గాడు. నాలుగో సెట్లో జొకోవిచ్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. ముర్రే సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ 28 నిమిషాల్లోనే ఈ సెట్‌ను దక్కించుకొని విజేతగా నిలిచాడు. జొకోవిచ్ 8 ఏస్‌లు సంధించడంతోపాటు ముర్రే సర్వీస్‌ను తొమ్మిదిసార్లు బ్రేక్ చేశాడు. 40 అనవసర తప్పిదాలు చేసిన అతను నెట్‌వద్దకు 37 సార్లు వచ్చి 26 సార్లు పాయింట్లు సాధించాడు. ఈ ఓటమితో ఆండీ ముర్రేకు నాలుగోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో నిరాశ ఎదురైంది. ఓపెన్ శకంలో ఈ టోర్నీలో నాలుగుసార్లు ఫైనల్ చేరుకున్నప్పటికీ ఒక్కసారీ టైటిల్ సాధించలేకపోయిన తొలి ప్లేయర్‌గా ముర్రే గుర్తింపు పొందాడు.